విలీనం పాట మళ్ళీ ఇప్పుడెందుకో
posted on Dec 24, 2013 @ 9:45AM
తెలంగాణా ఇస్తే తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని కేసీఆర్ ఏదో మాటవరసకి అన్నమాట పట్టుకొని, అటు తెదేపా, ఇటు టీ-కాంగ్రెస్ నేతలు కూడా ఆయనని ఒకటే సతాయిస్తున్నారు. కాంగ్రెస్ లో ఇంకా విలీనం చేయనందునే తెలంగాణా ఏర్పాటు ఆలస్యమవుతోందని తెదేపా నేతలు చేస్తున్నఆరోపణలు తెరాసను బద్నాం చేయడానికే అనుకొన్నా, రాజ్యసభ సభ్యుడు వీ.హనుమంత రావు కూడా తెదేపాకు కోరస్ పాడటం గమనిస్తే, కాంగ్రెస్ పార్టీ నిజంగానే తెలంగాణాపై గేమ్ ఆడుతోందనే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్ర విభజనతో తన రాజకీయ ప్రత్యర్దులందరినీ తుడిచిపెట్టేదామని అడియాసకు, అత్యాశకు పోయిన కాంగ్రెస్ అధిష్టానానికి తల బొప్పికట్టడంతో, మరో నాలుగు నెలలు కళ్ళుమూసుకొంటే ఆనక వచ్చేవాళ్ళే ఆ తిప్పలేవోపడతారని భావిస్తోందో మరేమో గానీ, గత రెండు నెలలుగా తెరాస విలీనం గురించి మాట్లాడనిది ఇప్పుడు మళ్ళీ విలీనం పాట జోరుగా అందుకొంది. తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేయకపోయినట్లయితే ఆ సాకుతో ఈ సమస్య నుండి బయటపడాలని యోచిస్తున్నట్లున్న కాంగ్రెస్ పార్టీ, ఒకవేళ ఈ విలీనం ఐడియా బెడిసికొడితే, నెపం నెట్టివేసేందుకు బీజేపీ ఉండనే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో తెరాస కలిపేస్తే, తెరాస నుండి ఇబ్బంది ఉండదని కాంగ్రెస్ భావిస్తున్నపటికీ, ముందుగా బలయిపోయేది కాంగ్రెస్ పార్టీ నేతలే! ఏమయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి వ్రతం చెడినా ఫలం దక్కేలా లేదు