చంద్రబాబు నెత్తిన పాలు పోసిన వైఎస్ జగన్!!
posted on Jan 10, 2020 @ 4:35PM
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. వైసీపీ దూకుడు ముందు నిలబడలేక టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితమైంది. ఇది మామూలు ఓటమి కాదు. టీడీపీ పునాదులనే కదిలించిన ఓటమి. అసలు ఈ ఓటమి నుండి టీడీపీ ఇప్పట్లో కోలుకుంటుందా? అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టీడీపీ క్యాడర్ లో కూడా నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. మరోవైపు వైసీపీ ఘన విజయంతో ఆ పార్టీ నాయకత్వం, కేడర్ నూతనోత్సాహంతో పరుగులు పెట్టింది. 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైసీపీ జోరు చూసి.. వైఎస్ జగన్ కి ఇక తిరుగులేదు అనుకున్నారంతా. ప్రజలు రికార్డు మెజారిటీ ఇచ్చారు.. ఇక ఇతర పార్టీ నేతలను ఆకట్టుకోవాల్సిన పనికూడా లేదు. జగన్ కూల్ గా తనపని తాను చేసుకుంటూ పొతే చాలు.. వచ్చే ఎన్నికల్లో కూడా ఈజీగా గెలిచి సీఎం అయిపోతారన్న అభిప్రాయం వ్యక్తమైంది. టీడీపీ ఇప్పట్లో ఆ ఓటమి నుండి కోలుకొని జగన్ ని దెబ్బకొట్టే అవకాశమే లేదు అనుకున్నారంతా. కానీ జగన్ మాత్రం తనంతట తానే టీడీపీకి త్వరగా కోలుకునే అవకాశాన్ని ఇస్తున్నారు.
ప్రజావేదిక కూల్చివేత, పోలవరం రివర్స్ టెండరింగ్, విద్యుత్ ఒప్పందాల రద్దు, ఇసుక కొరత.. ఇలా కొన్ని సందర్భాలలో టీడీపీకి స్వరం వినిపించే అవకాశాన్ని జగన్ ఇచ్చారు. అయితే ఘోర ఓటమిలో కూరుకుపోయిన టీడీపీని ఇవేవి చెయ్యి పట్టి పైకి లాగలేకపోయాయి. అలాంటి సమయంలో జగన్ నిర్ణయం రూపంలో టీడీపీకి ఓ వరం లభించింది. మూడు రాజధానుల అంశాన్ని జగన్ తెరమీదకు తీసుకురావడం టీడీపీకి కలిసొచ్చింది. మూడు రాజధానుల వ్యవహారం అమరావతి ప్రాంత రైతులు ఉద్యమించేలా చేసింది. రాజధానిని అమరావతి నుండి తరలించవద్దంటూ.. వారు గొంతెత్తి నినదిస్తున్నారు. లాఠీ దెబ్బలకు, అరెస్టులకు భయపడకుండా పిడికిలి బిగించి పోరాడుతున్నారు. వారికి టీడీపీ పూర్తిగా అండగా నిలబడింది. టీడీపీ నాయకత్వం ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటూ రైతులకు మేమున్నామన్న భరోసా ఇస్తోంది. ఇన్నిరోజులు ఓటమి చీకటిలో మగ్గిపోయిన టీడీపీ రేపటి వెలుగు కోసం పోరాటం మొదలుపెట్టింది. కార్యకర్తలు స్వచ్చందంగా ఉద్యమంలో పాల్గొంటూ రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి టీడీపీ మళ్లీ ప్రజల నోళ్ళలో నానడం మొదలుపెట్టింది.
ఒక్కోసారి మనం వేసే ఒక్క అడుగు భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తుంది. ఇప్పుడు రాజధాని విషయంలో జగన్ అలాంటి అడుగే వేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన వైసీపీపై వ్యతిరేకత ఏర్పడేలా చేసిందని అంటున్నారు. తెలుగువన్ సంస్థ క్షేత్రస్థాయిలో సేకరించిన ప్రజాభిప్రాయంలో కూడా ఇదే విషయం స్పష్టమైంది. రాజధాని తరలింపు ప్రతిపాదనతో... కృష్ణ, గుంటూరు, గోదావరి, ప్రకాశం జిల్లాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు రాయలసీమ ప్రజల్లో కూడా.. రాజధానిని విశాఖకు తరలిస్తే తమకి బాగా దూరమువుతుందన్న అసంతృప్తి కనిపిస్తోంది. ఇవే ఇప్పుడు టీడీపీకి కలిసొస్తున్నాయి. రాజధానిపై పోరాటంతో టీడీపీ ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. చిన్న పెద్ద నాయకుల నుండి సాధారణ కార్యకర్తల వరకు రైతులు వెంట పోరుబాట పట్టారు. దీంతో ఆకు పచ్చ జెండా పట్టి ఉద్యమిస్తున్న రైతులకు పసుపు పచ్చ జెండా అండగా ఉందన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తోంది. మొత్తానికి.. 151 సీట్లతో ఘనంగా అధికారంలోకి వచ్చిన జగన్.. ప్రశాంతంగా ఉండకుండా.. మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చి.. టీడీపీకి పుంజుకునే అవకాశాన్ని ఇచ్చారని అంటున్నారు. జగన్ వేసిన ఈ ఒక్క రాంగ్ స్టెప్.. చంద్రబాబు నెత్తిన పాలు పోసి.. వైసీపీ వారిని తలలు పెట్టుకునేలా చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.