ఢిల్లీ వీధుల్లో తమిళ రైతు… జయలలిత బతికుంటే ఇలా జరిగేదా?
posted on Apr 13, 2017 @ 11:53AM
రాజు లేని రాజ్యం అరాచకానికి నెలవు. ఈ విషయం ఇప్పుడు మాట్లాడుకుంటోన్నది కాదు. రామాయణ కాలంలో కూడా దశరథుడు మరణిస్తే… రాముడు అరణ్యంలో వుంటే… భరతుడికి పెద్దలు అదే మాట చెబుతారు. రాజు లేని రాజ్యం అతలాకుతలం అవుతుందని! అయితే, కేవలం రాజుంటే సరిపోదు. సమర్థుడైన రాజు కూడా వుండాలి. ఇప్పుడు అదే విషయం నిరూపిస్తోంది తమిళనాడు!
తమిళనాడులో జయ అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరితే బోలెడు హడావిడి జరిగింది. తరువాత ఆమె మరణం కూడా బ్రేకింగ్ న్యూస్ ల పరంపరకు దారి తీసింది. ఇక ఆ తరవాత శశికళ వ్యవహారం, ఆమె సీఎం అవ్వలేకపోవటం, జైలుకెళ్లటం … ఇవన్నీ అయితే నానా గందరగోళానికి దారి తీశాయి. దేశం మొత్తం అదే చర్చ జరిగింది! కాని, విచిత్రంగా ఇప్పుడు అదే తమిళనాడుకు సంబంధించిన నిజమైన సమస్య ఎక్కడా చర్చకు రావటం లేదు. వచ్చిన మీడియాలో బ్రేకింగ్ న్యూస్ ల స్థాయికి రావటం లేదు. అక్కడా, ఇక్కడా అప్పుడూ ఇప్పుడు మాత్రమే కథనాలు వస్తున్నాయి! ఢిల్లీ వీధుల్లో తమిళ రైతులు అంటున్నారే తప్ప… జయలలిత, శశికళ గురించి ఊదరగొట్టినంతగా ఎవరూ మాట్లాడటం లేదు!
అసలు తమిళ రైతులకి ఏమైంది? వారు ఢిల్లీలో ఎందుకు నిరసనలకి దిగారు? ఈ ప్రశ్నలకి సమాధానం చాలా మందికి క్లియర్ గా తెలియదు. వారు రుణామాఫీ కోసం రోడ్డెక్కలేదు. వారి డిమాండ్లలో అది కూడా ఒకటైనా అసలు సమస్య కరువు! గత శతాబ్ద కాలంలో ఎప్పుడూ లేని వికృతమైన కరువు ఈసారి తమిళనాడుని తాకింది. జయ బ్రతికి వుండగానే తుఫాన్ వచ్చి చెన్నై మునిగినా… చాలా ప్రాంతాలు మాత్రం కరువుకి చిక్కాయి. పంటలు పండలేదు. రైతులు నిండా మునిగిపోయారు. బ్యాంక్ లకు ఋణాలు చెల్లించలేక విలవిలలాడుతున్నారు! అందుకే, ఢిల్లీ వీధుల్లో కేంద్రాన్ని నిలదీస్తున్నారు!
తమిళనాడు రైతులు రాజధానికి వచ్చి నగ్నంగా కూడా నిరసనలు తెలుపుతుంటే మోదీ సర్కార్ పట్టించుకోకపోవటం నిజంగా విషాదమే! ఒకవైపు ఉత్తర్ ప్రదేశ్ కి భారీ రైతు ఋణమాఫీ ప్రకటించి ఇంకో వైపు తమిళ రైతుల్ని మాత్రం ఎర్రటి ఎండకి నిర్ధాక్షిణ్యంగా వదిలేయటం దుర్మార్గం. కాని, ప్రాక్టికల్ గా మాట్లాడుకున్నప్పుడు కేంద్రం తప్పుతో పాటూ మనం తమిళనాడు రాష్ట్రంలో జరుగుతోన్నది కూడా చర్చించాలి! జయలలిత మరణం తరువాత అక్కడ స్థిరమైన ప్రభుత్వమే లేదు. పన్నీర్ సెల్వం నుంచి పళని స్వామీ దాకా జరిగిన పరిణామాల్లో నానా రచ్చ జరిగిపోయింది. ఈ క్రమంలో రైతుల్ని పట్టించుకున్న నాథుడే లేడు చెన్నైలో! అదే ఢిల్లీ చేరిన తమిళ రైతుల పాలిట శాపంగా మారింది!
ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో కోట్లు పంచి పెట్టి చిన్నమ్మ మేనల్లుడు దినకరన్ని గెలిపించుకునే పనిలో వున్న సీఎం బక్కచిక్కిన రైతుల్ని పట్టించుకునే ఉద్దేశ్యంలో లేడు! అసలు ఆయన వారి తరుఫున కేంద్ర ప్రభుత్వంతో ఒక్క మాటన్నా మాట్లాడలేదు ఇప్పటి వరకూ. ఇలాంటి పరిస్థితి జయలలిత బతికి వుంటే మనం ఊహించగలమా? ఇక్కడే అసలు సమస్యంతా వుంది. తమిళనాడుకి సీఎం అయితే వున్నాడు కాని... అతడికి రైతుల్ని పట్టించుకునేంత తీరిక, స్వేచ్ఛా, పెద్ద మనసు… ఏవీ లేవు! అందుకే, తమిళ అన్నదాత ఢిల్లీ వీధుల్లో మలమల మాడిపోతున్నాడు! జయలలిత నిష్క్రమణతో ఏర్పడ్డ ఈ దారుణమైన పరిపాలనా కరువు… తమిళులకి ఎప్పుడు తీరుతుందో ఏమో!