2019 ఎన్నికల సాగుకి… సిద్ధమైన కేసీఆర్ ఉచిత ఎరువు!
posted on Apr 14, 2017 @ 12:40PM
2014లో అటు మోదీ, ఇటు కేసీఆర్, చంద్రబాబు…. ముగ్గురూ ఒకేసారి ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఇప్పుడు సరిగ్గా వాళ్ల టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ పూర్తైంది. సెకండ్ ఇన్నింగ్స్ కు ప్రిపేర్ అవుతున్నారు! అయితే, అందరిలోకి కేసీఆర్ స్ట్రాటజీ కాస్త డిఫరెంట్ గానే కనిపిస్తోంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అంటూ ఇంత కాలం నెట్టుకొచ్చారు. కాని, అనూహ్యంగా గత కొన్ని నెలలుగా కొత్త కొత్త సంక్షేమ పథకాలు జనం ముందుకు తీసుకొస్తున్నారు! తద్వారా కులాలు, మతాల కాంబినేషన్ జాగ్రత్తగా కాపాడుకుంటూ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు స్కెచ్ వేస్తున్నారు!
కేసీఆర్ అత్యంత తాజా ప్రకటన రైతులకి ఉచిత ఎరువు! నిజంగానే ఆయన చెప్పుకున్నట్టు ఇంత వరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇలాంటి పని చేయలేదు! పంపిణీ చేయలేదు! కేసీఆర్ ఒకే ఒక్క మాస్టర్ స్ట్రోక్ తో 55లక్షల మంది రైతుల దృష్టిని ఆకర్షించగలిగారు. పైగా రుణ మాఫీ కూడా వీలైనంత వరకూ బాగానే జరిగింది తెలంగాణలో. అయితే, ఉచితంగా ఎరువులు ఇవ్వమని సీఎంని అడిగింది ఎవరు? ఎవరూ అడగలేదు. అయినా ఎందుకని వేల కోట్ల భారం మోస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పని చేస్తోంది? కారణం ఎన్నికలే!
ఎన్నికలు అంతకంతకూ దగ్గర పడుతుండటంతో కేసీఆర్ సంక్షేమం మీద దృష్టి పెట్టారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆయన టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని పెద్ద ఎత్తున్న పార్టీలో చేర్చుకుని సంస్థాగతంగా బలం చేకూర్చున్నారు! అయితే, గడిచిన రెండు, రెండున్నర సంవత్సరాల్లో తెలంగాణ సామాన్య జనానికి మాత్రం స్పష్టంగా ఎలాంటి లబ్ధి చూపించలేకపోయారు. మంచి విద్యుత్ అందించటం లాంటివి పక్కన పెడితే ఉద్యోగాలు పెద్ద ఎత్తున వస్తాయని నిరుద్యోగులు ఆశించారు! ఆ అంశంలో ఘోరంగా ఫెయిలైంది కేసీఆర్ సర్కార్. కోదండరామ్ సార్ రోడ్డు మీదకే వచ్చి గొడవ చేసేలా తయారైంది ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వ్యవహారం!
ఉద్యోగాలే కాదు కేజీ టూ పీజీ లాంటి ఇంకా బోలెడు ఎన్నికల హామీలు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ నెరవేర్చలేకపోయింది. ఇక ముందు కూడా వడివడిగా నెరవేర్చే సూచనలు కనిపించటం లేదు. ప్రతి పక్షాల నుంచి , ప్రజా సంఘాల నుంచీ రోజు రోజుకి ఒత్తిడి అధికమవుతోంది. ధర్నా చౌక్ ని కూడా అసెంబ్లీ, సెక్రటేరియట్లకు దూరంగా మార్చేయాల్సిన అవసరం ఏర్పడింది! ఇలాంటి పరిస్థితుల్లో ఉచిత ఎరువులే కాదు గొర్రెల పంపిణీ లాంటి వినూత్నమైన పథకాలతో గులాబీ బాస్ జనాన్ని ఎంగేజ్ చేసే పనిలో పడ్డారు!
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకి ముందు వున్న సమస్యలు ఇప్పటికీ అలానే వున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు మొదలు హైద్రాబాద్ రోడ్లు, పూర్తి కాని మెట్రో రైలు వరకూ అన్నీ అస్తవ్యస్తంగానే వున్నాయి. మరి ఇలాంటి స్థితిలో ఎరువులు, గొర్రెలు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కి ఎంత వరకూ మేలు చేస్తాయో చూడాలి!