మూడు రాజధానుల వెనుక ముగ్గురు వ్యక్తులు.. బాబు నిలబడటం కష్టమే!!
posted on Jan 9, 2020 @ 11:13AM
గత కొంతకాలంగా ఏపీ రాజకీయాలు ఊహించని విధంగా మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని మార్పు అంశం ఏపీలో తీవ్ర కలకలం రేపింది. రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలిస్తుండటంపై.. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిని తరలించడానికి వీల్లేదంటూ అమరావతి ప్రాంత రైతులు తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ప్రాంత వాసుల్లో కూడా.. రాజధానిని విశాఖకు తరలిస్తే బాగా దూరం అవుతుందనే అసంతృప్తి ఉంది. రైతుల నుండి తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నా.. వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం వెనకడుగు వేయకుండా.. కమిటీల పేరుతో ముందుకెళ్తోంది. మరోవైపు ఇంత జరుగుతున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుండి సరైన స్పందన లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
నిజానికి అమరావతి భూమి పూజకి ప్రధాని మోడీ వచ్చారు. పవిత్ర మట్టిని, గంగ జలాన్ని ఇచ్చి.. అమరావతిని ఢిల్లీ కంటే గొప్ప నగరంగా తీర్చిదిద్దటంలో పూర్తీ సహకారం అందిస్తామని చెప్పుకొచ్చారు. ప్రధాని హోదాలో మోడీ మాట ఇచ్చారు. ఇప్పుడూ ప్రధానిగానే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ప్రధాని మాటని మట్టిలో కలిపేస్తూ జగన్ నిర్ణయం తీసుకుంటున్నారు. అయినా బీజేపీ నుండి ఆశించిన స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవట్లేదు. దీనినిబట్టి చూస్తుంటే.. అసలు జగన్ ఇంత దూకుడుగా వెళ్లడం వెనుక బీజేపీ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ సపోర్ట్ లేకుండా అంత తేలికగా జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోలేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మూడు రాజధానుల నిర్ణయం వల్ల బీజేపీకి ఒరిగేదేముంది అనుకోవచ్చు. కానీ దాని వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీ ప్రభ తగ్గుతోంది. పలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ వంటి రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. దీంతో ఉత్తరాదిలో మొదలైన వ్యతిరేకతను దక్షిణాదితో భర్తీ చేయాలని బీజేపీ భావిస్తోంది. దక్షిణాదిలో బలపడేలా వ్యూహాలు రచిస్తోంది. దానిలో భాగంగానే ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏపీలో జగన్ ని పావుగా వాడుకొని పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ భావిస్తోందని అంటున్నారు.
కొద్దిరోజులుగా జగన్ ని జైలుకి పంపి ఏపీలో బీజేపీ బలపడాలని చూస్తోందని ప్రచారం జరుగుతోంది. కానీ బీజేపీ మాత్రం.. జగన్ జైలు కి వెళ్లడం కంటే.. బయట ఉంటేనే తమ పార్టీకి ప్రయోజనమని భావిస్తోందట. ఇప్పుడు వైసీపీలో ఉన్న వారిలో మెజారిటీ కార్యకర్తలు, నాయకులు ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్నవారే. ఒకవేళ జగన్ జైలుకి వెళ్లి.. వైసీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే.. వారంతా కాంగ్రెస్ వైపు చూస్తారు కానీ బీజేపీ వైపు చూడరు. అంటే ఏపీలో కాంగ్రెస్ కి బీజేపీనే జీవం పోసినట్టు అవుతుంది. అసలు కాంగ్రెస్ బలపడటం బీజేపీకి ఏమాత్రం నచ్చదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో బీజేపీకి ఉన్న ఒకేఒక బలమైన శత్రువు కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ కి ప్లస్ అయ్యే పని బీజేపీ ఎప్పటికీ చేయదు. అందుకే జగన్ ని తమ గ్రిప్ లో పెట్టుకొని గేమ్ ఆడాలని చూస్తోందట. ఏపీలో టీడీపీ ప్లేస్ ని భర్తీ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోందట. టీడీపీ కేవలం అమరావతి ప్రాంతానికి చెందిన పార్టీ అనే ముద్ర వేసి.. మిగతా ప్రాంతాల్లో బీజేపీ బలపడాలని చూస్తోందట.
2014 లో అధికారంలోకి వచ్చిన టీడీపీ 2019 ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ ఓటమి నుండి టీడీపీని కోలుకోకుండా చేసి.. టీడీపీ ప్లేస్ ని బీజేపీ భర్తీ చేయాలని అనుకుంటుందట. మరోవైపు వైసీపీ కూడా టీడీపీని పూర్తిగా దెబ్బ కొట్టాలని చూస్తోంది. అసలు టీడీపీ, చంద్రబాబు వంటి మాటలు భవిష్యత్తులో వినపడకూడదు అనేలా చేయాలనుకుంటోంది. దానిలో భాగంగానే జగన్.. రాజధాని తరలింపుకు శ్రీకారం చుట్టారు అంటున్నారు. అమరావతిని చంద్రబాబు రాజధానిగా ఎంపిక చేసి, దానిని ప్రపంచంలోనే గొప్ప నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలి అనుకున్నారు. కానీ ఆ దిశగా అడుగులు వేసేలోపే ఆయనకు అధికారం దూరమైంది. ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నారు. ఆయన అమరావతిని ఎంత బాగా డెవలప్ చేసినా.. ముందుగా జనాలకు గుర్తొచ్చే పేరు మాత్రం చంద్రబాబు. అందుకే ఆ పేరు వినపడకూడదనే రాజధాని తరలింపు లాంటి పెద్ద నిర్ణయం జగన్ తీసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాజధాని తరలింపు వెనుక కారణం ఏదైనా.. పైకి మాత్రం రాజధానిగా అమరావతి సరైన ప్రాంతం కాదని, ఒక కులానికి చెందిన రాజధాని అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవం మాత్రం మరోలా ఉంది. గతంలో విశాఖ, కర్నూల్ తుఫాను-వరదలతో అల్లాడిపోయాయి కానీ అమరావతి కాదు. ఇక CRDA భూ యజమానులు లిస్ట్ చూస్తే అమరావతి ఒక కులానికి చెందిన రాజధాని కాదని స్పష్టంగా అర్ధమవుతోంది. అయినా కుల ముద్ర వేస్తున్నారు. నిజానికి అమరావతికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. దానినో పవిత్ర ప్రాంతంగా భావిస్తున్నారు. అదీగాక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు దాదాపు సమాన దూరం ఉంది. ఇలా అనేక కారణాల చేత అప్పుడు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. కానీ ఇప్పుడు ఆ ఎంపికే తప్పు అంటున్నారు. నిజంగా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని అనుకోవడంలో తప్పు లేదు. రాజధానితో పాటు కొన్ని నగరాల్ని అభివృద్ధి చేయవచ్చు. తమిళనాడులో రాజధాని చెన్నైతో పాటు.. కోయంబత్తూర్, సేలం, వెల్లూర్ వంటి ఎన్నో నగరాలను అభివృద్ధి చేశారు. కానీ జగన్ సర్కార్ మాత్రం రాజధాని తరలించడం, విడదీయడమే అభివృద్ధి అనుకుంటోంది. ఇలా చేయడం వల్ల ఏపీకి అంటూ ఒక పెద్ద నగరం లేకుండా పోతుంది. ఇదంతా చూస్తుంటే.. కేవలం అమరావతి అంటే చంద్రబాబు బ్రాండ్ అనే ముద్ర ఉంటుందనే కారణంతోనే జగన్ రాజధాని తరలింపు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
రాజధాని తరలింపుతో ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కృష్ణ, గుంటూరు, గోదావరి, ప్రకాశం జిల్లాలలో ప్రజలు రాజధాని తరలింపుని వ్యతిరేకిస్తున్నారు. రాయలసీమ ప్రజలు కూడా విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే తమకి బాగా దూరమవుతుందనే అభిప్రాయంలో ఉన్నారు. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు రాజధానిని తరలించవద్దంటూ ఆందోళనలు చేస్తున్నారు. రాజధాని తరలింపు వార్తలను జీర్ణించుకోలేక పలువురు రైతులు గుండె పోటుతో మరణించారు కూడా. ఇంత జరుగుతున్నా బీజేపీ నుండి సరైన స్పందన లేదు. రాజధాని మార్పు రాష్ట్ర పరిధిలోని అంశమని ఒకరు, మూడు రాజధానులు వస్తే మంచిదే అని మరొకరు.. ఇలా రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు కాని ఇది ప్రధాని మోడీ భూమి పూజ చేసిన రాజధాని అంటూ.. అమరావతి కోసం ఒక్కరు కూడా బలంగా పోరాడటం లేదు. బీజేపీ మౌనంగా ఉండటం చూస్తుంటే.. ఈ రాజధాని మార్పు వెనుక బీజేపీ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాజధానిపై ఇంత రగడ జరుగుతుంటే స్పందించని బీజేపీ.. మత పరమైన రాజకీయాలు అంటూ వైసీపీని టార్గెట్ చేస్తోంది. వైసీపీపై క్రిస్టియానిటీ ముద్ర వేస్తోంది. తిరుపతిలో అన్యమత ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో పెద్ద ఎత్తున మత మార్పిడులు జరుగుతున్నాయని, దేవాలయాల సొమ్ముని పాస్టర్లకు దోచి పెడుతున్నారని ఇలా రకరకాలుగా వైసీపీ మీద విమర్శలు చేస్తోంది. అయితే ఇలా కావాలనే వైసీపీ పై క్రిస్టియానిటీ ముద్ర వేస్తోందని అంటున్నారు. ఈ ప్రచారం వల్ల క్రిస్టియన్స్ అందరూ వైసీపీకి దగ్గరైతే.. నార్త్ ఇండియాలో జరిగినట్టుగా.. హిందువులు బీజేపీ వైపు వస్తారని బీజేపీ భావిస్తోన్నట్టు తెలుస్తోంది. ఈ రిలీజియన్ సెంటిమెంట్ తో అటు వైసీపీ, ఇటు బీజేపీ రెండు పార్టీలు లాభపడి.. టీడీపీని దెబ్బ కొట్టాలని చూస్తున్నాయి అంటున్నారు. మొత్తానికి మోడీ, అమిత్ షా ఆశీస్సులతోనే జగన్ నడుస్తున్నారని.. ముగ్గురూ కలిసి ఏపీలో టీడీపీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.