ఇది అసలు ట్విస్ట్ అంటే... దేశ రెండో రాజధానిగా అమరావతి!!
posted on Jan 29, 2020 @ 2:47PM
ఏపీని నెలరోజులుగా పట్టి కుదిపేస్తున్న అంశం మూడు రాజధానులు. అధికార పార్టీ వైసీపీ మూడు రాజధానుల దిశగా అడుగులు వేస్తోంది. ప్రతిపక్ష టీడీపీ దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాజధానిగా అమరావతినే ఉంచాలని, అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి వీల్లేదని రైతులతో కలిసి ఉద్యమిస్తోంది. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజధాని అంశంపై ఒకరిపై ఒకరు కయ్యానికి కాలు దువ్వుతుంటే... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం వేడుక చూస్తోంది. ఆ పార్టీ నాయకులు.. కొందరు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో.. రాజధానిపై బీజేపీ స్పష్టమైన వైఖరి ఏంటో తెలియకుండాపోయింది. ఇలా రాజధాని రగడ నెలరోజులకు పైగా కొనసాగుతూనే ఉంది. అయితే ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతున్న వేళ.. బీజేపీ ఊహించని ట్విస్ట్ ఇవ్వడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. అమరావతిని దేశ రెండో రాజధానిగా చేయాలని బీజేపీ యోచిస్తున్నట్టు సమాచారం.
జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు ఏపీలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ హవా ఉండేది. అయితే విభజన దెబ్బతో ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైంది. ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇక బీజేపీ విషయానికొస్తే.. ఏపీలో బీజేపీ ప్రభావం మొదటి నుండి అంతంత మాత్రంగానే ఉండేది. రాష్ట్ర విభజన తరువాత 2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీతో కలిసి బరిలోకి దిగిన బీజేపీకి గౌరవప్రదమైన సీట్లు వచ్చాయి. అయితే ౨౦౧౯ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ దారుణమైన ఫలితాలను మూటగట్టుకుంది. నోటా కంటే తక్కువ ఓట్లు సాధించింది. ఏపీ ప్రజలు.. రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా కాంగ్రెస్ ని ఎంత వ్యతిరేకిస్తున్నారో... విభజన హామీలు మరిచి, ప్రత్యేక హోదాను పక్కన పెట్టిన బీజేపీని కూడా.. అంతే వ్యతిరేకిస్తున్నారని ఫలితాలు చూస్తే అర్ధమవుతుంది. ఆ వ్యతిరేకతను పోగొట్టి ఏపీలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. ఆ దిశగానే ఇప్పుడు అడుగులు వేస్తోంది.
దేశ రెండో రాజధాని దక్షిణాదిన ఉండాలని రాజ్యాంగంలో సూచించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అలాంటి ఆలోచన ఏ ప్రభుత్వం చేయలేదు. బీజేపీ ఇప్పుడు ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. రెండో రాజధానిగా అమరావతి అయితే బాగుంటుందన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆర్‌ఎస్ఎస్ కూడా అమరావతి అయితేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చారిత్రకత, సంస్కృతి, ఇలా అన్నిటిపరంగా అమరావతి అనువైన రాజధాని అవుతుందని ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అమరావతిని దేశ రెండో రాజధానిగా ప్రకటించి దక్షిణాది రాష్ట్రాలపై పట్టు సాధించాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఉత్తర భారత దేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ.. ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చేదు ఫలితాలను రుచిచూసింది. దీంతో ఉత్తరంలో తగ్గిన ప్రభని దక్షిణంలో సరి చేయాలి అనుకుంటుంది. దానిలో భాగంగానే ఏపీ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏపీలో 2014 నుండి టీడీపీ- వైసీపీల మధ్య పోరు నువ్వానేనా అన్నట్టుగా ఉంది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ ఊహించని విజయాన్ని అందుకొని.. టీడీపీకి వెనక్కి నెట్టింది. అయినా టీడీపీ బలంగానే ఉంది, ప్రతిపక్ష పార్టీగా తన గళాన్ని బలంగా వినిపిస్తోంది. అయితే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని వైసీపీ చూస్తోంది. మరోవైపు టీడీపీ ప్లేస్ లోకి బీజేపీ వచ్చి.. వైసీపీకి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని భావిస్తోంది. అంటే రెండు పార్టీలకు టీడీపీని దెబ్బకొట్టడం కావాలి. అందుకే రాజధాని అంశాన్ని తెరమీదకు తెచ్చి టీడీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని అంటున్నారు. మూడు రాజధానులతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో టీడీపీ మీద వ్యతిరేకత ఏర్పడేలా చేసి... మరోవైపు అమరావతిని దేశ రెండో రాజధానిగా ప్రకటించి రాష్ట్రంలో బీజేపీ బలపడాలని చూస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి మూడు రాజధానులు అంటూ వైసీపీ.. అమరావతి దేశ రెండో రాజధాని అంటూ బీజేపీ... ఇలా రెండు పార్టీలు కలిసి ఏపీలో టీడీపీని సమాధి చేయడానికి కంకణం కట్టుకున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.