హామీలే 'కేజ్రీవాల్' కు సవాళ్ళు..!
posted on Dec 24, 2013 @ 10:12AM
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏఏపీ పలు వాగ్ధానాలు చేసింది. ఇప్పుడు ఆ హామీలే ఆ పార్టీకి పెద్ద సవాల్‌గా మారనున్నాయి. కరెంటు చార్జీలను 50శాతం తగ్గిస్తామని, నగరంలోని ప్రతి ఇంటికి రోజూ 700 లీటర్ల చొప్పున తాగునీటిని ఉచితంగా ఇస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. వీఐపీ సంస్కృతిని తొలగిస్తామని, జనలోక్‌పాల్ చట్టం చేస్తామని కూడా పేర్కొంది. అయితే వీటిని నెరవేర్చాలంటే కత్తి మీద సాము చేయాల్సిందేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ప్రజల భాగస్వామ్యంతో సరికొత్త పాలన అందిస్తామని, ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలకు భిన్నంగా వ్యవహరిస్తామని కేజ్రీవాల్ చెబుతున్నారు. ప్రమాణ స్వీకార తేదీని ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. అయితే ఈ నెల 26న ఈ కార్యక్రమం ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీకి డిసెంబర్ 4న జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 31, ఏఏపీకి 28, కాంగ్రెస్‌కు 8 సీట్లు దక్కాయి.
ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీతో పాటు ఏఏపీ ప్రభుత్వ ఏర్పాటుకు విముఖత వ్యక్తం చేయడంతో రెండు వారాలుగా అనిశ్చితి ఏర్పడింది. షరతుల్లేకుండా మద్దతిస్తామంటూ కాంగ్రెస్ లేఖ ఇవ్వడంతో అధికార పగ్గాలు చేపట్టడానికి ఏఏపీ ముందడుగేసింది.