విశాఖకు రాజధాని మార్పు కేవలం భూముల కోసమేనా?
posted on Jan 2, 2020 @ 11:11AM
విశాఖకు రాజధాని మార్పు అన్న విషయం కొందరికి ఆనందాన్ని ఇస్తే, మరికొందరికి తీవ్ర నిరాశను ఇస్తొంది. రాజధాని ప్రకటన రాగానే విశాఖలో భూముల మాయాజాలం మొదలైంది. నిషేధిత 22 ఎ జాబితాలో ఉన్న భూములకు రెక్కలొస్తున్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు కాదని కొత్తగా వచ్చిన అభ్యర్థులకు ల్యాండ్ క్లియరెన్స్ వచ్చేస్తుంది. జిల్లా యంత్రాంగం కాదూ కూడదు అని స్పష్టం చేసినా ఏకంగా సచివాలయం స్థాయి నుంచే ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. సర్కార్ కు సన్నిహితులైన వారికి మాత్రమే ఇలాంటి వెసులుబాటు లభిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఐదారు దరఖాస్తులను నేరుగా అమరావతి నుంచే పరిష్కరించినట్టు తెలిసింది. దీని ద్వారా విశాఖ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు మరో ఇద్దరు నేతలకు లబ్ధి చేకూరినట్టు సమాచారం.
జిల్లాలో 22ఎ జాబితాలో నమోదైన భూములపై సుమారు 2,200 దరఖాస్తులొచ్చాయి.2018 నుంచి ఇప్పటి వరకు వస్తున్న దరఖాస్తులను జిల్లా యంత్రాంగం క్షుణ్ణంగా పరిశీలించి పక్కా ఆధారాలు ఉంటేనే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇలా ఒక 1,800 దరఖాస్తుల పరిష్కరించినట్టు సమాచారం. 22 ఏ లో చేర్చిన వాటిలో ఎక్కువ భాగం భూ సేకరణలో ఉన్న స్థలాలే ఉన్నాయి. ప్రజావసరాలకు సేకరించిన భూమికి సబ్ డివిజన్ చేయాలి. లేకపోతే సర్వే నెంబరు మొత్తం ప్రభుత్వ భూమిగా నమోదు అవుతుంది. జిరాయితీ భూమికి ఆనుకొని గోర్జి, గెడ్డ పోరంబోకు చెరువులను ఆక్రమించుకుని కొందరు విక్రయాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి భూములను కూడా 22 ఏ కింద చేర్చుతుంటారు.వాటిని నిషేధిత జాబితా నుంచి తప్పించాలంటే ఆక్రమణకు గురై భూమిని సర్వే చేసి మిగిలిన జిరాయితీ భూమిని యజమానికి బదలాయిస్తారు. జిల్లాలో భూములకు విలువ పెరగటంతో 22ఏ కింద చేర్చిన భూములకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.వీటి విషయంలో అధికారులు ఆచితూచి అడుగులు వేస్తుంటారు.
నగరంతో పాటు విశాఖ రూలర్, భీమిలి, ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం, గాజువాక,పరవాడ, అనకాపల్లి మండలాల్లో 22 ఏ దరఖాస్తుల అధికారుల పై తీవ్ర ఒత్తిడి ఉంది. నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో 22ఎ జాబితాలో నమోదైన భూముల మినహాయింపు కోసం వచ్చిన దరఖాస్తుల్లో కొన్నింటిని అధికారులు తిరస్కరించారు. ప్రభుత్వం నుంచి వాటికి సంబంధించిన సమాచారం కోరినపుడు అదే విషయాన్ని నివేదించారు. అయితే అధికార పార్టీ నేతలు రంగ ప్రవేశం చేసి ఉన్నత స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి అమరావతి నుంచి ఫైళ్లను పంపించినట్లు సమాచారం.రెండో సారి కూడా అధికారులు సదరు ఫైళ్లను తిరస్కరిస్తూ మళ్లీ ప్రభుత్వానికి పంపారు. ఉన్నత స్థాయి వ్యక్తులు రంగ ప్రవేశం చేసి 22 ఏ నుంచి మినహాయించాల్సిందేనని ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఆ ఆదేశాలను అమలు చేయటానికి అధికారులు నానా అవస్తలు పడుతున్నట్టు సమాచారం.ముడసర్లోవ, మర్రిపాలెం, మాధవధార, పెదవాల్తేరు, పోతినమల్లయ్యపాలెంతో పాటు రెండుచోట్ల ఇరవై రెండు ఏళ్ల ఉన్న భూముల కు మినహాయింపు సాధించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీని పై స్పందించేందుకు జిల్లా అధికారులు ఎవరూ సమాధానం ఇవ్వట్లేదు. ఒకటి రెండేళ్ల క్రితం పెట్టుకున్న దరఖాస్తులను కాదని ఇటీవల వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం ఆగమేఘాల మీద అనుమతి ఇవ్వటంలో ఆంతర్యం ఏమిటి, ఇరవై రెండు ఏ లో చేర్చిన భూములు రాయితీలో ఉన్నాయా లేదా అనేది బహిరంగం గా విచారణ చేపట్ట కుండా హడావిడిగా ఫైళ్లు తప్పించుకోవటం వెనుక ఏం జరిగింది ఇప్పుడు ఇదే చర్చ నీయాంశంగా మారింది.అసలు అత్యవసరంగా విశాఖ భూముల పై ప్రభుత్వానికి దృష్టి ఎందుకు మళ్లిందో వేచి చూడాలి.