కొత్త సంవత్సరానికి 'తెలంగాణ'

      రాష్ట్ర విభజన విషయంలో ముందుకే వెళ్తాం. నవంబర్ 15 నాటికి ముసాయిదా బిల్లు రెడీ అవుతుంది. కొత్త ఏడాది నాటికి రెండు రాష్ట్రాలు ఏర్పడతాయ'ని తెలంగాణ ప్రాంత మంత్రులు, ముఖ్యనేతలతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. దీనిపై ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. 'విభజనపై మేం వెనక్కు పోయామని, సందిగ్ధంలో పడ్డామని ఎవరైనా అంటే నమ్మొద్దు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందని ప్రజలకు వివరించండి. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చామని వివరించండి. భారీ స్థాయిలో సమావేశాలు నిర్వహించండి. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజల్లోకి తీసుకువెళ్లండి' అని దిగ్విజయ్ పేర్కొన్నారు.

రచ్చబండ కాడ సమైక్యరాగం ఆలపిద్దుమా

  ఇటీవల ముఖ్యమంత్రి కాస్త మంద్ర స్థాయిలో సమైక్యరాగం ఆలపిస్తుండటంతో ఎవరికీ సరిగ్గా వినిపించడం లేదు. పైలిన్ తుఫాను సభలో కూడా ఆయన చాలా మంద్ర స్థాయిలో సమైక్య రాగం ఆలపించి, ప్రజలను కూడా తనతో కోరస్ పాడమని కోరారు. అయితే, ఆయన స్వరంలో వచ్చిన తేడాను దిగ్విజయ్ సింగ్ కూడా బాగానే పసిగట్టారు. అందుకే ఈసారి ఆయన చిన్నచిర్నవ్వుతో సరిపెట్టేసారు.   కానీ, త్వరలో తెలంగాణా బిల్లో, దాని నకలో మరొకటో శాసనసభకు వచ్చినప్పుడు, సభలో సభ్యులందరి ముందు పూర్తి స్థాయిలో సమైక్య కచేరీ ఈయవలసి ఉంటుంది గనుక, ఇలా క్యాంప్ కార్యాలయంలో ఒంటరిగా కూర్చొని కూని రాగాలు తీయడం కంటే అలా జనాల మధ్యకెళ్ళి రచ్చబండ మీద కూర్చొని జనాలతో కలిసి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి భావించడంతో రచ్చబండ కచేరీకి ముహూర్తం ఖరారు అయిపోయింది.   వచ్చే నెల 6 నుంచి 24 వరకు, అంటే శాసనసభలో ఫైనల్ కచేరీ మొదలయ్యేవరకు మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. అయితే దీనికి ముఖ్యమంత్రి ఇంకా డేట్స్ ఇవ్వలేదని, త్వరలో తెలియజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే సీమాంధ్ర మంత్రుల సమైక్య రాగాలాపన వినడానికి వచ్చిన వారికి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, పెన్షన్లు, వికలాంగులకు పించెన్లు మంజూరు చేస్తామని మంత్రిగారు చెప్పారు.   ఒకవైపు సీమంద్రాలో రచ్చబండ మీద సమైక్యరాగాలాపన జరుగుతుంటే, అదే సమయంలో తెలంగాణా రచ్చబండ మీద తెలంగాణా సాధన గీతం, అదిగో నవలోకం, ఉందిలే మంచి కాలం ముందు ముందునా  వంటి గీతాలను అక్కడి కాంగ్రెస్ మంత్రులు ఆలపించే అవకాశం ఉంది.   కానీ, ఫైనల్ కచేరీలో మాత్రం ఎవరి రాగాలు వారే తీయాలని, ఒకరివి మరొకరు కాపీలు కొట్ట కూడదని, పైరసీకి అసలే తావీయకూదదని అందరూ సమైక్యంగా ముందే డిసైడ్ అయిపోయారు. అందువలన రెండు ప్రాంతాలలో ప్రజలు కాంగ్రెస్ నేతలకి కోరస్ పాడుతారో లేదో ముందే ఆలోచించుకొంటె మళ్ళీ అందరి తాళం తప్పకుండా పాట చక్కగా సాగుతుంది.

తుఫాను వచ్చినా మడమ తిప్పేది లేదుట

  రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఈనెల 26న హైదరాబాదులో వైకాపా జరుపనున్నసమైక్య శంఖారావం సభ జరుగుతుందా లేదా? అనే అనుమానాలను నివృత్తి చేస్తూ సభ తేదీలో మళ్ళీ ఎటువంటి మార్పు ఉండబోదని, 26న యధావిధిగా జరుగుతుందని పార్టీ నేత కొణతాల రామకృష్ణ స్పష్టం చేసారు.   అయితే వానల కారణంగా ప్రజలు, పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే ఈ సమయంలో కూడా మడమ తిప్పకపోతే ఎలా? అని పార్టీ నేతలే కాక ప్రత్యర్ధి పార్టీ నేతలు కూడా బాధపడుతున్నారు. అయితే ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన సభ మళ్ళీ మరో మారు వాయిదా వేసుకొంటే, ఏదో ఒక సాకు చూపి మడమ తిప్పేశారని మళ్ళీ వాళ్ళే విమర్శలు చేస్తారు గనుక ఇక ప్రళయమే వచ్చినా కూడా సభ విషయంలో మడమ తిప్పే ప్రసక్తే లేదని వైకాపా డిసైడ్ అయిపోయింది.   అయితే సభ మొదలయ్యే నాటికి వానలు తగ్గిపోవచ్చునని వారు అంచనా వేస్తున్నారు. తగ్గినా తగ్గకపోయినా ఇక మడమ తిప్పే ప్రసక్తి లేదు గనుక సభకి సరిపోయే జనాలను పోగేయక తప్పదు. ఇజ్జత్ కి సవాలాయే!ఇక కోర్టు వారు అనుమతిస్తే వర్షం వల్ల దెబ్బతిన్న ప్రాంతాల ప్రజలను ఈ నెల 27, 28 తేదీల్లో ఓసారి పరామర్శించి రావాలని జగన్ కోరిక. అనుమతి రాకపోతే విజయమ్మ బయలుదేరవచ్చును.

రెచ్చగొట్టేందుకే జగన్ సభ

      తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేందుకే హైదరాబాద్ లో సమైక్య శంఖారావం సభ పెడుతున్నాడని కొండా సురేఖ దంపతులు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య సభ పేరుతో రెచ్చగొడితే రెచ్చిపోమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తుండగా హైదరాబాదులో సమైక్య సభ పెట్టడమేమిటని ఆమె ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ వస్తుందన్న నమ్మకం తమకు ఉందని సురేఖ దంపతులు విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ తెలంగాణపై యూ టర్న్ తీసుకున్న నేపథ్యంలో ఆగ్రహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిన కొండా సురేఖ దంపతులు ముఖ్యమంత్రి కిరణ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

పయ్యావుల కేసుతో తెదేపాలో రచ్చ

  తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన అంశంలో ఎంతో లౌక్యంగా రోజులు నెట్టుకొస్తుంటే ఆ పార్టీ నేత పయ్యావుల కేశవ్ విభజనను వ్యతిరేఖిస్తూ సుప్రీం కోర్టులో పిటిషను వేయడంతో,తెదేపా ఆంధ్ర, తెలంగాణా నేతల మధ్య విభేదాలకు దారి తీస్తోంది. ఈ పిటిషనుతో పార్టీకి ఎటువంటి సంబందమూ లేదని, ఇది వ్యక్తిగతంగా వేస్తున్న పిటిషను అని ఆయన చెప్పినప్పటికీ, అది పార్టీలో కలకలం రేపింది.   తామంతా రెండు ప్రాంతాలలో పార్టీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణా ఉద్యమాలు తీవ్రంగా సాగుతున్నతరుణంలో కూడా వెనక్కి తగ్గిన సంగతిని గుర్తు చేస్తూ, రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ లేఖ కూడా ఇచ్చి సమన్యాయం కోసం అధ్యక్షుడే పోరాడుతున్నవేళ, పయ్యావుల కేశవ్ ఈవిధంగా సుప్రీం కోర్టులో కేసు వేయడాన్ని పార్టీలో తెలంగాణా నేతలు తప్పుపడుతున్నారు. తెదేపా తెలంగాణా ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావ్ ఈవిషయమై చంద్రబాబుకి పిర్యాదు చేసి పయ్యావులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.   రాష్ట్ర విభజనపై స్పష్టమయిన వైఖరి తెలియజేయని కారణంగా రెండు ప్రాంతాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెదేపా,ఇప్పుడు నేతల మధ్య మొదలయిన ఈ అంతర్యుద్దంతో ప్రత్యర్ది పార్టీలకి మరో అస్త్రం అందించినట్లవుతుంది. రేపు తెలంగాణా నోట్ శాసనసభకు వచ్చినప్పుడు కూడా తెదేపా ఇదే విధంగా ద్వంద వైఖరి అవలంభిస్తే పార్టీకి తీరని నష్టం జరగడం ఖాయం.

కాంగ్రెస్ గూటికి కేకే..?

      కాంగ్రెస్ పార్టీలో బోలెడంత సీనియారిటీ వుండి, ఎన్నో పదవులు అనుభవించి ఈమధ్యే టీఆర్ఎస్‌లోకి జంప్‌జిలానీ అయిన కె.కేశవరావు మళ్ళీ కాంగ్రెస్‌ గూట్లోకి తిరిగొచ్చే అవకాశాలున్నాయా? ఈమధ్యకాలంలో జరిగిన పరిణామాలు, తాజాగా కేకే వ్యవహారశైలి ఇలాంటి అనుమానాలు కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తనకి మరోసారి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వకపోవడంతో అలిగిన కేకే తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి టీఆర్ఎస్‌లో చేరాడు. తాను టీఆర్ఎస్‌లోకి వెళ్ళగానే ఎక్కడికో వెళ్ళపోతానని కలలుగన్న కేకే అక్కడ ఏదో నామ్ కే వాస్తే పదవి దక్కడంతో నిరాశకు గురయ్యాడు.   టీఆర్‌ఎస్ పార్టీ మీటింగులలో సింహాసనం లాంటి కుర్చీలో కేసీఆర్ కూర్చుని ఉంటే, ఆ పక్కనే కాస్తంత దూరంగా విదూషకుడికి వేసేంత కుర్చీలో కూర్చుని సీరియస్ ఎక్స్ ప్రెషన్లు ఇవ్వడం మినహా టీఆర్‌ఎస్‌లో కేకే సాధించిందేమీ లేదు. ఒకప్పుడు కేకే కూర్చున్నట్టు కేసీఆర్ పక్కనే కుర్చీలో కూర్చుని వుండే రాములమ్మ కూడా కాంగ్రెస్‌కి జై కొట్టేసింది. టీఆర్ఎస్‌లో కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆర్, ఆయన కుటుంబమే తప్ప బయట నుంచి వచ్చినవాళ్ళు బయటకే వెళ్తారన్న విషయం కేకేకి ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నట్ట్టుంది. నరేంద్ర, విజయశాంతి, రఘునందన్.. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూళ్ళేదనీ...! భవిష్యత్తులో టీఆర్ఎస్ తనకు ఎంపీ టిక్కెట్టో, ఎమ్మెల్యే టిక్కెట్టో ఇస్తుందనో, రాజ్యసభకో, మరో సభకో పంపుతుందనో ఆశించినా లాభం ఉండదన్న చేదు వాస్తవం కేకేకి ఇప్పుడిప్పుడే పూర్తిగా అర్థమవుతునట్టుంది. టీఆర్ఎస్ లాంటి నియంతల పార్టీలో ఉండటం కంటే కాంగ్రెస్ లాంటి ఏం మాట్లాడినా, ఎన్ని డ్రామాలాడినా చెల్లుబాటయ్యే, బోలెడన్ని పదవులు వచ్చే అవకాశం వున్న కాంగ్రెస్‌కే వెళ్తే బెటరనిపిస్తున్నట్టుంది. అందుకే కేకే దగ్గర మాతృసంస్థకి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. మొన్నామధ్య సీమాంధ్రలో ఎవరో సోనియాగాంధీ దిష్టిబొమ్మకి సమాధి కట్టారట. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటే, ఏదో అమ్మగారి అనుగ్రహం కోసం అలా చేశారని సరిపెట్టుకోవచ్చు. కానీ టీఆర్‌ఎస్‌లో వున్న కేకే  ప్రెస్‌మీట్ పెట్టి మరీ బాధని వ్యక్తం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకెలా అర్థం చేసుకోవాలి.. కేకే మళ్ళీ కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్నారనే అర్థం చేసుకోవాలి.

ఏం కొంప ముంచుతారో?!

      సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు గురువారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని మూకుమ్మడిగా కలవబోతున్నారట. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయబోతున్నారట. ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి సీమాంధ్రులలో గుండె దడ మొదలైంది. రాష్ట్ర విభజన చేయొద్దని కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతిని అడగటానికి వెళ్తుంటే సీమాంధ్రులు భయపడటమెందుకు? అక్కడే వుంది అసలు తిరకాసు.   ఇప్పుడు రాష్ట్రం విభజన సమస్య ఎదుర్కోవడానికి ప్రధాన కారణం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలేనన్న వాస్తవం సీమాంధ్రులు అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం దగ్గర అతి వినయం ప్రదర్శించడం, సమైక్య వాదనను సమర్థంగా వినిపించకపోవడం, అధిష్టానం అభిప్రాయం అడిగినప్పుడల్లా, ‘‘కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం’’ అని చెప్పడం, రాష్ట్రాన్ని విభజించినా సీమాంధ్రులు పెద్దగా ఫీలవరని కేంద్రానికి నివేదికలు ఇవ్వడం.. ఇవన్నీ రాష్ట్ర విభజనకు ఆజ్యం పోశాయి. కేంద్రం విభజన నిర్ణయం తీసుకోవడానికి కారణమయ్యాయి. విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉవ్వెత్తున జరుగుతున్న ఉద్యమం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం విభజన విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రపతి దగ్గరకి వెళ్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు అక్కడ ఏం మాట్లాడబోతున్నారో, ఏం కొంప ముంచబోతున్నారోన్న భయం సీమాంధ్రులలో వుంది. పైకి మాత్రం సమైక్య రాష్ట్రం కోసమే రాష్ట్రపతి దగ్గరకి వెళ్తున్నామని చెప్తున్నా, లోపల రహస్య ఎజండా ఏమైనా ఉందేమోనన్న అనుమానాలు సీమాంధ్రులలో కలుగుతున్నాయి. కలగవా మరి?

ప్రజల ప్రాణాలకు విలువలేదా రాహుల్ జీ?

  రాజస్తాన్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ తన నాయనమ్మ, తండ్రి ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయినట్లే ఏదో ఒకరోజు తను కూడా చనిపోవచ్చునని, అయినప్పటికీ తను చావుకి భయపడనని జనాన్నిసెంటిమెంటుతో పడేయాలని చూసారు. అందుకే తను మతతత్వ పార్టీలను తీవ్రంగా వ్యతిరేఖిస్తానని ఆయన చెప్పారు.   నిజమే! ఉగ్రవాదాన్ని,మతత్వత్వాన్ని అందరూ ఖండించాల్సిందే. అందుకు కేవలం ఆయన కుటుంబ సభ్యులే కాక సాధారణ ప్రజలు కూడా వందలమంది ప్రతీ ఏటా బలయిపోతూనే ఉన్నారు. ఏనుగుకయినా చీమకయినా కాలు విరిగితే నొప్పి ఒకటే! ఏనుగు పెద్ద జంతువు గాబట్టి దానికి ఎక్కువ నొప్పి, చీమ చిన్నది గాబట్టి దానికి కొంచెం తక్కువ నొప్పి ఉండవని ఆయన గ్రహించాలి.   దాదాపు పదేళ్లుగా అధికారంలో ఉన్నతన పార్టీ నేటికీ దేశంలో ఉగ్రవాదుల దాడులను, మత ఘర్షణలను ఎందుకు సమర్ధంగా అరికట్టలేకపోతోంది? పాకిస్తాన్ ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ లోకి చొరబడి పట్టపగలే ప్రజల మీద, సైనికుల మీద, పోలీసుల మీద దాడులు చేసి నిత్యం అనేకమందిని పొట్టన పెట్టుకొంటుంటే చనిపోయినవారిని లెక్కబెట్టడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసింది?   చివరికి నిన్న హోం మంత్రి షిండే జమ్ములో పర్యటిస్తున్న సమయంలో కూడా పాక్ ఉగ్రవాదులు భారత సరిహద్దు దళాలపై కాల్పులు జరిపి ఒక భారత సైనికుడిని పొట్టన పెట్టుకొన్నాయి. మరి దేశంకోసం పోరాడిన ఆ వీర జవాను ప్రాణానికి విలువ లేదా?   తమ ప్రభుత్వం తప్పులని, అసమర్ధతను కప్పిపుచ్చుకొని, ఇంతవరకు ఎటువంటి మత ఘర్షణలు జరుగని రాజస్థాన్ రాష్ట్రంలో మత ఘర్షణల ప్రస్తావన తేవడం దేనికి? అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించడం దేనికి?   గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషి కారణంగానే ఆయనకు ప్రజలలో ఆదరణ పెరిగిన సంగతి కాంగ్రెస్ పార్టీలో ప్రతీ ఒక్కరు గుర్తుపెట్టుకొంటే తాము ఏమి చేయాలో తెలిసివస్తుంది.   మాటలకి చేతలకి లంకె లేనప్పుడు అవి కేవలం ఉత్తర కుమార ప్రగల్భాలే అవుతాయి అని ఆయన గ్రహిస్తే మంచిది.

రాహుల్ తీరుతో బీజేపీ హ్యాపీ

      తన తీరుతో, మాట తీరుతో రోజు రోజుకూ దేశ ప్రజల్లో గౌరవం పోగొట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని చూసి బీజేపీ వర్గాలు లోపల లోపల హ్యాపీగా ఫీలవుతున్నాయి. రాబోయే ఎన్నికలలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి పోటీదారుడు అవుతాడని భావిస్తున్న రాహుల్‌గాంధీ క్రమక్రమంగా తన ఇమేజ్‌ని తానే డ్యామేజ్ చేసుకుంటూ, మరోవైపు తన పార్టీ ఇమేజ్‌ని కూడా డ్యామేజ్ చేస్తున్నాడు. ఇది నరేంద్రమోడీకి, భారతీయ జనతాపార్టీకి ఎంతో లాభించే అశం. కాగలకార్యం గంధర్వులే తీర్చుతారన్నట్టు రాహుల్‌గాంధీ తన కంట్లో తానే వేలు పెట్టి పొడుచుకుంటూ ఉండటం పరిస్థితులను బీజేపీకి అనుకూలంగా మార్చుతున్నాయి. రాహుల్‌గాంధీ ప్రధాని అభ్యర్థిత్వమే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఓడించే బ్రహ్మాస్త్రమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే జనాల్లో నరేంద్రమోడీ ఎక్కడ, రాహుల్ గాంధీ ఎక్కడ అనే కంపారిజన్ మొదలైంది. రాహుల్‌గాంధీ ప్రస్తుత వ్యవహార శైలి, ధోరణి ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారాన్ని నరేంద్రమోడీకి, బీజేపీకి బంగారు పళ్ళెంలో పెట్టి అప్పగించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ పైపైకి రాహుల్‌గాంధీ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నప్పటికీ, అబ్బాయిగారి వ్యవహార శైలి ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటోంది.

సమైక్యశంఖారావంపై అనుమానాలు

      రాష్ట్రంలో వరదపరిస్థితుల దృష్ట్యా సమైక్యశంఖారావం సభ నిర్వాహణపై అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తుండటంతో జన సమీకరణకు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు కలవరపడుతున్నారు. మరోవైపు 48 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఎల్బీ స్టేడియంలో సభా వేదిక ఏర్పాట్లు ఎలా జరపాలనే విషయమై పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే ఈ వర్షాల నేపథ్యంలో సీమాంధ్ర జనం హైదరాబాద్ కు రాగలరా అన్న సందేహంతో రంగారెడ్డి, హైదరాబాద్ లలో ఉన్న సీమాంధ్ర ప్రజల మీద ఎక్కువగా ఆధారపడాలని నిర్ణయించారు. ఇక సమైక్య శంఖారావం కోసం భారీ బందోబస్తు చేయనున్నారు.

టిడిపి ఎమ్మెల్యేలు అరెస్ట్

      సచివాలయం ముందు సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. నష్టపోయిన రైతాంగాన్ని నష్టపరిహారం ఇచ్చి, వసతి సౌకర్యం, భోజనం అందించాలని డిమాండ్ చేశారు. అధికారులను నివేదికలు తయారు చేసే పనిలో కాకుండా వరదప్రాంతాల్లో వినియోగించాలని ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను సీఎం కిరణ్ చర్చలకు ఆహ్వానించినప్పటికీ తమ వద్దకే వచ్చి చర్చలు జరపాలంటూ టీడీపీ నేతలు పట్టుబట్టడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తమను సీఎం చర్చలకు పిలవకుండానే అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

రాహుల్ పిల్లచేష్టలు

      పిల్లచేష్టలు వదలిపోని నలభయ్యేళ్ళ రాహుల్‌గాంధీని వాళ్ళమ్మ సోనియమ్మ ఈ దేశానికి ప్రధానమంత్రిని చేయడానికి నానా తంటాలు పడుతూ, అడ్డగోలు విభజనకు కూడా పూనుకుంది. అమ్మ మనసుని అర్థం చేసుకుని హుందాగా వ్యవహరించాల్సిన రాహుల్‌గాంధీ మాత్రం వీలైనప్పుడల్లా తన పిల్లచేష్టల్ని ప్రదర్శిస్తున్నాడు. ఆమధ్య కేంద్రప్రభుత్వ నేరచరితుల ఆర్డినెన్స్ విషయంలో నోటికొచ్చినట్టు మాట్లాడి నాలుక్కరుచుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా గొప్ప విషయంలా ఒప్పుకున్న నిర్ణయాన్ని ఒక్కమాటలో తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీ పరువుని నడిరోడ్డు మీదకి ఈడ్చాడు. తలలు పండిన కాంగ్రెస్ నాయకులు కూడా తనముందు దిగదుడుపేనని తేల్చేశాడు.     రాహుల్‌గాంధీ పిల్లచేష్టల ధాటికి కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్లు లోలోపల కుమిలిపోతున్నా, ఎందుకొచ్చిన గొడవ అని ఎవరూ కిక్కురుమనడం లేదు. తాజాగా రాహుల్‌గాంధీ రాజస్థాన్ ఎలక్షన్ మీటింగ్‌లో తన ప్రాణాలకు తీవ్రవాదుల నుంచి ముప్పు వుందని ప్రకటించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం, లేనిపోని ఇష్యూ క్రియేట్ చేయడం రాహుల్ పిల్లచేష్టలకు పరాకాష్ట అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఓటర్లని ఆకర్షించడానికి ఎలాంటి మాటలు మాట్లాడొచ్చు, ఎలాంటి మాటలు మాట్లాడకూడదన్న కనీస జ్ఞానం కూడా రాహుల్‌గాంధీకి లేకపోవడం సహజమేనంటున్నారు. రాహుల్‌గాంధీ చేసిన కామెంట్లు రాజస్థాన్‌లో ఓట్లు రాల్చే విషయం అటుంచి, జనాలకి రాహుల్ అంటే చిరాకుపుట్టి కాంగ్రెస్ పార్టీ పుట్టి ముంచే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. రాహుల్‌గాంధీ ఇప్పటికైనా పిల్లచేష్టలు మానుకుంటే మంచిదని అనుకుంటున్నారు.

పవన్ పాలిట్రిక్స్

      మెగా బ్రదర్స్ పవన్‌కళ్యాణ్, నాగబాబు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు పుకార్లు రావడం...వీటిపై నాగబాబు లేఖ రాయడంతో ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పడిన విషయం తెలిసిందే. అయితే ఈ పుకార్లను ఎవరూ సృష్టించారన్న దానిపై ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఓ ఆసక్తి చర్చ నడుస్తోంది.   ‘అత్తారింటికి దారేది’ సినిమాకి మైలేజ్ పెంచుకోవడానికే పవన్‌కళ్యాణ్ వర్గీయులే ఈ పుకార్లని షికార్లు చేయించారనేది వారి వాదన. సినిమాకి మళ్లీ రిపీటెడ్‌ ఆడియన్స్‌కి థియేటర్‌ కి రప్పించడానికి ఈ ట్రిక్కు కనిపెట్టారట. దీనితో ఈ సినిమాకి ఇంకాస్త మైలేజీ వచ్చిందని అనుకుంటున్నారు. మరి వంద కోట్ల వైపుగా అత్తారింటిని లాగాలంటే... ఇలాంటి ట్రిక్కులు తప్పవు.

మంత్రిగారి నోటి దురద!

      కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకాలు అధికారుల నిర్లక్ష్యం వల్లే సరిగా అమలు కావడం లేదని మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి వాపోతున్నాడు. అక్కడితో ఆగకుండా ప్రభుత్వం పథకాల అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను కొట్టండని వీధి రౌడీ తరహాలో ప్రజలకు పిలుపు ఇచ్చాడు.   మీ పథకాల్లో, ప్రభుత్వ విధానాల్లో సత్తా లేక, వాటిని సరిదిద్దుకునే దమ్ములేక అధికారులను కొట్టండని పిలుపు ఇవ్వడమేంటని ప్రభుత్వోద్యోగులు సీరియస్ అవుతున్నారు. ఆడలేక మద్దెల ఓడు అంటే ఇదేనని అంటున్నారు. మంత్రి నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరిస్తున్నారు. అధికారులు సరిగా పని చేయకపోతే లోపం ఎక్కడుందో పరిశీలించి దాన్ని సరిదిద్దుకోవాలిగానీ, అధికారులను కొట్టండని పిలుపు ఇవ్వడమేంటి మంత్రిగారూ. మీరు అన్నట్టు తప్పు చేసిన వారిని కొట్టడం న్యాయమే అయితే ప్రజలు ముందుగా కొట్టాల్సింది మిమ్మల్నే! ఎన్నికల కమీషన్‌కి ఇచ్చిన ధ్రువీకరణ పత్రంలో  తమరి మీద వున్న ఆర్థిక నేరాల కేసులను చూపించకుండా దాచిన పాపానికి తమర్ని కొట్టాలా? రాజకీయాల నుంచి తరిమికొట్టాలా? ఈ రెండిట్లో ఏది చేయాలో మీరే తేల్చుకోండని అధికారులు అంటున్నారు. మంత్రిగారు నోటి దురద తగ్గించుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.

ఎన్నికల వైతరిణిని దాటేందుకు తరుణోపాయము లేదా?

  తెలంగాణాలో కాంగ్రెస్ నేతలు కొత్త రాష్ట్రం ఎపుడెపుడు ఏర్పడుతుందా? ప్రభుత్వం ఎపుడేర్పడుతుందా? ఎన్నికలు ఎంత త్వరగా వస్తాయా? అని ఆత్రంగా ఎదురు చూస్తుంటే, సీమాంధ్ర నేతల పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది.   అధిష్టానం దెబ్బకి పార్టీలో ఉన్నా, పార్టీ మార్చివేరే కండువా కప్పుకొన్నా లేకపోతే సరికొత్త జెండా, సరికొత్త టోపీ, కండువాలు వేసుకొచ్చినా ప్రజలు మాత్రం తమని గుర్తుపత్తేయడం ఖాయమని వారు చాలా దిగులు పడుతున్నారు. ఈ ఎన్నికల వైతరిణిని దాటేందుకు తరుణోపాయమే లేదా?అని వారందరూ బుర్రలు బ్రద్దలు కొట్టుకొంటున్నారు.   అయితే పనబాక, శీలం,పురందేశ్వరి వంటి వారు మాత్రం రోట్లో తలపెట్టాక పోటుకి భయపడుతూ కూర్చుంటే ఎట్లా? అని దైర్యంగా తమ ప్రయత్నాలు తాము చేసుకుపోతున్నారు. కానీ ఇంతకాలం సమైక్యం కోసం మాట్లాడుతున్న నేతలకే ఇప్పుడు సమస్య వచ్చిపడింది. అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ రాష్ట్ర విభజనని అడ్డుకొంటామని చెప్పిన పాపానికి, విభజన అనివార్యమని స్పష్టం అవుతున్నందున, ప్రజలు వారినే ముందుగా అనుమానించే పరిస్థితులు ఏర్పడటంతో వారు ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్ళలేకపోతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎన్నికలలో ఎలా పోటీ చేయాలని వారు చాలా మధన పడుతున్నారు.   అయితే సీనియర్ కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి  సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి దీనికి తరుణోపాయం కనిపెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖ గాలులు వీస్తున్నపటికీ, తమ నియోజక వర్గంపై తమకు పూర్తి పట్టు ఉందని, అందువల్ల వచ్చేఎన్నికలలో తన సోదరుడు జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ జెండా పక్కన బెట్టి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయవచ్చని చెప్పారు. అంటే, ఆయన పార్టీపై ఆధారపడకుండా కేవలం తన శక్తి సామర్ధ్యాలతో గెలిచే ప్రయత్నం చేస్తారు గనుక, ఇది కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులను తగ్గించే అవకాశం ఉంది. కనుక అధిష్టానం కూడా దీనిని దిక్కారం క్రింద భావించదు. ఎన్నికల తరువాత ఎలాగు ఆయన మళ్ళీ కాంగ్రెస్ గూట్లోనే చేరుతారు గనుక ఇందులో పార్టీకి కూడా అభ్యంతరం చెప్పడానికేమి లేదు.   అందువల్ల సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ ఈ ప్రభాకర్-ఫార్ములా తమకేమయినా వర్క్ అవుట్ అవుతుందేమో ఆలోచించుకొంటే మంచిది.

విభజన త్వరగా చేయాలి: గవర్నర్

      రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీలో పలువురు పెద్దలతో వరుసగా భేటీ అయి..ఒక్కొక్కరితో అరగంట చొప్పున చర్చలు జరిపారు. రాష్ట్ర స్థితిగతులు, రాజకీయ పరిస్థితిపై అందరికీ నివేదికలు ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనకు సంబంధించి కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. విభజనపై నిర్ణయం తీసుకున్నందున పరిస్థితి సద్దుమణగాలంటే దానిని వేగవంతం చేయాలని, లేదంటే పరిస్థితి మలుపులు తిరిగే అవకాశముందని చెప్పినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన పట్ల సుముఖంగా లేని ముఖ్యమంత్రి అసెంబ్లీ తీర్మానం ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కీలక దశను ఎలా దాటాలన్న దానిపై కేంద్రం దృష్టి సారించింది. ఈ అంశంపైనే హోంమంత్రి షిండేకు గవర్నర్ నరసింహన్ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో పాలన స్తంభించిపోయిందని కూడా పేర్కొన్నట్లు తెలిసింది.

వర్షాలతో రైతన్నకు దెబ్బ మీద దెబ్బ

      రాష్టవ్యాప్తంగా వర్షాలు కుండపోతలా కురుస్తున్నాయి. గత 48 గంటలుగా రాష్ట్రంలోని అన్నిప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. పత్తి రైతుకు ఈ వర్షాలు శరాఘాతంగా పరిణమిచ్చాయి. చెరువులు, కుంటులు నిండి పారుతున్నాయి. పైలిన్‌ తుపానుతో ఇబ్బందుల్లో ఉన్న తీరప్రాంత రైతులకు ఈ అల్పపీడనం మూలంగా వచ్చిన తుపాను పులిమీద పుట్రలా మారింది.   శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, హైదరాబాద్‌, కరీంనగర్‌లో ఎడతెరపి లేని వర్షం కురిసింది. ప్రస్తుతం  నెల్లూరు-ఒంగోలు మధ్య అల్పపీడనం కేంద్రీకృతమయివుంది. తీరం సమీపంలో ఉన్నందున వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరో 48 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధనా కేంద్రం చెబుతుండడం రైతులకు మరింత ఇబ్బందికరంగా మారింది. శ్రీకాకుళం జిల్లా మందసలో అత్యధికంగా 17 సెం.మీ, పలాస, సోం పేట, ఇచ్ఛాపురంలో 15 సెం.మీ, కాకి నాడ, చోడవరం, అనకాపల్లి, పత్తిపా డులలో 12 సెం.మీ, కళింగపట్నంలో 11 సెం.మీ, తిరుపతి, విశాఖ విమానాశ్ర యం, అరకు, కావలి, ఎలమంచిలి, పెద్దాపురంలలో 9 సెం.మీ, టెక్కలి, కోడే రులలో 8, అచ్చంపేట, గజపతినగరం, ఎర్రగొండపాలెం, వెంకటగిరి, మాచర్ల, దేవరకొండలలో 7, నెల్లూరు, అవనిగడ్డ, రణస్థలం, తణుకు, ఆత్మకూరు, దర్శి, తాడేపల్లిగూడెం, తెర్లాం, పాలకొండలలో 6, రాజమండ్రి, మచిలీపట్నం, కందు కూరు, నాగర్‌కర్నూల్‌, పొదిలి, పాడేరు, శ్రీకాళహస్తి, కైకలూరు, అద్దంకి, చీపురు పల్లి, విజయనగరంలో 5 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.

మీడియాకి హ్యండిచ్చిన మెగా బ్రదర్స్

    వేలిస్తే చెయ్యందుకొనే మన మీడియా రెండు మూడు రోజులుగా పవన్ కళ్యాణ్, నాగబాబు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు పుకార్లు వస్తున్నాయని చెపుతూనే, దానిపై ఎవరి శక్తిమేర వారు ఊహాగానాలు, సందర్భ సహిత వ్యాఖ్యలు, విశ్లేషణలు వగైరా వగైరాలతో జనాలను, ముఖ్యంగా తెదేపా అభిమానులను మంచి రంజింపజేశారు. కొందరు మరొక అడుగు ముందుకు వేసి, యన్టీఆర్ కి చెక్ పెట్టేందుకే పవన్ కళ్యాణ్ పార్టీలోకి రప్పిస్తున్నారని ఈ వార్తలకి మంచి మసాలా కూడా తగిలించారు. పనిలోపనిగా నాగబాబుకి మచిలీపట్నం నుండి టికెట్ కూడా వాళ్ళే కన్ఫర్మ్ చేసేసి తమ సత్తా చాటుకొన్నారు. మరొక వారం పదిరోజులు ఆగితే పవన్ కళ్యాణ్ కి కూడా టికెట్ ఖాయం చేసేసేవారే, కానీ నాగబాబు తొందరపడి తాము ఏ పార్టీలో చేరడంలేదని ఈ రోజు ప్రకటించేశాడు. మీడియా ప్రజారాజ్యానికి కూడా తిరిగి ప్రాణం పోయాలని ఆశపడింది కానీ ఆ ప్రయత్నం పైనా నాగబాబు నీళ్ళుజల్లి అందరినీ ఉసూరుమనిపించాడు. అయితే ఇక మెగా సోదరులిద్దరూ రాజకీయాలలో చెయ్యి కాల్చుకొనే ఆలోచనలో లేరనే సంగతి మాత్రం ఖరారయిపోయింది.