రానున్నఎన్నికలలో రాజమండ్రికి స్టార్ ఎట్రాక్షన్

 

ఒకనాడు తెలుగు సినిమా పరిశ్రమలో ఒకవెలుగు వెలిగిన కృష్ణం రాజు, మొదట కాంగ్రెస్ పార్టీలోకి ఆ తరువాత బీజేపీలోకి అటునుండి ప్రజారాజ్యం పార్టీలోకి వరుసగా స్టెప్పులేసుకొంటూ చకచకా సాగిపోయారు. అయితే ప్రజారాజ్యంలో ఆయన స్టెప్పులు తడబడటంతో ఉండవల్లి చేతిలో ఓడిపోయారు. నాటి నుండి రాజకీయ సన్యాసం ప్రాక్టీస్ చేస్తున్నఆయన ‘బిల్లా రంగా..’అనుకొంటూ కాలక్షేపం చేస్తూ వచ్చారు. కానీ మళ్ళీ మోడీని చూసిన తరువాత ఆయనలోని బీజేపీ హార్మోన్స్ లో కదలికలు మొదలయ్యాయి. అందుకే ఆ మధ్యన ఎప్పుడో మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన దర్శనం చేసుకొని ఎన్నికలలో పోటీ చేసేందుకు అవసరమయిన ప్రేరణ తెచ్చుకొన్నారు. మళ్ళీ నిన్నడిల్లీలో వాలిపోయి బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కి బొకే ఇచ్చి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చి వచ్చారు. అంటే ఇక నేడో రేపో బీజేపీ గూట్లో చేరిపోతున్నట్లు ప్రకటన వెలువడవచ్చునన్నమాట. రానున్నఎన్నికల తరువాత ఎలాగయినా కేంద్రంలో జెండా ఎగురేయాలని పట్టుదలతో ఉన్నబీజేపీ, కృష్ణంరాజు గారికి మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించి రాజమండ్రీ టికెట్ ఇవ్వవచ్చును.

 

రాష్ట్రవిభజన కారణంగా అస్త్ర సన్యాసం చేసిన ఉండవల్లి ఎలాగు రేసులోంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించేశారు గనుక, సీమంద్రాలో కాంగ్రెస్ పార్టీ ప్రతికూల పవనాలు ఎదుర్కొంటున్నందున, ఈసారి తను గెలిచే అవకాశాలున్నాయని ఆయన ఓ లెక్క వేసుకొని మళ్ళీ రంగంలో దిగి ఉండవచ్చును. అయితే ఆయనతో ఆడిపాడిన జయప్రద కూడా సరిగ్గా రాజమండ్రీలోనే స్టెప్పులు వేయాలని తెగ ఆరాటపడుతోంది పాపం. అన్ని పార్టీలు కూడా ఆమెని రా..రమ్మని ఒకటే ఆహ్వానించేస్తుండటంతో (అలాగని ఆమె చెప్పారన్నమాట) కొంచెం కన్ఫ్యుస్ అయ్యి, చివరికి కాంగ్రెస్ పార్టీకి కమిట్ అయిపోవాలని డిసైడ్ అయ్యి, సోనియాగాంధీకి తనను పార్టీలో జేర్చుకొనే అవకాశం కల్పించారు.

 

సీమాంద్రాలో కాంగ్రెస్ పేరు చెపితే జనాలు తరిమి కొట్టేలా ఉన్నారు గనుక బహుశః ఆమెకే టికెట్ ఖాయం చేసే అవకాశాలున్నాయి. ఒకవేళ జయప్రదకి కూడా రాజమండ్రీ వేదికే ఖాయం అయిపొతే, ఇక వారిద్దరూ ఆ పాత మధురాలు ఓసారి జ్ఞప్తికి తెచ్చుకొంటూ ఎవరి పార్టీలో వారు స్టెప్పులు వేసుకొంటారేమో. కృష్ణంరాజు వెనుక కత్తి, తుపాకి పట్టుకొని ఏ బాహుబలో, బిల్లానో యుద్దానికి వస్తే రావచ్చును. అప్పుడు జయప్రదతో స్టెప్పులు వేయడానికి మన మెగా మంత్రిగారు వస్తారేమో మరి.

 

వారిద్దరి మధ్య మరో ఫ్యామిలీ నటుడు మురళీ మోహన్ సైకిల్ మీద జయభేరీ వాయించేందుకు దూసుకు రావచ్చును. అప్పుడు ఆ పోటీ కాంగ్రెస్-బీజేపీ-తెదేపాల మధ్యకాక టాలివుడ్ తారల మధ్య సాగినట్లవుతుంది గనుక మంచి పసందుగా ఉండవచ్చును. ఇదంతా బాగానే ఉంది. కానీ ఈ ప్రోగ్రాం అయిపోయాక వీరిలో రాజమండ్రీ ప్రజలకు ఏవయినా ఒరగబెట్టేవరెవరనేది కూడా ఆలోచించుకోవాలి.