టికెట్ల కేటాయింపులో లోకేష్ కీలక పాత్ర
posted on Dec 23, 2013 @ 7:07PM
వచ్చేఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధుల పేర్లపై తెదేపా గత ఆరేడు నెలలుగా కసరత్తు చేస్తోంది. అదిప్పుడు మరికొంచెం ఊపందుకొన్నట్లు తెలుస్తోంది. గతంలోలాగే ఈసారి కూడా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ అభ్యర్ధుల ఎంపికలో కీలకపాత్ర పోషిస్తున్నారు. తండ్రీకొడుకులు ఇరువురూ కూడా వేర్వేరుగా సర్వేలు నిర్వహిస్తూ, ఆ ఇద్దరి సర్వేలలో మంచి మార్కులు సంపాదించుకొన్నఅభ్యర్ధులతో మరొక లిస్టు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అభ్యర్ధుల అంగబలం, అర్ధం బలంతో బాటు, ప్రజాధారణ, కార్యకర్తల, స్థానిక నేతల మద్దతు, విశ్వసనీయత, విజయావకాశాలు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్ధులను ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర విభజన ప్రక్రియ, ఎన్నికల పొత్తుల సంగతి తెలనంతవరకు టికెట్స్ వ్యవహారం కూడా తేలడం కష్టమే. బహుశః ఫిబ్రవరి రెండో వారంలోగా తెదేపా అభ్యర్ధుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.