టీఆర్‌ఎస్ కొత్త ఇష్యూ దొరికింది
posted on Oct 29, 2013 @ 12:21PM
ప్రతి చిన్న విషయాన్నీ పెద్ద ఇష్యూచేసి రాజకీయంగా లాభపడాలని భావించే టీఆర్ఎస్ పార్టీకి మరో ఇష్యూ దొరికింది. ఒకవేళ రాష్ట్రాన్ని విభజిస్తే అటు సీమాంధ్రతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో శాంతి భద్రతల విషయంలో ఎలా వ్యవహరించాలన్న అంశం మీద కేంద్ర హోంశాఖ మంగళవారం హైదరాబాద్‌లో మాజీ డీజీపీలతో ఒక సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సమావేశంలో పాల్గొనడానికి మాజీ డీజీపీలు అరవిందరావు, మహంతి, ఆంజనేయరెడ్డి తదితరులకు ఆహ్వానాలు అందాయి. అయితే టీఆర్ఎస్‌లో చేరి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న మాజీ డీజీపీ పేర్వారం రాములుకు మాత్రం ఆహ్వానం అందలేదు. ఒక రాజకీయ పార్టీలో చురుకైన కార్యకర్తలా వున్న వ్యక్తిని ఈ సమావేశానికి పిలవకూడదని కేంద్ర హోం శాఖ భావించిందో, మరే కారణం ఉందోగానీ, మొత్తానికి సమావేశానికి పేర్వారం రాములుకు ఆహ్వానం రాలేదు. దాంతో టీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధించడం ప్రారంభించింది.
తెలంగాణ ప్రాంతం నుంచి డీజీపీ స్థాయికి ఎదిగిన ఏకైక పోలీసు అధికారి అయిన పేర్వారం రాములును సమావేశానికి ఆహ్వానించకపోవడం ఉద్దేశపూర్వకంగా చేసిన పనేనని టీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. రాష్ట్ర విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి ఈ విషయం మీద టీఆర్ఎస్ ఫిర్యాదు కూడా చేసింది. ఈ విషయాన్ని ఇంకా పెద్దదిగా చేసి, దీన్ని సీమాంధ్రుల కుట్రగా కలర్ వేయడానికి టీఆర్ఎస్ నాయకులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ సమావేశంలో పేర్వారం రాములు కూడా పాల్గొంటే టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా లేని అంశాలు చర్చకు వస్తే ఆయన వాటికి అడ్డుపుల్ల వేసే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఇప్పుడు ఆ అవకాశం లేదని బాధపడుతోంది. నానాయాగీ చేసయినా సరే పేర్వారం రాములుకు ఈ సమావేశానికి ఆహ్వానం అందేలా చేయాలని టీఆర్ఎస్ కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది.