ఓడిన కేజ్రీకి, గెలిచిన దీదీకి… ఇద్దరికీ తప్పని బీజేపి టెన్షన్!
posted on Apr 13, 2017 @ 6:50PM
ప్రతిపక్షాల గుండెల్లో కమలం కలకలం రేగుతూనే వుంది. 2014లో మోదీ ప్రధాని అవ్వటంతో మొదలైన ప్రభంజనం ఇంకా నడుస్తోంది. మొన్నటికి మొన్న యూపీ, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ వశపరుచుకున్న బీజేపి ఇవాళ్ల ఉప ఎన్నికల్లో కూడా ఉత్సాహం ప్రదర్శించింది. అయితే, సాధారణంగా బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు అధికార పార్టీ హంగామా వుండటం మామూలే! కాని, ఇవాళ్ల కౌంటింగ్ జరిగిన వివిధ రాష్ట్రాల్లోని తొమ్మది స్థానాల్లో బీజేపి అత్యధిక సీట్లు గెలుచుకుని విమర్శకులకి ఒక విధంగా ఫ్యూచర్ చూపించేసింది!
బై ఎలక్షన్స్ పెద్దగా ట్రెండ్ ని గాని, భవిష్యత్ లో జరగబోయే పరిణామాల్ని పట్టిచూపలేవని రాజకీయ పండితులు అంటూ వుంటారు. అందుక్కారణం చాలా చోట్ల ఏ పార్టీ సీటు ఖాళీ చేస్తే అదే పార్టీ మళ్లీ గెలవటం. కాని, ఇవాళ్ల ఎన్నికల ఫలితాల్లో అలా జరిగింది కేవలం కర్ణాటకలోనే! అక్కడ ఉప ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లో కాంగ్రెస్సే గెలిచింది! దీని కారణంగా మరికొన్ని నెలల్లో అక్కడ జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అద్బుతం చేస్తుందంటే మాత్రం ఎక్స్ పర్ట్స్ ఒప్పుకోవటం లేదు!
ఇక మధ్యప్రదేశ్, అసోమ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లలో బీజేపి అవలీలగా తన స్థానాలన్నీ తిరిగి కైవసం చేసుకుంది. మొత్తం మీద ఏ రాష్ట్రంలోనూ అమిత్ షా సైన్యం ఆల్రెడీ వున్న సీటు కోల్పోలేదు. అయితే, ఆశ్చర్యకరంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి కాషాయ దళం కాక పుట్టించింది. రాజౌరి గార్డెన్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపి విజయ దుందుభి మోగించింది! ఈ స్థానం ఇంతకు ముందు అరవింద్ కేజ్రీవాల్ ఖాతాలోనిది! కాని, బై పోల్స్ లో ఆప్ తన స్థానాన్ని నిలబెట్టుకోటం మాట అటుంచీ … అసలు డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది! రెండో స్థానం కూడా ఢిల్లీ ఓటర్లు కాంగ్రెస్ కి కట్టబెట్టారు!
ఢిల్లీ తరువాత ఈ రోజు ఉప ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికరంగా సాగిన పరిణామాలు బెంగాల్లో చూడొచ్చు! ఇక్కడ బీజేపికి విజయం దక్కలేదు. కాని, కాంతి దక్షిణ్ అనే అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగితే టీఎంసీ బలమైన మెజార్జీతో గెలుచుకుంది. అయితే, రెండో స్థానంలో కమలదళం నిలవటం… దీదీకి టెన్షన్ పుట్టించే విషయం! ఒకప్పుడు ఈ నియోజకవర్గం సీపీఐ కంచుకోట! కాని, ప్రస్తుతం టీఎంసీ చేతిలోకి వెళ్లింది. కాని, రాష్ట్ర వ్యాప్తంగా అంతటా జరుగుతున్నట్టుగానే ఇక్కడ కూడా బీజేపి వేగంగా ఎదుగుతోంది. ఈ ఉప ఎన్నికలతో మమతా బెనర్జీ రాబోయే ఎలక్షన్ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది! కమ్యూనిస్టుల కన్నా కాషాయదళమే మమత గండంగా మారుతోంది!
బెంగాల్ లో బీజేపి యువనేత ఈ మధ్యే మమతా బెనర్జీ తలకు పదకొండు లక్షల వెలకట్టాడు! అంతకు ముందు కూడా శ్రీరామనవమి, సరస్వతీ పూజ వంటి వాటి విషయంలో బీజీపీ, టీఎంసీలకే గొడవ జరుగుతూ వస్తోంది! సీపీఎం, సీపీఐ లాంటి కమ్యూనిస్టు పార్టీలు అంతకంతకూ గేమ్ లో లేకుండా పోతున్నాయి! ఈ ఉప ఎన్నికల్లో బీజేపి రెండో్ స్థానానికి ఎగబాకటం ఎర్ర పార్టీల వారికి డేంజర్ సైరనే! వారి సంగతేమోగాని.. బెంగాల్లో కమలం రేపనున్న కలకలాన్ని బెనర్జీ మాత్రం గుర్తించేసింది!