తూచ్! ఆమాద్మీకి బేషరతు మద్దతు ఇస్తామని చెప్పలేదు : కాంగ్రెస్

  అమాద్మీ పార్టీ కోరకుండానే ఆ పార్టీకి బేషరతుగా బయట నుండి మద్దతు ఇస్తామంటూ డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీం జంగ్ కు కొద్ది రోజుల క్రితమే లేఖ వ్రాసిన కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు అమాద్మీపార్టీ కాంగ్రెస్ మద్దతు తీసుకొని ప్రభుత్వ ఏర్పాటుకి సిద్దమని ప్రకటించగానే, కాంగ్రెస్ పార్టీ తామేమీ బేషరతుగా మద్దతు ఇస్తామని చెప్పలేదంటూ మాట మార్చింది.   కాంగ్రెస్ పార్టీకి చెందిన డిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మీడియాతో మాట్లాడుతూ, “మా పార్టీ అమాద్మీకి బేషరతుగా మద్దతు ఇస్తామని ఎన్నడూ వాగ్దానం చేయలేదు. ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత అంశాల వారిగా ఆ ప్రభుత్వ పనితీరుని బట్టి మద్దతు ఇస్తాము తప్ప గుడ్డిగా మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు,” అని కుండ బ్రద్దలు కొట్టారు.   ఇక మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ, “అమాద్మీ చేసిన అనేక వాగ్దానాలలో చాలా వరకు ఆచరణ సాధ్యం కానివి. వాటిని అమలు చేయడం వీలుకాదని నా అభిప్రాయం. ప్రతీ విషయానికి ప్రజాభిప్రాయం కోరుతామని చెపితే ఇక ఆమాద్మీ ప్రభుత్వం పనిచేయగలదా? ఒక్కో ప్రాంతానికి విడివిడిగా బడ్జెట్ తయారు చేసి, ఆయా ప్రాంతాల ప్రజల అభిప్రాయం తీసుకొని నిధులు కేటాయించడం సాధ్యమయ్యేపనేనా? ఏమయినప్పటికీ ప్రజాదరణతో అధికారం చేపడుతున్న అమాద్మీ పార్టీకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక తన ఎన్నికల మ్యానినిఫెస్టోను అమలుచేయవలసిన బాధ్యత ఆపార్టీపైనే ఉంది,” అని షీలా దీక్షిత్ అన్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్

    భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవనుంది. డిల్లీలో రాజకీయ దిగ్గజాలయిన కాంగ్రెస్, బీజేపీలను మట్టికరిపించిన ఆమాద్మీ (సామాన్యుడు) త్వరలో డిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేప్పట్టబోతున్నాడు. కాంగ్రెస్,బీజేపీల మద్దతు స్వీకరించడానికి నిరాకరించిన అమాద్మీపార్టీ, ఒక సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయం కోరుతూ రిఫరెండం నిర్వహించింది. అందులో అత్యధిక శాతం ప్రజలు కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పరచమని కోరడంతో, ఆమాద్మీ పార్టీ డిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకి తాము అంగీకరిస్తున్నట్లు కొద్ది సేపటి క్రితమే ప్రకటించింది. ఆ పార్టీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్ మరో ముగ్గురు సహచరులతో కలిసి ఎటువంటి ఆర్భాటం, ఊరేగింపులు లేకుండా ఒక చిన్న కారులో డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీం జంగ్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమ సంసిద్దత తెలియజేసేందుకు బయలుదేరి వెళ్ళారు. ఆమాద్మీ పార్టీ తరపున అరవింద్ కేజ్రీవాల్ డిల్లీ ముఖ్యమంత్రిగా ఈనెల 26న ప్రమాణం స్వీకరించే అవకాశం ఉంది. ప్రజలను దూరంగా ఉంచే పాత సాంప్రదాయాలకు స్వస్తి పలుకుతూ, ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని డిల్లీ నగరం నడిబొడ్డున ప్రజల సమక్షంలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించాలని ఆమాద్మీ పార్టీ భావిస్తోంది.

టిడిపి అడ్రస్ గల్లంతు కావడం ఖాయ౦: కెసిఆర్

      తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇక ఎవరూ అడ్డుకోలేరని తెరాస అధ్యక్షుడు కెసిఆర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంధర్బంగా కెసిఆర్ మాట్లాడుతూ..తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని ఆయన అన్నారు.   టీడీపీ జుక్కల్ ఎమ్మెల్యే షిండే వెంట పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్‌లోకి వచ్చారంటే, ఆ పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చనని అన్నారు.   తెలంగాణ టీడీపీ నేతలు కూడా షిండే బాటలో ఉద్యమంలోకి రావాలి. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే మాతృ ద్రోహులుగా మారకుండా తెలంగాణ ప్రజల్లో గౌరవం పెంచుకోవాలని కేసీఆర్ హితవు పలికారు. ఏనుగు వెళ్లింది.. తోక చిక్కిందంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అభివర్ణించారు. బీహార్‌లోనూ లాలూప్రసాద్ పార్టీ బలంగా ఉండేది. బీహార్ నుంచి జార్ఖండ్ రాష్ట్రం విడిపోయాక ఆ ప్రాంతంలో లాలూ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఆ రాష్ట్రానికి వెళ్లినప్పుడు.. ఇదేందని అక్కడి ప్రజలను అడిగితే.. 'లాలూ పార్టీది, మాది వేర్వేరు రాష్ట్రాలు' అని బదులిచ్చారు. తెలంగాణలో టీడీపీ పరిస్థితి కూడా అంతే'' అని చెప్పారు.  

వైకాపా గూటికి జెసి

  సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పాటు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ అధిష్టానం వడి వడిగా అడుగులు వేస్తుండటంతొ ఆ పార్టీ సీమాంద్ర నాయకులు ఇక ప్రత్యామ్నాయాలపై దృష్టిపెడుతున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు పార్టీకి గుడ్‌బై చెప్పి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరుతుండగా తాజాగా అనంతపురంలో మరోషాక్‌ తగలనుంది. అనంతపురం జిల్లాలొ కాంగ్రెస్‌ పార్టీకి బలమైన నాయకునిగా ఉన్న జెసి దివాకర్‌ రెడ్డి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఆయన తనయుడు పవన్‌ వైసిపి పార్టీ వైపు చూస్తున్నారు. 2014 ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేయాలని భావిస్తున్నారట. ఇప్పటి వరకు జిల్లాలో బలమైన వర్గంగా ఉన్న జెసి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరటంతో కాంగ్రెస్‌ ఆ జిల్లాలో తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పాడింది.

భీమవరం బుల్లోడు ఆడియో ఫంక్షన్‌లో అపశృతి

  సునీల్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌తో తెరకెక్కుతున్న భీమవరం బుల్లొడు ఆడియో ఫంక్షన్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఫంక్షన్‌లో తొక్కిసలాట జరగటంతో సురేష్‌ అనే యువకుడు మరణించాడు. పశ్చివ గోదావరి జిల్లా భీమవరంలో ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని స్థానిక డిఎన్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేశారు. అయితే ఊహించిన దానికన్నా అభిమానులు ఎక్కువగా రావటంతో చేసిన ఏర్పాట్లు సరిపోక తొక్కిసలాట జరిగింది. వెనుక వరనుసలో కూర్చున్న వారు ముందు వారిని తోసేయటంతో సురేష్‌ కిందపడిపోయాడు తరువాత జరిగిన తొక్కిసలాటలో సురేష్‌ మృతి చెందాడు.

రాష్ట్రపతి అనంతపురం పర్యటన

  శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి చేరుకున్న రాష్ట్రపతి నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.ఆయనతో పాటు గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం పదిన్నర సమయంలో హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరి పుట్టపర్తి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో అనంతపురం వెళతారు. అనంతపురంలో జరిగే నీలం సంజీవరెడ్డి స్టేడియంలో జరిగే నీలం శతజయంతి ముగింపు వేడుకల్లో పాల్గొనటంతో పాటు, తరువాత పుట్టపర్తిలొని సత్యసాయి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. ఆ తరువాత మూడు గంటల సమయంలో తిరిగి హైదరాబాద్‌ చేరుకుంటారు.ఈ పర్యటనలో మంత్రులు గీతారెడ్డి, రఘువీరారెడ్డి, శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు కూడా పాల్గొననున్నారు. ప్రణబ్ రాక నేపథ్యంలో అనంతపురం, పుట్టపర్తిలలో భద్రత కట్టుదిట్టం చేశారు. డీజీపీ దగ్గరుండి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

అశోక్ బాబుకు పోలీసులు నోటిసులు

      ఎపి ఎన్జీవో నేత అశోక్ బాబుకు కష్టాల పరంపర మొదలైనట్టుంది. సమైక్యాంధ్ర ఉద్యమం పుణ్యమాని ఒక్కసారిగా మీడియా స్టార్ అయిపోయిన అశోక్ బాబును వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు కంగుతినిపిస్తున్నాయి. ఎపిఎన్జీవోల మధ్య లుకలుకలు, సమ్మెను అర్థంతరంగా ఆపేశారని విమర్శలు, ఎపి ఎన్జీవో ఎన్నికలపై దీని ప్రభావం, రాజకీయనాయకుల సహకారం అడగాల్సి రావడం వంటివన్నీ ఒకత్తయితే ఇప్పుడు ఏకంగా ఓయు పోలీసులు నుంచి నోటిసులు అందుకోవాల్సి రావడం మరోకెత్తు. రెచ్చగొట్టే ప్రసంగాలు, వాఖ్యనాలు చేశారంటూ అశోక్ బాబుకు శనివారం ఓయూ పోలీసులు నోటిసులు జారీ చేశారు. ఈ నెల హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఇక్కడే పుట్టాం..కలిసుందాం: కిరణ్

      ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైద్రాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సమైక్యవాణి విన్పించారు. ‘ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి..’అందుకే తాము కలిసి ఉండాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు.తాము ఎందుకు కలిసి ఉండాలని కోరుకుంటున్నామో గీతా రెడ్డి వంటివాళ్లు అర్థం చేసుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మాటలకు గీతారెడ్డితో పాటు తదితరులు నవ్వుకున్నారు.శ్రీసిటిలో ఆయన శనివారం పెప్సికో బేవరేజ్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. విభజన.. సమైక్య ఉద్యమాల వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక రంగం కుంటు పడలేదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పడం కొసమెరుపు.

వరస్ట్ సీఎం కూడా కిరణ్‌కుమార్ రెడ్డి

      దేశంలోనే వరస్ట్ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి అని, రాష్ట్ర విభజన విషయంలో కిరణ్ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్నారని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ కంటే ఎక్కువ ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కిరణ్ ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు చర్చకు రాకుండా సీఎం కిరణ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. జనవరి 3 నుంచి జరిగే సమావేశాల్లో బిల్లుపై చర్చ జరగకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని ఎర్రబెల్లి హెచ్చరించారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనంపై ప్రజలకు కేసీఆర్ స్పష్టత ఇవ్వాలన్నారు. పయ్యావుల సమైక్యవాదం ఆయన వ్యక్తిగతమని ఆయన అన్నారు. విభజనపై చంద్రబాబు స్పష్టతతో ఉన్నారని ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.

ఒక్కత్రాటిపైకి వచ్చిన కాంగ్రెస్, తెదేపా నేతలు

  ఏపీఎన్జీవోలు నిర్వహించిన అఖిలపక్ష సమావేశం కొద్ది సేపటి క్రితమే ముగిసింది. అనంతరం అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ, సమావేశానికి హాజరయిన అన్ని పార్టీల నేతలు రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా కలిసి పోరాడేందుకు అంగీకరించారని తెలిపారు. మళ్ళీ శాసనసభ సమావేశమయినప్పుడు బిల్లును వ్యతిరేఖిస్తున్నట్లు సభ్యులందరూ స్పీకర్ కు అఫిడవిట్స్ సమర్పించాలని తాము కోరినట్లు తెలియజేసారు. మళ్ళీ రెండు మూడు రోజుల్లో అందరూ సమావేశమయ్యి రాష్ట్రపతిని కలిసే విషయంపై చర్చించి తుది నిర్ణయం తీసుకొంటామని తెలిపారు. ప్రస్తుతం రాజకీయ జేఏసీ ఏర్పడలేదు గనుక, జిల్లా స్థాయిలో ఏపీయన్జీవోలే ఉద్యమిస్తారని తెలియజేసారు.   తెదేపా నేత పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు చేస్తున్న సమైక్యఉద్యమాలకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ తరపున హాజరయిన మంత్రి శైలజానాథ్ మరియు యంపీ సబ్బంహరి మాట్లాడుతూ తామందరం కూడా ఉద్యోగ సంఘాలకు మద్దతు ఇస్తామని ప్రకటించారు. పార్టీలకతీతంగా అందరూ కలిసి పోరాడితే తప్పకుండా ఫలితం ఉంటుందని వారు అన్నారు. లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు మరియు సీపీఎం సభ్యులు వీరయ్య మాట్లాడుతూ తాము సమైక్యాంధ్ర కొరకు స్వతంత్రంగానే పోరాడుతామని అన్నారు.   ఈ సమావేశంలో ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే రాష్ట్ర విభజన చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు, రాష్ట్ర విభజనకు అంగీకరించిన తెదేపా సభ్యులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏకాభిప్రాయానికి వస్తే, సమైక్యాంధ్ర కోసమే పోరాడుతున్నామని చెప్పుకొంటున్న వైకాపా ఈ సమావేశానికి మొహం చాటేసింది.      

తెదేపా ఎదురు దాడితో ఆత్మ రక్షణలో పడిన తెరాస

  రాష్ట్ర విభజనపై నిర్దిష్టమయిన అభిప్రాయం చెప్పలేక సతమతమవుతున్నతెదేపాపై ఇదే అదునుగా అన్ని రాజకీయ పార్టీలు దాడి ప్రారంభించాయి. ముఖ్యంగా తెరాస నేతలు హరీష్ రావు తదితరులు శాసనసభ, మండలిలో తెదేపా అనుసరించిన ద్వంద వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్ననేపద్యంలో వారిని తక్షణమే ఎదుర్కొనవలసిన అవసరం ఏర్పడింది. తెదేపా తెలంగాణా నేతలు మోత్కుపల్లి నరసింహులు, ఎర్రబెల్లి దయాకర రావు తెరాసపై ఎదురుదాడి ఆరంబిస్తూ, అసలు తెరాసకు నిజంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలనే కోరిక ఉంటే, తెరాసను వెంటనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తెలంగాణా ఏర్పాటుకి సహకరించాలని కోరారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా ఏర్పాటుకి సంసిద్దత వ్యక్తం చేస్తున్నపటికీ, తెరాస విలీనానికి అంగీకరించనందునే ఏవో కుంటి సాకులు చెపుతూ విభజన ప్రక్రియను సాగదీస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రకటన చేసిన వెంటనే తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఉండి ఉంటే, ఈ పాటికి తెలంగాణా రాష్ట్రం కూడా ఏర్పడి ఉండేదని వారు అన్నారు. అందువల్ల ఇప్పటికయినా తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తెలంగాణా ఏర్పాటుకు సహకరించాలని, లేకుంటే ప్రజలు తెరాసను క్షమించబోరని వారు హెచ్చరించారు.   తెరాస తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇస్తుందో లేక తెలంగాణా ప్రజల ఆకాంక్షకే ప్రాధాన్యత ఇస్తుందో తెలపాలని వారు కోరారు. ఈ ఎన్నికలలోగా రెండు పార్టీల విలీనం జరుగకపోయినట్లయితే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఏర్పాటుని వాయిదా వేసే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పడకపోతే ఆ తరువాత పరిస్థితుల గురించి ఎవరూ చెప్పలేరని వారు అన్నారు. నాలుగు కోట్ల ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చేందుకు, తెరాస వెంటనే కాంగ్రెస్ విలీనం చేసి, రాష్ట్ర ఏర్పాటుకి సహకరించాలని వారు డిమాండ్ చేసారు.   ఈవిధంగా తెదేపా ఎదురుదాడి మొదలుపెట్టడంతో తెరాస ఆత్మరక్షణలో పడింది. తెరాస కాంగ్రెస్ లో విలీనం కాకపోవడం వలననే తెలంగాణా ఏర్పాటు అవడం లేదని ప్రజలు కూడా నమ్మినట్లయితే ఆ పార్టీకి చాలా ప్రమాదమే.

డిల్లీకి సుల్తాన్ ఆమాద్మీ

  డిల్లీ ప్రభుత్వ ఏర్పాటుకి సరిపడే మెజారిటీ లేకపోవడంతో వెనక్కి తగ్గిన ఆమాద్మీపార్టీకి కాంగ్రెస్ బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడంతో, కాంగ్రెస్ మద్దతు స్వీకరించడానికి సుముఖంగా లేని ఆమాద్మీ పార్టీ, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు చేయాలా వద్దా అంటూ డిల్లీ ప్రజల అభిప్రాయం కోరింది. ఇంతవరకు దాదాపు పది లక్షల మంది స్పందించగా వారిలో 75శాతం కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరినట్లు ఆమాద్మీ పార్టీ తరపున ప్రతాప్ గంజ్ నుండి ఎన్నికయిన మనిష్ సిసోడియా మీడియాకు తెలియజేసారు. ఈ ఆదివారం రాత్రి పార్టీ సభ్యులు సమావేశమయ్యి పార్టీ నిర్ణయాన్ని సోమవారం ఉదయం ప్రకటిస్తామని తెలిపారు. మెజారిటీ శాతం ప్రజలు ఆమాద్మీనే ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరుతున్నందున బహుశః సోమవారం ఆ పార్టీ తరపున ఎన్నికయిన శాసనసభ్యులు డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీం జంగ్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమ సంసిద్దత తెలియజేయవచ్చును. ఆ పార్టీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్ డిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసే అవకాశం ఉంది.ఒకవేళ సోమవారం కూడా అమాద్మీ ప్రభుత్వ ఏర్పాటుకి ముందుకు రాకపోయినట్లయితే డిల్లీలో రాష్ట్రపతి పాలన విదించే అవకాశం ఉంది. 

కేంద్రమంత్రి జయంతీ నటరాజన్ రాజీనామా

  ఇటీవల నాలుగు రాష్ట్రాలలో ఘోర పరాజయం పొందిన తరువాత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ త్వరలో పార్టీని సమూలంగా ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన అనగానే జనాలు ఏవేవో ఊహించేసుకొంటారు. కానీ ప్రక్షాళన అంటే అటువారిని ఇటు, ఇటువారిని అటు మార్చడమే తప్ప పార్టీలో అసమర్ధులను ఏరి పారేయడమో లేక అవినీతిపరులను పార్టీనుండి బయటకు పంపడమో కానే కాదు. అందువల్ల యువరాజవారు మొదలుపెట్టిన ప్రక్షాళన కార్యక్రమం కూడ అలాగే మొదలయింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖా మంత్రి జయంతి నటరాజన్ పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు తన పదవికి రాజీనామా చేసారు. దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర కూడ పడిపోయింది. కేంద్రమంత్రి వీరప్ప మొయిలీకి ఆ శాఖల అదనపు భాద్యతలను అప్పగించారు. పార్టీలో సీనియర్ నేత అయిన ఆమెకు పార్టీలో కీలక భాద్యతలు అప్పగించేందుకే, ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. గులాం నబీ ఆజాద్ తో సహా మరో పదిమంది కేంద్రమంత్రులు కూడా రాజీనామాలు చేసి, పార్టీని ఎన్నికలకు సిద్దం చేసే పనిలోపడతారని సమాచారం.  బహుశః మన రాష్ట్రంలో అసంతృప్త నేతలెవరికో కేంద్ర మంత్రి పదవులు ఎరగా వేసి దారికి తెచ్చుకొంటారేమో మన యువరాజవారు. 

అఖిలపక్షానికి వైకాపా డుమ్మా దేనికో

  ఏపీఎన్జీవోలు ఈరోజు ఏర్పాటుచేస్తున్నఅఖిలపక్ష సమావేశం ప్రధానోద్దేశ్యం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అన్ని రాజకీయపార్టీలను ఒకే వేదిక మీదకు తెచ్చి సమైక్యపోరాటం చేయడం. అయితే ప్రస్తుతం అన్నిపార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని వ్యవహరిస్తున్నందున, ఏపీఎన్జీవోల చేస్తున్నఈ ప్రయత్నం వల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చును. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకొంటున్న రాజకీయ పార్టీల నేతలు తమ అహాన్ని, బేషజాలను, పార్టీ జెండాలను, స్వీయ మరియు పార్టీ ప్రయోజనాలను అన్నిటినీ పక్కన బెట్టి సమైక్యంగా కలిసి పనిచేస్తే నేటికీ రాష్ట్ర విభజనను ఆపే అవకాశం ఉంది. కానీ వారు అంత గొప్ప త్యాగాలు చేస్తారని ఆశించడం అడియాస, అవివేకమే అవుతుంది. దీనిని నిర్దారిస్తున్నట్లు వైకాపా తమ పార్టీ ఈ సమావేశంలో పాల్గొనబోదని తెలియజేసింది.   మిగిలిన అన్ని పార్టీల సంగతీ ఎలా ఉన్నపటికీ, సమైక్యాంధ్ర కోసం పోరాడుతూ, అందరినీ (ముఖ్యంగా తెదేపాను) తమతో కలిసి రమ్మనమని కోరిన వైకాపా, ఇప్పుడు అదే తెదేపా కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నకారణంగా తాము ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇష్టపడటం లేదని కుంటి సాకు చెప్పి మొహం చాటేయడంతో వైకాపా నిజంగా సమైక్యాంధ్ర కోసమే పోరాడుతోందా? లేక ఆ సెంటిమెంటును వాడుకొని రాజకీయ లబ్ది పొందాలని పోరాడుతోందా?అనే అనుమానం కలగడం సహజం.   అన్ని పార్టీలను దూరం పెట్టిన ఏపీఎన్జీవోలు, జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలకాగానే ఆయనను మాత్రమే కలిసి తమ ఉద్యమానికి మద్దతు కోరారు. వారి ఉద్యమానికి మద్దతు ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి చిన్న మెలిక పెట్టారు. వారు ఒక సమైక్య తీర్మానం చేసి తీసుకు వస్తే దానిపై మొదటి సంతకము తానే చేస్తానని. అలాగే అన్నిపార్టీలను కూడా అందుకు వారు ఒప్పించాలని షరతు పెట్టారు. ఆవిధంగా తన రాజకీయ ప్రత్యర్ధి అయిన తెదేపాను ఇరికించవచ్చని జగన్ భావించారు. అయితే అది గ్రహించిన ఏపీఎన్జీవోలు ఆయన పధకంలో పావులుగా మారేందుకు ఇష్టపడలేదు. తనమాట వినకపోతే ఎంతటి ఆత్మీయులనయినా వదులుకొనే గుణం ఉన్న జగన్, ఏపీఎన్జీవోలను వదులుకోవడం పెద్ద విచిత్రం కాదు.   ఏపీఎన్జీవోలు ఆయన ప్రతిపాదనకు ఒప్పుకోకపోయినప్పటికీ, వారందరూ ముక్తకంఠంతో తనకు, తన పార్టీకి బేషరతుగా మద్దతు పలికి ఉండి ఉంటే, బహుశః జగన్మోహన్ రెడ్డి వారిని క్షమించి ఉండేవారేమో! కానీ, ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు తనను కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తనకు సమాంతరంగా ఉద్యమం నడుపుతుండటం జగన్ కు ఆగ్రహం కలిగించింది. ఒకవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మరోవైపు అశోక్ బాబు ఇద్దరూ కూడా రంగంలో ఉండటంతో, వైకాపా చేస్తున్నసమైక్యాంధ్ర ఉద్యమాల వలన సీమాంధ్రలో తనకు, తన పార్టీకి కూడా ఆశించినంతగా మైలేజీ రాకపోవడంతో జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి కారణమయ్యి ఉండవచ్చును. అయితే జగన్మోహన్ రెడ్డి అదృష్టం కొద్దీ తెదేపా కూడా సమైక్యాంధ్ర రాగం అందుకోలేదు. అందుకొని ఉంటే అప్పుడు తెదేపాతో కూడా పోరాడవలసి ఉండేది.   ఓడిపోవడం తనకు ఇష్టం లేదని మీడియా ముందే కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి, అధిష్టానాన్ని ధిక్కరిస్తూ గట్టిగా సమైక్యవాదం చేస్తున్నకిరణ్ కుమార్ రెడ్డితో సమైక్యాంధ్ర ఛాంపియన్ షిప్ కోసం పోటీపడవలసి వస్తోంది. అటువంటప్పుడు ఇప్పుడు అశోక్ బాబుకి కూడా ప్రాధాన్యత ఇస్తే ఆయన కూడా తనకు పోటీ అవుతారనే ఆలోచనతోనే ఈ సమావేశానికి హాజరయ్యేందుకు విముఖత చూపి ఉండవచ్చును. ఈరోజు ఏపీఎన్జీవోలు నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశం విజయవంతమయితే, రాష్ట్ర విభజనకి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. ఆసంగతి ఎలా ఉన్నపటికీ, అన్ని పార్టీలు కలిసిపనిచేసేందుకు అశోక్ బాబు ఒప్పించగాలిగితే మళ్ళీ ఆయన కూడా బలం పుంజుకొనే అవకాశం ఉంటుంది.   జగన్మోహన్ రెడ్డి తెలంగాణాలో తన పార్టీని పణంగా పెట్టి మరీ చేస్తున్నసమైక్యాంధ్ర ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం వచ్చేఎన్నికలలో సీమాంధ్రలో విజయం సాధించడమే. అటువంటప్పుడు, రాజకీయాలలోకి రావాలనే ఉద్దేశ్యం ఉందని ప్రకటించిన అశోక్ బాబుకి ఆయన సహకరిస్తారని ఊహించలేము.

ప్రజల చేతికే 'చీపురు'

      ఢిల్లీ గద్దెపై చీపురు ఎక్కుతుందో లేదో అనేది ఇప్పుడు ప్రజల చేతిలోకి వెళ్ళింది. తాము ఢిల్లీ లో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో ప్రజలను అడిగి నిర్ణయిస్తామంటూ మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఆమ్ఆద్మీ పార్టీ ఆ పనిలో బిజీబిజీగా ఉంది. ఇప్పటికే ఆ పార్టీ శాసన సభ్యుల,కార్యకర్తలు వార్డులు వారీగా ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 5.50లక్షల మంది అభిప్రాయాలు సేకరించమని, మరో రెండురోజుల్లో ఈ తతంగాన్ని పూర్తి చేసి సోమవారం నాటికల్లా ప్రజాభిప్రాయం ప్రపంచానికి వెల్లడిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. సో...సోమవారం దాకా వేచి చూద్దాం.