మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం
posted on Oct 29, 2013 @ 11:35AM
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానికి, రాష్ట్రపతికి రాష్ట్ర విభజనని ఆపమని లేదా పూర్తి రాజ్యాంగ బద్దంగా చేయమని కోరుతూ వ్రాసిన లేఖల గురించి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ తనకేమి తెలియదని పెద్ద జోకేసారు. కానీ చాకు లాంటి పీసీ.చాకో మాత్రం రెండు లేఖలు తమకు అందాయని కన్ఫర్మ్ చేయడమే కాక, రాజ్యాంగం గురించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కంటే ప్రధాని మన్మోహన్ సింగ్ మరియు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఐడియా ఉందని స్పష్టం చేసారు.
ముఖ్యమంత్రి రాష్ట్ర విభజనను మొదటి నుండి వ్యతిరేఖిస్తున్నారని అందువల్ల ఆయన లేఖలని చూసి ఎవరికీ ఆశ్చర్యం (కలవరం) కలుగలేదని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎవరూ పరిష్కరించడానికి సాహసించని తెలంగాణా అంశాన్ని తమ పార్టీ పరిష్కరిస్తోందని, రాష్ట్ర విభజన పూర్తి రాజ్యంగబద్దంగానే జరుగుతోందని మీడియాకు తెలిపారు. రాష్ట్ర విభజనపై పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నవిషయం కూడా తమకు తెలుసని, అయితే తమ నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు.
సాక్షాత్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి వ్రాసిన లేఖలు గురించి తనకేమి తెలియదని తప్పుకొంటే, చాకో ఈవిధంగా వివరణ ఈయడం విశేషమే. ఎందుకంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్రాసిన లేఖల కారణంగా కాంగ్రెస్ అధిష్టానం ఆయనని ఇటువంటి కీలక తరుణంలో పదవి నుండి తప్పించనూ లేక అలాగని ఆయన దిక్కార ధోరణిని సహించనూ లేక ఆయనతో ఏవిధంగా వ్యవహరించాలో అర్ధం కాక తలపట్టుకొందని మీడియాలో వస్తున్న వార్తలను, రాజకీయ విశ్లేషణలను ఇప్పటికీ ఖండించక పోయినట్లయితే అది అధిష్టానం చేతగానితనంగా కనబడుతుందనే భయంతోనే, ఆ లేఖలను చూసి తామేమి కలవరపడటం లేదని, అసలు ఆ లేఖలకు తాము ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని అర్ధం అవుతోంది. కానీ, పార్టీ తీసుకొన్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేరుగా ప్రధానికి, రాష్ట్రపతికి లేఖలు వ్రాయడం అంత తేలికగా కొట్టిపారేయవలసిన విషయం కాదని అందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం ఇంతకంటే వేరే ఉపాయం లేదు మరి. అందుకే చాకో ద్వారా ఈ వివరణ.