శాసనమండలి రద్దు నిర్ణయంతో నిరాశకు గురైన వైసిపి నేతలు!!
posted on Jan 30, 2020 @ 1:52PM
ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకే కాదు వైసీపీ నేతలకు కూడా తలనొప్పిగా పరిణమిస్తున్నాయి. తాజాగా శాసనమండలిని రద్దు నిర్ణయం తీసుకోవడంతో వైసీపీ లోని పలువురు నాయకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తమకు అనుకూలంగా వ్యవహరించలేదనే ఉద్దేశంతో ఏకంగా శాసన మండలినే ఏపీ ప్రభుత్వ పెద్దలు రద్దు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క చిక్కుముడి విప్పబోయి వంద చిక్కుముడులు వేసినట్టుగా ఉంది జగన్ తీరు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు కామెంట్ చేస్తున్నారు. శాసన మండలి రద్దు నిర్ణయం వల్ల ఆ పార్టీలోని ఎందరో నేతల ఎమ్మెల్సీ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో వారంతా పార్టీ అధినేత తీరుపై అసహనంతో ఉన్నారు.
మండలి రద్దు నిర్ణయంతో చిత్తూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ముఖ్య నేతలు ఆశలు అడియాసలయ్యాయి. అందులో ఒకరు కె చంద్ర మౌళి కాగా రెండోవారు ఎస్సీవీ నాయుడు. తాము అధికారంలోకొస్తే ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవులిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడదే జగన్ ఏకంగా శాసనమండలిని రద్దు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో మండలి సభ్యత్వం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఆ ఇద్దరి పరిస్థితేమిటన్నది పార్టీ శ్రేణులకు కూడా అంతుబట్టడం లేదు. సీఎం జగన్ నిర్ణయాన్ని బహిరంగంగా ఎవరు తప్పుపట్టకపోయినా సన్నిహితుల వద్ద మాత్రం వారు ఆక్షేపిస్తున్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన కె చంద్ర మౌళి కుప్పం నియోజకవర్గంలో 2014-19 ఎన్నికల్లో వరుసగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై పోటి చేసారు. పోటీ చేసిన రెండు సందర్భాలలో కూడా చంద్రబాబు మెజారిటీని కొంత తగ్గించగలిగారు. ఇదిలా ఉంటే కుప్పంలో చంద్రమౌళిని గెలిపిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తామని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఒకవేళ బాబుపై గెలవకపోయినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గనుక అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి కేటాయిస్తామని కూడా వాగ్దానం చేశారు. దీనికి తోడు 2019 ఎన్నికల్లో చంద్రమౌళి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొనలేకపోయారు. దీంతో పార్టీ వర్గాల్లో ఆయనపై బాగా సానుభూతి ఏర్పడింది. వయసు రీత్యా కూడా ఇది చివరి అవకాశం అనే భావన అందరిలో ఉంది వీటికి తోడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కూడా హామీ ఇచ్చినందున చంద్ర మౌళికి తప్పకుండా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని కుప్పం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గట్టి నమ్మకంతో ఉన్నాయి. చంద్రమౌళి కూడా ఇదే ధీమాతో ఉన్నారు, మండలిలోకి చంద్రమౌళి అడుగుపెడతారని అదృష్టం కలిసొస్తే మంత్రి పదవి దక్కినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఆయన అనుచరులు గంపెడాశతో ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలోనే జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలిని రద్దు తీర్మానం చేయడంతో ఈ అంశం చంద్రమౌళి పాలిట పిడుగుల మారింది.
శ్రీకాళహస్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు రాజకీయంగా అనేక పార్టీలలో కొనసాగినప్పటికీ స్థానికంగా బలమైన నేత. శ్రీకాళహస్తితోపాటు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన సత్తివేడులోనూ నెల్లూరు జిల్లా పరిధిలోని సూళ్లూరుపేట నియోజక వర్గంలో ఆయనకు బాగా పట్టుంది. గత పాతికేళ్ల నుంచి శ్రీ కాళహస్తి నుంచి పోటీ చేయాలని ఆశతో అప్పటికే తాను కొనసాగిన పార్టీలో టిక్కెట్ ఆశించి భంగపడిన సందర్భాలూ ఉన్నాయి. నిజానికి ఈ ఆశతోనే ఆయన పలు పార్టీలు మారినట్టుగా స్థానికులు చెబుతుంటారు. 2004ఎన్నికల సమయంలో ఎస్సీవీ నాయుడు టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాటి ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ టికెట్ లభించింది, తొలిసారి గెలిచి చట్ట సభలోకి అడుగు పెట్టారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన ఎస్సీవీ నాయుడు తిరిగి తెలుగుదేశం గూటికి వచ్చారు. అప్పటి నుంచి టిడిపిలో కొనసాగారు. 2019 ఎన్నికల్లో టిడిపి టికెట్ ఆశించారు, టికెట్ లభించకపోవడంతో టిడిపిని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీ కాళహస్తి సత్యవేడు నియోజకవర్గాలతో పాటు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో కూడా ఎస్సీవీ నాయుడు పట్టు ఉండటంతో ఆ మూడు చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు గట్టిగా కృషి చేశారు. అయితే పార్టీలో చేర్చుకునే సమయంలో ఎస్సీవీ నాయుడుకి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. వయసు రీత్యా నాయుడు కూడా ఈ ఐదేళ్ళలోనే సముచిత పదవులు పొందాలనే ఆశ పెట్టుకున్నారు. జగనిచ్చిన మాట నెరవేరుతుందని తన అనుచర వర్గంతో కూడా చెబుతూ వచ్చారు.
అయితే మూడు రాజధానుల బిల్లు శాసన మండలిలో ఆమోదం పొందకపోవడంతో ఏకంగా మండలి పైనే వేటు వేశారు సీఎం జగన్. ఈ పరిస్థితుల్లో ఎమెల్సి పదవులపై ఆశ పెట్టుకున్న నేతల్లోనే కాకుండా వారి అనుచర వర్గాల్లో కూడా తీవ్ర నిరాశ చోటుచేసుకుంది. ఒకవేళ ప్రత్యామ్నాయంగా ఇతర పదవులేమైనా ఇస్తారని ఆశించాలన్నా అలాంటి అవకాశం కనుచూపు మేరలో కనబడటం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజికవర్గాలతోపాటు మహిళలకు రిజర్వేషన్ పాటించేలా విధాన పరమైన నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది జగన్ ప్రభుత్వం. దీంతో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు దక్కడం దాదాపు అసాధ్యమని ఆయా నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ నిర్ణయంపై ఆ పార్టీ నేతలు కార్యకర్తలు బహిరంగంగా మాత్రం విమర్శించటం లేదు కానీ, అంతర్గతంగా బాగా రగిలిపోతున్నారట. మండలి రద్దును స్వాగతించే వారికన్నా విమర్శించే వారి సంఖ్యే ఎక్కువగా ఉందని తెలుస్తోంది.