కడప పేరు వింటేనే భయపడేలా చేశారు: చంద్రబాబు

      వైఎస్‌ హయంలో కడప అనే పేరు వింటేనే భయపడేలా చేశారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కబ్జా చేశారన్న కారణంగా జూబ్లీహిల్స్‌లో అధికారులు కూల్చివేసిన ఇంటిని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ విషయంలో కడప మేయర్‌ రవీంద్రనాధ్‌రెడ్డికి ఎదురొడ్డి నిలిచి కడవరకూ పోరాడి, గెలిచిన నీరజారావును ఈ సందర్భంగా ఆయన అభినందించారు. తన హయంలో ఎంతో కష్టపడి, బోర్డులు పెట్టి కాపాడిన భూములన్నీ తర్వాత వచ్చిన ప్రభుత్వం అక్రమార్కుల పాలు చేసిందన్నారు. వైఎస్‌ హయంలో హైదరాబాద్‌లో ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా వేల ఎకరాలు కబ్జా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాఫియాతో పోరాడడం అంటే మామూలు విషయం కాదని, ఈ విషయంలో నీరజారావు ధైర్యం ఎంతైనా ప్రశంసనీయమైనదని అన్నారాయన.

కాంగ్రెస్ పార్టీపై అవినీతి పిడుగు

  కాంగ్రెస్ పార్టీకి అవినీతికి ఉన్నఅవినాభావ సంబంధం గురించి ప్రజలకు కొత్తేమీ కాకపోయినా, ఈ మధ్యకాలంలో యువరాజు రాహుల్ గాంధీ వారికి అవినీతి పూనకం (అంటే అవినీతికి వ్యతిరేఖంగా లెక్చర్లు ఇవ్వడం) రావడంతో, కొంపదీసి ఆయన మాటలకు తలొగ్గి కాంగ్రెస్ నేతలందరూ నిజంగానే అవినీతిని విడిచిపెట్టేయబోతున్నారా? అని ప్రజలు ఒకటే అనుమానంపడిపోసాగారు. కానీ, మీకా భయం అక్కరలేదని కాంగ్రెస్ తరపున బీజేపీ నేతలు లికితపూర్వకంగా హామీ ఇచ్చారు.   హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, ఆయన అర్ధాంగి ప్రతిభా సింగ్ ఇద్దరూ కూడా గతంలో జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించలేక చేతేలేత్తేసిన వెంచర్ ఎనర్జీ కంపెనీ అనే ఒక ప్రైవేట్ విద్యుత్ సంస్థ వద్ద నుండి రూ.1.5కోట్లు, రూ.2.4 కోట్లు (మాత్రమే) ముడుపులు పుచ్చుకొని, దానికి మళ్ళీ పనులు మొదలుపెట్టడానికి అనుమతులు మంజూరు చేసారని, అంతే గాక సదరు కంపెనీకే చెందిన వేరే సంస్థ- తరిణి ఇన్ఫ్రా కంపెనీలో వీరభద్ర సింగ్ భార్య, కుమారుడు విక్రమాదిత్య సింగ్, కుమార్తె అపరాజిత కుమారిలు వాటాదారులుగా ఉన్నారని అన్ని ఆధారాలతో సహా బీజేపీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి పది పేజీల లేఖ వ్రాసిపడేసి, ఈ అవినీతి భాగోతం గురించి గురించి సోనియా, రాహుల్ గాంధీలు ఏమి జవాబు చెప్తారంటూ ప్రశ్నిస్తోంది. ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణంపై దర్యాప్తు చేయాలని కోరిన రాహుల్ గాంధీ మరి వీరభద్ర సింగ్ ముడుపుల వ్యవహారంపై కూడా పెదవి విప్పుతారా లేదా? అని బీజేపీ నిలదీస్తోంది.   అయితే షరా మామూలుగానే కాంగ్రెస్ ముందుగా ఆ ఆరోపణలను గట్టిగా ఖండించేసి పడేసింది. మరీ అంత ముచ్చటాగా ఉంటే ఆ కాయితాలు, సాక్ష్యాలు పట్టుకొని ఏ కోర్టుకో  సీబీఐ దగ్గరకో వెళ్ళండి కానీ మమ్మల్ని మాత్రం విసిగించొద్దని చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చేసింది. అదేవిధంగా వీరభద్ర సింగ్ కూడా నేను, నా పెళ్ళాం పిల్లలు ఏ పాపం ఎరుగమని, కావాలంటే ఏ విచారణకయినా సిద్దం అని ఒక ఖండన ప్రకటన ఒకటి పడేసి చేతులు దులుపుకొన్నారు. ఇక మరో నాలుగు నెలలో దిగిపోయేవాడిని నాకెందుకు ఈ గొడవ? అనుకొంటూ మన్మోహన్ సింగ్ తన మౌనవ్రతంలో మునిగిపోయారు. కానీ, బీజేపీ మాత్రం ఇంతవీజీగా నిన్నొదల బొమ్మాళీ అంటూ కాంగ్రెస్ వెంట పడుతూ ఒకటే వేదిస్తోంది. ఇదంతా చూసి రాహుల్ గాంధీకి గానీ మళ్ళీ మూడొచేస్తే తనకు మూడుతుందని పాపం వీరభద్ర సింగ్ బిక్కుబిక్కుమంటూ డిల్లీ వైపు చూస్తున్నాడు.

జగన్ పాట పాడుతున్న జేసీ

      రాష్ట్ర విభజన జరిగినా, సమైక్యంగా ఉన్నా తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉండనని ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 31 తర్వాత తన రాజకీయ భవిష్యత్తు చెబుతానని, ఏ పార్టీలోకివెళ్లేదీ తెలియచేస్తానని చెప్పారు. ఇప్పటికీ తనకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి షోకాజ్ నోటీస్ అందలేదన్నారు. ఒకవేళ అందినా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. "ఇప్పటికీ వైసీపీలో మా కుటుంబానికి తలుపులు తెరుచుకుని ఉన్నాయి. ఆ పార్టీ తరపున మాకు రావచ్చు. ప్రస్తుతం వైసీపీలో ప్రకటించిన వారికి గానీ, మరొకరికి గానీ పార్టీ టికెట్ ఇస్తారనే గ్యారంటీ లేదు. ఇప్పటికీ వైసీపీతో మాకు సన్నిహిత సంబంధాలున్నాయి.

కిరణ్ కాంగ్రెస్ కోసం రెబల్స్ ఎదురుచూపులు

  ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ మొన్ననే మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పుకొన్నారు. కనీసం 25మంది శాసనసభ్యులు మరో కొందరు మంత్రులు కూడా త్వరలోనే పార్టీలో నుండి వేరే పార్టీలలోకి జంప్ అయిపోనున్నారని బల్లగుద్దీ మరీ చెప్పారు. అయితే వారిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారా లేదా? అనే సంగతి కూడా చెప్పి పుణ్యం కట్టుకొని ఉంటే, ఆయన కొత్త పార్టీ పెడతారని ఆశగా ఎదురుచూస్తున్నవారి నోట్లో పంచదార పోసినట్లయ్యేది.   వారిలో చాలా మంది తమకు సరిపడని జగన్మోహన్ రెడ్డితోనో, లేక తమ రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబుతోనో సర్దుకుపోవడం కంటే, ఒకటే బ్లడ్ గ్రూప్, ఒకటే బ్లడ్ కల్చర్, ఒకటే డీ.యన్.యే. ఉన్న కిరణ్ కుమార్ రెడ్డితోనే సర్దుకుపోవడమే సులువని భావిస్తు, జనవరి23 ముహూర్తం కోసం కళ్ళు కాయలు కాసేలా, చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు పాపం.   చివరికి రాయపాటి, లగడపాటి, ఉండవల్లి వంటి సీనియర్ రాజకీయ నేతలు కూడా ఎంతసేపు కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే అందులో ఎక్కి ఈ ఎన్నికల వైతరిణిని దాటేద్దామని ఆశపడుతున్నారు తప్ప వారిలో ఎవరూ కూడా స్వయంగా పార్టీ పెట్టే ఆలోచన చేయడం లేదు. తమకంటే చాలా జూనియర్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే, ఆయన క్రింద ఇంతమంది సీనియర్లు పనిచేసేందుకు సిద్దపడుతుండటం చాలా అనుమానాస్పదంగా ఉంది. ఇదంతా చూస్తే కిరణ్ కుమార్ రెడ్డితో సహా అందరూ కూడా కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే నడుచుకొంటున్నారనే అనుమానం కలుగుతోంది.   రాష్ట్ర విభజన చేస్తే సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేఖత ఎదురవుతుందని, దానివల్ల పార్టీకి తీవ్రంగా నష్టం కలుగుతుందని కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకపోదు. బహుశః అందుకే రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ “పార్టీని రెండు ప్రాంతాలలో ఏవిధంగా గెలిపించుకోవాలో మాకు తెలుసు. అందుకు తగిన వ్యూహాలు మావద్ద ఉన్నాయని” ధీమా వ్యక్తం చేసారు.   ఇంతవరకు ఈ కాంగ్రెస్ అధిష్టాన వ్యతిరేఖ వర్గమంతా కలిసి రాష్ట్రవిభజనకు పూర్తి సహకారం అందించారు. జనవరి23తో అధిష్టానం తమకు అప్పజెప్పిన ఆ పని కూడా పూర్తి చేసిన తరువాత కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ తిరుగుబాటుదారులందరూ కొత్త జెండా పట్టుకొని ఎన్నికలలో పోటీచేయడం, కాంగ్రెస్ వ్యతిరేఖతను ఓట్లుగా మలచుకొని ఎన్నికలలో గెలిచిన తరువాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోవడమే ఆ వ్యూహం అయ్యిఉండవచ్చును.   ఆ ప్రయత్నంలో భాగంగానే వారందరూ కూడా కాంగ్రెస్ అధిష్టానం తమను, ప్రజలను కూడా చాలా అన్యాయం చేసిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితమయిపోతుందని అంటూ కాంగ్రెస్ ను తిట్టిపోస్తూ ప్రజల సానుభూతిని, కాంగ్రెస్ పట్ల వ్యతిరేఖతను పెంచి పోషిస్తున్నారు. అందరూ కలిసి పార్టీకి తీరని నష్టం కలిగిస్తున్నా కూడా పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ ఎవరిమీద మీద ఇంతవరకు ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం ఈ అనుమానాలను దృవీకరిస్తోంది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే వాళ్ళందరూ పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు తప్ప సోనియాగాంధీని విమర్శించడం లేదు. పార్టీలో అందరూ తమ తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని బొత్స వారిని వెనకేసుకొని వస్తున్నారు. అంటే కిరణ్-కాంగ్రెస్ లో జేరెందుకు ఆలోచిస్తున్నవారు మాత్రం నేటికీ పార్టీ క్రమశిక్షణ అధిగమించడం లేదని, వేరే పార్టీలలో టికెట్స్ ఖరారు చేసుకొన్నవారే కాంగ్రెస్ పార్టీని, అధిష్టానాన్నికించపరుస్తున్నారని అర్ధం అవుతోంది. బహుశః అందుకే జేసీ దివాకర్ రెడ్డికి షో-కాజ్ నోటీసులు జారీచేసారు. మిగిలిన వారు పార్టీకి ఎంత నష్టం కలిగిస్తున్నాదానిని అభిప్రాయ వ్యక్తీకరణ పద్దులో వ్రాసి అడ్జస్ట్ చేస్తున్నారు. బహుశః జనవరి23 తరువాత కిరణ్ కొత్త పార్టీ పెట్టగానే, అప్పుడు బొత్ససత్యనారాయణ వారందరి మీద మూకుమ్మడిగా క్రమశిక్షణ చర్యలు తీసుకొంటారేమో!

పాలిటిక్స్‌లో పవనిజం... పెళ్లితో ఖతం...

      పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ మరోసారి వార్తల్లోకి వచ్చారు.. గత కొంతకాలంగా సినిమాల హిట్స్‌ పరంగా, ఆ తర్వాత పవనిజం అనే కొత్త స్లోగన్‌తోనూ మీడియా నోళ్లలో నానుతున్న ఈ హీరో... ఇటీవలే రాజకీయనేత అవతారం ఎత్తనున్నాడని కూడా బాగా వినిపించింది. తెలుగుదేశం పార్టీలోకి రానున్నాడని మీడియా కధనాలు వెల్లడిరచాయి. అవన్నీ ఒకెత్తయితే... ఇప్పుడు మూడో పెళ్లితో పవన్‌ మరో సంచలనానికి కారణమయ్యారు.   అయితే విశేషం ఏమిటంటే గతంలో వచ్చిన కధనాలు ఒకదాని పునాది మీద ఒకటి పుట్టుకొస్తే... ఇప్పుడు వెల్లడైన నిజం... ఆ కధనాల్లో చాలా వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టేదిలా ఉండడం. ముఖ్యంగా పవన్‌ వరుస పెళ్లిళ్లు ఆయనకు మహిళల్లో ఉన్న ఫాలోయింగ్‌ను దెబ్బతీయనున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్వల్పవ్యవధిలోనే పెళ్లిళ్లు, విడాకులు అంటూ ఈ కొణిదల వారసుడు చెలరేగిపోవడం మరింతగా అతని ఇమేజ్‌కు మచ్చ తేనుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో... అసలే అంతంత మాత్రపు ఆశలతో రేపటి ఎన్నికలకు వెళుతున్న రాజకీయ పార్టీలు పవన్‌కళ్యాణ్‌ను రమ్మనడం మాట అటుంది అతను వస్తే పారిపోయే అవకాశం లేకపోలేదని పలువురు జోస్యం చెబుతున్నారు. అలాగే పవనిజం అంటూ వెర్రెత్తిపోతున్న అభిమాన సందోహానికి కూడా ఇదొక ఎదురుదెబ్బేనని, పవనిజం అంటే పూటకొకర్ని పెళ్లి చేసుకోవడమేనా అంటూ ఇతర హీరోల అభిమానులు, పవన్‌ ప్రత్యర్థులు ప్రచారం చేసే ప్రమాదం ఉంది కనుక... పెళ్లి అనే నిజం దెబ్బకు మిగతావన్నీ హాంఫట్‌ అయిపోవడం ఖాయమని తేల్చేస్తున్నారు. వీటన్నింటి నేపధ్యంలో తన పెళ్లి వార్తలపై పవన్‌ ఎలా స్పందిస్తారనేదానిపైనే రేపటి పవన్‌ భవిష్యత్తు అడుగు ఆధారపడి ఉందనేది నిర్వివాదం.  

విభజన...‘విడిది’

      గతంలో శీతాకాల విడిదికి గాను హైదరాబాద్‌కు వచ్చిన ఏ రాష్ట్రపతికీ ఈ తరహా అనుభవం ఎదురై ఉండదు. దీనికి కారణం రాష్ట్రంలో నెలకొన్న విభజన పరిస్థితులే. గందరగోళంగా రాష్ట్ర పరిస్థితి రాష్ట్రపతి నిలయాన్ని కేంద్రంగా మార్చుకోవాలని చూస్తుండడంతో... విశ్రాంతి నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ప్రణబ్‌ముఖర్జీ... ఫుల్‌ బిజీగా మారిపోయారు. పార్టీల వారీగా వచ్చేవారు కొందరు, వ్యక్తిగతంగా వచ్చేవారు మరికొందరు... గుట్టల కొద్దీ వినతిపత్రాలు, అర్జీల మీద అర్జీలు వచ్చి పడుతుంటే పాపం...ఏం చేయాలో తెలియక ఓపికగా అందర్నీ ఆహ్వానిస్తున్నారు. దీంతో నగరంలోని రాష్ట్రపతినిలయం ఎప్పుడూ లేనంత సందడిగా మారింది.     మామూలుగా అయితే ఢిల్లీ వెళ్లి, రాష్ట్రపతిని కలవడం అంటే అంత తేలికైన విషయం కాదు. పైగా అసలు ఆయన అపాయింట్‌మెంట్‌ దొరకడమే గగనం. ఎంతో వ్యయప్రయసలకు ఓర్చుకుని అక్కడి దాకా వెళ్లినా అక్కడ ఉండే బిజీ కారణంగా రాష్ట్రపతి ఇచ్చే సమయం ఏదో కొన్ని నిమిషాలకు మించి ఉండదు. వీటన్నింటిని బేరీజు వేసుకున్న పార్టీలు, వ్యక్తులు... విడిదిలో బస పూర్తయిపోయేలోగా... తమ పని చక్కబెట్టేసుకోవాలని ఆరాటపడుతున్నారు. నిజానికి విభజనకు సంబంధించినంత వరకూ ఇరు ప్రాంతాల నేతలు చేస్తున్న వాదనలు, వినిపిస్తున్న అంశాలు కొత్తవీ కావు... ఇప్పటిదాకా ప్రణబ్‌కు తెలియనివీ కావు. మరెందుకీ ఆరాటం అంటారా? అదేనండీ మైలేజీ. నిజానికి తామే సమైక్యవాద ఛాంపియన్‌లం అని నిరూపించుకోవాలని తహతహలాడుతున్నవారు అందుకు దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోదలచుకోవడం లేదు. వారే ఈ మార్గం కనిపెట్టారు. అది మరెందరికో దారి చూపింది. ముక్కలు చెక్కలుగా విడిపోయిన సమైక్యవాదులు... ఒకరొకరుగా రాష్ట్రపతిని కలిసి వచ్చి, ఆ విషయాన్ని మీడియాకు వెళ్లడిస్తూ బోలెడంత మైలేజీ తెచ్చేసుకుంటుంటే... కంగారుపడిపోయిన ప్రత్యేకవాదులు కూడా అదే బాట పట్టారు. అందుకోసం అప్పటికప్పుడు ఉమ్మడిరాజధానిని రెండేళ్లు కుదించాలనే సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చి మరీ రాష్ట్రపతిని కలిసొచ్చారు. గతంలో పదేళ్ల ఉమ్మడికి ఒప్పుకున్న నాయకులు ఇప్పటికిప్పుడు రెండేళ్ల డిమాండ్‌ తేవడం విచిత్రమని విశ్లేషకులు అంటున్నారు. ఈ ‘వాదుల’ హోరు చూస్తున్న మరికొందరు వ్యక్తులు పలు రకాల సంస్థలు, సంఘాలు అప్పటికప్పుడు తమ డిమాండ్లను గుర్తు తెచ్చుకుని ఛలో రాష్ట్రపతి నిలయం అంటున్నారు. ఏదేమైనా... నేతల ప్రచార కండూతి కాస్త తగ్గితే ఆ మేరకు ఈ శీతాకాలవిడిది రాష్ట్రపతికి విశ్రాంతిని ఇస్తుంది.  

ఆంధ్ర, తెలంగాణాలలో మారిన రాజకీయ బలాబలాలు

  మూడేళ్ళ క్రితం కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ప్రకటన చేయగానే సీమాంధ్ర నేతలందరూ పార్టీలకతీతంగా మూకుమ్మడిగా రాజీనామాలు చేయడంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గక తప్పలేదు. సీమాంధ్ర నేతలు కేంద్ర నిర్ణయాన్ని సైతం మార్చగలగడంతో వారి శక్తిపై సీమాంధ్ర ప్రజలకు అపారమయిన నమ్మకం, విశ్వాసం ఏర్పడ్డాయి. ఆ తరువాత తెలంగాణా ఉద్యమాలు జోరుగా సాగుతున్నతరుణంలో టీ-కాంగ్రెస్ నేతలు, ఇతర పార్టీలు, జేయేసీలు కలిసి పనిచేస్తూనే ఒకరితో మరొకరు కీచులాడుకొంటుంటే, ఇంత అనైక్యంగా ఉన్నవీరు తెలంగాణా సాధించేనా? అని అందరూ పెదవి విరిచారు. సీమాంధ్ర నేతల శక్తి యుక్తులపై ప్రజలకున్నఅపార నమ్మకం వల్ల, తెలంగాణా ప్రజలు, పార్టీలు ఎంతగా పోరాడినా తెలంగాణా ఏర్పడే అవకాశం లేదనే ధీమా కూడా ఉండేది. బహుశః ఆ ధీమాతోనే అన్ని పార్టీలు రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ లేఖలు కూడా ఇచ్చాయి.   అయితే తెలంగాణా ప్రజల అలుపెరగని పోరాటాల వల్లనయితేనేమి, రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే సోనియా గాంధీ దృడసంకల్పం వల్లనయితేనేమి, రాష్ట్రంలో ప్రత్యర్ధ రాజకీయ పార్టీలను దెబ్బతీయాలనే కాంగ్రెస్ దురాలోచన వల్లనయితేనేమి, సీమాంధ్ర మంత్రుల, యంపీల సహకారం వల్లనయితేనేమి మొత్తం మీద హటాత్తుగా రాష్ట్ర విభజనకి, తద్వారా తెలంగాణా ఏర్పాటుకి రంగం సిద్దమయిపోయింది.   అయితే మరి సర్వశక్తివంతులనుకొన్న సీమాంధ్ర నేతలందరూ ఈసారి ఎందుకు విఫలమయ్యారు? అనే ప్రశ్నకు జవాబు అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజన జరుగుతోందని చాలా ముందే కాంగ్రెస్ నేతలందరికీ తెలిసినప్పటికీ, వారిలో కొంతమంది మంత్రి పదవులకు, మరికొందరు పార్టీ టికెట్లకు, కాంట్రాక్టులకు అమ్ముడుపోయారనేది బహిరంగ రహస్యం. అంటే తెలంగాణా సాధనకు తెలంగాణా ప్రజల కృషి పట్టుదల ఎంత ఉందో, అందుకు సరిసమానంగా సీమాంధ్ర యంపీలు, మంత్రులు, నేతల సహకారం కూడా ఉందని అంగీకరించక తప్పదు. మళ్ళీ వారే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమను అన్యాయం చేసిందని వాపోతూ అద్భుతంగా నటిస్తున్నారు.   ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణాలో రాజకీయపార్టీల పరిస్థితి పూర్తిగా తారుమరయ్యింది. ఒకప్పుడు ఐకమత్యంగా ఉన్న సీమాంధ్ర నేతలు, పార్టీలు ఇప్పుడు ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా విడిపోవడమే కాకుండా, సీమాంధ్రపై పట్టుకోసం ఎంతకయినా దిగజారేందుకు వెనకాడటం లేదు. వచ్చేఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ల కోసం, పార్టీలను, సిద్ధాంతాలను అన్నిటినీ పక్కనబెట్టి అటూఇటూ పరుగులు తీస్తున్నారు.   ఇక తెలంగాణాలో పార్టీల నేతలందరూ ఇంతవరకు వచ్చిన తెలంగాణాను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పోనీయకూడదనే గట్టి పట్టుదలతో తమ విభేదాలను, పార్టీ జెండాలను కూడా పక్కనబెట్టి సమైక్యంగా ముందుకు కదులుతున్నారు. వారు ఇప్పుడు సీమాంధ్ర నేతలను ఎదుర్కోవడం తమకు పెద్ద సమస్య కాదనే పూర్తి నమ్మకంతో ఉన్నారు. సీమాంధ్ర నేతలలో చిత్తశుద్ధి కొరవడిందనే సంగతి గ్రహించడమే అందుకు కారణం.   తెలంగాణా బిల్లుని శాసనసభలో ఓడిస్తామని, లేకుంటే పార్లమెంటులో ఓడిస్తామని, ఇంకా కుదరకుంటే రాష్ట్రపతికి అఫిడవిట్లు సమర్పించి ఆయన మనసు మార్చేస్తామని, లేకుంటే సుప్రీం కోర్టులో కేసులు వేసి ఆపేస్తామని ఇలా ఏవేవో కట్టు కధలు, పిట్ట కధలు సీమాంధ్ర నేతలు చెపుతూనే ఉన్నారు. అయితే వారి అసలయిన లక్ష్యం రాష్ట్ర విభజనను ఆపడం కాదు. ఆపడానికి తాము మాత్రమే చాలా గట్టిగా కృషి చేసామని చెప్పుకొంటూ వచ్చే ఎన్నికలలో ప్రజల ఓట్లు దండుకోవడమే. మొన్న శాసనసభ సమావేశాలప్పుడు వారందరూ ప్రవర్తించిన తీరు అనుసరించి వ్యూహాలే అందుకు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చును.    ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా సాగుతున్నఈ వికృత రాజకీయ క్రీడని బహుశః రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత కూడా ఎన్నికలు పూర్తయ్యేవరకు వారు ఆడుతూనే ఉంటారు. అందుకు ప్రజలు తగిన ప్రతీకారం తీర్చుకోదలిస్తే తమను ఇంతగా మోసం చేసినవారు ఏ పార్టీలో చేరినా వారిని నిర్దాక్షిణ్యంగా ఓడించడమోకటే మార్గం.

మోహన్ బాబు కేసు: పద్మశ్రీ తొలగించాలని కోర్టు ఆదేశం

      సినీ నటులు మోహన్ బాబు, బ్రహ్మానందం ‘పద్మశ్రీ' అవార్డును దుర్వినియోగం చేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా సినిమా టైటిళ్లలో వారి పేర్ల ముందు ‘పద్మశ్రీ' వేసుకున్నారన్న వివాదానికి సంబంధించి, హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. తాజా విచారణ అనంతరం, ‘దేనికైనారెడీ’ సినిమా టైటిల్స్‌ నుంచి మోహన్‌బాబు, బ్రహ్మానందం పేర్ల ముందున్న పద్మశ్రీని తొలగించాలని ఆదేశించింది. టైటిల్స్‌లోని ‘పద్మశ్రీ’ పేరు వాడకంపై అఫిడవిట్‌ సమర్పించాలంటూ బ్రహ్మానందంకు ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. సినిమా టైటిల్స్‌ నుంచి పద్మశ్రీ తొలగించి, ఆ విషయాన్ని పత్రికల్లో ప్రకటన వచ్చేలా చేయాలనీ చిత్ర నిర్మాతలకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

కావూరిని కౌగలించుకుందెవరు: రేవంత్‌

      తెలంగాణ ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసుకుంటూ వెళ్తోందని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు కల సాకారమైతే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పారని, టీఆర్ఎస్‌ను విలీనం చేయాలని కాంగ్రెస్ నేతలే కోరుతున్నారని ఆయన తెలిపారు. సమైక్యవాది కావూరిని సిరిసిల్లలో కేటీఆర్ కౌగిలించుకున్న మాట వాస్తవం కాదా? ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, కిరణ్, జగన్ కలిసి చంద్రబాబుపై కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు. తెలుగు ప్రజలను ఆదుకునే పార్టీ టీడీపీ అని ఆయన చెప్పారు. తెలంగాణకు టీడీపీ అనుకూలమంటే సీమాంధ్రకు అన్యాయం చేయడం కాదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

కేజ్రీవాల్ కు అస్వస్థత

      ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన కేజ్రీవాల్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం కార్యాలయానికి హాజరుకాలేకపోయారు, ఆయన జ్వరంతో భాదపడుతున్నారు. ప్రతి ఇంటికి 700 లీటర్లు నీరు ఇస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఢిల్లీ జల బోర్డు అధికారులతో ఆయన సమావేశమై ఈరోజు చర్చలు జరపాల్సివుంది. కేజ్రీవాల్ నివాసం నుంచే కొన్ని ముఖ్యమైన వాటిపై చర్చలు జరిపారు. ఆదివారం నుంచి తనకు 102 జ్వరం ఉందని ఆయన ఈరోజు ఉదయం ట్విటర్‌లో తెలిపారు. సోమవారం ఆఫీస్‌కు హాజరవడం చాలా ముఖ్యమని, నీటీ విషయంలో ప్రకటన చేయాలన్న ఆలోచనలో ఉన్నామని, దేవుడు నన్ను ఇదే సమయంలో అనారోగ్యవంతుణ్ణి చేశాడని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. డాక్టర్స్ తనకు రక్తపరీక్షలు నిర్వహించి, విశ్రాంతి అవసరమని సూచించారని ఆయన తెలిపారు.

సోనియాకు 'అపరిచితుడి' శిక్షలు

      విచిత్ర వేషధారణలతో 'సమైక్య' వాణి వినిపిస్తున్న తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్.. ఆదివారం జరిగిన ప్రజా గర్జన సభలో'అపరిచితుడి' వేషం కట్టి అలరించారు. సంప్రదాయాలు తప్పి విభజన ప్రక్రియను నడిపిస్తున్నారంటూ సోనియాగాంధీకి శిక్షలు ప్రకటించాడు. ఏఐసీసీ అధ్యక్షురాలికి 'కుంభీపాకం' తప్పదని హెచ్చరించాడు. అంతేకాదు... 'భలే మంచి చిచ్చు పెడితివే... ఓ సోనియమ్మ! అన్నదమ్ముల వంటి తెలుగు ప్రజలమధ్య చిచ్చుపెట్టి చోద్యం చూస్తుంటివే! సీమాంధ్ర ప్రజలపై శఠగోపం పెట్టి చోద్యం చూస్తుంటివే! రెండుసార్లు గెలిపించిన రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని యోచిస్తివే!' అంటూ పాట కూడా అందుకున్నారు.

దేవదేవుని సన్నిధిలో 'బాబు గర్జన'

      దేవదేవుని సన్నిధిలో ప్రజా గర్జన ప్రారంభమైందని, తెలుగుదేశం ఈ మహయజ్ఞాన్ని ప్రారంభించిందని, అందరూ భాగస్వాములు కావాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తిరుపతిలో ఆదివారం జరిగిన ప్రజా గర్జన సభలో పిలుపునిచ్చారు. సుదీర్ఘ సమయం ప్రసంగించిన చంద్రబాబు ఆద్యంతం పూర్తి ఉద్రేకంగా మాట్లాడారు. బాబు ప్రసంగం ఇప్పటిదాకా ఆయన చేసిన వాటికి భిన్నంగా సాగింది. జనాన్ని తరచూ ప్రశ్నలు వేస్తూ వారి నుంచి సమాధానాలు రాబడుతూ నేరుగా వారితోనే మాట్లాడిన అనుభూతిని కల్పించారు. ఆయన ఉపన్యాస ధోరణి గతానికి పూర్తి భిన్నంగా ఉండి జనాన్ని బాగా ఆకట్టుకుంది.   మరోవైపు వేదికపైకి వచ్చినప్పటి నుంచీ బాబు ఆద్యంతం ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించారు. తరచూ చిరునవ్వులు చిందిస్తూ జనానికి విజయసంకేతం చూపిస్తూ అభివాదం చేశారు. ఆయన పలకరింపులకు ప్రతిగా జనం రెచ్చిపోయి కేరింతలు కొట్టారు. టీడీపీ విజన్ 2020 తయారు చేస్తే కాంగ్రెస్ దొంగలు విజన్ 420 తయారు చేశారంటూ 2004 నుంచి కాంగ్రెస్ పాలనను, ప్రత్యేకించి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను దృష్టిలో ఉంచుకుని విమర్శన్ద్మాలు సంధించారు. సోనియా గాంధీకి ప్రజలు దయతో ఓటు వేస్తే అనకొండ పాము కంటే భయంకరంగా దేశమంతా వేలాది అనకొండలను తయారు చేసిందని, వాటిలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకటైతే సోనియా అల్లుడు రాబర్ట్ వాధ్రా ఇంకొకటని దెప్పి పొడిచారు. పిల్ల అనకొండ జగన్ అంటూ వర్ణించారు. ఈ అనకొండలు దేశాన్ని మింగేస్తున్నాయని, జగన్ వందలాది కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. ఒకవైపు కాంగ్రెస్, వైకాపాపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తూనే ఇంకోవైపు తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేయదలచారో వాగ్దానాలు, హామీల రూపంలో చెప్పారు. తమను గద్దెనెక్కిస్తే నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రిస్తామంటూ సామాన్యులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అధికారంలోకి వస్తే రైతు రుణాలను మాఫీ చేస్తామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తామని, ఉచితంగా తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తామని హామీల వర్షం కురిపించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే బాధ్యత తనదే అని, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. బీసీ డిక్లరేషన్ తమ పార్టీయే ఇచ్చిందని, పేదరికం లేని సమాజాన్ని చూడటమే తన లక్షహ్యొం అని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో అంటీముట్టనట్టుగా మాట్లాడే చంద్రబాబు తిరుపతి సభలో విభజన సమస్యల గురించి చాలాసేపే మాట్లాడారు. రాష్ట్రం విడిపోవాలంటే సీమాంధ్రకు న్యాయం జరగాలని, సమైక్యంగా ఉండాలంటే తెలంగాణకు న్యాయం చేయాలని, వీటిలో ఏది జరగాలన్నా రెండు ప్రాంతాల వారినీ ఒక చోటికి చేర్చి ఒప్పించాలని అనడం జనానికి నిజమే కదా అనిపించేలా చేసింది. చివరన చంద్రబాబు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామంటూ ప్రతిజ్ఞ చేయించినపుడు కూడా జనం ఉత్సాహంగా లేచి నిలుచుని ప్రతిజ్ఞ చేశారు.

అన్నాహజారే మనసు కరుగుతోందా

  ఒకప్పుడు అన్నాహజారేతో కలిసి జనలోక్ పాల్ బిల్లుకోసం ఉద్యమించిన అరవింద్ కేజ్రీవాల్, ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలను పనిచేయించలేమని గ్రహించి, మార్పు తేవాలంటే స్వయంగా రాజకీయాలలో ప్రవేశింఛి అందుకు కృషి చేయడమే మార్గమని భావించడంతో, నాటి నుండి వారిరువురి దారులు వేరయిపోయాయి. ఆ తరువాత గత ఏడాది కాలంగా డిల్లీ ప్రజల సమస్యలపై అరవింద్ కేజ్రీవాల్ అనేక పోరాటాలు చేసారు కూడా. కానీ అవన్నీదున్నపోతు మీద వానలాగే డిల్లీ ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయి. ఆ తరువాత ఆయన ఆమాద్మీ పార్టీని స్థాపించడం, దానితో డిల్లీ ప్రజలందరూ మమేకం కావడం, ఆయన డిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అన్నీచకచకా జరిగిపోయాయి.   ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టిననాటి నుండి ఆయన అయన అనుచరుల నిజాయితీతో కూడిన మాటలు, చేపడుతున్న చర్యలు చూసిన తరువాత బహుశః అన్నాహజారే మనసు క్రమంగా కరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఇటీవల ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “వ్యక్తులు రాజకీయాలలోకి చేరడం నేరమని నేను భావించడం లేదు. కానీ వాటిలో చేరిన తరువాత వారి ప్రమేయం లేకుండానే అవినీతి, లంచగొండితనమూ,అధికార లాలసలో మునిగిపోతారనే ఉద్దేశ్యంతోనే నేను రాజకీయాలలో చేరడాన్ని వ్యతిరేఖిస్తున్నాను. అయితే అరవింద్ కేజ్రీవాల్ ని నేను చాలా కాలంగా చూస్తున్నాను. ఆయన చాలా నీతి, నిజాయితీ గల వ్యక్తి. ఇప్పుడు కూడా ఆయన అదేవిధంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వంలో అవినీతిని పారద్రోలి మిగిలిన రాజకీయ నేతలకు పార్టీలకు ఆదర్శంగా నిలవాలని కోరుకొంటున్నాను,” అని అన్నారు.   అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారోత్స్వానికి కూడా హాజరవడానికి ఇష్టపడని అన్నాహజారే ఇప్పుడు ఈవిధంగా మాట్లాడటం చూస్తే కొంచెం మెత్తబడుతున్నట్లు అర్ధం అవుతోంది. బహుశః అరవింద్ కేజ్రీవాల్ మాటలలో నిజాయితీని అన్నాహజారే గుర్తించినందునే ఆయనలో ఈ మార్పు వచ్చినట్లు కనబడుతోంది. ప్రభుత్వం మరియు ఇతర వ్యవస్థల నుండి అవినీతిని పారద్రోలడం తన ఒక్కడివల్లే కాదని, అందుకు అందరూ కలిసి కృషి చేద్దామని అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపుకు, అన్నాహజారే కూడా సానుకూలంగా స్పందించినట్లు భావించవచ్చును.   ఇద్దరి గమ్యం ఒకటే గనుక, ఆయన కూడా ఆమాద్మీ ప్రభుత్వం వెనుక నిలబడితే ఇక ప్రక్షాళణా కార్యక్రమం వేగవంతమవుతుంది. అదేసమయంలోల్ అమాద్మీ ప్రభుత్వం గాడి తప్పితే హెచ్చరిస్తూ ఉండవచ్చును. అంతేగాక అన్నాహజారే వచ్చిఆమాద్మీ పక్కన నిలబడితే, ఇక కాంగ్రెస్, బీజేపీలు ఎటువంటి దుస్సాహసానికి పూనుకొనే ధైర్యం చేయలేవు కూడా. అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ఒక మంచి ప్రయోగానికి అన్నాహజారే వంటివారు కూడా ముందుకు వచ్చి తమ సహకారం అందిస్తే, తప్పకుండా అది విజయవంతమవదమే కాక అది క్రమంగా దేశమంతటా వ్యాపించే అవకాశం ఉంటుంది.

హరికృష్ణను దూరంగా పెడుతున్నారా..!!

      తెలుగుదేశం పార్టీపై ఆ పార్టీ నేత నందమూరి హరికృష్ణ మరోసారి అసంతృప్తిని వ్యక్తపరిచారు. తనకు ప్రజాగర్జనలో పాల్గొనేందుకు ఆహ్వానం పంపలేదంటూ ఆవేదన వ్యక్తం చేయడం కలకలం రేపుతోంది. సమైక్యాంధ్ర అన్నందుకే పార్టీ కార్యక్రమాలకు తనను దూరం పెట్టారన్న అనుమానం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజను వ్యతిరేకిస్తూ హరికృష్ణ రాజ్యసభ సభ్వత్వానికి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విభజన ప్రకటన వెలువడిన నాటి నుంచి సమైక్యవాదాన్ని హరికృష్ణ బలంగా విన్పిస్తున్నారు.   మరోవైపు ప్రజాగర్జన కోసం తాము ప్రత్యేకంగా ఎవరికీ ఆహ్వానం పంపలేదని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. కేవలం జిల్లా నేతలకు మాత్రమే ఆహ్వానాలు పంపించామన్నారు. మిగతా నాయకులు ఎవరైనా స్వచ్చంధంగా పాల్గొనవచ్చునని చెప్పారు.

చావుతో చెట్టా ‘పట్టాల్‌’...

      అనంతపురంలో మరో ఘోరప్రమాదం. రైలు పట్టాలపై మ్రత్యుఘోష. తెల్లవారుజాము సమయంలోనే 26 జీవితాలు తెల్లవారిపోయాయి. ఆ తర్వాత ఏమి జరిగింది? ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి దాకా అందరూ సంతాపం వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి కాస్త తీరిక చేసుకుని వచ్చి పోయినోళ్లను ఎలానూ తేలేం కాబట్టి తలా రూ.5లక్షల నష్టపరిహారం, ప్రమాదంపై కమిటీ వేస్తానని ప్రకటించేసి వెళ్లిపోయారు. రోజంతా బుగ్గయిన బోగీ చుట్టూ కెమెరా తిప్పి తిప్పి, వాయిస్‌ ఓవర్‌లు చెప్పిచెప్పి అలసిపోయిన మీడియా ఫ్రెండ్స్‌ కూడా శాంతించారు. పొద్దున్నే ఇంటికి వస్తారని చూస్తున్న తమవారు రారని, ఇక వచ్చే అవకాశమే లేదనే విషయం ఇక ఇప్పుడు సంపూర్ణంగా అర్థం అవుతున్న దశలో... చనిపోయిన వారి కుటుంబాలలో ఎన్ని కళ్లు కన్నీళ్ల సముద్రాలు కడతాయో... ఎన్ని ఇళ్లు అతలాకుతలం అవుతాయో... ఎన్ని జీవితాలు చిందరవందరగా మారతాయో... రైలెక్కడం అనేది ఇంత పెద్ద నేరమా? అని ఎంతమంది భయపడిపోతారో... గత కొన్నేళ్ళుగా వరుస ప్రమాదాలు జరుగుతున్నా రైల్వేశాఖగాని, కేంద్రప్రభుత్వం గాని తమకు చీమ కుట్టినట్టయినా లేదని తరచు నిరూపించుకుంటూనే ఉంది. ప్రత్యక్షంగా జరిగే నష్టాన్ని మాత్రమే చూస్తున్న ‘పై’ వారికి పరిహారం ఇస్తే సరిపోతుందనిపిస్తుందేమో... కాని ఈ తరహా ప్రమాదాల కారణంగా తలెత్తే అనుబంధ కష్టాలు ప్రభుత్వాలకు అర్థమైతే... ఈపాటికే రైల్వేశాఖ పటిష్టమైన చర్యలు ప్రకటించేంది. కాలయాపన కమిటీలు, పరిహారాలతో ప్రజల్లో పేరుకుపోతున్న అభధ్రతాభావాన్ని పెంచడం మానేసేది.     తెల్లవారుజామునే జరుగుతున్న ప్రమాదాలు కనురెప్పపాటులో మనిషిని ‘మసి’చేస్తున్న కారణాలను శరవేగంగా అన్వేషించే యత్నం ఇప్పటికీ జరగడం లేదు. గతంలో వేసిన కమిటీల సిఫార్సులు ఏమయ్యాయో తెలీదు. రైల్వేలో సుశిక్షుతులైన సిబ్బంది నియామాకం ఎందుకు చేయరో తెలియదు. అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందితో నెట్టుకు రావడం వల్ల కలుగుతున్న నష్టాలపై విశ్లేషణ లేదు. రైళ్లు ఢీ కొనడం సంఘటనలు తగ్గి, అగ్నిప్రమాదాలు ఎందుకు పెరిగాయో అర్థం చేసుకునే ప్రయత్నం లేదు. అనిల్‌కకోడ్కర్‌ కమిటీ సిఫార్సులు అమలు చేయరు గాని మరిన్ని కమిటీలు వేసి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తూ ఉంటారు. ప్రమాదాలు జరగనే కూడదని, జరగవని ఎవరం అనం... అయితే ఒక ప్రమాదం మరిన్ని ఘోరాలు జరగకుండా అరికట్టేందుకు దోహదపడాలిగా... అది కూడా జరగకపోవడమే రైలు పట్టాలతో చావును చెట్టాపట్టాలేయిస్తోంది. ఓల్వో బస్సుల నుంచి రైలు బోగీల దాకా బుగ్గిగా మారేందుకు కారణమవుతోంది.  

టేక్ డైవర్షన్ ప్లీజ్!

  మన రాజకీయ పార్టీలు ఎప్పుడయినా వివాదాలలో లేదా ఇబ్బందులలో చిక్కుకొన్నప్పుడు వెంటనే వేరే ఆసక్తికరమయిన అంశం ఏదో అందుకొని మాట్లాడుతూ ప్రజల, ప్రత్యర్ధుల మీడియా దృష్టిని మళ్ళిస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ట్రిక్కుని అనేక ఏళ్లుగా చాలా విజయవంతంగా అమలుచేస్తూ అనేక సార్లు గండం గట్టెకింది. ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు, లోక్ పాల్ బిల్లుని, ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ అవినీతిపై పోరాటాన్నిదొరకపుచ్చుకొని సమస్యలనుండి బయటపడ్డారు. అయితే రాహుల్ గాంధీ పొరపాటున తమ కొంపముంచే ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణాన్ని కెలుక్కోవడంతో, ఇప్పుడు ఆ సమస్య నుండి బయటపడేందుకు అర్జెంటుగా మళ్ళీ మరో కొత్త అంశం కోసం కాంగ్రెస్ వెదుకులాడుతోంది.   ఇక, మొన్న శాసనసభ సమావేశాలు మొదలయ్యినప్పుడు తెదేపా నేతలు రెండుగా చీలిపోయి మీడియా ముందు, సభలో చాల జోరుగా వాదించేయడంతో తెరాసకు అడ్డుగా దొరికిపోయారు. అప్పుడు తెరాస నేతలు తమపై దాడి మొదలుపెట్టేసరికి తెదేపా నేతలు ఆత్మరక్షణలో పడ్డారు కానీ వెంటనే తేరుకొని వారు కూడా ఆ ‘ట్రిక్కు’ని మరోమారు విజయవంతంగా ప్రయోగించి బయటపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో తెరాసను విలీనం చేయనందునే తెలంగాణా ఆలస్యమయిపోతోందని వారు లొల్లి చేయడంతో అందరి దృష్టీ తెదేపాపై నుండి తెరాసపైకి మళ్ళింది. ఇదేసమయంలో తెదేపా నేతలకు వీ.హనుమంత రావు వంటివారు కూడా కోరస్ పాడటం మొదలు పెట్టడంతో ఈసారి తెరాస ఆత్మరక్షణలో పడింది.   ఇటువంటి టీ కప్పులో తుఫానులను అనేకం చూసిన కేసీఆర్ వెంటనే రంగంలోకి దూకి, రాష్ట్ర విభజన బిల్లులో అత్యవసరంగా చేయవలసిన సవరణల గురించి చర్చ మొదలుపెట్టి, అవసరమయితే మళ్ళీ ఉద్యమానికయినా సిద్దమని ప్రకటించేయడంతో మ్యాటర్ ఆటోమేటిగ్గా దానికి డైవర్ట్ అయిపోయింది. ఆ తరువాత ఆయన టీ-కాంగ్రెస్ నేతలను, రాష్ట్రపతిని కలవడం వంటివి చేయడంతో ‘విలీనం’ పాయింటుని మరి వినపడకుండాపోయింది. ఒకవేళ మళ్ళీ వినబడినా దానికి కౌంటర్ గా టీ-బిల్లు- సవరణలు అనే టాపిక్ ఉంది గనుక పెద్దగా ఇబ్బంది ఉండదు.   ఇక అందరి గురించి చెప్పుకొని వైకాపాను వదిలేస్తే వాళ్ళు చాలా బాధపడతారు. గనుక వాళ్ళ గురించి కూడా ఓ నాలుగు ముక్కలు చెప్పుకోవలసిందే. దిగ్వజయ్ సింగ్ ‘జగన్ నా కొడుకువంటి వాడు’ అని కలవరించినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీతో తమకు ఎటువంటి అక్రమ సంబంధం లేదని రుజువు చేసేందుకు జగన్ సోనియాగాంధీని విమర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక సమైక్య ముసుగులో విభజనవాదం చేస్తున్నారని ఆరోపణలు వచ్చినప్పుడల్లా జగన్ అఫిడవిట్స్ గురించి మాట్లాడటం వీలయితే ఓసారి రాష్ట్రపతిని కలిసి రావడం కూడా ఆనవాయితీయే.   ఈ రాజకీయ గందరగోళం చూసి జనాలు వెంటనే ఏ సినిమా న్యూస్ కో షిఫ్ట్ అయిపోయి దాని గురించే ఆలోచించడం, మాట్లాడటం మొదలుపెడతారు.ఇలా డైవర్షన్ సాగుతూనే ఉంటుంది.

రావణుడెంత గొప్పవాడో తెలిసింది: నాగార్జున

      చిన్నప్పుడు రామాయణం, మహాభారతం చూసి ఆహా రాముడెంత మంచోడు, దుర్యోధనుడెంత చెడ్డోడు అనుకునేవాళ్లం కదా మనమంతా... టాలీవుడ్‌ స్టార్‌ నాగార్జున కూడా అంతేనట. అయితే మనలో చాలామందిమి ఇప్పటికీ అలాగే అనుకుంటాం కానీ... మన నాగ్‌కు మాత్రం అలా అనుకోవడం లేదట. హైదరాబాద్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సందర్భంగా ఈ ఎవర్‌గ్రీన్‌ అందగాడు తన శ్రీమతి అమలతో సహా పాల్గొని బోలెడన్ని ముచ్చట్లు చెప్పాడు. శూర్పణఖ అనే ఒక మహిళ ముక్కు చెవులు కోసేసేంత క్రూరత్వం ఉన్న వారి దగ్గర కన్నా తన దగ్గరే సీత క్షేమంగా ఉంటుందనే భావనతోనే రావణుడు సీతను అపహరించాడనే కొత్త లాజిక్‌ను ‘అసుర’ పుస్తకరచయిత కన్విన్సింగ్‌గా చెప్పిన తీరు తనకు నచ్చిందన్నాడు నాగ్‌.   అంతేకాదు మరెన్నో లక్షణాలు తెలుసుకున్నాక రావణుడు, కర్ణుడు... వీరంతా ఎంత గొప్పవారో తెలిసొచ్చిందన్నాడు. చెట్ల చుట్టూ తిరుగుతూ చేసే డ్యాన్సులు, సినిమాలంటే బోర్‌ కొట్టేస్తుందన్న నాగార్జున ఇలాంటి పుస్తకాల ఆధారంగా ఎవరైనా సినిమాలు తీస్తే నటించాలని ఉందన్నాడు. 2013 అత్యంత దురద్రుష్టకరమైన సంవత్సరమని, రానున్న ఏడాది అందరికీ బాగుండాలని ఆశిస్తున్నానన్నారాయన. ఇంతకీ ఈ మాటలంటున్నపుడు ఆయన పక్కనే ఉన్న అమలకు...  ఏకపత్నీవ్రతుడైన రాముడంటే భారతీయ మహిళలకు ఎంత ఇష్టమో, రావణుడంటే ఎంత ద్వేషమో తెలుసో లేదో...

పొట్లూరి వరప్రసాద్ కి వైకాపా టికెట్ ఖరారు..!!

  ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత మరియు పీవీపీ వెంచర్స్ అధినేత పొట్లూరి వరప్రసాద్ జనవరి26న వైకాపా తీర్ధం పుచ్చుకోనేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆయనకు విజయవాడ లోక్ సభ టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.   ఆ నియోజక వర్గం క్రింద ఉన్న తిరువూరు, నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట, విజయవాడ సెంట్రల్ మరియు తూర్పుప్రాంతాలు ఉన్నాయి. వీటిలో తిరువూరు, నందిగామ ప్రాంతాలు తప్ప మిగిలిన నాలుగు ప్రాంతాలలో కమ్మ కులస్థులదే పూర్తి ఆదిక్యత. అందువల్ల కాంగ్రెస్, తెదేపా, వైకాపా మూడు పార్టీలు కూడా అదే కులానికి చెందిన వ్యక్తులను తమ అభ్యర్ధులుగా నిలబెడుతున్నాయి.   ఇప్పటికే తెదేపా అభ్యర్ధిగా కేశినేని శ్రీనివాస్ (నాని) రంగంలో ఉండగా, ఇప్పుడు వైకాపా పొట్లూరి వరప్రసాద్ ను తన అభ్యర్ధిగా ఖరారు చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి ఇంత వరకు లగడపాటి రాజగోపాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఆయన అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నందున మళ్ళీ ఆయనకి టికెట్ దొరకక పోవచ్చును. కానీ ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే ఆయన ఆ పార్టీ టికెట్ పై పోటీచేయవచ్చును. లేదా స్వతంత్ర అభ్యర్దిగానయినా అక్కడి నుండే పోటీ చేయవచ్చును.   ఏవిధంగా చూసినా ఒకే కులానికి చెందిన ఈ ముగ్గురు బలమయిన అభ్యర్ధుల మధ్య చాలా తీవ్రమయిన పోటీ ఉండబోతోందని స్పష్టమవుతోంది. అయితే, షెడ్యుల్డ్ కులాల వారి ఆధిక్యత ఉన్న తిరువూరు, నందిగామలు ఎటువైపు మొగ్గితే వారికే విజయం దక్కుతుంది. గనుక అన్ని పార్టీలు ఆ రెండు ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నాయి. ఈ రెండు ప్రాంతాల ప్రజలపై ప్రస్తుతం జగన్ ప్రభావం అధికంగా ఉన్నందున పొట్లూరి వరప్రసాద్ విజయం ఖాయమనే ధీమాతో వైకాపా ఉంది.   మచిలీపట్నం నుండి లోక్ సభకు కుక్కల నాగేశ్వరరావుని తన అభ్యర్ధిగా నిలబెట్టాలనుకొన్న వైకాపాకి ఆయన హటాన్మరణంతో మళ్ళీ అంత బలమయిన అభ్యర్ధి కోసం గాలించవలసివస్తోంది. ఆయన కుమారుడు కుక్కల వెంకట విద్యాసాగర్ లేదా పేర్నివెంకట రామయ్య(నాని)ల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.   మచిలీపట్నం లోక్ సభ నియోజక వర్గం క్రింద ఉండే పెనమలూరు, గన్నవరం, పెడన, గుడివాడ, మచిలీ పట్నం,అవనిగడ్డ, పామర్రు మరియు మచిలీ పట్నం టవున్ ప్రాంతాలలో కాపు మరియు యాదవ కులస్తులు అధికంగా ఉన్నారు. అందువల్ల కాపు కులస్తుడయిన పేర్నివెంకట రామయ్యను లేదా యాదవ కులానికి చెందిన విద్యాసాగర్ లలో ఎవరికో ఒకరికి టికెట్ ఖాయం చేయాలని వైకాపా భావిస్తోంది. విద్యాసాగర్ కు సానుభూతి ఓటు కూడా అదనంగా ఉంటుంది గనుక ఆయనకు టికెట్ ఖరారు చేయవచ్చునేమో.   రాజకీయ పార్టీలన్నీఎన్నిసిద్దాంతాలు, ఆదర్శాలు వల్లెవేసినప్పటికీ స్థానిక కులసమీకరణాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికలలో అడుగు ముందుకు వేయలేవని స్పష్టమవుతోంది.