రాజకీయ నేతల ఇళ్ల గురించిన ఆరోపణల… ‘గృహ హింస’!
posted on Apr 14, 2017 @ 6:50PM
గతంలో ఒక నేత మీద మరోక నేత ఆరోపణలు చేసుకోవాలంటే పాలన పరమైన దోషాలు వెదికే వారు. తరువాతి కాలంలో అవినీతి కోణాల్ని దొరకబుచ్చుకుని ఇరుకున పెట్టేవారు. ఇప్పుడు అదంతా పోయింది. కొత్తగా పర్సనల్ ఎటాక్స్ ఎక్కువైపోయాయి! రాజకీయ నేత పబ్లిక్ లైఫ్ తో ఎలాంటి సంబంధం లేని విషయాల్ని పెద్ద రచ్చ చేసే ఎజెండా అమలవుతోంది. దీంట్లో ప్రతిపక్షం, పాలకపక్షం, మీడియా, సోషల్ మీడియా అన్నీ భాగం అవుతన్నాయి!
ఈ మధ్య కాలంలో చంద్రబాబు హైద్రాబాద్ నూతన నివాసం మీద పెద్ద రచ్చ జరిగింది. అమరావతికి మకాం మార్చిన చంద్రబాబు ఇక్కడ ఎప్పట్నుంచో వుంటోన్న పాత ఇంటిని కూల్చి కొత్తగా కట్టుకున్నారు. ఆ విషయంపై వైసీపీ వారు అనవసర రాద్దాంతానికి తెర తీశారు. చంద్రబాబు ఇళ్లు కోట్లు విలువ చేసేలా కట్టారని, అంత దుబారా ఎందుకనీ ప్రశ్నించారు. చంద్రబాబు ఇల్లు కట్టింది ప్రజా ధనంతో కానప్పటికీ ఆయన సీఎంగా వున్నారు కాబట్టి ప్రతిపక్షం టార్గెట్ చేసింది. కాని, గతంలోనే లోటస్ పాండ్ అనే పేరుతో భారీ ఇంధ్ర భవనం నిర్మించిన జగన్ , ఆయన పార్టీ వారు చంద్రబాబును టార్గెట్ చేయటం కాస్త విడ్డూరమే!
కొందరు చెబుతన్న దాని ప్రకారం చంద్రబాబు ఇళ్లు కేవలం మూడు బెడ్ రూమ్ ల సముదాయం మాత్రమే. బెడ్ రూమ్స్ కాక ఒక హాల్, కాన్ఫరెన్స్ హాల్, స్విమ్మింగ్ పూల్ లాంటివి వున్నాయట. బంజారా హిల్స్ , జూబ్లీహిల్స్ ఏరియాల్లో ఇలాంటి కట్టడాలు మామూలే! కాని, చంద్రబాబు విలాసవంతమైన ఇల్లు కట్టాడని విమర్శిస్తున్న వైసీపీ నేతలు పట్టించుకోని విషయం లోటస్ పాండ్ సంగతే! అందులో ఏకంగా ముప్పై గదులు వున్నాయని, అవ్వి కాకుండా ఇతరరత్రా ఏర్పాట్లన్నీ కలిపితే అరవై గదుల దాకా సంఖ్య చేరుతుందని అంటున్నారు. అలాగే, బ్యాడ్మింటన్ కోర్టులు, ఎస్కలేటర్లు, మీటింగ్ హాల్సు, స్వీమ్మింగ్ పూల్ లాంటి సౌకర్యాలు కూడా వున్నాయట! ఇవన్నీ ఖచ్చితంగా చెప్పటం ఎవరి వల్లా కాదు. కాకపోతే, జగన్ పై వున్న కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కూడా ఆయన లోటస్ పాండ్ నివాసం కోట్లు పలుకుతుందనే అభిప్రాయపడింది!
ఇంతకీ… చంద్రబాబు, జగన్ ఇళ్లలో ఎవరిది ఎక్కువ ఖరీదైంది? లోటస్ పాండ్ విస్తరించి వున్న వైశాల్యం చాలు ఏ నిర్మాణానికి ఎక్కువ డబ్బులు అవసరమయ్యేది చెప్పటానికి! చంద్రబాబు నివాసానికి కంటే అది చాలా రెట్లు పెద్దది. కాబట్టి వైసీపీ నేతలు అనవసరంగా సీఎం వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకపోవటమే మంచిది. కారణం , ఇప్పుడున్న సోషల్ మీడియా జమానాలో చర్చంటూ ఒక్కసారి మొదలయ్యాక ఎదుటి వారు కూడా బలంగానే వాదన వినిపిస్తారు. అప్పుడు అన్ని విషయాలు బయటపడిపోతాయి! ఇంతా చేస్తే… జగన్, చంద్రబాబుల ఇళ్లపై చర్చ ఏ విధంగానైనా ఆంధ్ర ప్రజలకి మేలు చేస్తుందా అంటే… ఏమీ లేదు! అందుకే, డబ్బున్న వాళ్లు కట్టుకునే ఇళ్ల గొడవకన్నా ఇళ్లు లేని పేదల కష్టాల గురించి మాట్లాడుకుంటే బెటర్!