వోల్వో బస్సు అగ్ని ప్రమాదం: 40 మంది సజీవదహనం!

      ఈ రోజు ఉదయం తెల్లవారు జామున మహబూబ్‌నగర్ జిల్లా కొత్తపేట మండలం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులు సజీవ దహనం కాగా ఐదుగురు తీవ్రగాయాల పాలయ్యారు. బెంగుళూరునుంచి హైదరాబాదు వస్తున్న ఒక వోల్వో బస్సు మహబూబ్‌నగర్‌ సమీపంలో బుధవారం తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో వంతెనను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరింగింది. ప్రమాద సమయంలో బస్సుల 49 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. తెల్లవారుజామున గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో తెలుసుకునే లోగానే..డిజిల్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగి క్షణాల్లో బస్సు దహనం అయినట్టు సమాచారం. మెలకువగా ఉన్న డ్రైవర్‌తో సహ ఆరుగురు ప్రమాదం నుంచి బయట పడినట్టు సమాచారం.   ఇది జబ్బార్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సుగా గుర్తించారు. కొందరు వనపర్తి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవరు, క్లీనరు పోలీసులో అదుపులో ఉన్నట్లు సమాచారం. జబ్బార్‌ ట్రావెల్స్‌ సంస్థ ప్రతినిధులు వస్తే తప్ప అసలు బస్సులో ఉన్న ప్రయాణికులకు సంబంధించిన ఎలాంటి వివరాలు వెల్లడి కాకపోవచ్చునని తెలుస్తోంది. 

రాష్ట్ర విభజనకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలే కారణమా

  కేంద్రమంత్రి పదవి కోసం కావూరి సాంబశివరావు అలకలు గురించి అందరికీ తెలిసిన విషయమే. మంత్రి ఇవ్వలేదనే కోపంతో ఆయన సమైక్యాంధ్ర కోసం అవసరమయితే పార్టీ పెట్టి మరీ పోరాటం మొదలు పెడతానని కాంగ్రెస్ హస్తాన్ని మెలితిప్పి మరీ కేంద్ర మంత్రి పదవి సంపాదించుకొన్నారు. కేంద్రమంత్రి పదవి రాగానే రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు కూడా. కానీ తాను సమైక్యవాదినేనని నేటికీ అయన చెప్పుకొంటూనే ఉంటారు.   తను కేంద్ర మంత్రి అయిననాటి నుండి తను ప్రతీ క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర విభజన చేయవద్దని, దానివల్ల అనేక సమస్యలు వస్తాయని కేంద్రానికి హితవు చెపుతూనే ఉన్నానని, కానీ ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసిన కొందరు సీనియర్లు రాష్ట్ర విభజన చేయమని అధిష్టానాన్ని ప్రోత్సహించారని ఆయన తీవ్ర ఆరోపణలు చేసారు. వారి కారణంగానే నేడు రాష్ట్రం విడిపోతోందని ఆయన ఆరోపించారు.   ఆయన తాజా ఆరోపణలతో రాష్ట్ర విభజనకు కొందరు స్వార్ధపరులయిన సీమాంద్ర కాంగ్రెస్ నేతలే ప్రధాన కారకులని అర్ధం అవుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుండి డిల్లీ వరకు ఒక్కో నేత ఒక్కో కారణమెందుకు చెపుతున్నట్లు? రాష్ట్ర విభజన ప్రతిపక్షాలిచ్చిన లేఖలే కారణమంటూ ఎందుకు నిందిస్తున్నట్లు? ముఖ్యమంత్రి పదవిపై కన్నేసి రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రోత్సహించింది ఎవరు? ఈ సంగతి తెలిసి ఉండి కూడా ఇంతకాలం కావూరి ఎందుకు దాచిపెట్టినట్లు? ఇప్పుడే ఎందుకు బయటపెడుతున్నట్లు?   కాంగ్రెస్ నేతలకు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్రం ముఖ్యం కాదని కావూరి మాటలు నిర్దారిస్తున్నాయి. వారి రాజీనామాల డ్రామాలలాగే, వారి సమైక్యాంధ్ర డ్రామాలు కూడా సాగుతున్నాయి నేటికీ.

లేచింది విద్యార్థి లోకం!

      రాష్ట్ర విభజన కోసం కేంద్రం పడుతున్న తహతహని సీమాంధ్రలోని విద్యార్థిలోకం ఇంతకాలం శాంతియుతంగా గమనించింది. ఇప్పుడు పరిస్థితులు చెయ్యిదాటిపోయేలా వుండటంతో సీమాంధ్ర విద్యార్థిలోకి రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. సీమాంధ్ర జిల్లాల్లో వున్న విశ్వవిద్యాలయాల విద్యార్థి జేఏసీల నాయకులు మంగళవారం నాడు నాగార్జున యూనివర్సిటీలో సమావేశమయ్యారు.   సమావేశం ముగిసిన తర్వాత విద్యార్థులు తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం, సీమాంధ్ర విద్యార్థులు నష్టపోకుండా చూడటం కోసం ఆత్మాహుతి దాడులకైనా సిద్ధమేనని విద్యార్థులు ప్రకటించడం విభజన విషయంలో సీమాంధ్ర విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనకు అద్దం పడుతోంది. సీమాంధ్రలో ఎవరి ఆందోళనలనూ పట్టించుకోకుండా రాష్ట్ర విభజనకు శరవేగంగా సన్నాహాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తమ సత్తా చూపించాలని సీమాంధ్ర విద్యార్థులు భావిస్తున్నారు. నవంబర్ 1 నుంచి తమ పోరును తీవ్రం చేయబోతున్నారు. రాష్ట్ర విభజన అగ్నికి ఆజ్యం పోసిన సీపీఐ, బీజేపీల మీద సీమాంధ్ర విద్యార్థులు మండిపడుతున్నారు. నవంబర్ 1న సీమాంధ్రలోని సీపీఐ, బీజేపీ కార్యాలయాలకు తాళాలు వేయాలని విద్యార్థులు నిర్ణయించారు. అయితే సీమాంధ్రలో సీపీఐ, బీజేపీ కార్యాలయాలకు తాళాలు వేసినా, వేయకపోయినా ఒక్కటే..  ఆ విషయం ఆ రెండు పార్టీలకి బాగా తెలుసు.

చిరుపై రాళ్ళ దాడి

      మాజీ మెగాస్టార్, కేంద్ర మంత్రి చిరంజీవికి వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ మధ్య కురిసిన వర్షాలు, వరదల బారిన పడి తీవ్రంగా నష్టపోయిన సీమాంధ్ర వాసులను పరామర్శించడం ద్వారా అక్కడి ప్రజల మనసులలో తాను కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందాలని చిరంజీవి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో శుభమా అని పరామర్శలు ప్రారంభించిన చిరంజీవికి ఆదిలోనే అపశకునం ఎదురైంది. పడవ ఎక్కబోయిన చిరంజీవి నీళ్ళలో జారిపడిపోయారు. తాజాగా, ఈ రోజు ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్ళిన చిరంజీవిని సమైక్య నినాదాలు చేస్తూ విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చిరంజీవిపైకి రాళ్ళు విసిరారు. అదృష్టవశాత్తూ చిరంజీవికి రాళ్ళు తగల్లేదు. భద్రతా సిబ్బంది సమైక్యవాదుల్ని నిలువరించారు. అనంతరం చిరంజీవిని జాగ్రత్తగా అక్కడినుంచి తరలించారు. చిరంజీవి లాంటి స్టార్ ఇమేజ్ వున్న వ్యక్తికి ఇలాంటి అనుభవాలు చాలా ఇబ్బందికరంగా వుంటాయి.

కిరణ్ పార్టీ పెడతానని చెప్పలేదు

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీని స్థాపించబోతున్నాడనే వార్తలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశాలు అవుతున్నాయి. సమైక్యవాదపు హీరోగా కిరణ్ కుమార్ రెడ్డి సొంతంగా ఇమేజ్ తెచ్చుకొన్న నేపథ్యంలో ఆయన కొత్తగా పార్టీ పెట్టినా సక్సెస్ అవుతాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు, కిరణ్ కు జరుగుతున్న అవమానాలు కూడా కొత్త పార్టీకి బీజాలు వేస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో కిరణ్ పార్టీ స్థాపిస్తాడనే వార్తలకు మరింత ఊపు వస్తోంది. ఇక కిరణ్ ను పదవి నుంచి తొలగించబోతున్నారన్న వార్తలు కూడా కొత్త పార్టీ ఊహాగానాలకు మరింత ఊతమిస్తున్నాయి.     ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తరపున మంత్రి శైలజానాద్ ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడూ పార్టీ పెడతానని చెప్పలేదని ఆయన అన్నారు.అలాగే రాష్ట్ర విబజనను అడ్డుకుంటానని ముఖ్యమంత్రి చెప్పారే కాని, త్యాగం చేస్తానని అనలేదని అంటున్నారు. రాజ్యాంగం ప్రకారమే రాష్ట్రాల ఏర్పాటు జరగాలి తప్ప రాజ్యాంగ విరుద్దంగా జరగరాదని శైలజానాద్ అన్నారు.

ఒకే వేదికపై మోడీ,మన్మోహన్‌

      భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ మంగళవారం ఒకే వేదికపై కలుసుకునున్నారు. అహ్మదాబాద్‌లో వీరిద్దరూ కలిసి సర్దార్‌ పటేల్‌ మ్యూజియంను ప్రారంభించారు. మోడీ భాజపా ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాక వీళ్లిద్దరూ కలిసి ఒకే వేదిక పంచుకోవడం ఇదే తొలిసారి. మన్మోహన్ పై మోడీ వరుసగా వాగ్బాణాలు సంధించడం, మోడీ సభలో పేలుళ్లపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండటం.. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరూ ఒకే వేదికపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మామలుగా మన్మోహన్ పై విరుచుకుపడే మోడి మంగళవారం మాత్రం ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికి ఆయనతో కరచాలనం చేశారు. మన్మోహన్ కూడా నవ్వుతో ఆయన్ని పలకరించారు.

రానున్నఎన్నికలలో రాజమండ్రికి స్టార్ ఎట్రాక్షన్

  ఒకనాడు తెలుగు సినిమా పరిశ్రమలో ఒకవెలుగు వెలిగిన కృష్ణం రాజు, మొదట కాంగ్రెస్ పార్టీలోకి ఆ తరువాత బీజేపీలోకి అటునుండి ప్రజారాజ్యం పార్టీలోకి వరుసగా స్టెప్పులేసుకొంటూ చకచకా సాగిపోయారు. అయితే ప్రజారాజ్యంలో ఆయన స్టెప్పులు తడబడటంతో ఉండవల్లి చేతిలో ఓడిపోయారు. నాటి నుండి రాజకీయ సన్యాసం ప్రాక్టీస్ చేస్తున్నఆయన ‘బిల్లా రంగా..’అనుకొంటూ కాలక్షేపం చేస్తూ వచ్చారు. కానీ మళ్ళీ మోడీని చూసిన తరువాత ఆయనలోని బీజేపీ హార్మోన్స్ లో కదలికలు మొదలయ్యాయి. అందుకే ఆ మధ్యన ఎప్పుడో మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన దర్శనం చేసుకొని ఎన్నికలలో పోటీ చేసేందుకు అవసరమయిన ప్రేరణ తెచ్చుకొన్నారు. మళ్ళీ నిన్నడిల్లీలో వాలిపోయి బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కి బొకే ఇచ్చి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చి వచ్చారు. అంటే ఇక నేడో రేపో బీజేపీ గూట్లో చేరిపోతున్నట్లు ప్రకటన వెలువడవచ్చునన్నమాట. రానున్నఎన్నికల తరువాత ఎలాగయినా కేంద్రంలో జెండా ఎగురేయాలని పట్టుదలతో ఉన్నబీజేపీ, కృష్ణంరాజు గారికి మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించి రాజమండ్రీ టికెట్ ఇవ్వవచ్చును.   రాష్ట్రవిభజన కారణంగా అస్త్ర సన్యాసం చేసిన ఉండవల్లి ఎలాగు రేసులోంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించేశారు గనుక, సీమంద్రాలో కాంగ్రెస్ పార్టీ ప్రతికూల పవనాలు ఎదుర్కొంటున్నందున, ఈసారి తను గెలిచే అవకాశాలున్నాయని ఆయన ఓ లెక్క వేసుకొని మళ్ళీ రంగంలో దిగి ఉండవచ్చును. అయితే ఆయనతో ఆడిపాడిన జయప్రద కూడా సరిగ్గా రాజమండ్రీలోనే స్టెప్పులు వేయాలని తెగ ఆరాటపడుతోంది పాపం. అన్ని పార్టీలు కూడా ఆమెని రా..రమ్మని ఒకటే ఆహ్వానించేస్తుండటంతో (అలాగని ఆమె చెప్పారన్నమాట) కొంచెం కన్ఫ్యుస్ అయ్యి, చివరికి కాంగ్రెస్ పార్టీకి కమిట్ అయిపోవాలని డిసైడ్ అయ్యి, సోనియాగాంధీకి తనను పార్టీలో జేర్చుకొనే అవకాశం కల్పించారు.   సీమాంద్రాలో కాంగ్రెస్ పేరు చెపితే జనాలు తరిమి కొట్టేలా ఉన్నారు గనుక బహుశః ఆమెకే టికెట్ ఖాయం చేసే అవకాశాలున్నాయి. ఒకవేళ జయప్రదకి కూడా రాజమండ్రీ వేదికే ఖాయం అయిపొతే, ఇక వారిద్దరూ ఆ పాత మధురాలు ఓసారి జ్ఞప్తికి తెచ్చుకొంటూ ఎవరి పార్టీలో వారు స్టెప్పులు వేసుకొంటారేమో. కృష్ణంరాజు వెనుక కత్తి, తుపాకి పట్టుకొని ఏ బాహుబలో, బిల్లానో యుద్దానికి వస్తే రావచ్చును. అప్పుడు జయప్రదతో స్టెప్పులు వేయడానికి మన మెగా మంత్రిగారు వస్తారేమో మరి.   వారిద్దరి మధ్య మరో ఫ్యామిలీ నటుడు మురళీ మోహన్ సైకిల్ మీద జయభేరీ వాయించేందుకు దూసుకు రావచ్చును. అప్పుడు ఆ పోటీ కాంగ్రెస్-బీజేపీ-తెదేపాల మధ్యకాక టాలివుడ్ తారల మధ్య సాగినట్లవుతుంది గనుక మంచి పసందుగా ఉండవచ్చును. ఇదంతా బాగానే ఉంది. కానీ ఈ ప్రోగ్రాం అయిపోయాక వీరిలో రాజమండ్రీ ప్రజలకు ఏవయినా ఒరగబెట్టేవరెవరనేది కూడా ఆలోచించుకోవాలి.

టీఆర్‌ఎస్‌ కొత్త ఇష్యూ దొరికింది

      ప్రతి చిన్న విషయాన్నీ పెద్ద ఇష్యూచేసి రాజకీయంగా లాభపడాలని భావించే టీఆర్ఎస్ పార్టీకి మరో ఇష్యూ దొరికింది. ఒకవేళ రాష్ట్రాన్ని విభజిస్తే అటు సీమాంధ్రతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో శాంతి భద్రతల విషయంలో ఎలా వ్యవహరించాలన్న అంశం మీద కేంద్ర హోంశాఖ మంగళవారం హైదరాబాద్‌లో మాజీ డీజీపీలతో ఒక సమావేశం ఏర్పాటు చేసింది.   ఈ సమావేశంలో పాల్గొనడానికి మాజీ డీజీపీలు అరవిందరావు, మహంతి, ఆంజనేయరెడ్డి తదితరులకు ఆహ్వానాలు అందాయి. అయితే టీఆర్ఎస్‌లో చేరి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న మాజీ డీజీపీ పేర్వారం రాములుకు మాత్రం ఆహ్వానం అందలేదు. ఒక రాజకీయ పార్టీలో చురుకైన కార్యకర్తలా వున్న వ్యక్తిని ఈ సమావేశానికి పిలవకూడదని కేంద్ర హోం శాఖ భావించిందో, మరే కారణం ఉందోగానీ, మొత్తానికి సమావేశానికి పేర్వారం రాములుకు ఆహ్వానం రాలేదు. దాంతో టీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధించడం ప్రారంభించింది. తెలంగాణ ప్రాంతం నుంచి డీజీపీ స్థాయికి ఎదిగిన ఏకైక పోలీసు అధికారి అయిన పేర్వారం రాములును సమావేశానికి ఆహ్వానించకపోవడం ఉద్దేశపూర్వకంగా చేసిన పనేనని టీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. రాష్ట్ర విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి ఈ విషయం మీద టీఆర్ఎస్ ఫిర్యాదు కూడా చేసింది. ఈ విషయాన్ని ఇంకా పెద్దదిగా చేసి, దీన్ని సీమాంధ్రుల కుట్రగా కలర్ వేయడానికి టీఆర్ఎస్ నాయకులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో పేర్వారం రాములు కూడా పాల్గొంటే టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా లేని అంశాలు చర్చకు వస్తే ఆయన వాటికి అడ్డుపుల్ల వేసే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఇప్పుడు ఆ అవకాశం లేదని బాధపడుతోంది. నానాయాగీ చేసయినా సరే పేర్వారం రాములుకు ఈ సమావేశానికి ఆహ్వానం అందేలా చేయాలని టీఆర్ఎస్ కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది.

సీమాంధ్రలో వైకాపా ఆధిక్యం

      సీమాంద్రలో ప్రస్తుతానికి వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉందని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రాబోయే కాలంలో రాజకీయ పరిణామాలను బట్టి ఈ అధిక్యత నిలుస్తుందా ? నిలవదా ? అన్నది వేచిచూడాలని అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే ఒక రకంగా పరిణామాలు ఉంటాయని, విభజన జరగకపోతే మరోరకంగా ఉంటాయని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడతారా ? లేదా అని తనకి తెలియదని అన్నారు. గతంలో చంద్రబాబు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంలో కుమ్మక్కు ఉద్దేశం కాదని, అప్పుడు రాజకీయ పరిస్థితుల రీత్యా ఆ విధమైన నిర్ణయం తీసుకున్నారని జెసి అబిప్రాయపడ్డారు. నేను గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. ఇప్పుడు పార్టీ మారాలంటే ఎలా మారగలని అన్నారు.

మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానికి, రాష్ట్రపతికి రాష్ట్ర విభజనని ఆపమని లేదా పూర్తి రాజ్యాంగ బద్దంగా చేయమని కోరుతూ వ్రాసిన లేఖల గురించి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ తనకేమి తెలియదని పెద్ద జోకేసారు. కానీ చాకు లాంటి పీసీ.చాకో మాత్రం రెండు లేఖలు తమకు అందాయని కన్ఫర్మ్ చేయడమే కాక, రాజ్యాంగం గురించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కంటే ప్రధాని మన్మోహన్ సింగ్ మరియు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఐడియా ఉందని స్పష్టం చేసారు.   ముఖ్యమంత్రి రాష్ట్ర విభజనను మొదటి నుండి వ్యతిరేఖిస్తున్నారని అందువల్ల ఆయన లేఖలని చూసి ఎవరికీ ఆశ్చర్యం (కలవరం) కలుగలేదని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎవరూ పరిష్కరించడానికి సాహసించని తెలంగాణా అంశాన్ని తమ పార్టీ పరిష్కరిస్తోందని, రాష్ట్ర విభజన పూర్తి రాజ్యంగబద్దంగానే జరుగుతోందని మీడియాకు తెలిపారు. రాష్ట్ర విభజనపై పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నవిషయం కూడా తమకు తెలుసని, అయితే తమ నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు.   సాక్షాత్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి వ్రాసిన లేఖలు గురించి తనకేమి తెలియదని తప్పుకొంటే, చాకో ఈవిధంగా వివరణ ఈయడం విశేషమే. ఎందుకంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్రాసిన లేఖల కారణంగా కాంగ్రెస్ అధిష్టానం ఆయనని ఇటువంటి కీలక తరుణంలో పదవి నుండి తప్పించనూ లేక అలాగని ఆయన దిక్కార ధోరణిని సహించనూ లేక ఆయనతో ఏవిధంగా వ్యవహరించాలో అర్ధం కాక తలపట్టుకొందని మీడియాలో వస్తున్న వార్తలను, రాజకీయ విశ్లేషణలను ఇప్పటికీ ఖండించక పోయినట్లయితే అది అధిష్టానం చేతగానితనంగా కనబడుతుందనే భయంతోనే, ఆ లేఖలను చూసి తామేమి కలవరపడటం లేదని, అసలు ఆ లేఖలకు తాము ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని అర్ధం అవుతోంది. కానీ, పార్టీ తీసుకొన్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేరుగా ప్రధానికి, రాష్ట్రపతికి లేఖలు వ్రాయడం అంత తేలికగా కొట్టిపారేయవలసిన విషయం కాదని అందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం ఇంతకంటే వేరే ఉపాయం లేదు మరి. అందుకే చాకో ద్వారా ఈ వివరణ.

విభజనపై ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌

      విభజన నిర్ణయం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత దూకుడుగా అడుగులు వేస్తోంది. విభజన వల్ల శాంతిభద్రతలపై పడే ప్రభావం, నక్సల్స్ సమస్య, హైదరాబాద్ స్థాయి తదితరాలపై అధ్యయనానికి కేంద్ర హోంశాఖ ఓ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపిఎస్ అదికారి విజయకుమార్ ఆధ్వర్యంలో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పడింది. మాజీ ఐపిఎస్ అదికారి ఎ.కె. మహంతి , జెవి రాముడు తదితరులు కూడా ఈ బృందంలో ఉన్నారని చెబుతున్నారు. ఇది రాష్ట్ర అధికార వర్గాల నుంచి సమగ్ర సమాచారం సేకరించి ఓ వ్యూహాత్మక పత్రాన్ని రూపొందిస్తుంది. కేంద్ర మంత్రుల బృందానికి తన నివేదిక సమర్పిస్తుంది. వారం రోజుల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఈ కమిటీకి హోంశాఖ గడువు విధించినట్టుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంటే నవంబర్ 5లోగా ఇది జీవోఎంకు ప్రాథమిక నివేదిక సమర్పించాల్సి ఉంటున్నదన్నమాట.

క్లైమాక్స్ సీన్ కోసం దివాకర్ రెడీ, మరి బొత్స?

  ఇంతవరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడు పదవి నుండి తప్పించబోతోందనే దాని పైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆయన కంటే ముందుగా సీనియర్ కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి క్లైమాక్స్ యాక్షన్ సీన్ చేసేందుకు ఆరాటపడుతున్నట్లు కనిపిస్తున్నారు.   మొన్న జగన్ సభకు కాంగ్రెస్ అధిష్టానం మద్దతు ఉందని ప్రకటించి అందరినీ నివ్వెరపరిచిన ఆయన, ఈ రోజు మరో అడుగు ముందుకు వేసి, తమ అధిష్టానం కేంద్రంలో అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యంతోనే ముందుకు సాగుతూ అటు తెరాసతో, ఇటు వైకాపాతో పొత్తులకు సిద్ధపడుతోందని, జగన్ 25 ఎంపీ సీట్లకు హామీ ఇచ్చినందునే తమనందరినీ పక్కన బెడుతోందని ఆరోపించారు.   తమ అధిష్టానం కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఆరాటపడుతుంటే, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారం చేప్పటి ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడుతున్నాడని ఆయన తీవ్ర విమర్శలు చేసారు. తనకు కొత్త పార్టీ గురించి ఎటువంటి ఆలోచన లేదని, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఇప్పుడే ఎవరూ ఏమి చెప్పలేరని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌కు బీజేపీ మద్దతు పలకడం అనవసరమని భావించవచ్చు గనుక, రాష్ట్ర విభజనను ఆపేందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మొత్తం బీజేపీలో చేరితే బాగుటుందని అన్నానని మీడియాకు వివరణ ఇచ్చారు.   ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో మహా అయితే రెండు నుండి ఆరు యంపీ సీట్లు మాత్రమే దక్కే అవకాశం ఉందని, కాంగ్రెస్ నేతలందరూ తాము కాంగ్రెస్ పార్టీకి చెందినవారమని చెప్పుకోవడానికి కూడా సిగ్గు పడుతున్నారని ఆయన అన్నారు. బహుశః ఈ విధంగా మాట్లాడినందుకు షోకాజ్ నోటీసులు అందుకొన్నాఆశ్చర్యం లేదని, ప్రజలే కాదు ఆయన కూడా భావించడం విశేషం. అయినప్పటికీ తను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని అన్నారు.   ఆయనను ఇష్టం లేకపోతే పార్టీలో నుండి బయటకి పొమ్మని ఇప్పటికే హెచ్చరించిన బొత్స, ఇంత రాద్ధాంతం చేస్తుంటే ఇంకా వేచి చూస్తారని అనుకోలేము. పార్టీ నుండి ఎవరినయినా బయటకి తరిమేసేందుకు ఈ మాత్రం మాటలు చాలు. అయితే ఆయనని బయటకి పంపితే ఆయన మరిన్ని రహస్యాలు బయటపెడితే పార్టీకి ఇంత కంటే ఎక్కువ నష్టం కలుగుతుందని బొత్స భావిస్తే మాత్రం ఆయనను ఉపేక్షించే అవకాశం ఉంది.

కాలుజారిన చిరు

  వరద ప్రాంతాల్లోని బాధితులను పరామర్శించటానికి వచ్చిన కేంద్ర మంత్రి చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది.. సినిమాల్లో ఎన్ని స్టంట్‌లు అయినా అవలీలగా చేసు మన మెగాస్టార్‌ అదే రేంజ్‌లో పడవ ఎక్కబోయి పాపం కాలు జారిపడిపోయారు..   తిమ్మాపురంలో వరద ముంపు ప్రాంతంలో పర్యటిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చిరంజీవితోపాటు మరో ఇద్దరు నేతలు పడవ ఎక్కారు. ముగ్గురూ జారి నీటిలో పడ్డారు. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న సెక్యూరిటి సిబ్బంది చిరును లేపి జాగ్రత్తగా తరలించారు. వరద బాధితులను పరమర్శించడానికి వచ్చిన మంత్రిగారు చివరకు తననే మరొక పరామర్శించే పరిస్థితి కొని తెచ్చుకున్నారంటున్నారు అక్కడి ప్రజలు.  

జగన్ పై వైకాపా నేతలు అసంతృప్తి

      వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఏ దుర్ముహూర్తంలో సమైక్య శంఖారావ సభ ఏర్పాటు చేశారోగానీ, అన్ని పార్టీ వాళ్ళు ఆయనపై విరుచుకుపడుతున్నారు.ఇటు సమైక్యవాదులు, అటు విభజనవాదులు, అటు కాంగ్రెస్ పార్టీ, అటు తెలుగుదేశం పార్టీ.. మధ్యలో టీఆర్ఎస్. అన్ని వైపుల నుంచీ జగన్ నిర్వహించిన సభ మీద, జగన్ మాట్లాడిన తీరు మీద విమర్శనాస్త్రాలు దూసుకొస్తున్నాయి.   జగన్‌తో లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్న కాంగ్రెస్,  టీఆర్‌ఎస్ పార్టీలు కూడా అందరూ జగన్ని తిడుతున్నారు.. మనం కూడా తిట్టకపోతే బాగోదన్నట్టుగా వాళ్ళు కూడా ప్రెస్‌మీట్లు పెట్టి జగన్‌ని తిట్టిపోశారు. సరే బయటి పార్టీల వాళ్ళు తిట్టారంటే సర్దిచెప్పుకోవచ్చు. వైకాపా శ్రేణులు కూడా సభలో జగన్ మాట్లాడిన తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో బాహాటంగా బయటపడలేక లోపల లోపలే కుమిలిపోతున్నారు. జగన్ ఎవరు మంచి చెప్పినా వినడు.. ఒకవేళ సాహసించి మంచి చెపితే ఆ చెప్పినవాళ్ళనే తరిమేస్తాడన్న వాస్తవం పార్టీలో ఎవరూ నోరెత్తకుండా చేస్తోంది.

యథా రాహుల్.. తథా జగన్!

      కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్‌గాంధీకి, కాంగ్రెస్ పార్టీ దత్తపుత్రుడు జగన్‌ని మధ్య చాలా అంశాలలో పోలికలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   పోలిక-1. రాహుల్ తండ్రి మాజీ ప్రధానమంత్రి. జగన్ తండ్రి మాజీ ముఖ్యమంత్రి. ఇద్దరి తండ్రులూ కీర్తిశేషులే.  ఇద్దరూ తండ్రికి ఏకైక కుమారులే! రాహుల్, జగన్ ఇద్దరూ తమ తండ్రులు అధిష్టించిన పదవులను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నవారే. పోలిక-2. రాహుల్ని ప్రధానమంత్రి చేయాలని ఆయన తల్లి సోనియా పరితపిస్తుంటే, జగన్‌ని ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన తల్లి విజయమ్మ పరిశ్రమిస్తున్నారు. పోలిక-3. రాహుల్, జగన్.. ఇద్దర్నీ జనం మూడక్షరాల పేరుతోనే పిలుస్తారు. రాహుల్‌కి ‘యువరాజు’ అనే నిక్‌నేమ్ వుంది. జగన్‌కి ‘యువనేత’ అనే నిక్‌నేమ్ వుంది. పోలిక-4. అటు రాహుల్, ఇటు జగన్ ఇద్దరూ ఆవేశపరులుగా, దూకుడు కలిగి వున్నవాళ్ళుగా,  తనమాటే నెగ్గాలనే పట్టుదల ఉన్నవారిగా పేరు తెచ్చుకున్నారు. పోలిక-5. రాహుల్ గాంధీ కారణంగా దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జగన్ కారణంగా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పోలిక-6. రాహుల్‌గాంధీలో, జగన్మోహన్‌రెడ్డిలో రాజకీయ అపరిపక్వత కనిపిస్తుంది. ఇద్దరికీ చిన్న వయసులోనే పెద్ద కుర్చీ మీద కన్ను వుంది. పోలిక-7. రాహుల్‌కి, జగన్‌కి వేదికల మీద ఎలా మాట్లాడాలో తెలియదు. రాజస్థాన్ ఎన్నిక ప్రచారంలో నోటికొచ్చినట్టు మాట్లాడి రాహుల్ విమర్శలు ఎదుర్కుంటుంటే, సమైక్య శంఖారావంలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడి జగన్ ఇబ్బందులు తెచ్చుకున్నాడు. పోలిక-8. రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. అలాగే జగన్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఎటుచూసినా కనిపించడం లేదు.

కాంగ్రెస్, బిజెపి ట్విట్టర్ వార్

      గతంలో రాజకీయ నాయకులు చట్టసభల్లో, మీటింగుల్లో, ప్రెస్‌మీట్లలో తిట్టుకున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమా అని సోషల్ నెట్‌వర్క్ వేదికల మీద కూడా ‘ట్విట్టు’కుంటున్నారు. ట్విట్టర్లో రెగ్యులర్‌గా కామెంట్లు పోస్ట్ చేసేవాళ్ళలో నరేంద్రమోడీ ముందుంటున్నాడు. ఈమధ్య దిగ్విజయ్ ‌సింగ్ కూడా ట్విట్లు పోస్ట్ చేయడంలో యాక్టివ్‌గా వుంటున్నాడు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనుకున్నాడో లేక బీజేపీలో నిప్పుపెట్టాలని అనుకున్నాడో గానీ దిగ్విజయ్ సింగ్ తన ట్విట్టర్‌లో బీజేపీ మీద కొన్ని కామెంట్లు పోస్ట్ చేశాడు.   ‘‘బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా మతోన్మాది, అబద్ధాల కోరు, మానసిక దుర్బలుడు అయిన నరేంద్రమోడీ కాకుండా సుష్మా స్వరాజ్ అయితే చాలా బాగుండేది.’’ అంటూ ట్విట్ చేశాడు. ఈ ట్విట్ చదివి సుష్మా స్వరాజ్ కాకుండా మరెవరన్నా అయితే మురిసిపోయి దిగ్వింజయ్ సింగ్‌కి ఫోన్ చేసి థాంక్స్ చెప్పేవారే. కానీ బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ మాత్రం అలా చేయలేదు. ట్విట్టుని ట్విట్టుతోనే ఎదుర్కోవాన్నట్టు ఆమె తన ట్విట్టర్ అకౌంట్లో ఒకకామెంట్ పోస్ట్ చేశారు. ‘‘బీజేపీ ప్రధాని అభ్యర్థిత్వం విషయంలో దిగ్వింజయ్ సింగ్ అభిప్రాయం అదయితే, మా దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ కంటే దిగ్వింజయ్ సింగే ఉత్తమ అభ్యర్థి’’ అని పోస్ట్ చేశారు. కుక్కకాటుకి చెప్పుదెబ్బలా వున్న ఈ ట్విట్ చదివిన దిగ్విజయ్ సింగ్ ‘‘సుష్మా స్వరాజ్ చెప్పింది కరెక్టే కదా’’ అనుకున్నాడేమో మళ్ళీ చప్పుడు చేయలేదు.

దిగ్విజయ్ జోక్స్

  సినిమాలలో బ్రహ్మానందమే కాదు, ఒక్కోసారి కాంగ్రెస్ వాళ్ళు కూడా బలే జోకులేసి జనాలను నవ్విస్తుంటారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానికి, రాష్ట్రపతికి వ్రాసిన లేఖల గురించి అమెరికా, జపాన్లో ఉన్నవాళ్ళకి కూడా ఈపాటికి తెలిసిపోయుంటుంది. కానీ ఎప్పుడూ డిల్లీలోనే ఉండే మన రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ వారికి మాత్రం ఆవిషయం తెలియనే తెలియదట. మీడియావాళ్ళు చెపితేనే తెలిసిందని ఇంకా ఆ లేఖలో సారాంశం ఏమిటో చూడవలసి ఉందని జోక్ వేసారు.   క్రిందటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ‘జగన్ మోహన్ రెడ్డిది మా కాంగ్రెస్ పార్టీది సేమ్ టు సేమ్ డీ.యన్.యే’, అని మళ్ళీ డిల్లీ వెళ్ళిన తరువాత కూడా ‘జగన్ నా కొడుకు వంటి వాడు’ అని మరోసారి కన్ఫర్మ్ చేసిన ఆయన, ఈసారి మాత్రం తమ సంబంధాల గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదుట. బహుశః జగన్ మొన్న హైదరాబాదులో సోనియమ్మని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన తరువాత కూడా ఇంకా ‘జగన్ నా కొడుకు వంటి వాడే’ అనాలంటే చాల గుండె దైర్యం ఉండాలి కదా?   మళ్ళీ రెండు పార్టీలలో హార్మోన్స్ లలో ఏమయినా మార్పులు చేర్పులు చోటు చేసుకొంటున్నాయా? అని ప్రజలకి అనుమానం కలిగేలా ఆయన మౌనం వహించినప్పటికీ, ఇంకా డీ.యన్.యే.లు మార్చుకోవడం ఎవరి తరమూ కాదుకదా!

ఇంటి గుట్టు రట్టు చేస్తే ఎలా దివాకర్?

  ఇంటి గుట్టు లంకకి చేటంటారు. మరి అటువంటిది లంకలో ఉన్నవాళ్ళే మన ఇంటి గుట్టుని భద్రంగా  కాపాడే ప్రయత్నం చేస్తుంటే, ఇంట్లో వాళ్ళే గుట్టు రట్టు చేస్తుంటే ఏ ఇంటి పెద్దకయినా ఆగ్రహం కలుగక మానదు. కాంగ్రెస్ పార్టీ దేశంలో మిగిలిన పార్టీలకి పెద్దన్నపాత్ర పోషిస్తుంటే, అందులో బొత్ససత్యనారాయణ రాష్ట్ర కాంగ్రెస్ లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన లంకంత తమ కాంగ్రెస్ గుట్టు మట్టులను కోడిపెట్ట కోడి పిల్లలను జాగ్రత్తగా కాపడుకొస్తున్నట్లు కాపాడుకొస్తుంటే, ముఖ్యమంత్రితో సహా అందరూ ఎప్పుడో అప్పుడు ఆ ఇంటి గుట్టు గురించి టంగ్ స్లిప్పు చేసుకొంటూనే ఉన్నారు.   మొన్న జగన్ ముచ్చటపడి హైదరాబాదులో శంఖం ఊదుకొంటుంటే “మా పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మంచి అండర్ స్టాండింగ్ ఉందని, అందుకు నూటా నలబై నాలుగు ఉదాహరణలున్నాయని, ఆయన సభకి అన్ని రైళ్ళని పరిగెత్తించడం కూడా అందులో ఒకటని ప్రకటించేసారు కల్లాకపట మెరుగని మన జేసీ దివాకర్ రెడ్డి గారు. ఓసారి లగడపాటి మరోసారి హర్ష కుమార్ ఇంకోసారి జేసీ దివాకర్ రెడ్డి ఇలా ఎందరిని కంట్రోల్ చేయగలడు ఎంత పెద్దన్న అయితే మాత్రం?   అయినప్పటికీ మరీ మౌనంగా కూర్చొంటే కొంప కోల్లేరయిపోతుందని ఆయన బెంగపెట్టుకొన్నవాడై, దివాకర్ రెడ్డిని లైన్లో పెట్టి ‘ఇంటి గుట్టు రట్టు చేస్తే ఎలా? ఉంటే బుద్దిగా ఉండండి లేకుంటే బయటకి దయచేయండని’ మందలించినట్లు మీడియా గుప్పుమంది. అయితే మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు ఏడుస్తున్నానన్నట్లు, ఏదో ఇంటి గుట్టు బయట పెట్టోదని సింపుల్ గా చెపితే పోయేదానికి, బయటకి పొమ్మని చెప్పడం ఏమిటి?అయినా నన్ను బయటకి పొమ్మనడానికి నువ్వెవరని? దివాకరుడు సీమ పౌరుషం ప్రదర్శించినట్లు తాజా సమాచారం. ఎందుకయినా మంచిదని కాంగ్రెస్ లోనే పుట్టిన తను తన చివరాఖరి శ్వాస కూడా కాంగ్రెస్లోనే కంటిన్యూ అయిపోతానని ఒకచిన్న డిక్లరేషన్ కూడా చేసేసారు.   అయితే అరచేతిని అడ్డం పెట్టి ఉదయించే సూర్యుడిని ఆపలేమని వైయస్సార్ కాంగ్రెస్ వాళ్ళు మాటిమాటికి ఎందుకు ఏ ఉద్దేశ్యంతో అంటున్నారో పెద్దన్నగారు కాస్త ప్రజలకి వివరిస్తే బాగుంటుందేమో!