కాంగ్రెస్, బిజెపి ట్విట్టర్ వార్
posted on Oct 28, 2013 @ 4:33PM
గతంలో రాజకీయ నాయకులు చట్టసభల్లో, మీటింగుల్లో, ప్రెస్‌మీట్లలో తిట్టుకున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమా అని సోషల్ నెట్‌వర్క్ వేదికల మీద కూడా ‘ట్విట్టు’కుంటున్నారు. ట్విట్టర్లో రెగ్యులర్‌గా కామెంట్లు పోస్ట్ చేసేవాళ్ళలో నరేంద్రమోడీ ముందుంటున్నాడు. ఈమధ్య దిగ్విజయ్ సింగ్ కూడా ట్విట్లు పోస్ట్ చేయడంలో యాక్టివ్‌గా వుంటున్నాడు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనుకున్నాడో లేక బీజేపీలో నిప్పుపెట్టాలని అనుకున్నాడో గానీ దిగ్విజయ్ సింగ్ తన ట్విట్టర్‌లో బీజేపీ మీద కొన్ని కామెంట్లు పోస్ట్ చేశాడు.
‘‘బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా మతోన్మాది, అబద్ధాల కోరు, మానసిక దుర్బలుడు అయిన నరేంద్రమోడీ కాకుండా సుష్మా స్వరాజ్ అయితే చాలా బాగుండేది.’’ అంటూ ట్విట్ చేశాడు. ఈ ట్విట్ చదివి సుష్మా స్వరాజ్ కాకుండా మరెవరన్నా అయితే మురిసిపోయి దిగ్వింజయ్ సింగ్‌కి ఫోన్ చేసి థాంక్స్ చెప్పేవారే. కానీ బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ మాత్రం అలా చేయలేదు. ట్విట్టుని ట్విట్టుతోనే ఎదుర్కోవాన్నట్టు ఆమె తన ట్విట్టర్ అకౌంట్లో ఒకకామెంట్ పోస్ట్ చేశారు.
‘‘బీజేపీ ప్రధాని అభ్యర్థిత్వం విషయంలో దిగ్వింజయ్ సింగ్ అభిప్రాయం అదయితే, మా దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ కంటే దిగ్వింజయ్ సింగే ఉత్తమ అభ్యర్థి’’ అని పోస్ట్ చేశారు. కుక్కకాటుకి చెప్పుదెబ్బలా వున్న ఈ ట్విట్ చదివిన దిగ్విజయ్ సింగ్ ‘‘సుష్మా స్వరాజ్ చెప్పింది కరెక్టే కదా’’ అనుకున్నాడేమో మళ్ళీ చప్పుడు చేయలేదు.