ఆర్దికాభివృద్ధి దీపం… వెలిగించే చమురుతో కృష్ణా తీరం!
మనకో సామెత వుంది… దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని! కానీ దీపం వెలిగించుకోటానికి తగిన చమురు వుంటే… ఇల్లు ఎప్పుడైనా చక్కబెట్టుకోవచ్చు! అవునా, కాదా? ఇక శుభవార్త ఏంటంటే… ఇప్పుడు ఆంధ్రుల నవ్యాంధ్ర దీపాన్ని వెలిగించే చమురు… కనకదుర్గమ్మ కనుసన్నల్లో, కృష్ణమ్మ పాదాల చెంత అద్భుతంగా లభించబోతోంది! ఆధునిక కాలపు బంగారం లాంటి సహజ వాయువు, చమురు దేశంలో మరెక్కడా లేని విధంగా కృష్ణా జిల్లాల్లో లభించనున్నాయి! అదే జరిగితే భారీ ఆర్దిక రాబడితో స్వర్ణాంధ్ర సుందర స్వప్నం సుసాధ్యమే!
రాష్ట్ర విభజనతో రాజధాని సైతం లేని దయనీయ స్థితిలో ఏపీ తన పయనం మొదలుపెట్టింది. మూడేళ్లలోనే అమరావతో సహా ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు పోతోంది. అయితే, ఎంతగా పెట్టుబడులు ఆకర్షించినా ఆర్దిక లోటు మాత్రం వెంటాడుతూనే వుంది. ప్రతీ దానికీ కేంద్రం తలుపు తట్టి నిరీక్షించాల్సి వస్తోంది. కాని, ఈ చారిత్రక సంధి కాలంలో ఒక్కసారి మనం జాగ్రత్తగా అడుగు వేస్తే ఎంతో ఆర్దిక పురోగతి సాధ్యమేనంటున్నారు నిపుణులు. కారణం… రాజధానికి దగ్గర్లోనే, కృష్ణ తీరంలో భారీగా చమురు నిక్షేపలు బయటపడ్డాయి. త్వరలోనే వాటి వెలికితీత మొదలవనుంది. అది జరిగితే ఇప్పుడు వ్యవసాయం, చేపల పరిశ్రమకి ప్రఖ్యాతిగాంచిన కృష్ఝా జిల్లా స్వరూప, స్వభావమే మారిపోనుంది!
ఇప్పటి పరిణామాల్ని పరికించే ముందు ఓ సారి గతంలోకి వెళదాం. బ్రిటీషు వారు భారత్ లో కాలుమోపిన తొలినాళ్లలోనే మచిలీపట్నానికి కూడా వచ్చారు. 18వ శతాబ్దంలోనే వారి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇక్కడ కార్యాలయం వుండేది. తెల్లవారి సైన్యం కూడా మకాం చేసేది. ఇంకా భారతదేశం అంతా వారి ఆధీనంలోకి రానప్పుడే మచిలీపట్నంలో వ్యాపార లావాదేవీలు నడిపే వారు ఇంగ్లీషు వాళ్లు. అయితే, అప్పట్లోనే ఒక ఆసక్తికర విషాద ఘటన చోటు చేసుకుంది. 1860-70ల మధ్య కాలంలో ఓ భారీ జల తరంగం ఊళ్ల మీదకి వచ్చి వేలాది మందిని పొట్టనబెట్టుకుంది. బంగాళాఖాతం మీద నుంచి తరుముకొచ్చిన ఆ రాకాసి అల గురించి బ్రిటీష్ లైబ్రెరీలో ఆధారాలు నమోదై వున్నాయి కూడా!
ఇంతకీ… మొత్తం 40వేల మంది వరకూ సామాన్య ప్రజలు, మత్స్యకారులు, బ్రిటీష్ అధికారులు మరణించిన ఆ దుర్ఘటన ఎందుకు జరిగింది? సముద్రం ఉప్పొంగటానికి కారణం… సముద్ర గర్భంలోనూ, కృష్ణ జిల్లా భూగర్భంలోనూ దాగి వున్నా అపార నిక్షేపాలేనట! ఇది ఇప్పుడు కాదు… 1860ల్లోనే బ్రిటీష్ వారు రాసిపెట్టిన సత్యం! కిందనున్న ఆ చమురు నిల్వల్లోఅగ్ని రాజుకుని పేలుళ్లు సంభవించటం చేతనే సముద్రం అల్లకల్లోలమై జనం మీదకి దూసుకొచ్చింది!
18వ శతాబ్దం నుంచీ నిన్న మొన్నటి వరకూ సముద్ర గర్భంలోని, భూగర్భంలోని చమురు నిల్వలు బయటకు తీసే చౌకైన సాంకేతిక మనకు అందుబాటులో లేదు. కాని, గత కొన్ని దశాబ్దాలుగా చమురు రంగంలో మనం ఎంతో అభివృద్ధి సాధించాం. అందుకే, ప్రస్తుతం కేజీ బేసిన్ లో చమురు ఉత్పత్తి వేగంగా జరిగిపోతోంది. ఇక తరువాతి గమ్యం కృష్ణ తీర ప్రాంతమే అంటున్నారు నిపుణులు. దీంట్లో భాగంగా… నాగాయలంక మండలంలోని వక్కపట్ల వారి పాలెం, నంగేగడ్డ గ్రామాల్లోని పొలాల్లో చమురు వెలికితీత ప్రారంభించనున్నారు వచ్చే ఆగస్ట్ లో! ఇప్పటికే ఇక్కడ భారీ చమురు నిల్వలు వున్నాయని ఓఎన్జీసీ, కెయిర్ ఇండియా సంస్థలు గుర్తించాయి.
కృష్ణ తీరంలోని కేవలం కొన్ని ఊళ్లూ, కొన్ని ఎకరాల పంట పొలాలకు మాత్రమే చమురు అన్వేషణ పరిమితం కాకూడదనీ …. నదీ తీరం మొత్తం జల్లెడ పట్టాలనీ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, నవ్యాంధ్ర తీరంలో, సముద్ర గర్భం కూడా లోతుగా అన్వేషించాలని అంటున్నారు. దీని వల్ల దేశంలోనే మరే రాష్ట్రానికి లేని చమురు నిల్వల సంపత్తి ఏపీకి కలుగుతుంది. దాని వల్ల భారీగా ఆర్దికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన జరుగుతుంది. తెలుగు వారికే కాదు… చమురు లభించటం వలన… శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న భారత్ కి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది!
ఒకప్పుడు చేతి చమురు వదిలించుకోవటం అంటే డబ్బులు ఖర్చు చేయటం అని అర్థం! కాని, ఆధునిక కాలంలో పెట్రోల్, డీజీల్ ఉత్పత్తికి కారణమైన చమురే అత్యంత ఖరీదైన సంపద! ఆ చమురు వెలికితీసి చేతి అంటించుకోవటమే… ఆర్దికాభివృద్ధి! మరి అటువంటి సహజ సంపద ప్రకృతి మన కృష్ణమ్మ ఒడిలో భద్రంగా దాచింది. ఎంత సమర్థంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజల బాగుకి వాడతాయన్నదే తరువాతి ప్రశ్న!