కుల్భూషణ్ జాదవ్ రా ఏజెంటా? భారత గూఢచారుల గురించి 7ఆసక్తికర సత్యాలు!
posted on Apr 14, 2017 @ 8:48PM
కుల్భూషణ్ జాదవ్ …. ఇప్పుడు ఈ పేరు రెండు దేశాల్లో మార్మోగుతోంది! ఇటు ఇండియా జాదవ్ కు ఏం జరిగినా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తోంటే… అటు పాకిస్తాన్ అతను రా ఏజెంట్ అనీ, తమ దేశంలోకి చొరబడ్డాడనీ, ఉగ్రవాదానికి కారణమని కబుర్లు చెబుతోంది! అసలు ఉరిశిక్షకి గురై ప్రస్తుతం చావుబతుకుల మద్య వున్న కుల్భూషణ్ నిజంగా అపరాధేనా? మన దృష్టిలో కాకున్నా పాకిస్తాన్ చట్టాల ప్రకారమైన అతను గూఢచారా? పాకిస్తాన్ భద్రతకు ముప్పా? కానే కాదంటున్నారు నిపుణులు! అందుకు ఏడు కారణాల్ని కూడా వారు చెబుతున్నారు!
1. కుల్భూషణ్ జాదవ్ భారత నిఘా సంస్థ రా పంపిన ఏజెంట్ కాదని చెప్పే మొదటి అంశం… అతను పాకిస్తాన్ సరిహద్దు వెంట వుండే భారతీయుడు కాకపోవటమే. పాక్ లోకి ఎవర్నైనా గూఢచర్యం కోసం పంపాలంటే రా ముందుగా వాళ్లని పాక్ సరిహద్దు గ్రామాల్లోంచే ఎంచుకుంటుంది. వారైతేనే పాకిస్తాన్ జనంతో రోజూ టచ్ లో వుంటూ వుంటారు. వారికి పాక్ ఆచారాలు, సంప్రదాయాలు, వ్యవహారాలు అన్నీ తెలిసి వుంటాయి. అలాంటి వారు పాక్ లోకి వెళితే ఈజీగా అక్కడ జనంలో కలిసిపోగలరు. జాదవ్ మహారాష్ట్ర కు చెందిన వాడు. ఆయనకు పాక్ జనజీవితం గురించి, సంస్కృతి గురించి తెలిసే అవకాశమే లేదు!
2. చాలా అరుదుగా మాత్రమే … పాక్ సరిహద్దు ప్రాంతాలకు చెందని వార్ని రా తన ఏజెంట్స్ గా పంపుతుంటుంది. అలాంటి వారు చాలా చాలా తెలివైన, చురుకైన వారై వుండాలి. పాక్ లోకి వెళ్లాక అక్కడ ఎవ్వరికీ అనుమానం కలగకుండా జనంలో అవలీలగా కలిసిపోవాలి. అయినా కూడా ఇలాంటి వార్ని రా ఎక్కువ కాలం పాక్ లో వుండనీయదు. కొన్ని రోజుల్లోనే మిషన్ కంప్లీట్ చేసుకుని వచ్చేయమని చెబుతుంది. జాదవ్ చాలా రోజులు పాక్ లో గడిపాడు.
3. రా ఏజెంట్లు పాకిస్తాన్ లో ప్రవేశిస్తే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇండియన్ పాస్ పోర్ట్ కలిగి వుండరు. అలా పాస్ పోర్ట్ తో , అదీ వేరే ఒక దేశం గుండా రా తన ఏజెంట్స్ ని పంపదు. జాదవ్ ఇండియన్ పాస్ పోర్ట్ తో ఇరాన్ సరిహద్దు ద్వారా పాక్ లో ప్రవేశించే ప్రయత్నం చేశాడు. ఇది రా ఏజెంట్లు ప్రవర్తించే తీరు ఎంత మాత్రం కాదు!
4. రా వేరే దేశం ద్వారా తన ఏజెంట్ ని పాక్ లోకి పంపాలనుకుంటే పక్కాగా ప్లానింగ్ తో ముందుకు వెళుతుంది. ఏజెంట్ తనంత తానుగా బయలుదేరి వెళ్లిపోడు. విదేశంలోని సోర్స్ తో రా అధికారులు జాగ్రత్తగా చర్చలు జరిపి ఎలాంటి రిస్క్ లేకుండా ప్లాన్ చేశాకే… ఏజెంట్ కు బయలుదేరేందుకు అనుమతినిస్తారు. ఇరాన్ అలాంటి దేశం కాదు. రా ఇరాన్ గుండా మన ఏజెంట్లను పంపే అవకాశం లేదు!
5.ఇక పాకిస్తాన్ జాదవ్ కు సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో ఆయన రా జాయింట్ సెక్రటరీ అనిల్ కుమార్ గుప్తా తనని పాక్ పంపారని చెప్పాడు. అసలు అనిల్ కుమార్ గుప్తా అనే అధికారే రా లో లేడని తేలింది! అంతే కాదు, జాదవ్ చేత పాకిస్తాన్ అజిత్ దోవల్ పేరు కూడా పలికించింది! క్షేత్ర స్థాయిలో పని చేసే గూడచారులతో అజిత్ దోవల్ స్థాయిలోని చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ మాట్లాడటం అసంభవం!
6. పాక్ విడుదల చేసిన వీడియోలోనే జాదవ్ ఒక చోట తాను 2001లో నేవీ నుంచి రిటైర్ అయ్యానని చెప్పాడు. మరో చోటా అతనే తాను ఇంకా సర్వీస్ లో వున్నానని, 2022లో రిటైర్ అవుతానని చెబుతాడు! ఇలా మాట్లాడుతున్నాడంటే అర్థం … పాకీలు జాదవ్ ను చిత్రహింసలకు గురి చేసి వుండాలి. లేదంటే, అతను ఏదైనా డ్రగ్ ప్రభావంతో అపస్మారక స్థితిలో మాట్లాడి వుండాలి.
7. ఫైనల్ గా… ఇరాన్ నుంచి పాక్ లోకి ప్రవేశించే ప్రయత్నం చేసిన కుల్భూషణ్ జాదవ్… ఒక చిన్న వ్యాపారస్థుడు. అతనికి బిజినెస్ ఇరాన్ లో వుంది. అలాంటి వ్యాపారస్థులు రా కోసం పని చేయటం అబద్ధం కాదు. కాని, జాదవ్ చేసుకునే వ్యాపారం చాలా చిన్నది. అతనితో రా వారికి పెద్దగా అనుబంధం వుండే అవకాశం అస్సలు లేదు. ఎందుకంటే, రా కోసం అప్పుడప్పుడూ లోకల్ బిజినెస్ మెన్ పని చేసినా వారంతా తమ తమ వ్యాపారాల్లో నష్టాల్ని ఎదుర్కుంటున్న వారై వుంటారు. వారు డబ్బు కోసమో, లేక మరేదైనా లాభం కోసమో రా ఏజెంట్లు గా సహకరిస్తుంటారు. జాదవ్ కు అలాంటి అవసరం కూడా వున్నట్టు కనిపించటం లేదు. అతని లాంటి నేపథ్యం వున్న ఎవరికీ రా సుదీర్ఘమైన మిషన్లు అప్పగించదు. చిన్న చితకా సమాచారాలే వారు చేరవేస్తుంటారు. పాక్ చెప్పినట్టుగా ఉగ్రవాదం రగల్చటం లాంటి పనులకు రా వ్యాపారస్థుల్ని అస్సలు ఉపయోగించదు!
కేవలం అంతర్జాతీయ సమాజం ముందు భారత్ పేరు చెడగొట్టాలని ఆశిస్తోన్న పాక్ జాదవ్ ను అక్రమంగా ఉరితీసే ఆలోచనలో వుంది. అయితే, ఇండియా కూడా ధీటుగా బదులు ఇవ్వటంతో ప్రస్తుతానికైతే వెనక్కి తగ్గింది. చూడాలి మరి… మన జాదవ్ ఎంత కాలానికి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడో!