క్లైమాక్స్ సీన్ కోసం దివాకర్ రెడీ, మరి బొత్స?

 

ఇంతవరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడు పదవి నుండి తప్పించబోతోందనే దాని పైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆయన కంటే ముందుగా సీనియర్ కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి క్లైమాక్స్ యాక్షన్ సీన్ చేసేందుకు ఆరాటపడుతున్నట్లు కనిపిస్తున్నారు.

 

మొన్న జగన్ సభకు కాంగ్రెస్ అధిష్టానం మద్దతు ఉందని ప్రకటించి అందరినీ నివ్వెరపరిచిన ఆయన, ఈ రోజు మరో అడుగు ముందుకు వేసి, తమ అధిష్టానం కేంద్రంలో అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యంతోనే ముందుకు సాగుతూ అటు తెరాసతో, ఇటు వైకాపాతో పొత్తులకు సిద్ధపడుతోందని, జగన్ 25 ఎంపీ సీట్లకు హామీ ఇచ్చినందునే తమనందరినీ పక్కన బెడుతోందని ఆరోపించారు.

 

తమ అధిష్టానం కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఆరాటపడుతుంటే, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారం చేప్పటి ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడుతున్నాడని ఆయన తీవ్ర విమర్శలు చేసారు. తనకు కొత్త పార్టీ గురించి ఎటువంటి ఆలోచన లేదని, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఇప్పుడే ఎవరూ ఏమి చెప్పలేరని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌కు బీజేపీ మద్దతు పలకడం అనవసరమని భావించవచ్చు గనుక, రాష్ట్ర విభజనను ఆపేందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మొత్తం బీజేపీలో చేరితే బాగుటుందని అన్నానని మీడియాకు వివరణ ఇచ్చారు.

 

ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో మహా అయితే రెండు నుండి ఆరు యంపీ సీట్లు మాత్రమే దక్కే అవకాశం ఉందని, కాంగ్రెస్ నేతలందరూ తాము కాంగ్రెస్ పార్టీకి చెందినవారమని చెప్పుకోవడానికి కూడా సిగ్గు పడుతున్నారని ఆయన అన్నారు. బహుశః ఈ విధంగా మాట్లాడినందుకు షోకాజ్ నోటీసులు అందుకొన్నాఆశ్చర్యం లేదని, ప్రజలే కాదు ఆయన కూడా భావించడం విశేషం. అయినప్పటికీ తను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని అన్నారు.

 

ఆయనను ఇష్టం లేకపోతే పార్టీలో నుండి బయటకి పొమ్మని ఇప్పటికే హెచ్చరించిన బొత్స, ఇంత రాద్ధాంతం చేస్తుంటే ఇంకా వేచి చూస్తారని అనుకోలేము. పార్టీ నుండి ఎవరినయినా బయటకి తరిమేసేందుకు ఈ మాత్రం మాటలు చాలు. అయితే ఆయనని బయటకి పంపితే ఆయన మరిన్ని రహస్యాలు బయటపెడితే పార్టీకి ఇంత కంటే ఎక్కువ నష్టం కలుగుతుందని బొత్స భావిస్తే మాత్రం ఆయనను ఉపేక్షించే అవకాశం ఉంది.