కిరణ్ కొత్త పార్టీ పెడతారా?

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇదివరకులాగా అధిష్టానం మీద రంకెలు వేయడం లేదు. అదేవిధంగా ఇదివరకులా సమైక్యమని గొంతుచించుకోవడం లేదు. ఆవిషయం శాసనమండలిలో చేసిన ప్రసంగంతో తేటతెల్లమయింది. అయితే ఇంకా ఆఖరు బంతికి చాలా సమయం ఉందని, నేటికీ తను సమైక్యవాదినేనని చెప్పుకోవడం విచిత్రం. ఏమయినప్పటికీ ఆయన ఈ నాలుగయిదు నెలలలో పెంచుకొన్న తన రేటింగ్ మళ్ళీ క్రమంగా పడిపోవడం మొదలయింది. అందువల్ల ఇప్పుడు ఆయన స్వంత కుంపటి పెట్టుకొన్నా దానికి ఇదివరకంతటి ప్రజాదారణ ఉంటుందానేది అనుమానమే.   అయితే కిరణ్ కుమార్ రెడ్డి, ఉండవల్లి, లగడపాటి, హర్ష కుమార్, సబ్బం హరి వంటి వారు నిజంగా కాంగ్రెస్ అధిష్టానంతో విభేదిస్తున్నా లేక ఆవిధంగా నటిస్తున్నా వారు ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే వారి పైన, పార్టీపైనా ప్రజలలో ఇంకా అనుమానాలు పెరిగే అవకాశం ఉంది గనుక  కొత్త పార్టీ ఆవిర్భావం తప్పని సరి కావచ్చును. ఈసారి సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఎలాగు గెలిచే అవకాశాలు లేవు గనుక, మునిగిపోయే ఆ నావలో పయనించడం కంటే కొత్త నావ ఏర్పాటు చేసుకొని పయనించడమే ఎంతో కొంత మేలు. తద్వారా ఎన్నికలలో గెలిచే అవకాశాలు కొంతయినా మెరుగుపడటమే కాకుండా, ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం వారిచేత ఆడిస్తున్ననాటకంలోనే ఇది కూడా ఒక భాగమయి ఉంటే వచ్చేఎన్నికలలో ఓట్లు చీల్చి సీమాంధ్రలో తెదేపాను అధికారంలోకి రాకుండా అడ్డుకొనే అవకాశం కూడా ఉంటుంది. ఎన్నికల తరువాత అప్పటి పరిస్థితులను బట్టి తగు నిర్ణయాలు తీసుకొనే వీలుంటుంది.

కిరణ్ కు 'ఉత్తమ' ఉపశమనం

      మొత్తానికి ఇండియాటుడే పుణ్యమాని ఆంధ్రప్రదేశ్ సీఎంకి ఉపశమనం లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పీఠమెక్కాక...ఆయనకు ఎదురైనవన్నీ తలనొప్పులే. ఓరకంగా చెప్పాలంటే ఇన్ని రకాల ఒత్తిళ్లు మారే ముఖ్యమంత్రికి ఎదుర్కొలేదనడం కూడా అతిశయోక్తి కాదు. డ్రామాలాడుతున్నావంటూ సీమాంధ్ర నేతలు, తెలంగాణ ద్రోహి అంటూ టి.నేతలు తిట్టిపోస్తుంటే, పాలన అటకెక్కి౦దంటూ పలు సంఘాలు ఆందోళన చేస్తూంటే..దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు ఆధారంగా ఇండియాటుడే పత్రిక ఇచ్చే ర్యా౦కుల్లో కిరణ్ పాలనకు 'ఉత్తమ' స్థానం దక్కడం విశేషం. శుక్రవారం ఢిల్లీ లో ఈ అవార్డ్ ను అందుకుంటున్న కిరణ్...దీనితోనైనా రీచార్జ్ అవుతారేమో...చూద్దా౦.

కుర్షీద్ చెప్పిన ‘అమెరికా క్షమాపణలు’ ఒట్టి కధే

  భారత దౌత్యవేత్త దేవయాని కొబ్రగాడే పట్ల అమెరికా అనుచిత వైఖరిని భారత్ తీవ్ర నిరసన తెలియజేసింది. ఆమెపై మోపిన కేసులను వెంటనే ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని భారత్ కోరుతోంది. భారత విదేశాంగ శాఖా మంత్రి సల్మాన్ కుర్షీద్ నిన్న డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “స్టేట్ సెక్రెటరీ ఆఫ్ అమెరికా జాన్ కెర్రీ నాతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ఆ సమయంలో నేను అందుబాటులో లేకోపోవడంతో జాతీయ భద్రతా సలహాదారు శివశంకర మీనన్ తో మాట్లాడిన ఆయన, మీనన్ కు అమెరికా ప్రభుత్వం తరపున క్షమాపణలు చెప్పారు. ఈరోజు జాన్ కేర్రీ నాతో మాట్లాడేందుకు సమయం నిర్దారించబడింది,” అని తెలిపారు."   కానీ, న్యూయార్క్ రాష్ట్ర అధికార ప్రతినిధి మేరీ హర్ఫ్ మీడియాతో మాట్లాడుతూ “మేము ఎటువంటి తప్పు చేయలేదు. మా చట్టాలకు లోబడే వ్యవహరించాము. అందువలన మేమెవరికీ క్షమాపణలు చెప్పనవసరం లేదు. అదే విదంగా దేవయానిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకొనే ప్రసక్తి లేదు. కోర్టు పరిధిలో ఉన్నఈ వ్యవహారంపై ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. నాకు తెలిసినంతవరకు జాన్ కెర్రీ భారత్ అధికారులతో లేదా మంత్రులతో మాట్లాడేందుకు ఎటువంటి అపాయింటుమెంటు ఇవ్వలేదు,” అని కుండ బద్దలుకొట్టారు.   మేరీ హర్ఫ్ అమెరిక అగ్ర రాజ్యాహంకారానికి అద్దం పడుతుంటే, సల్మాన్ కుర్షీద్ చేసిన ప్రకటన భారత ప్రజలను మోసపుచ్చేదిగా ఉంది. ఈ వ్యవహారం మరికొంత కాలం సాగిన తరువాత, అకస్మాత్తుగా ‘ఇటలీ నావికుల’ వ్యవహారంలాగే ఇదీ చల్లబడిపోయి, ఆ తరువాత వార్తలలోంచి కూడా మాయమయిపోతుంది. కానీ, ఒక భారతీయ మహిళ పట్ల అమెరికా అధికారులు అసభ్యంగా ప్రవర్తించిన తీరు ఆదేశానికి మాయని మచ్చగా మిగిలిపోవడంఖాయం. అయితే అమెరికా మొహం మీద ఇంతకంటే చాలా పెద్ద పెద్ద మచ్చలే ఉన్నందున వాటి మధ్య ఈ మచ్చకూడ కనబడకుండా పోతుంది.

రామోజీరావుకి హైకోర్టు జలక్

  ప్రముఖ దినపత్రిక ఈనాడు యజమాని రామోజీరావు విశాఖలో ఈనాడు కార్యాలయం స్థాపించేందుకు మంతెన ఆదిత్య కుమారవర్మఅనే వ్యక్తి నుండి 1973లో 2.78 ఎకరాల స్థలం మరియు 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనాలను 33 సంవత్సరాల కాలపరిమితికి అద్దెకు తీసుకున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ఆ స్థలానికి అప్పట్లో నెలకు కేవలం మూడు వేల రూపాయలు అద్దె చెల్లించడానికి రామోజీరావు అంగీకరించారు. ఆ తరువాత కొంత కాలానికి స్థల యజమానికి తెలియకుండా ఆ స్థలంలో కొంత భాగం రోడ్లు విస్తరణ కోసం విశాఖ నగరాభివృద్ధి సంస్థకు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ఆయన దారాదత్తం చేయడమే కాకుండా అందుకు ప్రతిగా వేరేచోట ఆయన తనపేరిట స్థలం కూడా తీసుకొన్నారు. ఇదొక నేరమయితే, లీజు కాలం ముగిసిన తరువాత కూడా ఖాళీ చేయడానికి నిరాకరిస్తూ స్థల యజమానిని ముప్పతిప్పలు పెడుతూ జిల్లా కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు పరుగులు పెట్టిస్తున్నారు.ఈ క్రమంలో ప్రతీ కోర్టు ఆయనకు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినప్పటికీ, నేటికీ ఆ స్థలాన్ని సదరు యజమాని స్వాదీనం చేయకుండా కోర్టుల చుట్టూ తిప్పిస్తూ నెలలు సంవత్సరాలు గడిపేస్తున్నారు. ఇటీవల రామోజీ భాదితుడు మంతెన ఆదిత్య కుమారవర్మ మళ్ళీ హైకోర్టు తలుపు తట్టడంతో, కేసు విచారణ పూర్తయ్యేవరకు ఈనాడు కార్యాలయం అదే స్థలంలో కొనసాగాలని రామోజీరావు కోరుకొంటున్నట్లయితే, ప్రస్తుత ప్రభుత్వ విలువ ప్రకారం నెలకు రూ 17 లక్షలు చొప్పున స్థల యజమానికి అద్దె చెల్లించాలని, అంతే గాక పాత బకాయిల క్రింద రూ 2.06 కోట్లను వచ్చేనెల 10వ తేదీలోగా చెల్లించాలని హైకోర్టు రామోజీరావుని ఆదేశించింది.

బ్రజేష్ ట్రిబ్యునల్ కోసం మరో చిట్కా

  యుద్దరంగంలో దూకవలసిన సమయంలో ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతూ కాలక్షేపం చేయడం, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం మనకేమి కొత్త కాదని ఆల్మెట్టి, బాబ్లీ డ్యాం, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తదితర వ్యవహారాలలో మన రాష్ట్ర ప్రభుత్వం నిరూపించింది. ఇప్పుడు ప్రజాగ్రహానికి, ప్రతిపక్షాల విమర్శలకు జడిసి అఖిలపక్ష సభ్యులను వెంటేసుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ని కలిసి, కృష్ణా జలాలపై బ్రిజేష్‌ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు చాలా అన్యాయమని మొరపెట్టుకోనున్నారు. అయితే వివిధ అంశాలను, సమస్యలను పరిష్కరించిమని కోరుతూ ఇంతవరకు మన రాష్ట్రం నుండి చాలా మందే ఆయనను కలిసారు. కానీ ఆయన దేనిపై స్పందించిన దాఖలాలు లేవు. ఆయనొక నిమిత్తమాత్రుడని తెలిసి కూడా ఆయనకు మొరపెట్టుకోవాలనుకోవడం గమనిస్తే, ఈ సమస్య పరిష్కారం పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో మరోసారి తేటతెల్లమవుతుంది. కనీసం చేతులు కాలకయినా సరయిన ఆకులు పట్టుకోవాలనే జ్ఞానం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మన ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలను పరిష్కరించలేకపోయినప్పటికీ, తమకు ఎదురయ్యే ఎటువంటి సమస్యనుండయినా అవలీలగా బయటపడేందుకు ఇటువంటి చిట్కాలు ప్రయోగించడంలో ఆరితేరిపోయాయి.

నెపం నెట్టాలనా.. విభజన ఆపాలనా?

  లెటర్‌ ఇచ్చిన చంద్రబాబు విబజనకు సహకరిస్తున్నాడు, కిరణ్‌ డ్రామాలాడుతున్నాడు అంటూ వైసిపీ విమర్శిస్తుంది. సమైక్యం ముసుగులో జగన్‌ విభజన కోరుకుంటున్నాడు. సోనియాతో కుమ్మక్కయి బెయిలు తెచ్చుకుని బయటకొచ్చి సినిమా రక్తికట్టిస్తున్నాడు అంటూ తెలుగుదేశం వాళ్లు మేం చిత్తశుద్దితొ పోరాడుతున్నాం. లెటర్‌ ఇచ్చిన చంద్రబాబు, ఆర్టికల్‌ 3 ప్రకారం విభజించుకోమన్న జగన్‌లే సమైక్యద్రోహులు అంటూ కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు.. ఇలా ఎవరికి వారు ఒకరి మీద ఒకరు విభజన పాపాన్ని నెట్టాలని చూస్తున్నారు. అందుకు తగ్గట్టే ఎవరి పత్రిక వారికి, ఎవరి చానల్‌ వారికి ఉండటంతో ఏ పార్టీకా మీడియా గొడుగు పడుతూ ఉంది. ఈ గోలలో విభజన ఆపాలనే ఆరాటం కన్నా.. విడిపోయాక చోటు చేసుకునే రాజకీయ పరిస్థితుల నుంచి లబ్ధి పొందాలనే యావే ఎక్కువ కనిపిస్తుండడంతో రాష్ట్రప్రజలు తాము దిక్కులేని వారిమయ్యామని అనుకుంటున్నారంటే .. అది నిజంగా మన రాజకీయనేతల పుణ్యమే..

ఇది విద్రోహనామ సంవత్సరం ; విహెచ్‌

  హనుమంతన్న నామకరణమిది. ఈ 2013 సంవత్సరానికి విహెచ్‌ పెట్టిన పేరు ` విద్రోహనామ సంవవత్సరం`. ఇంతకీ మన కరుడుగట్టిన కాంగ్రెస్‌ కమ్‌ తెలంగాణ వాదికి ఈ సంవత్సరాన్ని ఇలా ఎలా అనాలనిపించింది?     మనకు ముగ్గుకు విద్రోహులున్రు. ఇందులో మొదటి ప్లేస్‌ చంద్రబాబుది. అందుకే చంద్రబాబు విద్రోహి నెంబర్‌ 1, రెండో ప్లేసు మన జగన్‌బాబుది, మూడో ప్లేస్‌ ఎవరిదంటున్నవ.. ఇంగెవరికిస్తామయ్యా.. నయా ద్రోహి, ముఖ్యమంత్రి కిరణ్‌కే నంటూ హనుమంతన్న తిట్టిపోసిండు. ఇక సరేలే నీకు పొద్దుగాల నుండి ఆళ్లని తిట్టుడే పనిగద అనుకుంటూ పొబోయిన ప్రెస్సోళ్లని ఆపి గట్ట ఉరుకుతరేందయ్యా గాసేపు ఆగండి. ఓ ముచ్చట మరిచినా అంటూ ఈ ముగ్గరే కాదు, సీమాంద్ర ఎమ్మెల్యేలంతా ద్రోహులే, తల్లి పాలు దాగి రొమ్ముగుద్దే ద్రోహులు అంటూ టోకున జెప్పిండు. విహెచ్‌ గంత పెద్ద మడిసి చెబితే ఒప్పుకోకతప్పదనుకోండి.. కానీ గాళ్లెవరో ద్రోహం గిట్ట జేస్తే తనననుండేంది? నడిమిట్ట తానేం తప్ప జేపినానంటూ 2013 సంవత్సరం ఏడ్చిపొదా.. పాపం..

తెదేపా, తెలంగాణా భాజాపాలో విభజన

  నరేంద్రమోడీకి నీరాజనాలు, ఇటీవల ఎన్నికల ఫలితాలు.. వీటి పుణ్యమాని దేశవ్యాప్తంగా భాజాపా శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబుకుతుంటే రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ గందరగోళంలో మునిగిపోయింది. హైదరాబాద్‌లో నరేంద్రమోడి నిర్వహించిన బహిరంగ సభలో తొలిసారి పొత్తు పొడిచింది. అక్కడ నుంచి ఇరు పక్షాలూ దశల వారిగా సన్నిహితమైనట్టు కనిపిస్తుంది. భాజాపా అగ్రనేతలు చంద్రబాబుతో రాసుకు పూసుకు తిరుగుతున్నారు. తెలుగుదేశంతో పొత్తు దాదాపు ఖరారైనట్టే కనిపిస్తుంది. ఈ విషయంలో రాష్ట్ర శాఖ అభిప్రాయాలను అగ్రనాయకత్వం పట్టించుకోవటం లేదు. దీంతో ఇప్పటి దాకా భాజాపా రాష్ట్రస్థాయి నేతలుగా ఉన్నవారు తమ ప్రాధాన్యం తగ్గిపోతుందేమోననే భయంతో కారాలు మిరియాలు నూరుతున్నారు. అయితే రాష్ట్రనాయకుల్లో కొందరు తెదేపాతో పొత్తును పూర్తి స్థాయిలో ఆహ్వానింస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఇది పార్టీకి మంచి ఊపునిస్తుందని అంటున్నారు. ఈ విషయంలో చీలికలు వచ్చే ప్రమాదం కనిపిస్తుంటే.. మరో వైపు పులి మీద పుట్రలా సీమాంద్ర భాజాపా.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా సమైక్యగళమెత్తింది.  సీమాంద్రకు నష్టం కలిగేలా విభజన నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తూ త్వరలో సీమాంద్ర భాజాపా నేతలు తమ జాతీయనాయకుల్ని కలిసి చర్చించనున్నారు. ఏదేమైనా ఢిల్లీ  కోట మీద పాగా వేసే దిశగా దూసుకుపోతున్నపరిస్థితుల్లో ఆంద్రప్రదేశ్‌లో ఆ పార్టీకి ఇలాంటి ఇబ్బందులు ఎదురవడం చింతించదగినదే.

కన్ను లొట్టపోయిందిట..

  ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీకి ఓ కన్ను లొట్టపోయిందని ఆ పార్టీ ఎమ్మెల్యే జెసి దివాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. విభజన నిర్ణయం కారణంగా దాపురించిన పరిస్థితుల్ని అభివర్ణిస్తూ ఆయన గురువారం ఈ కామెంట్‌ చేశారు. ఈ కాంమెట్‌ చేస్తున్నప్పుడు ఆయన తన ఎడమ కన్నును ఒకటికి రెండు సార్లు మూసి తెరిచి, దానిని చూపిస్తూ ఏకపాత్రాభినం కూడా చేసేశారు. మరి ఆయన దృష్టిలో పార్టీ పరిస్థితి బాగున్న కన్ను ఏప్రాంతామో.. ఆయనే చెప్పాలి. అంతా బాగానే ఉంది కానీ.. ఈ సందర్భంగా ఆయన ఇంకో విచిత్రమైన విషయం కూడా చెప్పారు అదేమిటంటే.. రాష్ట్రం విడిపోతే కిరణ్‌ పార్లీ పెట్టరట. సమైక్యంగా ఉంటేనే పెడతారట. పనిలో పనిగా జగన్‌ పార్టీ సమైక్యం కోసం బాగా ప్రత్నిస్తున్నారని అభినందనలు కూడా అందించేశారు. ఏమిటి జెసి గారూ. ఒకే రోజు మీరిన్ని నిజాలు చెబితే జనం జీర్ణించుకోవద్దూ..

`లాస్ట్‌ బాల్‌` టైముందోచ్‌..

    రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్‌ మహాక్రీడా ప్రియుడని మరోసారి నిరూపించుకున్నారు. సమైక్యం కోసం వీలున్నప్పుడల్లా డైలాగుల బౌండరీలు, స్పీచ్‌ల సిక్సర్లు కొడుతున్నకిరణ్‌గారు.. ఇటీవల కొంత సైలెంట్‌గా ఉన్న విషయం విదితమే. ఫుడ్‌పాయిజన్‌ అంటూ అసెంబ్లీకి డుమ్మా కొట్టేసిన ఆయన విపక్షాల విమర్శల్ని తిప్పి కొట్టేందుకు తీరుబాటుగా అసెంబ్లీ వాయిదా వేసి మరీ సిద్దమయ్యారు. అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ఇంకా ప్రవేశ పెట్టలేదని తేల్చి చెప్పారు. అయితే విభజన అంశంపై శాసనసభ అభిప్రాయం చెప్పాల్సిందేనన్నారు. బిల్లుపై చర్చ జరిగితే తమ ఎమ్మెల్యేల వైఖరులేంటో ప్రజలే తెలుసుకుంటారన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల విభజన జరిగిన తీరు తెన్నులను తాను అధ్యయనం చేశానని ఆ అధ్యయన ఫలితాలు అసెంబ్లీ స్పీకర్‌, శాసన మండలి చైర్మన్‌లకు అందించానన్నారు. తొలుత బీహార్‌, యుపి అసెంబ్లీలు విభజన తీర్మానాన్ని తిరస్కరించాయని, రెండేళ్ల తరువాత మాత్రమే అంగీకారం తెలిపాయని ఆయన వెల్లడించారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, సీమాంద్రకు అనుకూలం కాదని అయతే ప్రజా ప్రయోజనాలకే మాట్లాడుతున్నానని ఆయన వివరించారు. తాను వాస్తవాలు మాట్లాడుతుంటే విపక్షనేతలు రాజకీయాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తన నిజాయితీరి ఎవరి సర్ఠిఫికేట్‌ అవసరం లేదన్నారు. తానేమీ పోరాటం విరమించలేదని, లాస్ట్‌ బాల్‌కి ఇంకా టైముందని అంటూ.. తానేంటో నిరూపిస్తానని కూడా అన్నారు సో.. చివరి బంతి ఎప్పుడు పడుతుందో, దాన్ని కిరణ్‌ గారు బౌండరీ దాటిస్తారో తనతో పాటు అందర్నీ క్లీన్‌బౌల్డ్‌ చేస్తారో.. వెయిట్‌ అండ్‌ సీ.

మనీ మేటర్‌ తేల్చండి.

  సీమాంద్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకి విభజన తర్వాత బ్యాలెన్స్‌ షీట్‌ ఏమిటనే డౌటొచ్చింది. అందుకే వీరంతా కలిసి అధిష్టానానికి లేఖ రాయలని నిర్ణయించుకున్నారు. ఇందులో తెలంగాణ ముసాయిదా బిల్లు విధివిధానాలపై మరింత స్పష్టత కావాలని కోరనున్నారు. అంతేకాకుండా ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక వివరాలను కూడా వెల్లడించాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఇ:తకీ ఈ లేఖకు అర్ధమేమిటి? విభజనను ఆపలేమని, కనీసం అస్థుల అప్పుల సంగతైనా తేల్చుకుందామని వీరు భావిస్తున్నారా? లేక వీలున్నంత కాలం ఈ గందరగోళాన్ని సాగదీయాలనుకుంటున్నారా..? ఈ ప్రశ్నలు ఇప్పుడు రాజకీమవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

తప్పున్నా...తప్పుకోమనకూడదు..

      ఇలాంటి విచిత్రమైన స్టేట్ మెంట్లు ఇవ్వగలిగిన నాయకులు మన రాష్ట్రంలో కొంతమందే ఉన్నారు. చాలా కాలం తర్వాత గురువారం నోరువిప్పిన మాజీమంత్రి డీ.ఎల్ రవీంద్ర రెడ్డి కూడా ఇప్పుడు ఆ జాబితాలో చేరిపోయారు. పార్టీ పగ్గాలు ఎవరికైనా అప్పజెప్పాలంటూ సోనియా గాంధీ పై జె.సి. దివాకర్ రెడ్డి చేసిన కామెంట్ పై ఆయన లేట్ గా అయినా వెరైటీగా స్పందించారు. ''రాష్ట్రంలో కాంగ్రెస్ పతనానికి అధిష్టానమే కారణం. అయితే సోనియా గాంధీ తప్పు చేసి ఉండవచ్చు. కానీ ఒక్క తప్పుకే అలా తప్పుకోమనకూడదు''అంటూ ఆయన విచిత్రంగా వ్యాఖ్యానించారు.   ఒకవైపు అధినేత తప్పు చేశారంటూనే మరోవైపు తప్పుకోకూడదంటూ విమర్శనూ, మద్దతునూ కలగలిపి డీఎల్ ఇచ్చిన స్టేట్ మెంట్ లోతులు వెతికే పనిలో పడ్డారు విశ్లేషకులు. పనిలో పనిగా ముఖ్యమంత్రి కిరణ్ పార్టీ పెడతారని తాను అనుకోవడం లేదన్న డీఎల్....జె.సి, గాదె వె౦కట రెడ్డి లాంటి నేతలు మాత్రం కిరణ్ పార్టీ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. మిగిలినవారు ఎటు ఎటు దూకుతారో అని బాగానే గమనిస్తున్న డీ.ఎల్ ఇంతకీ తానే పార్టీలోకి జంప్ జిలానీ అవుదామనుకుంటున్నారో చెప్పాలని కొందరు గుసగుసలాడుతున్నారు.  

సమైక్య'అత్త'కు..విభజన 'అల్లుడు'..

      గురువారం అసెంబ్లీ ఆవరణలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. సమైక్యం కోసం గట్టిగా మాట్లాడే టిడిపి నేత నన్నపనేని రాజకుమారిని తెరాస నేత కెటిఆర్ పరామర్శించారు. ''అత్తమ్మా పడిపోయావ్ గా ఎలా ఉన్నావ్'' అంటూ ఆరాతీశారు. శాసనమండలిలో జరిగిన తోపులాటలో నన్నపనేనిని తెరాస ఎమ్మెల్సీ స్వామిగౌడ్ తోసేసిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ...స్వామిగౌడ్ కావాలని ఆమెని పడేయలేదంటూ వివరణ ఇచ్చారు. టీవిల్లో నన్నపనేని పడిపోయిన వైనం చూసిన నాన్న కెసిఆర్ చాలా బాధపడ్డారని కూడా ఆయన చెప్పారు. ఈ సంధర్బంగా నన్నపనేని కూడా కెటిఆర్ తో ముచ్చటించారు. మొత్తం మీద ఆంధ్రా అత్తకు తెలంగాణ అల్లుడుకు మధ్య చోటుచేసుకున్న ఈ కుశల ప్రశ్నల పర్వం..ప్రాంతాలకతీతంగా అందరినీ ఆకట్టుకుంది.

జనవరి 3 నుంచి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు

      అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఒకసారి వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. తెలంగాణ, సమైక్య నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. జనవరి 3 నుంచి అసెంబ్లీ రెండో విడత సమావేశాలు ప్రారంభంకానున్నాయి.   జనవరి 3 నుంచి 10 వరకు రెండో విడత సమావేశాలు, జనవరి 11 నుంచి 15 వరకు సంక్రాతి సెలవులు, జనవరి 16 నుంచి 23 వరకు మూడో విడత సమావేశాలు జరుగనున్నాయి. అయితే అసెంబ్లీ నిరసవధిక వాయిదాపై టీఆర్ఎస్, బీజేపీ, టీటీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీని ఏకపక్షంగా వాయిదా వేశారని టీఆర్ఎస్, బీజేపీ సభ్యులు సభలోనే ఉండి నిరసన వ్యక్తం చేయగా, తెలంగాణ టీడీపీ నేతలు పోడియం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు.

సీమాంధ్ర ప్రజలకు సీయం హ్యాండ్

  “ప్రజాభిప్రాయాన్ని గౌరవించని ప్రభుత్వాలకు ప్రజలే శలవులు ప్రకటిస్తారు. ఆఖరు బంతి వరకు ఆట సాగుతుంది. దిగ్విజయ్ సింగ్ చెప్పిన మాటలు ఆయన వ్యక్తిగతమయినవి. నేను నేటికీ సమైఖ్యవాదానికే కట్టుబడి ఉన్నాను. నా అభిప్రాయంలో, ఆలోచనలలో వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. ఎప్పటికీ సమైక్యవాదానికే కట్టుబడి ఉంటాను. నేను పైలిన్ తుఫానును ఆపలేకపోవచ్చునేమో కానీ, తప్పకుండా రాష్ట్ర విభజన ఆపగలను. నాచేతులతో పులిచింతల ప్రాజెక్టు ప్రారంభిచే అదృష్టం దక్కినందుకు గర్వ పడుతున్నాను. కానీ, నా హయాంలోనే రాష్ట్ర విభజన జరగడం నా దురదృష్టంగా భావిస్తున్నాను. ఇన్ని కోట్ల మంది ప్రజలు ఇన్ని నెలలుగా రోడ్లమీధకు వచ్చి నిరసనలు ఆందోళనలు చేస్తుంటే ప్రపంచమంతా గమనించింది. కానీ ఇది గమనించడానికి కేంద్రానికి కళ్ళు చెవులూ లేవా? ఇటువంటి పదునయిన మాటలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంతకాలంగా అధిష్టానాన్ని గట్టిగా ఎదిరిస్తూ, సమైక్య చాంపియన్ గా మంచి పేరు సంపాదించుకొన్నారు. అయితే ఇప్పుడు అదంతా కంటశోషగా మిగిలిపోయినట్లు కనబడుతోంది.   టీ-బిల్లు శాసనసభకు రాగానే రాష్ట్రంలో ప్రళయం వచ్చేస్తుందనే అంతగా ఆయన అనుచరులు అందరూ కూడా చల్లబడిపోయారు. చివరికి ముఖ్యమంత్రి కనుసైగతో రంగంలో దూకేసే ఏపీఎన్జీవోల నాయకుడు అశోక్ బాబు మెరుపు సమ్మె చేయాడానికి సరయిన ముహూర్తం దొరక్కపోవడంతో మీనమేషాలు లెక్కబెడుతూ కూర్చోవలసి వచ్చింది పాపం.   ఇక, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభలో తెలంగాణా బిల్లుపై వీర ప్రసంగం చేసేసిన తరువాత ఆయన అయన సహచరులు వీరతిలకం, వీర గంధం ఒళ్లంతా పూసేసుకొని రాజీనామాలు చేసేసి వీధుల్లోకి వచ్చేసి ఆందోళనలు చేసేస్తారని ప్రజలెవరూ కూడా ఇక ఆందోళన చెందనవసరం లేదు.   అయితే ఆరు నెలలుగా గారడి సాము చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కనీసం శాసనసభలో విభజనకు వ్యతిరేఖంగా నాలుగు మంచి మాటలయినా చెపితే విని పులకించిపోదామని టీవీలకు చెవులు కళ్ళు అప్పగించి కూర్చొన్న ప్రజల ఆశలను అడియాస చేస్తూ, ఈ రోజు ఆయన శాసనమండలిలో మొక్కుబడిగా మూడే మూడు నిమిషాలాలో ఆ తంతు కూడా ముగించేసారు.   బీహార్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు అక్కడి శాసనసభ అనుసరించిన పద్దతులని తాను అధ్యయనం చేసానని, అందువల్ల సభలో సభ్యులందరూ కూడా అధ్యయనం చేస్తే మేలని ఒక ఉచిత సలహా ఇచ్చారు. సభ ముందుకు వచ్చిన సమస్య చాలా సున్నితమయినది కనుక, సభ్యులందరూ సంయమనం పాటించాలని కోరారు. చర్చల ద్వారా ఎటువంటి సమస్యనయినా పరిష్కరించు కోవచ్చు గనుక దీనిపై సభలో సభ్యులందరూ హుందాగా చర్చలో పాల్గొని పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. అందుకోసం స్పీకర్ , చైర్మన్ ఇరువురూ సభకు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. అవసరమయితే మరోసారి బీఏసీ సమావేశం ఏర్పాటు చేసుకొనైనా ఉభయ సభలు సజావుగా సాగేలా చేయడం మన అందరి భాద్యత అని ఆయన హితబోధ చేసారు. ఆ తరువాత సభలో సమైక్యాంధ్ర నినాదాలు మొదలవడంతో సభ వాయిదా పడింది.   ఇక శాసనసభ సజావుగా జరిగే అవకాశం లేకపోవడంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను నిరవదికంగా వాయిదా వేసారు. అందువల్ల ఇక సీమాంధ్ర ప్రజలు ఉభయ సభల నుండి ఏమీ ఆశించడం అత్యాస, అడియాసే అవుతుందనే సత్యం ఎంత త్వరగా గ్రహిస్తే అంతే మన శాంతి దక్కుతుంది.

కెసిఆర్ కు మోత్కుపల్లి సలహా

      తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావుకు తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యేలు ఒక సలహా ఇస్తున్నారు. టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తే దేనితోనూ సంబంధం లేకుండా తెలంగాణ వచ్చేస్తుందని తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే మోత్కుపల్లి అంటున్నారు. టీఆర్ఎస్ విలీనం విషయంలో కేసీఆర్ వెంటనే ఓ నిర్ణయం తీసుకోవాలని, సోనియాగాంధీతో కేసీఆర్ కు మంచి సంబంధాలే ఉన్నాఎందుకో ఆలస్యం జరుగుతుందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ వెంటనే వచ్చేందుకు కేసీఆర్ విలీనానికి సిద్దం కావాలని, అవసరం లేనప్పుడు ఢిల్లీలో ఉండే కేసీఆర్..ఇప్పుడు ఫాం హౌస్ లో ఎందుకున్నాడని ప్రశ్నించారు.

కిరణ్ తీరు మొగుడు కొట్టినట్లు.. పెళ్లాం ఏడ్చినట్లు

      శాసనమండలిలలో తెలంగాణ బిల్లుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి గురువారం ఉదయం ప్రసంగించారు. విభజన అంశం సున్నితమైనదని, ఇలాంటి అంశాలపై జాగ్రత్తగా మాట్లాడితే ఎవరికీ ఇబ్బందులు రావని ఆయన తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా చర్చ జరగాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో విభజన సమయంలో చర్చ ఎలా జరిగిందో అందరూ అధ్యయనం చేయాలన్నారు. అవసరమైతే మరోసారి బీఏసీ సమావేశం పెడదామని సీఎం కిరణ్ తెలిపారు. అయితే సీఎం ప్రసంగంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేయగా అందరికీ అర్థమయ్యేందుకే అన్ని చెబుతున్నామని సీఎం కిరణ్ వివరణ ఇచ్చారు.   మరోవైపు ముఖ్యమంత్రి తీరు మొగుడు కొట్టినట్లు.. పెళ్లాం ఏడ్చినట్లు నటిస్తే అప్పులోడు వెళ్లిపోయినట్లుగా ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి మండలి సభ్యుడు స్వామి గౌడ్ అన్నారు. కిరణ్ చర్చపై మాట్లాడినా సీమాంధ్ర సభ్యులు అడ్డుకుంటున్నారన్నారు. సీమాంధ్ర సమస్యల పరిష్కారం కోసం చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. నొప్పి వస్తే కాళ్లు చేతులు కొట్టుకోకుండా డాక్టర్ వద్దకు వెళ్తేనే తగ్గుతుందని, అలాగే మీ సమస్యలు తీరాలంటే చర్చ జరగాలన్నారు.