లగడపాటి చేతిలో చంద్రాస్త్రం..!!

      రాష్ట్రవిభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తమ అభిప్రాయాలు పట్టించుకోకుండా ముందుకు వెళితే బ్రహ్మస్త్రం ప్రయోగిస్తాం అంటూ ప్రకటిస్తూ వచ్చిన లగడపాటి రాజగోపాల్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పార్టీకి పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటూ వస్తున్న రాజగోపాల్‌.. అధిష్టానం పై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన తిరిగి పార్టీలో కొనసాగే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో ఇప్పుడు లగడపాటి పార్టీ మారుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అది కూడా కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీలోకి అన్న వార్త రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ దిశగా లగడపాటి వర్గం అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం.. త్వరలోనే వందలాది కార్యకర్తలతో ఆయన తెలుగుదేశం తీర్ధం పుచ్చుకోనున్నారట. అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంటున్నట్టుగా సమాచారం. అయితే ఈ సారి లగడపాటి విజయవాడ నుంచి కాకుండా ఏలూరు నియోజక వర్గం నుంచి పోటి చేయాలని భావిస్తున్నాడట. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి కూడా హామీ లభించినట్టుగా చెపుతున్నారు. ఇదే నిజమయితే ఇన్నాళ్లు కరుడు గట్టిన కాంగ్రెస్‌ వాదిగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఎలా మనగలుగుతారో.. ఆయనకు ఆ పార్టీ ఎలాంటి స్థానం కల్పిస్తుందో చూడాలి.

ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం

      ఢిల్లీలో చీపురు కట్టతో చరిత్ర సృష్టించిన ఆమ్ఆద్మీ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అరవింద్ కేజ్రీవాల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. సమాచార హక్కు కార్యకర్త మనీష్ సిసోదియా, మిగిలిన ఐదుగురు మంత్రులతో కూడా నజీబ్ జంగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. రాంలీలా మైదాన్ ప్రజలు, అభిమానులతో కిక్కిరిసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల మద్దతుతో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పడడం విశేషం.

రైలు ప్రమాదం: 26కు చేరిన మృతుల సంఖ్య

      శనివారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం సంభవించింది. బెంగుళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ థర్డ్ ఏసీ బీ-1 బోగీలో మంటలు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈఘటనలో 26 మంది సజీవదహనం కాగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణంగా అధికారులు భావిస్తున్నారు. బోగీలో ఏవైనా పేలుడు పదార్థాలు ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈఘటన జరిగిన వెంటనే ధర్మవరం,కొత్తచెరువు, పుట్టపర్తి ఆస్పత్రుల సిబ్బందిని రైల్వే అధికారులు అప్రమత్తం చేశారు. క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం బెంగుళూరు, గుంతకల్లు నుంచి ప్రత్యేక రైల్లో రెండు వైద్య బృందాలను అధికారులు తరలిస్తున్నారు.   బాధితుల వివరాలు తెలుసుకునేందుకు అధికారులు టోల్‌ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నెంబర్ : 080 22354108, 22156554 ఫోన్ నెంబర్ : 080 22354108, 9731666863 ఫోన్ నెంబర్ : 080 22259271, 9731666863 దక్షిణ మధ్య రైల్వేశాఖ పలు జిల్లాలో హెల్ప్‌లైన్ల నెంబర్లను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ : 040 27700868, 9701371060 వికారాబాద్ : 08416 252215, 9701371081 తాండూరు : 08411 272010 ధర్మవరం : 08559 224422 సేదం : 08441 276066, 7760998338 బీదర్ : 08482 226404, 7760998400 గుంతకల్లు : 0855 2220305, 09701374965 అనంతపురం : 09491221390 బెంగుళూరు సిటి : 080 22235408, 080 22156553 ప్రశాంతి నిలయం : 080 555280125

రైలు ప్రమాదం: మృతుల కుటుంబాలకు 5లక్షల పరిహారం

      అనంతపురం జిల్లా పుట్టపర్తి వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష, గాయపడిన వారికీ యాభై వేలు చొప్పున పరిహారం అందజేస్తామని రైల్వే అధికారులు తెలిపారు.   అనంతపురం జిల్లా పుట్టపర్తి వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ థర్ట్ ఏసీ బీ-1 బోగీలో మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ధర్మవరం అసుపత్రికి తరలిస్తున్నారు. సహయ చర్యల కోసం ధర్మవరం నుండి ప్రత్యేక రైలు రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. ప్రయాణ సమయంలో బోగీలో మొత్త 73 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

యుపిఎకు ఓంప్రకాష్‌ గుడ్‌బై

  యుపిఏ కు మరో ఎదురు దెబ్బ తగిలింది ఇప్పటికే తెలంగాణ అంశంతో రాష్ట్రంలో పట్టుకోల్పోతున్న కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో మరో ఎంపి దూరమయ్యాడు. కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తూ వస్తున్న స్వతంత్ర అభ్యర్ధి ఎంపి ఓం ప్రకాష్‌ యాదవ్‌ ఆ పార్టీకి తన మద్దతు ఉపసంహరించుకున్నారు. ధర పెరుగుదల, అవినీతి, రాజకీయ ప్రత్యర్థుల పై కాంగ్రెస్‌ అవలంభిస్తున్న ప్రతీకార చర్యలు లాంటి అంశల నేపధ్యంలో ఆ పార్టీకి ఆయన మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టుగా ప్రకటించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి మద్దతు ఉపసంహరణ లేఖ అందించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఓం ప్రకాష్‌ గతంలో పలు సందర్బాల్లో దేశానికి దమ్మున నాయకుడు కావాలంటూ స్టేట్‌మెంట్‌లు ఇచ్చారు. పలు సందర్బాల్లో నరేంద్ర మోడిని బహిరంగంగానే పొగిడారు. ఈ నేపధ్యంలో ఆయన బిజిపిలో చేరే అవకాశం ఉందన్న వర్తాలు వినిపిస్తున్నాయి.

అనంతపురంలో ఘోర రైలు ప్రమాదం:23 మంది మృతి

  ఈ ఉదయం అనంతపురం జిల్లాలొ ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 23 మంది సజీవదహనం అయ్యారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి దగ్గరలొ నాంధేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏసి బొగి ప్రమాద వశాత్తు పూర్తిగా కాలిపోయింది. థర్డ్‌ ఏసి బి1 భోగిలో మంటలు చెలరేగడంతో ప్రమాదం  సంభవించింది. ఈ ప్రమాదంలొ 23 మంది అక్కడి కక్కడే మరణించగా మరి కొంత మంది గాయపడ్డారు, క్షతగాత్రలను సమీపంలొని థర్మవరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం  జరిగిన సమయంలో భోగి మొత్తం 73 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు.

రాయలసీమ రగులుతోంది... కోస్తాంథ్ర గుండెకు గాయమైంది... జెపి

      వినడానికి సినిమా డైలాగుల్లా ఉన్నాయనుకుంటున్నారా? అన్నది ఎవరో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. ఆయన ఎవరో కాదు... లోక్‌సత్తా నేత జయప్రకాష్‌ నారాయణ. సబ్జెక్ట్‌లో ‘సత్తా’ ఉన్న నేత కూడా ఇలాగైతే లాభం లేదనుకున్నారో ఏమో... సెంటిమెంట్‌ డైలాగులు విసరడం ప్రారంభించారు. విభజన అంశంపై ఆయన శుక్రవారం వైజాగ్‌లో మాట్లాడుతూ రాజకీయలబ్థి కోసమే కాంగ్రెస్‌ రాష్ట్ర విభజనకు పాల్పడుతోందన్నారు. రెండు ప్రాంతాల్లో సీట్లు దక్కించుకోవడం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టిందన్నారు. ఈ నిర్ణయం కారణంగా రాయలసీమ రగులుతోందని, కోస్తాంథ్ర మనసు గాయపడిరదని అన్నారాయన. అన్ని ప్రాంతాల వారినీ పిలిచి మాట్లాడి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని కాంగ్రెస్‌ పార్టీ ఆలోచించడం లేదని విమర్శించారు.

జగన్‌... నోరు పారేసుకోకు...

      స్పీకర్‌ను ఉద్ధేశ్యించి జగన్‌ చేసిన వ్యాఖ్యల్ని మంత్రి బాలరాజు తీవ్రంగా ఖండిరచారు. రాజ్యాంగ వ్యవస్థనే కించపరిచే విధంగా జగన్‌ మాట్లాడారనీ, జగన్‌ అధికారం కోసమే ఇదంతా చేస్తున్నారని అందరికీ తెలుసనీ ఆయన ఎద్దేవా చేశారు. అయితే అధికారంలోకి వచ్చాక కూడా ఇదే పంథా అనుసరిస్తారా? అనేది జగన్‌ తేల్చిచెప్పాలన్నారు. మాట్లాడే హక్కుందని అన్‌పార్లమెంటరీ భాష మాట్లాడడం ప్రజాస్వామ్యవ్యవస్థల మీద గౌరవం ఉన్నవారు చేయరని ఆయన స్పష్టం చేశారు. దీనిపై జగన్‌ను అసెంబ్లీకి పిలిపించి వివరణ అడగాలన్నారు. మరోవైపు తెలంగాణనేతలు సైతం జగన్‌పై తీవ్రస్తాయిలో మండిపడ్డారు. జగన్‌ ఓ మూర్ఖుడని ఎం.పి గుత్తా సుఖేందర్‌రెడ్డి తిట్టిపోశారు. స్పీకర్‌పై వ్యాఖ్యలు జగన్‌ ఫ్యూడల్‌ మనస్తత్వానికి నిదర్శమన్నారు. స్పీకర్‌పై జగన్‌ చేసిన విమర్శల్ని ఖండిరచిన ప్రభుత్వ ఛీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి... అసెంబ్లీ సమావేశాల్లో ప్రివిలేజ్‌ మోషన్‌ ఇస్తామన్నారు.

సోనియాకు చెవుడు... జగన్‌

      కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ సీమాంధ్రవాసుల గోడును ఎందుకు వినడం లేదు? ఈ ప్రశ్నకు వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి దగ్గర చక్కని సమాధానం ఉంది. ఆ సమాధానం ఏమిటంటే... సోనియాకు చెవుడు అట. తన అటు సమైక్యం ఇటు ఓదార్పు రెండిటినీ కలుపుకుని టూ ఇన్‌ వన్‌ యాత్ర చేస్తున్న జగన్‌... శుక్రవారం మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే విద్యార్థులు, రైతులు, అన్ని విధాల నష్టపోతారని ఎంత మొత్తుకుంటున్నా చెవిటివాళ్లయిన కేంద్ర ప్రభుత్వ సారధులకు వినపడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ ఒక తాటి మీదకు రావాలని, వచ్చే ఎన్నికల్లో 30 ఎంపి సీట్లు గెలిపించుకోవాలని, సమైక్యంగా ఉంచేవ్యక్తినే ప్రధానిగా చేసుకుందామని ఆయనన్నారు. మొత్తానికి తనది చెవిటి వాడి ముందు (సమైక్య) శంఖారావం అని జగనే ఒప్పుకున్నారన్నమాట అని కొందరు గుసగుసలాడారు.

స్పీకర్ కి బుద్ది జ్ఞానం లేదుట

  జగన్ తన సెక్యూరిటీ గార్డును వంగోబెట్టి అతని వీపుని తన చెయ్యి, మైకు పెట్టుకొనే టేబిల్ గా వాడుకొని విమర్శల పాలయ్యారు. ఆ తరువాత తనని కొడుకు వంటివాడు అని అన్నందుకు దిగ్విజయ్ సింగ్ చెంప చెళ్ళుమనిపించాలన్నారు. మళ్ళీ ఇప్పుడు స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు అసలు బుద్ది జ్ఞానం ఉందా? అంటూ నోరుపారేసుకొని మరోమారు అందరి నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆపార్టీ నేత అంబటి రాంబాబు బుద్ధి జ్ఞానం అనేవేమయినా బూతు మాటలా? అని ఎదురు ప్రశ్నిస్తూ అతితెలివి ప్రదర్శిస్తున్నారు. గట్టిగా రెండు మూడేళ్ళు రాజకీయానుభవం కూడా లేని జగన్మోహన్ రెడ్డి తనకంటే వయసులో, రాజకీయానుభవంలో, ఉన్నత హోదాలో ఉన్నవారిపట్ల నోటికొచ్చినట్లు మాట్లాడటం కేవలం తన అంగబలం, అర్ధం బలం చూసుకొనేనని అర్ధం అవుతోంది. అయితే పద్దెనిమిది నెలల పాటు చంచల్ గూడా జైలులో ఉన్నపుడు, తనను తన డబ్బు, మంది మార్బలమూ కాపాడలేకపోయాయని సంగతి గ్రహించి ఉంటే ఈవిధంగా తన స్థాయికి మించి మాట్లాడి ఉండేవారు కారు. దిగ్విజయ్ సింగ్ ను చెంప దెబ్బకొట్టాలని అన్నపుడు, ఆయన కూడా జగన్ లాగ తన స్థాయి దిగజార్చుకొని మాట్లాడలేదు. సరికదా అలా అన్నపటికీ అతను నా కొడుకు వంటివాడేనని ఎంతో హుందాగా జవాబిచ్చారు. నేడు అంబటి రాంబాబు వంటి వారు జగన్ అహంకారాన్ని తెలివిగా వెనకేసుకు రావచ్చును. కానీ ఏదో ఒకనాడు అతను కూడా జగన్ అహంకారానికి బలై పార్టీ నుండి బయటకి గెంటబడే అవకాశం ఉంది.

పార్టీ నుంచి పోయేందుకు పాతికమంది రెడీ... బొత్స

      కాంగ్రెస్ పార్టీ రాష్ట్నంలో ఎంతగా దిగజారిపోయిందో జనం చెప్పుకోవడం సంగతి అటుంచితే సాక్షాత్తూ ఆ పార్టీ అధ్యక్షుడే ఒప్పుకున్నారు. పార్టీ నుంచి దాదాపు పాతికమంది ఎమ్మెల్యేలు జంప్‌జిలానీలు కానున్నారని పిసిసి అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ అంటున్నారు. అంతేకాదు... వీరిలో నలుగురు మంతుల్రు సైతం ఉన్నారట. దీనికి సంబంధించిన జాబితా ఒకటి తమ దగ్గర ఉందని ఆయన చెప్పారు. అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడిన జెసి దివాకర్‌రెడ్డికి నోటీసులు జారీ చేశామన్న బొత్స అవి ఆయన అందలేదంటున్నారన్న ప శ్నకు అందకపోతే మళ్లీ పంపుతాం అన్నారు. సాక్షాత్తూ తమ ప్రభుత్వం పైనే అవిశ్వాసం పెట్టిన స్వంత పార్టీ ఎంపీల పరిస్థితి గురించి అడిగిన పశ్న్రకు ఆయన స్పందిస్తూ వారి సంగతి అధిష్టానం చూసుకుంటుందన్నారు. కొంతమంది ప్రజల్లో ఉన్న సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలని చూస్తున్నారంటూ పరోక్షంగా టీడీపీ, వైసీపీలని దుయ్యబట్టారు. బానేఉంది కానీ...మరి తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని అక్కడ సీట్లు సాధించడానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నించడం లేదా... సత్తిబాబూ... అని కొందరు కుశాగ్రబుద్ధులు ప్రశ్నిస్తున్నారు...

మటుమాయం కానున్నఅవినీతి, అధిక ధరలు

  లోకులు కాకులవంటి వారు. అవినీతి మరకలు అంటని కాంగ్రెస్ పార్టీ గురించి అవాకులు చవాకులు వాగుతుంటారు. కాంగ్రెస్ యువరాజావారు అవినీతిని అంతం చేయాలనే సంకల్పం చెప్పుకొని స్వయంగా చొరవ తీసుకొని రెండేళ్లుగా అటక మీద పడున్న లోక్ పాల్ బిల్లుని దుమ్ముదులిపి పార్లమెంటు చేత ఆమోదింపజేసినప్పటికీ ఒక్కరు కూడా పాపం! ఆయనను మెచ్చుకొన్న పాపాన పోలేదు. నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని ఊడ్చిపడేస్తే గానీ తమకీ జ్ఞానోదయం కలగలేదా? అంటూ యువరాజవారని కూడా చూడకుండా జనాలు ఆయనతో పరాచికాలు ఆడారు.   కానీ ఆయన మాత్రం పట్టువదలని విక్రమార్కుడి వంటి వ్యక్తి గనుక ఈరోజు తమ పన్నెండు రాజ్యాల ముఖ్యమంత్రులను డిల్లీకి పిలిపించుకొని వెంటనే తమ తమ రాజ్యాల నుండి అవినీతిని, అధిక ధరలను తరిమేయమని హుకూం జారీ చేసారు. అయినా అనకూడదు కానీ, కొత్త పార్టీ పెట్టుకొని బయటకిపోయే కిరణ్ కుమా రెడ్డిని పట్టుకొని యువరాజవారు అవినీతిని, అధిక ధరలను అంతం చేయామని ఆదేశిస్తే పాపం ఆయన మాత్రం ఈ వారం పదిరోజుల్లో ఏమి చేయగలరు? అందుకే ఆయన యువరాజా వారికి ఒక దివ్యమయిన సలహా ఇచ్చినట్లు సమాచారం. మనకి చేతకాని ఈ అవినీతి, అధిక ధరల అంతం గురించి ఎంత మాట్లాడినా వచ్చేఎన్నికలలో రాష్ట్రంలో జనాలు మనకి ఓటేస్తారనే గ్యారంటీ ఏమీ లేదు. అందువల్ల వీటికంటే సమైక్యం గురించి మాట్లాడుకొంటే మనకి ఎక్కువ ‘లైక్స్’ వస్తాయని సూచించారు. కానీ యువరాజావారు ఆ సమైక్య టాపిక్ గురించి వేరేగా మాట్లాడుకొందామని, ఇప్పుడు మాత్రం అందరూ అవినీతి, అధిక ధరల గురించి అనర్గళంగా ఉపన్యసించండని ఆదేశించడంతో అందరూ దాని గురించే మాట్లాడేసి బయటపడ్డారుట. ఇంతకీ ఈ ప్రయాస అంతా అవినీతిని, అధిక ధరలను అంతం చేయడానికా లేక వచ్చే ఎన్నికలలో గెలిచేందుకు మాత్రమేనా? అని ఎవరయినా ప్రశ్నిస్తే వారి అజ్ఞానికి నవ్వుకోక తప్పదు.   గమనిక: అదృష్టవశాత్తు ఆ పన్నెండు రాజ్యాలలో మన రాష్ట్రం కూడా ఒకటి గనుక ఒకవేళ రాత్రికి రాత్రే అధిక ధరలు, అవినీతి మాయమయిపోతే ఎవరూ ఆశ్చర్యపోవద్దని మనవి.

రోశమ్మకు బాలకృష్ణ సహాయం

      మద్యపాన వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించి రాష్ట్రంలో మద్య నిషేధం విధించేలా చేసిన నెల్లూరు జిల్లా దూబగుంటకు చెందిన ఉద్యమకారిణి రోశమ్మ గుర్తుందా. మద్య నిషేధం ఎత్తేసిన తరువాత ఆమె ఎవరికీ పట్టకుండా పోయింది. అయితే ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ప్రస్తుతం నెల్లూరులోని బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.   ఆమె ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న సినీ నటుడు బాలకృష్ణ... రోశమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆమెకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. రెండు కిడ్నీలు చెడిపోయి నెల్లూరులోని బొల్లినేని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోశమ్మకు బాలకృష్ణ సేవా సమితి తరఫున దాని కన్వీనర్, టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి రూ.25 వేలు అందజేశారు. అనంతరం ఆయన బాలకృష్ణకు ఫోన్ చేయగా రోశమ్మతో ఆయన మాట్లాడారు. అనారోగ్యంపై చింతించవద్దని, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వైద్యం, ఇతరత్రా సహాయాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు అండగా నిలుస్తారని రోశమ్మకు భరోసా ఇచ్చారు.

రాహుల్ పై 'ఆమ్ఆద్మీ' అభ్యర్ధి పోటీ?

      ఢిల్లీ పీఠ౦ దక్కించుకున్న ఆమ్ఆద్మీ పార్టీ తర్వాతి టార్గెట్ ఏమిటి? మనలో ఎవరికైనా ఇలాంటి అనుమానం ఉంటే దాన్ని ఆ పార్టీ నేత కుమార్ విశ్వాస్ నివృత్తి చేశారు. ఆయన ఈ ఈరోజు ఉత్తరప్రదేశ్ లోని రాహుల గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేధీ సందర్శించనున్నారు. అక్కడ జాదు సందేశ్ యాత్రలో పాల్గొననున్నారు. అంతేకాదు నియోజకవర్గంలో ప్రజాసమస్యల పరిస్థితిని సమీక్షించనున్నారు. ఉత్తరప్రదేశ్లో ఆమ్ఆద్మీ తొలి అడుగుగా దీన్ని రాజకీయవిశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.   కొడితే కుంభస్థలాన్ని కొట్టాలనే ఆలోచనతో ఉన్న ఆమ్ఆద్మీ ..దేశ వ్యాప్తంగా కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలపైనే దృష్టి సారించిందని, అందులో భాగంగానే రాహుల్ నియోజకవర్గాన్ని లక్ష్యం చేసుకుందని విశ్లేషకుల అభిప్రాయం. ఈ యాత్రలోపాల్గొనడమే కాకుండా అక్కడ తమ పార్టీ కార్యకర్తలతో విశ్వాస్ సమావేశం కూడా నిర్వహించనున్నారని సమాచారం. కొసమెరుపు ఏమిటంటే..రానున్న లోకసభ ఎన్నికలలో రాహుల్ ప్రత్యర్ధిగా ఆమ్ఆద్మీ  విశ్వాస్ పేరు ఇప్పటికే తెరపైకి రావడం. ఒకవైపు కాంగ్రెస్ మద్దతుతో గద్దెనెక్కిన ఆమ్ఆద్మీ అదే కాంగ్రెస్ పార్టీని భావి ప్రధాని అయిన ఇలాకాలో జెండా పాతాలనుకోవడం..నిజంగా విశేషమే.  

ఓటమి వైరాగ్యం నుండి బయటపడిన కాంగ్రెస్

  రాజకీయ పార్టీలు ఎన్నికలలో ఓడిపోయినప్పుడు ఆత్మవిమర్శ చేసుకొని, అంతర్గత లోపాలను సవరించుకొని ముందుకు సాగుతామని చెప్పుకోవడం కూడా ఒక ఆనవాయితీగా మారిపోయింది. అయితే ఒక మూస ధోరణినికి అలవాటుపడిపోయిన పార్టీలు, వాటి నేతలు తమ అలవాట్లను, పద్దతులను అంత త్వరగా వదులుకోలేవని ఆ తరువాత పరిణామాలు స్పష్టం చేస్తుంటాయి. ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో ఓడిపోయిన తరువాత సోనియా, రాహుల్ గాంధీలు కూడా ఈ ఆత్మవిమర్శ పాటనే మరోమారు కోరస్ గా ఆలపించారు. కానీ, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం రెండు రోజులే అన్నట్లుగా ఈ ఆత్మవిమర్శ బాధ నుండి వారు కూడా చాల త్వరగానే బయటపడగలిగారు.   వచ్చేఎన్నికలలో విజయం సాధించడం కోసం తమ పార్టీ, ప్రభుత్వం ఏవిధంగా సన్నదమవ్వాలనే దానికంటే, తమ బలమయిన రాజకీయ ప్రత్యర్ధి నరేంద్ర మోడీని ఏవిధంగా కట్టడిచేయాలనే తీవ్రంగా ఆలోచిస్తూ, ఒక మహిళా ఆర్కిటెక్ట్ కదలికలను కనిపెట్టేందుకు మోడీ ప్రభుత్వం గూడచర్యానికి పాల్పడిందని ఆరోపిస్తూ సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జ్ నేతృత్వంలో ఒక కమీషన్ వేస్తున్నట్లు హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నిన్న ప్రకటించారు. గోద్రా అల్లర్లలో మోడీ పాత్రను పరిశోదించేందుకు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక పరిశోదనా బృందం (సిట్) మోడీకి క్లీన్ చిట్ ఇవ్వడం సబబేనని నిన్న అహ్మదాబాద్ లోని మెట్రోపోలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే, మరో కేసులో విచారణ అంటూ హోంమంత్రి కమీషన్ వేయడం చూస్తే, కాంగ్రెస్ ఎన్నటికీ తన తీరు మార్చుకో(లే)దని స్పష్టం అవుతోంది. ఈ తెలివితేటలేవో తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఉపయోగించుకోగలిగితే కొంతయిన ప్రయోజనం ఉంటుంది. కానీ, కాంగ్రెస్ పార్టీ వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా వ్యవహరిస్తోంది.