అవినీతి అంతంతోనే అభివృద్ధి

      తొమ్మిదేళ్ళ తెలుగుదేశం పాలన అత్యంత నీతివంతంగా సాగిందని అందువల్లే రాష్ట్రం సర్వోతోముఖాభివృద్ధి దిశాగా పయనించిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ తమ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించిందని, సర్వవ్యవస్థలనూ అవినీతిమయం చేసిందన్నారు. ఆ పార్టీ నేతలు పాల్పడిన అవినీతే దీనికి కారణమన్నారు. అవినీతి రహిత ప్రభుత్వం రావాలని, అభివృద్ధి పథంలో రాష్ట్రం తిరిగి ముందుకు సాగాలని అందరూ ఏసుక్రీస్తును ప్రార్థించాలని సూచించారు. ఈ సందర్భంగా దళిత క్రిస్టియన్లను ఎస్టీలుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు.

టిడిపి ఎంపీగా పవన్ కళ్యాణ్..!!

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టిడిపి పార్టీ తరపున పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పోటీచేస్తారని రాజకీయవర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో వైకాపా నుంచి కేవీపీ వియ్యంకుడు.. పారిశ్రామికవేత్త రఘురామకృష్ణం రాజుకు టికెట్ దాదాపుగా ఖరారై౦ది. అలాగే కాంగ్రెస్ నుంచి సిటింగ్‌ ఎంపీగా కనుమూరి బాపిరాజు రంగంలో ఉన్నారు. అయితే భారీ కేండిడేట్లు రంగంలో ఉన్న ఈ నియోజకవర్గ౦లో బరిలోకి పవన్ కూడా దీగడంతో పోటీ రసవత్తరంగా మారనుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఎలక్షన్స్ వ్యూహంలో భాగంగానే తెలుగుదేశం పార్టీ...ఆయన వైపు చూస్తున్నారన్న ప్రచారం సినీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆ మధ్యన బాలకృష్ణ ఆ మేరకు రాయబారం నిర్వహించినట్లు చెప్పుకున్నారు. స్వయంగా బాలకృష్ణ పవన్‌ను వెంటబెట్టుకుని చంద్ర బాబుతో చర్చలు జరిపారని, ఆ మేరకు టీడీపీలో చేరేందుకు పవన్‌ కల్యాణ్‌ సుముఖత వ్యక్తం చేశారన్న వార్తలు వెలువడ్డాయి. ఆ వార్తలపై పవన్ నుంచి  ఖండన రాకపోవడం...తాజాగా టిడిపి తరపున లోక్‌సభకు పోటీ చేస్తారని వార్తలు రావడం..పవన్ మౌనం అంగీకారమేమో అనే సందేహాలు కలుగుతున్నాయి.

హామీలే 'కేజ్రీవాల్' కు సవాళ్ళు..!

      అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏఏపీ పలు వాగ్ధానాలు చేసింది. ఇప్పుడు ఆ హామీలే ఆ పార్టీకి పెద్ద సవాల్‌గా మారనున్నాయి. కరెంటు చార్జీలను 50శాతం తగ్గిస్తామని, నగరంలోని ప్రతి ఇంటికి రోజూ 700 లీటర్ల చొప్పున తాగునీటిని ఉచితంగా ఇస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. వీఐపీ సంస్కృతిని తొలగిస్తామని, జనలోక్‌పాల్ చట్టం చేస్తామని కూడా పేర్కొంది. అయితే వీటిని నెరవేర్చాలంటే కత్తి మీద సాము చేయాల్సిందేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి.   ప్రజల భాగస్వామ్యంతో సరికొత్త పాలన అందిస్తామని, ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలకు భిన్నంగా వ్యవహరిస్తామని కేజ్రీవాల్  చెబుతున్నారు. ప్రమాణ స్వీకార తేదీని ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. అయితే ఈ నెల 26న ఈ కార్యక్రమం ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీకి డిసెంబర్ 4న జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 31, ఏఏపీకి 28, కాంగ్రెస్‌కు 8 సీట్లు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీతో పాటు ఏఏపీ ప్రభుత్వ ఏర్పాటుకు విముఖత వ్యక్తం చేయడంతో రెండు వారాలుగా అనిశ్చితి ఏర్పడింది. షరతుల్లేకుండా మద్దతిస్తామంటూ కాంగ్రెస్ లేఖ ఇవ్వడంతో అధికార పగ్గాలు చేపట్టడానికి ఏఏపీ ముందడుగేసింది.

విలీనం పాట మళ్ళీ ఇప్పుడెందుకో

  తెలంగాణా ఇస్తే తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని కేసీఆర్ ఏదో మాటవరసకి అన్నమాట పట్టుకొని, అటు తెదేపా, ఇటు టీ-కాంగ్రెస్ నేతలు కూడా ఆయనని ఒకటే సతాయిస్తున్నారు. కాంగ్రెస్ లో ఇంకా విలీనం చేయనందునే తెలంగాణా ఏర్పాటు ఆలస్యమవుతోందని తెదేపా నేతలు చేస్తున్నఆరోపణలు తెరాసను బద్నాం చేయడానికే అనుకొన్నా, రాజ్యసభ సభ్యుడు వీ.హనుమంత రావు కూడా తెదేపాకు కోరస్ పాడటం గమనిస్తే, కాంగ్రెస్ పార్టీ నిజంగానే తెలంగాణాపై గేమ్ ఆడుతోందనే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్ర విభజనతో తన రాజకీయ ప్రత్యర్దులందరినీ తుడిచిపెట్టేదామని అడియాసకు, అత్యాశకు పోయిన కాంగ్రెస్ అధిష్టానానికి తల బొప్పికట్టడంతో, మరో నాలుగు నెలలు కళ్ళుమూసుకొంటే ఆనక వచ్చేవాళ్ళే ఆ తిప్పలేవోపడతారని భావిస్తోందో మరేమో గానీ, గత రెండు నెలలుగా తెరాస విలీనం గురించి మాట్లాడనిది ఇప్పుడు మళ్ళీ విలీనం పాట జోరుగా అందుకొంది. తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేయకపోయినట్లయితే ఆ సాకుతో ఈ సమస్య నుండి బయటపడాలని యోచిస్తున్నట్లున్న కాంగ్రెస్ పార్టీ, ఒకవేళ ఈ విలీనం ఐడియా బెడిసికొడితే, నెపం నెట్టివేసేందుకు బీజేపీ ఉండనే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో తెరాస కలిపేస్తే, తెరాస నుండి ఇబ్బంది ఉండదని కాంగ్రెస్ భావిస్తున్నపటికీ, ముందుగా బలయిపోయేది కాంగ్రెస్ పార్టీ నేతలే! ఏమయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి వ్రతం చెడినా ఫలం దక్కేలా లేదు

దీనబందుతో పురందేశ్వరి చెలగాటం

  దీనబందు, కళాబందు, ఆత్మబందు, భక్తబందు, వైద్యబందు వంటి అనేక వీరత్రాళ్ళు వేయించుకొని వాటిని భారంగా మోసుకు తిరుగుతున్న రాజ్యసభ సభ్యుడు టీ.సుబ్బిరామి రెడ్డికి పాపం! కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది నందమూరి గడుసుపిల్ల పురందేశ్వరి. ఆయన పాపం.. ఎన్నికల కోసం ఎదురు చూడకుండా బోలెడంత డబ్బు ఖర్చుపెట్టి ఒక పద్దతి ప్రకారం ప్రజాసేవ, కళాసేవ, దైవసేవ ఇత్యాది నానారకాల సేవలు చేసుకుపోతూ, జస్ట్ విశాఖ లోక్ సభ టికెట్ మాత్రమే పుచ్చుకొంటానని చెప్పుకొంటుంటే, ఆ పురందేశ్వరి ‘నేను కూడా ఇక్కడే కంటిన్యూ అయిపోతా’నని చెపుతూ పాపం! ఆ పెద్దమనిషిని ఒకటే అల్లరి పెట్టేస్తోంది.   అప్పటికీ ఆయన చాలా విశాల హృదయం గలవాడు గనుక ‘ఇగో పిల్లా... నువ్వు కావాలంటే ఆ పక్కనున్నఏ నరసాపురంకో పోయి పోటీ చేసుకో’ అని మంచిగా చెప్పి చూసాడు. పైగా ‘సోనియమ్మ చాన్నాళ క్రితమే నాకు వైజాగ్ టికెట్ కన్ఫర్మ్ చేసేసారు’ అంటూ ఓ దైవరహస్యం కూడా బయట పెట్టేరు. కానీ ఆమె వింటే కదా! పైగా వాళ్ళాయన వెంకటేశ్వర రావు కూడా ఆమెకు తోడుగా వచ్చి అడ్డుగోలు వాదనలు మొదలుపెట్టేసాడు. “అల్లపుడేపుడో నాగార్జున సాగర్ డ్యాం కడుతున్నపుడు నువ్వు సిమెంట్ బ్లాకులో అమ్ముకోలేదా? కాంట్రాక్టుల కోసం పైరవీలు చేయలేదా?” అంటూ ఏవేవో అవాకులు చవాకులు వాగి పాపం! ఆ పెద్దాయన మనసు నొప్పించేసాడు.   ‘వైజాగ్ టికెట్ కోసం నేను మాట్లాడితే, ఈయనేమిటి హిస్టరీ మాట్లాడుతూ నా పరువు తీసేస్తున్నాడు’ అని ఆగ్రహంతో ఊగిపోతూ ‘నా మూడోకన్ను తెరుస్తా.. మరో ముక్క ఎక్సట్రా మాట్లాడినా పరువు నష్టం దావా వేస్తా’ నని మెళ్ళో వ్రేలాడుతున్న రుద్రాక్షలు పట్టుకొని భీకర శపథం చేసేసారు ఆ భక్తబందు. అందుకు ఆ దగ్గుబాటి అదర లేదు, బెదరలేదు. పైగా ‘ఆ.. వేస్తే పోయేది నీ పరువే కాని నాది కాదు,’ అని బెదిరించారు. ‘సోనియమ్మ కాళ్ళమీద పడితే టికెట్ రావచ్చు. కానీ కోర్టుకెళితే పోయిన పరువు తిరిగి రాదూ కదా..’ అని బాధపడుతూ పాపం ఆ దీనబందు వెనక్కి తగ్గవలసి వచ్చింది.   అయితే ఆ తరువాత నుండి వైజాగ్ లో మొక్కలు నాటుడు, మందులు పంచుడు, కచేరీలు పెట్టుడు వంటి అనేక కార్యక్రమాలు స్పీడ్ పెంచేసి ‘ఇక వైజాగ్ టికెట్ నాదే’నని కుదుట పడుతుంటే, మళ్ళీ ఎక్కడి నుండో హటాత్తుగా ఊడిపడిన పురందేశ్వరి ‘నేను కూడా వైజాగ్ జనాలకి బోలెడు సర్వీస్ చేస్తున్నాను. ఆ సంగతి నేను ఊరంతా బ్యానర్లు తగిలించుకొని చాటింపు వేసుకోకపోయినా జనాలకి తెలుసు. వాళ్ళు ఎవరు కావాలనుకొంటే వారికే టికెట్’ అని కౌంటర్ ఇచ్చేసి సీమాంధ్రకి ప్యాకేజీ కోసం డిల్లీ ప్లేన్ ఎక్కేసింది.   ఆ మహాతల్లి మళ్ళీ వైజాగ్ వచ్చేలోగా జనాలని కాస్త మంచి చేసుకొంటే బెటర్ అని మన పెద్దాయన అగనంపూడిలో ఓ క్యాన్సర్ ఆసుపత్రికి శంకు స్థాపన చేసేసి, సినిమా వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళతో క్రికెట్ ఆడించి జనాలని ఆకట్టుకొనే ప్రయత్నం చేసారు కూడా. అయితే ప్యాకేజీ కోసం డిల్లీ వెళ్లిన చిన్నమ్మ ఇంతకీ ఎవరి ప్యాకేజీ కోసం మాట్లాడారో ఇంకా ప్రకటించనప్పటికీ, డిల్లీ నుండి ప్లేన్ వైజాగ్ లో దిగగానే ‘నేను వైజాగ్ నుండే పోటీ చేస్తున్నాను’ అని అనౌన్సమెంటు చేసేసారు. ఆమె అనౌన్సమెంటుకి పాపం దీన బందుగారి బీపీ మళ్ళీ పెరగడం ఆరంబించింది పాపం!

టికెట్ల కేటాయింపులో లోకేష్ కీలక పాత్ర

  వచ్చేఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధుల పేర్లపై తెదేపా గత ఆరేడు నెలలుగా కసరత్తు చేస్తోంది. అదిప్పుడు మరికొంచెం ఊపందుకొన్నట్లు తెలుస్తోంది. గతంలోలాగే ఈసారి కూడా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ అభ్యర్ధుల ఎంపికలో కీలకపాత్ర పోషిస్తున్నారు. తండ్రీకొడుకులు ఇరువురూ కూడా వేర్వేరుగా సర్వేలు నిర్వహిస్తూ, ఆ ఇద్దరి సర్వేలలో మంచి మార్కులు సంపాదించుకొన్నఅభ్యర్ధులతో మరొక లిస్టు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.   అభ్యర్ధుల అంగబలం, అర్ధం బలంతో బాటు, ప్రజాధారణ, కార్యకర్తల, స్థానిక నేతల మద్దతు, విశ్వసనీయత, విజయావకాశాలు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్ధులను ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర విభజన ప్రక్రియ, ఎన్నికల పొత్తుల సంగతి తెలనంతవరకు టికెట్స్ వ్యవహారం కూడా తేలడం కష్టమే. బహుశః ఫిబ్రవరి రెండో వారంలోగా తెదేపా అభ్యర్ధుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.

యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో జిందాల్ ?

      అమెరికా రాజకీయాల్లో ఎదుగుతూ వస్తున్న భారతీయ అమెరికన్ బాబీ జిందాల్ ఆ దేశ అధ్యక్ష పదివికి పోటీ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రిపబ్లిక్ నాయకుడిగా లూసియానా గవర్నర్‌ విధులు నిర్వహిస్తున్నా జిందాల్...2016లో అధ్యక్ష పదివికి పోటీ పడతారని అంటున్నారు. అమెరికన్ టీవి ఛానల్ సి-స్పాన్స్ న్యూస్ మేకర్ ఇంటర్వ్యూలో రిపబ్లికన్ పార్టీ సెనెటర్ డేవిడ్ విట్టర్ మాట్లాడుతూ..రజాదరణ గల బాబీ జిందాల్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగితే అందరూ సంతోషిస్తారని అన్నారు.అతని నాయకత్వంపై గౌరవం ఉందని తెలిపారు. రాజకీయాలకు కావాల్సిన అన్ని విలువలు జిందాల్‌కు ఉన్నాయని చెప్పారు. కానీ తనకు దాని గురించి ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలియదని విట్టర్ తెలిపారు. అయితే వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు బరిలో ఉంటారంటే మాత్రం.. జిందాల్‌పై దృష్టి పెట్టాల్సి ఉంటుందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ కూడా జిందాల్ అధ్యక్ష బరిలో నిలుస్తారనే భావిస్తున్నారని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ మద్దతు తాత్కాలికమే: ఆమాద్మీ

    ఆమాద్మీ పార్టీకి బేషరతుగా మద్దతు ఇస్తామని గవర్నర్ కు లేఖ వ్రాసిన కాంగ్రెస్ పార్టీ, తీరా చేసి ఆమాద్మీ ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధంకాగానే, తామేమీ బేషరతుగా మద్దతు ఇస్తామని వాగ్దానం చేయలేదని మాట మార్చింది. ఇక కాంగ్రెస్ చేతిలోంచి డిల్లీని గుంజుకోవాలని విశ్వప్రయత్నం చేసి, దానికి ఆమాద్మీతన చీపురు కట్ట అడ్డం వేయడంతో కంగు తిన్నబీజేపీ, తమ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోనేందుకే కాంగ్రెస్ అమాద్మీకి మద్దతు ఇస్తోందని ఆక్రోశిస్తోంది.   ఎన్నికలలో కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టిన ఆమాద్మీ పార్టీ ఇప్పుడు అదే అవినీతి పార్టీతో అధికారం కోసం చేతులు కలిపి డిల్లీ ప్రజలను మోసం చేశాయని ఆరోపించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆమాద్మీ పార్టీకి ఎంతో కాలం మద్దతు ఈయకపోవచ్చని బీజేపీ జోస్యం చెప్పింది.   బీజేపీ జోస్యం నిజమయ్యే అవకాశం ఉందని దృవీకరిస్తూ అమాద్మీకి చెందిన ప్రశాంత్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ, “మాకు కాంగ్రెస్ ఎంత కాలం మద్దతు కొనసాగిస్తుందో మాకు అనుమానమే. అది ఒక నెలా నాలుగు నెలలా లేక ఆరు నెలలా? అనేది దానినే నిర్ణయించుకోనివ్వండి. కానీ మేము మాత్రం కాంగ్రెస్ ఎటువంటి షరతులు పెట్టినా అంగీకరించబోము. మా ఎన్నికల మ్యానిఫెస్టోని మేము ఖచ్చితంగా అమలుచేసి తీరుతాము."   "ఒకవేళ కాంగ్రెస్ నచ్చకపోతే ఎప్పుడయినా మద్దతు ఉపసంహరించుకావచ్చును. అందుకు సిద్దపడే మేము ప్రభుత్వ ఏర్పాటుకి సిద్దమవుతున్నాము. అయితే మాకున్న కొద్దిపాటి వ్యవధిలో కూడా దేశంలో ప్రజాభిప్రాయాలకి అనుగుణంగా కూడా పరిపాలన చేయవచ్చని నిరూపించబోతున్నాము,” అని అన్నారు.   బహుశః వచ్చే సార్వత్రిక ఎన్నికలకి ఎన్నికల సంఘం షెడ్యుల్ ప్రకటించగానే కాంగ్రెస్ ఏవో గిల్లి కజ్జాలు పెట్టుకొని, కుంటి సాకులు చెప్పి అమాద్మీకి తన మద్దతు ఉపసంహరించవచ్చును. ఆవిధంగా అయితే, మళ్ళీ డిల్లీలో ఎన్నికలు నిర్వహించి, ఈ నాలుగు నెలలో అమాద్మీ ప్రభుత్వం చేసిన తప్పుల లిస్టు గురించి ప్రచారం చేసుకొని డిల్లీలో మళ్ళీ అధికారం చెప్పట్టే ప్రయత్నం చేయవచ్చును.

ప్రజాస్వామ్యన్ని గౌరవించిన గొప్ప వ్యక్తి నీల౦: ప్రణబ్

      అనంతపురంలో జరిగిన నీలం సంజీవరెడ్డి శతజయంతి ముగింపు వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరై ప్రసంగించారు. రాష్ట్రపతిగా, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా, లోక్ సభ స్పీకర్ గా నీలం సేవలను ప్రశంసించారు. భారతదేశంలో ఇన్ని పదవులు చేపట్టిన తొలి భారతీయుడు నీలం సంజీవరెడ్డి మాత్రమేనని ప్రణబ్ అన్నారు. స్పీకర్ గా అవిశ్వాసం సమయంలో సభను చర్చకు పిలిచిన ఘనత ఉందని అన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాల్గొన్నారని, క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకు వెళ్లారని అన్నారు. మహాత్మగాంధీ స్ఫూర్థితో ఆయన పనిచేశారని, ఓ లక్ష్యం కొరకు పనిచేస్తే పదవులు వెతుక్కుంటూ వస్తాయని అన్నారు. ప్రణబ్ రాక సంధర్భంగా అనంతపురంలో పెద్ద ఎత్తున ఆంక్షలు విధించారు. సమైక్యవాదులు ఎక్కడా కనిపించకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను దింపి అడ్డుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ మరో రూపం కేజ్రివాల్

      కాంగ్రెస్ అవినీతి మీద పోరాడిన మ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ అదే పార్టీ మద్దతు తీసుకుని అధికార పీఠం దక్కించుకోవడం పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీ మరో రూపం అని కూడా అంటున్నారు. అధికారం కోసం కేజ్రీవాల్ తన సిద్ధాంతాలను సైతం వదులుకున్నారని బీజేపీ నేత హర్షవర్ధన్ విమర్శించారు. ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు తిరస్కరించిన అవినీతి కాంగ్రెస్ తో జత కట్టడమేమిటని ప్రశ్నించారు. అధికారం కోసం కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలను మోసం చేశారని, ప్రజలకు ఏఏపీ ఇచ్చిన హామీలన్నిటినీ ఆ పార్టీ నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఇదే సమయంలో కేజ్రీవాల్ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం హర్షనీయమని, ఆయన ప్రజాస్వామ్య వ్వవస్థను బలోపేతం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు.

టిడిపిలోకి మాగుంట శ్రీనివాసులు..!!

      రాష్ట్రవిభజనతో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని నమ్మకంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర పార్టీలలో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం...కాంగ్రెస్ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం.   అయితే ఈసారి మాగుంట నెల్లూరు నుంచి లోక్ సభకు పోటీచేయాలని భావిస్తున్నారు. ఇదేగాని జరిగితే నెల్లూరులో రాజకీయాలు రసవత్తరంగా మారుతాయి. గత ఉపఎన్నికలలో వైకాపా తరపున నెల్లూరు నుంచి పోటిచేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి 2.91లక్షల భారీ మెజారిటితో గెలుపొందారు. దీంతో కడప తరువాత మరో కంచుకోటగా వైకాపా నేతలు నెల్లూరును భావించడం మొదలు పెట్టారు. సీమాంద్రలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్, టిడిపిల మద్యనే పోటీ ఉండబోతున్న తరుణంలో మాగుంట టిడిపిలో చేరి పోటీచేస్తే అది మేకపాటికి సవాలు విసిరినట్లు అవుతుంది. ఎందుకంటే మాగుంట శ్రీనివాసులరెడ్డి కుటుంబానికి నెల్లూరు జిల్లాలో పెద్ద బలగం ఉంది. దీంతో ఈ సారి నెల్లూరు లో రెండు దిగ్గజాల మధ్య పోటీ ఖాయమని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.