టేక్ డైవర్షన్ ప్లీజ్: కాంగ్రెస్ పార్టీ

  తన ప్రతిష్ట మసకబారిన ప్రతీసారి కాంగ్రెస్ పార్టీ ప్రజల, ప్రతిపక్షాల, మీడియా దృష్టిని కూడా వెంటనే వేరే అంశం మీదకు మళ్ళించడం అలవాటు. ఇటీవల నాలుగు రాష్ట్రాలలో ఓటమి, ముఖ్యంగా డిల్లీలో ఆమాద్మీ చీపురు దెబ్బలతో పూర్తిగా పరువుపోగోట్టుకొన్న కాంగ్రెస్ పార్టీ, రెండేళ్ళ క్రితం తను అటకెక్కించేసిన లోక్ పాల్ బిల్లును క్రిందకు దింపి, దుమ్ము దులిపి హడావుడిగా పార్లమెంటు చేత ఆమోదింపజేసింది. ఇది రాహుల్ బాబు చొరవ వలనే జరిగిందని యువరాజావారికి ఆ క్రెడిట్ కట్టబెట్టే ప్రయత్నం కూడా చేసింది. కానీ సభలోనే ఉన్నపెద్ద ముత్తెదువ సుష్మా స్వరాజ్ వెంటనే అడ్డుపడి ఆ క్రెడిట్ అంతా ఈ బిల్లు కోసమే కడుపు మాడ్చుకొంటున్న అన్నాహజారేకే దక్కాలని గట్టిగా చెప్పడంతో కాంగ్రెస్ కంగుతింది.   ఇంకా మరో ఆరు బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందవలసి ఉంది గనుక సమావేశాలను మరికొంత కాలం పొడిగించాలని యువరాజావారు ఆ(దే)శించినప్పటికీ, ‘అవిశ్వాసం..అవిశ్వాసం’ అంటూ సభలో చిందులు వేస్తున్నతమ పార్టీ యంపీల మాటవిని స్పీకర్ అవిశ్వాస తీర్మానం సభలో ప్రవేశపెడితే, లోక్ పాల్ తో పెంచుకొన్న రేటింగ్ కాస్త మళ్ళీ దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంటుందని రాజమాత భయపడ్డారో మరేమో తెలియదు, కానీ ఆమె మనసులో ఆలోచనలని భూతద్దం వేసి చదివేసినట్లు, స్పీకర్ మీరా కుమార్ పార్లమెంటును నిరవదికంగా వాయిదా వేసేసి చేతులు దులుపుకొన్నారు.   ఇక పార్లమెంటులో ఏ కుంభకోణాల గురించి ఎవరికీ జవాబులు, సంజాయిషీలు చెప్పుకొనే ఆగత్యం లేదు గనుక, కాంగ్రెస్ పార్టీ అందివచ్చిన దేవయాని ఉదంతం అందిపుచ్చుకొని మళ్ళీ హడావుడి చేస్తూ ప్రజల దృష్టి అటువైపు మళ్ళించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే డిల్లీలో అమెరికన్ ఎంబసీ ముందు ఉన్న ట్రాఫిక్ బ్యారికేడ్స్ తొలగించినంత మాత్రాన్నఈ సమస్య పరిష్కారం కాదని దేశముదురు కాంగ్రెస్ పార్టీకి తెలియకపోలేదు. కానీ తెలుగు సినిమాలు హిట్ట్ అవడానికి నాలుగు పంచ్ డైలాగులు ఒక ఐటెం సాంగ్ ఎలా అవసరమో, ఈ ఇమ్మోషనల్ ఇండో-అమెరికన్ డ్రామాతో ప్రజల దృష్టి ఆకట్టుకోవాలంటే ఇటువంటి హడావుడి కూడా అంతే అవసరమని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ తనకు బాగా తెలిసిన, అలవాటయిన టక్కుటమార విద్యలన్నిటినీ ప్రదర్శిస్తూ అందరి దృష్టి మళ్ళించేందుకు తెగ కష్టపడుతోంది.   నిజానికి దేవయాని విషయంలో పరిష్కారం కోసం భారత విదేశంగా శాఖ, అమెరికా విదేశాంగ శాఖా మరియు అమెరికా ప్రభుత్వంతో నేరుగా సంప్రదింపులు జరుపవలసి ఉంది. బహుశః అవి కూడా సమాంతరంగా జరుపుతున్నపటికీ, అది సామాన్య ప్రజల కంటికి కనబడదు గాబట్టి ప్రజలందరికీ అర్ధమయ్యే విధంగా ఈ డ్రామాలు ప్రదర్శిస్తోంది.   కాంగ్రెస్ ఊహించినట్లుగానే ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా కూడా దేవయాని అంశంలోకి పూర్తిగా షిఫ్ట్ అయిపోయారు గనుక, వారిని అందులో బిజీ బిజీగా ఉంచుతూనే, మరో పక్క వచ్చేనెల 17నుండి జరగనున్న కాంగ్రెస్ మహాసభలలో రాహుల్ బాబు యువరాజ పట్టాభిషేకానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడదీసిన తరువాత ముఖ్యమంత్రుల నియామానికి, పనిలోపనిగా మొన్ననే జైలునుండి బయటకు వచ్చిన లాలూ ప్రసాద్ ను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టెసింది. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తున్నఈ విద్యలపై విద్యార్ధులు పీ.హెచ్.డీ. కూడా చేయవచ్చును.

విలువలకే అమాద్మీ ప్రాధాన్యం

  అమాద్మీ కోరినట్లుగానే 16 అంశాలపై తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదని వెనువెంటనే కాంగ్రెస్ పార్టీ లేఖ ఇచ్చినప్పటికీ అమాద్మీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో వెనుకంజ వేస్తుండటంతో, కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.   ఈ నేపధ్యంలో ఆపార్టీ నేత అరవింద్ కేజ్రీ వాల్ మీడియాతో మాట్లాడుతూ, “వ్యక్తిగతంగా నాకు కాంగ్రెస్, బీజేపీల మద్దతు స్వీకరించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇష్టం లేదు. కానీ, ఇప్పుడు నా ఇష్టాఅయిష్టాల కంటే, ప్రజల అభిప్రాయానికే ప్రాధాన్యం ఇస్తాము. అందుకే మేము డిల్లీలో 25లక్షల మంది ప్రజల నుండి అభిప్రాయం సేకరిస్తున్నాము. వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరితే తప్పకుండా వారి ఆదేశాలను శిరసావహిస్తాము. వద్దంటే ప్రతిపక్షంలో కూర్చొంటాము."   "ఇంతవరకు ప్రజలు ఓట్లు వేయడం వరకే భాద్యత, ఆ తరువాత మొత్తం వ్యవహారమంతా నాలుగు గోడల మధ్య సూట్ కేసులతో కూర్చొనే రాజకీయ నాయకులదే అన్నట్లు సాగుతోంది. కానీ, మేము ఆ దుస్సంప్రదాయానికి పూర్తి భిన్నంగా, పూర్తి పారదర్శకతతో ప్రజల మధ్యనే ఈ వ్యవహారంపై తగు నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాము. అయితే దీనిని అలుసుగా తీసుకొని కొందరు నేతలు, వారి పార్టీలు మేము బాధ్యత తీసుకోవడానికి భయపడి పారిపోతున్నామని చాటింపు వేస్తున్నారు. అందుకు మేము భయపడేది లేదు."   "ప్రజలెన్నుకొన్న ప్రతినిధులు, వారి ద్వారా ఏర్పడే వ్యవస్థలు పూర్తిగా ప్రజలకే జవాబుదారీగా ఉండాలనే మా ఆలోచన, డబ్బు సూటు కేసులతో రాజకీయాలు చేసే వారికి చాలా విడ్డూరంగా, అర్ధం లేనిదిగా కనిపించవచ్చును. కానీ, నిజానికి ప్రజా ప్రతి నిధులు, వ్యవస్థలు ఈవిధంగానే జవాబుదారీతనంతో పనిచేయాలని ప్రజలు భావిస్తారు. అందుకే మేము ప్రజలకే మేము కట్టుబడి ఉంటాము తప్ప ఇతర రాజకీయ పార్టీల అభిప్రాయాలకు, విమర్శలకు కాదు."   "చాలా మంది ప్రజలు, మా పార్టీలో కూడా అనేకమంది కాంగ్రెస్ బేషరతు మద్దతు ఇస్తోంది గనుక దానిని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఈ నాలుగు నెలల సమయంలో మా సమర్ధత నిరూపించుకొనగలిగితే రానున్నసార్వత్రిక ఎన్నికలలో కూడా ఘన విజయం సాధించవచ్చని సూచిస్తున్నారు. వారు చెపుతున్నది నిజమే అయినప్పటికీ, మొన్న జరిగిన ఎన్నికలలో మా పార్టీ కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేఖంగా ప్రచారం చేసి, వారి భ్రష్ట రాజకీయాల నుండి ప్రజలకు విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ వారితోనే చేతులు కలపితే, మాపార్టీ కూడా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినట్లవుతుంది. అందుకే ప్రస్తుత పరిస్థితి వారికి వివరించి, మేము ఏవిధంగా వ్యవహరించాలని వారి అభిప్రాయం కోరుతున్నాము."   "ప్రజలను యస్.యం.యస్., ఈ-మెయిల్ మరియు ఇతర మార్గాల ద్వారా తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయమని కోరాము. వారి స్పందన, సలహాల మేరకు మేము త్వరలోనే సముచిత నిర్ణయం తీసుకొంటాము,” అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

లోక్ సభకు చంద్రబాబు!!

      తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల ఏర్పాటుతో వాటిలో ఏదో ఒకదానికి పరిమితం కావడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేరని అంటున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి వచ్చే ఎన్నికల్లో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లోకసభకు పోటీ చేయాలని అనుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విభజన ప్రక్రియ పూర్తి చేయడానికి తగిన సమయం లేనందున అసెంబ్లీకి కాకుండా కేవలం లోక్‌సభకు మాత్రమే ఎన్నికలు జరిగితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లోక్‌సభకు పోటీచేసే అవకాశముందనే ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి.   చంద్రబాబు ఇప్పటిదాకా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించలేదు. ఆరుసార్లుగా అసెంబ్లీకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా కుప్పం నుంచే పోటీకి సన్నాహాలు చేసుకొంటున్నారు. కానీ అసెంబ్లీకి ఆగి, లోక్‌సభకు మాత్రమే ఎన్నికలు జరిగితే చంద్రబాబు ఎంపీగా పోటీచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ నాయకులు కొందరు చెబుతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ఇతర పార్టీలకు దీటుగా తెలుగుదేశం పార్టీ సత్తా చాటడానికి వ్యూహరచన చేసుకుంటోంది. చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ సీమాంధ్రపై దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. కేవలం లోక్‌సభ ఎన్నికలు జరిగితే సినీ హీరో బాలకృష్ణ కూడా సీమాంధ్రలో ఒక చోటి నుంచి లోక్‌సభకు పోటీచేసే అవకాశముందని, బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి అత్యధిక సీట్లు గెలుచుకోవడమే టీడీపీ వ్యూహమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

వైయస్ జగన్ కు నారా లోకేష్ సవాల్

      వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి నారా లోకేష్ సవాల్ విసిరారు. తెలుగుదేశం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధి పై చర్చకు సిద్దమని, జగన్మోహన్ రెడ్డి తమ సవాలు స్వీకరించడానికి సిద్దమేనా? అని లోకేష్ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి తనకు ఎంతకీ బెయిలు దొరకకపోవడంతో చివరికి సోనియా గాంధీని బ్రతిమాలుకొని బెయిలు తెచ్చుకున్నారని ఆరోపించారు. తొమ్మిదేళ్ళ తెదేపా హయంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తే, దానిని ఆ తరువాత వచ్చిన వైయస్సార్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సర్వనాశనం చేశాయని విమర్శించారు.   తెదేపా ప్రభుత్వ పగ్గాలు చెప్పట్టేనాటికి రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ కొరత ఉండేదని, చంద్రబాబు కృషితో ఐదు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని పెంచగలిగారని తెలిపారు. విద్యుత్ ఉంటేనే పరిశ్రమలు, పరిశ్రమలు ఉంటేనే ఉద్యోగాలు ఉంటాయని గ్రహించిన తెదేపా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి రంగానికి పెద్ద పీట వేసిందని ఆయన అన్నారు. కానీ ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడి పరిశ్రమలు మూతపడుతున్నాయని, తత్ఫలితంగా మళ్ళీ నిరుద్యోగ సమస్య తీవ్రం అయ్యిందని తెలిపారు. తెదేపాను నిత్యం విమర్శించే కేసీఆర్, తెదేపా ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రమ్మని చంద్రబాబు సవాలు విసిరితే తన ఫాంహౌస్ లోకి దూరి దాకోన్నారని లోకేష్ ఎద్దేవా చేశారు.

కొండను తవ్వి లోక్‌పాల్‌ పట్టారా?

  బోలెడంత హంగామా చేసి, మిన్నునూ మన్నునూ ఏకం చేసినంత పని చేసి చివరికి లోక్‌పాల్‌ను సాధించారు. అంతా అయ్యాక.. ఇప్పుడు సాధించిన వారే అంటున్న మాటలు వింటుంటే.. సగటు జీవికి పై విధంగా సందేహం కలగడంలో ఆశ్యర్యం లేదు. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కొందరు రాజకీయ నేతలు, ఉద్యమకారులు స్పందించిన తీరు చూండండి మరి.. లోక్‌పాల్‌ సాధనలో కర్త కర్మ క్రియ అయిన అన్నా హజారే దీక్ష విరమణ అనంతరం ఏమన్నారంటే. 'లోక్‌పాల్‌ సభ ఆమోదం పొందడం హర్షణీయం.. అయితే దీనితో అంతా అయిపోతుందనుకోలేం. అవినీతి వ్యతిరేఖపోరాటంలో ఇదో ముందడుగు మాత్రమే'ఈ బిల్లు రావాల్సిదేనని కాంగ్రెస్‌ తరపున గట్టిగా పట్టుపట్టి హజారేతో సైతం శభాష్‌ అనిపించుకున్న రాహుల్‌గాంధీ ఏమన్నారంటే.. ' లోక్‌పాల్‌ ఆమోదం పొందడం పట్ల సంతోషంగా ఉంది. అయితే లోక్‌పాల్‌తో మాత్రమే అవినీతి నిర్మూలన సాధ్యమయ్యే పనికాదు. ఇలాంటి చట్టాలు మరిన్నిరావాలి' ఆది నుంచి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకున్న ఆమ్‌ఆద్మీనేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఏమన్నారంటే.. 'ఈ బిల్లులో అవినీతికి వ్యతిరేకంగా పటిష్టమైన చట్టంపై స్పష్టత లేదు, బిల్లు విషయంలో కాంగ్రెస్‌ అన్నాహజారేనే తప్పు దారి పట్టించింది'.]   అవినీతి పోరాటంలో అన్నాహజారేకు పూర్తి మద్దతు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు ఏమాన్నారంటే.. ' లోక్‌పాల్‌ బిల్లు ఆమోదం వెనుక అన్నాహజారే కృషి వెలకట్టలేనిది. ఈ బిల్లును మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నం జరగాలి'. నేరమయరాజకీయాలకు వ్యతిరేకంగా ఆంద్రప్రదేశ్‌లో లోక్‌సత్తాను ఏర్పాటుచేసిన జయప్రకాష్‌ నారాయణ్‌ ఏమన్నారంటే.. ' ఈ బిల్లు రాజకీయలబ్థి కోసం మాత్రమే. కేవలం 2 వేల మందికి పరిమితమైన దీని ద్వారా సాధించేదేమి లేదు'.

మళ్ళీ ముఖ్యమంత్రికి డిల్లీ పిలుపు దేనికి?

  మంగళవారం లోక్ సభలో లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందిన తరువాత పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అవిశ్వాసం తీర్మానం అని ఎగిరేగిరిపడిన కాంగ్రెస్ యంపీలు కూడా తట్ట బుట్టా సర్దుకొని మళ్ళీ రాష్ట్రానికి తిరిగివచ్చేస్తారు. అందువల్ల కాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ రాష్ట్ర విభజన బిల్లుపై కసరత్తు మొదలుపెట్టేందుకు సిద్దం అవుతోంది.   ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో కానీ, శాసనమండలిలో గానీ తెలంగాణా బిల్లుపై చర్చ జరిగే వాతావరణం కనబడటం లేదు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీబిల్లుపై మాట్లాడి బుక్కయిపోకూడదనే ఉద్దేశ్యంతో ఉభయ సభలను నడవనీయకుండా అడ్డుపడుతూ, బహుశః రాష్ట్రపతి ఇచ్చిన జనవరి23 గడువు వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగించే అవకాశాలున్నాయి.   తెదేపా, వైకాపా మరియు సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ఈ ఉద్దేశ్యాన్నికనిపెట్టిన తెరాస, టీ-కాంగ్రెస్ మరియు బీజేపీలు బిల్లుపై ఎటువంటి చర్చలేకుండానే రాష్ట్రపతికి త్రిప్పిపంపాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ పై ఒత్తిడి తెస్తున్నాయి. ఇక ఇటీవల దిగ్విజయ్ సింగ్ తో బొత్స సత్యనారాయణ ఇంటిలో భోజన సమావేశం తరువాత పూర్తిగా చల్లబడిపోయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా బిల్లుపై ఇదివరకులా రంకెలు వేయడం లేదు. అదేవిధంగా ఆయన సహచర మంత్రులయిన గంటా శ్రీనివాసరావు, శైలజానాథ్, టీజీ వెంకటేష్ తదితరులు కూడా ఇప్పుడు పూర్తిగా చల్లబడిపోయారు.   అందువల్ల పూర్తి అనుకూలంగా ఉన్న ఇటువంటి సమయంలో బిల్లును తిరిగి వెనక్కి రప్పించుకోగలిగితే, వెంటనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చుననే ఆలోచనతోనే కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని డిల్లీకి పిలిచి ఉండవచ్చును.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ విధేయుడుగానే ఉంటారని, రాష్ట్ర విభజనకు పూర్తిగా సహకరిస్తారని గతంలో దిగ్విజయ్ సింగ్ చాలా సార్లు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే కిరణ్ కుమార్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నారు గనుక, ఇక ఎన్నికల వరకు ఆయనను మార్చే అవసరం కూడా లేదు. కనుక, ప్రస్తుతం శాసనసభలో ఉన్న తెలంగాణా బిల్లుపై కనీసం తెలంగాణా సభ్యుల ఆమోద ముద్ర వేయించేసి, వీలయినంత త్వరగా రాష్ట్రపతికి త్రిప్పి పంపమని కాంగ్రెస్ అధిష్టానం ఆయనను ఆదేశించవచ్చును.

యువరాజ పట్టాభిషేకం

  నిజంగా నువ్వు చాలా గ్రేట్ మమ్మీ!   ఏమిటి నువ్వు కూడా మన కాంగ్రెస్ నేతల్లాగే భజన చేస్తున్నావు? కొంపదీసి సహవాస దోషమా ఏమిటి?   బాగుంది.. యువరాజుని నేను భజన చేయడమేమిటి? నాలుగు రాష్ట్రాలలో ఓడిపోయి మన పరువు పోయిందని మన కంటే ఎక్కువగా ప్రజలు, ప్రతిపక్షాలే మనకి గుర్తుచేసి మనల్ని ఏడిపిస్తుంటే వాళ్ళని లోక్ పాల్ బిల్లుతో భలే మాయ చేసావు మమ్మీ. నిజంగా యువార్ గ్రేట్ మమ్మీ! ఈ వెర్రి జనాలు అప్పుడే ఆ సంగతి మరిచిపోయి, లోక్ పాల్ బిల్లుని చూసి ఎలా చంకలు కొట్టుకొంటున్నారో చూస్తే నవ్వాపుకోలేక పోతున్నామమ్మీ! పైగా మనోళ్ళు అందరూ అది నా గొప్పదనమేనని ఓ..కోరస్ గా ఒకటే భజన చేసేస్తుంటే..నాకు కూడా మొన్న ఎన్నికలలో ఓడిపోయిన దుఃఖం పూర్తిగా పోయింది మమ్మీ! రియల్లీ యువ్వార్ గ్రేట్ మమ్మీ!   ఒరేయ్!కన్నా ఇక ఆపరా ఆ భజన రోజూ మనవాళ్ళ భజనలు వినివినీ చెవులు చిల్లులు పడిపోతుంటే ఇక నువ్వు కూడా తయారయ్యావా?   ఏమిటి మమ్మీ నేను నీ ట్రిక్ చూసి చాలా థ్రిల్ అయిపోయి ఆనందం పట్టలేక చెపుతుంటే భజన అని అలా తీసి పారేస్తావు?   ఆ పోనీలే..కోప్పడకు.. అయితే ఇంతకీ ఏమంటావు? నేను గ్రేట్ అంతేనా?   యస్ మమ్మీ! యువ్వార్ రియల్లీ గ్రేట్! టెర్రిఫిక్.. లేకుంటే ఇంతవరకు మనం తయారుచేసిన లోక్ పాల్ బిల్లు ఒట్టి వేస్ట్ అంటూ మనల్ని తిట్టి పోసిన ఆ అన్నాహజారే చేతే మన “కాంగ్రెస్ పార్టీయే లోక్ పాల్ బిల్లు కోసం చాలా శ్రమ పడింది. అందుకు పార్టీకి చాలా థాంక్స్” అని కూడా చెప్పించావు. అందుకే యువ్వార్ రియల్లీ ఎక్సట్రార్డినరీ పర్సన్న్..అని నేను అంటుంటే నువ్వేమో భజన అంటూ తీసి పారేస్తున్నావు.   ఏమిటో రా.. మీ డాడీ పోయినప్పటి నుండి ఈ భజనలు వినివినీ ఉన్నమాట చెప్పినా కూడా నాకు భజనలాగే వినిపిస్తోంది. అయినా ఒకటి గుర్తుంచుకో జనాలు అడిగారని ఏదీ వెంటనే ఇచ్చేయకూడదు. వాళ్ళు మనల్ని బ్రతిమాలుకొని, తిట్టుకొని ఇక వల్ల కాదనుకొంటున్నప్పుడే ఏదయినా ఇవ్వాలి. ఇది కూడా అంతే.అప్పుడు మనం ఇచ్చిందే గొప్పనుకొని ఆ తిట్టిన నోళ్ళతోనే మనకి భజనలు చేస్తారు.. ఇంకా భక్తి ఎక్కువయిపోతే  మనకి గుళ్ళు గోపురాలు కూడా కట్టి పూజిస్తారు. నువ్వు కూడా ఇటువంటి ట్రిక్స్ నేర్చుకోకపోతే ఇక దేశాన్ని ఎలా పాలిస్తావు? ఈ ప్రతిపక్షాలని, ప్రజలని ఎలా మేనేజ్ చేస్తావురా కన్నా... నువ్వు చూస్తే ఎప్పుడూ పార్టీ ప్రక్షాళన, రాజకీయ ప్రక్షాళన, దేశం, యువత, అభివృద్ధి అంటూ ఏవేవో మనకి అలవాటులేని మాటలన్నీ మాట్లాడుతుంటావు తప్ప.. మన మోహన్ అంకుల్ కుర్చీలో కూర్చోడానికి ఇష్టపడవు. ఇలాగయితే ఎలారా కన్నా? మళ్ళీ ఆ మోడీ అంకుల్ ఆ కుర్చీలో ఒకసారి సెటిల్ అయిపోతే ఇక అతనిని అందులోంచి లేపడం ఇక ఎవరి తరమూ కాదు..ముందే చెపుతున్నాను... జాగ్రత్తపడు. ఆ..   ఏమిటి మమ్మీ నేను మరీ అంత మొద్దబ్బాయిలా కనిపిస్తున్నానా నీకు కూడా? నాకు మాత్రం ఆ కుర్చీలో కూర్చోడం ఇష్టం లేకనే అలా మాట్లాడుతున్నానంటావా? నేను వద్దని అంటుంటే వాళ్ళు నాకు అసలు పదవీ వ్యామోహం లేదని ఎలాచెప్పుకొంటున్నారో ఎప్పుడయినా విన్నావా? ఈ జనరేషన్ గ్యాప్ వలన నువ్వు నా కాన్సెప్ట్ సరిగ్గా క్యాచ్చ్ చేయలేకపోతున్నావు మమ్మీ. పోనీ... నీ కాన్సెప్ట్ ప్రకారం ఇద్దరం కాళ్ళకి బలపాలు కట్టుకొని తిరిగినా ఒక్క రాష్ట్రంలో గెలిచామా చెప్పు? ఇప్పుడు జనాలకి ఇష్టమయిన నాలుగు మాటలవే..కావాలంటే ఓసారి ఏ ఫేస్ బుక్కులోకో ట్వీటర్లోకో వెళ్లి చూడు నీకే అర్ధం అవుతుంది నేను చెపుతున్న మాటలే జనాలు బాగా లైక్ చేస్తారని.   అవునురా కన్నా... నువ్వు చెప్పిందే నిజమనుకో.. అయినా ముసలి దాన్నయిపోతున్నాను కదా...నాకా ఫేస్ బుక్కులు అవీ ఏమి తెలుస్తాయి చెప్పు...బహుశః అలాంటి మాయ మాటలు చెప్పే ఆ చీపురు పార్టీ వాళ్ళు డిల్లీలో జనాలని తమ బుట్టలోపడేసుకొన్నారు. లోకంలో ఎక్కడా నీతి నిజాయితీ లేకుండా పోయాయిరా అబ్బాయ్! లేకుంటే 15ఏళ్ల నుండి మనం కారులోంచి కాలు క్రింద పెట్టకుండా కనుసైగ చేస్తే వచ్చి ఓటేసే డిల్లీలో జనాలు ఎవరో చీపురు పట్టుకొని వచ్చి ఓటేయమని అడిగితే వాళ్ళకీ ఓటేసేయడమే.. బుర్ర బుద్దీ లేకపోతే సరి!   పోనీలే..నువ్వు కూడా వచ్చేఎన్నికలలోగా జనాలకి బాగా ఎక్కే ఆ నాలుగు మంచి ముక్కలు మాట్లాడటం నేర్చుకో...   అప్పుడెప్పుడో మీ నాయనమ్మ కూడా ఇలాగే ఈ జనాలు తిక్కతిక్కగా వ్యవహరిస్తుంటే ‘గరీబీ హటావ్’ అంటూ ఓసారి గెలిచింది. ఏవో ఇరవయ్యో, ముప్పయ్యో సూత్రాలంటూ మరోసారి గెలిచింది. నువ్వు కూడా అలాంటివే ఏవయినా నేర్చుకోరా.. బాబు! ఓసారి నువ్వా మన్మోహన్ అంకుల్ కుర్చీలో కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉంటె మన జనాలు నీకు కూడా భజనలు, స్తోత్రపాటాలు చదువుతుంటే చూడాలని ఉందిరా కన్నా. ఆ ఒక్కటీ సాధించు చాలు..మరి నాకింకేమీ అక్కరలేదు.   స్యూర్ మమ్మీ... ఐ విల్ ట్రై మై బెస్ట్..బట్ ఆంటిల్ దెన్ ఐ నీడ్ యువర్ హెల్ప్ అండ్ సప్పోర్ట్ మమ్మీ..   ఓ.. వైనాట్ బేటా..నేనేమిటి.. మన కాంగ్రెస్ గ్యాంగ్ అంతా నీ వెనుకే ఉంటారు.. ప్రొసీడ్..

కిషన్ రెడ్డిని లైట్ తీసుకుంటున్న బిజెపి

  రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకి మద్దతిస్తామని మొదటి నుంచి చెబుతున్న బిజెపి పునరాలోచన చేస్తుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదే విషయమై ఇటీవల కిషన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపి౦చిన బిజెపి అధిష్టానం దీనిపై సుదీర్ఘ౦గా చర్చించిన తరువాత తెలంగాణ బిల్లుకు మద్దతిస్తే కాంగ్రెస్ కి తప్ప బిజెపికి ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నట్టు సమాచారం.   ఈ సంధర్బంగా తెలంగాణలో ఎన్నిసీట్లు వస్తాయని ఆరా తీయగా కిషన్ రెడ్డి చెప్పిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన బిజెపి అధిష్టానం కిషన్ రెడ్డి నోటి పవర్ని కాస్త తగ్గించమని ఆదేశాలు జారీ చేశారట. రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు ఇస్తే తెలంగాణకి ఏకపక్షంగా మద్దతు ప్రకటించి మొత్తం రాష్ట్రంలోనే బీజేపీ దుకాణం సర్దేసే పరిస్థితి తెచ్చావని అధిష్టానం అన్నట్లు తన సన్నిహితుల వద్ద కిషన్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారట.  దీంతో తెలంగాణ బిల్లుకి బిజెపి మద్దతు డౌటేనని అంటున్నారు రాజకీయ నిపుణులు.                       

'విప్పడం' తప్పుకాదట ...

      తనిఖీ పేరుతొ మన మహిళా దౌత్యాధికారి దేవయానికి సంకెళ్ళు వేయడం, దుస్తులు విప్పి మరీ సోదాలు చేయడం ... ఈ విషయంపై భారతదేశం స్పందించిన తీరు పట్ల అమెరికా విచారం వెలిబుచ్చింది. దౌత్యాధికారిపై దురంతానికి భారత్ తీవ్రంగా ప్రతిస్పందించడంతో దిగివచ్చిన అగ్రరాజ్యం ... బుధవారం సంఘటన పట్ల వివరణ ఇచ్చింది. భారతీయుల మనోభావాలు దెబ్బతినడం దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తూ భద్రతా పరంగా తాము తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలు, కఠినమైన చట్టాలను ఎకరుపు పెట్టింది. ఇదంతా అందులో భాగమే తప్ప కావాలని చేసింది కాదనీ, భారతదేశంతో సహృద్భావ సంబంధాలు మరింత పెంపొందించుకోవాలని తాము కోరుకుంటున్నామంది.

కొనసాగుతున్న శాసనసభ వాయిదాల పర్వం

  తెలంగాణా బిల్లుపై ఎటువంటి చర్చ చేప్పట్టకుండానే శాసనసభ, శాసనమండలి రెండూ కూడా రేపటికి వాయిదాపడ్డాయి. సభలో సీమాంధ్రకు చెందిన తెదేపా, వైకాపా కాంగ్రెస్ సభ్యులు సభాకార్యక్రమాలు జరుగకుండా అడ్డుపడుతుండటంతో ఉభయ సభలు రేపటికి వాయిదాపడక తప్పలేదు. సీమాంధ్రకు చెందిన తెదేపా నేతలు రాష్ట్రపతి పంపిన టీ-బిల్లులో విభజనపై సమగ్ర సమాచారం లేదని, అందువల్ల బిల్లుపై చర్చ వాయిదా వేసి కేంద్రం నుండి సమాచారం రప్పించిన తరువాతనే బిల్లుపై చర్చ జరపాలని లేఖ ఇచ్చారు.   ఇక వైకాపా, సభలో ముందుగా సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ సభను స్తంభింపజేసింది. తెరాస నేతలు అసలు ఎటువంటి చర్చ అవసరం లేదని, తాము తమ అభిప్రాయాలను నేరుగా రాష్ట్రపతికే పంపుతామని తెలియజేస్తూ ఒక లేఖ ఇచ్చారు.    సభ మళ్ళీ మూడోసారి సమావేశమయినప్పుడు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభ యొక్క తరువాత సమావేశపు తేదీలను ప్రకటిస్తారని అందరూ భావించినప్పటికీ ఎందువలననో ఆయన ప్రకటించలేదు. వచ్చేనెల 3నుండి 13వరకు, మళ్ళీ 16నుండి 23వరకు శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించవచ్చని సమాచారం. కానీ, టీ-కాంగ్రెస్, తెరాస నేతలు బిల్లుపై చర్చను ఈ నెలాఖరులోగానే ముగించి రాష్ట్రపతికి తిప్పి పంపేయాలని స్పీకర్ పై ఒత్తిడి తెస్తున్నారు. అసలు సభలో బిల్లుపై చర్చ జరిగే వాతావరణమే లేనందున బిల్లును వెంటనే రాష్ట్రపతికి త్రిప్పి పంపేయాలని కోరుతున్నారు.

ఉద్యమంలో ఉన్నానంటున్న 'నెల'బాలుడు

      "నాది విశాలాంధ్ర వాదం'' అన్నారాయన. సమైక్యం విన్నాం, విభజనవాదం విన్నాం. ఈ విశాలాంధ్ర వాదం ఏమిటి? దీన్ని మోసుకోచిన కొత్త శాల్తీ ఎవరా అనుకుంటున్నారా? రాష్ట్రానికి అత్యధికకాలం ముఖ్యమంత్రిగా చేసింది చంద్రబాబునాయుడు అని మనకు తెలుసు. మరి అత్యల్పకాలం చేసింది ఎవరు? ఆయనేనండీ మన రాష్ట్రానికి నెలరోజుల ముఖ్యమంత్రిగా రికార్డ్ సృష్టించిన నాదెండ్ల భాస్కర్ రావు. ఆయన అకస్మాత్తుగా బుధవారం వెలుగులోకి వచ్చారు. "నేను గతంలో విశాలాంధ్ర ఉద్యమాల్లో పాల్గొన్నా''నంటూ ఆయన విలేఖరులకు వివరించారు. ఎవరి బాగు కోసం, ఎవరి లాభం కోసం ఈ విభజన అంటూ గర్జించారు. ఈ విభజనతో ఏమీ సాధించలేమని తేల్చేశారు. అసలు తెలంగాణా ముసాయిదా బిల్లులో పసలేదని, అదంతా తప్పుల తడకనీ తెలంగాణా అని ఉండాల్సిన చోట తమిళనాడు అని ఉందంటూ ఎద్దేవా చేశారు. ఈ తప్పుల బిల్లును పాస్ చేయించాలనే కేంద్రం పప్పులు ఉడకబావని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం సమైక్య, విభజన గందరగోళాలకు కేంద్రంగా మారిన అసెంబ్లీని నడిపే సారథి ఈయన కుమారుడైన నాదెండ్ల మనోహర్ కావడం కొసమెరుపు. ఏమైతేనేం ... సమైక్యానికి మరో గళం కలిసింది.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సమాప్తం

  ఈ నెల 20వరకు జరుగవలసిన పార్లమెంటు శీతాకాల సమావేశాలను రెండు రోజుల ముందుగానే ఈరోజు ముగిసాయి. ఈ రోజు లోక్ సభలో లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందిన తరువాత పార్లమెంటును నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మీరా కుమార్ ప్రకటించారు. అందువల్ల ఇక తెలంగాణా బిల్లు కోసం పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశమవవలసి ఉంటుంది. లేదా ఫిబ్రవరి నుండి మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టవలసి ఉంటుంది.   సమావేశాల ముగిసిన వెంటనే కాంగ్రెస్ యంపీ సబ్బంహరి మీడియాతో మాట్లాడుతూ, తాము చెప్పినట్లే తెలంగాణా బిల్లు పార్లమెంటు శీతాకాల సమావేశాలలో రాకుండా అడ్డుకోగాలిగామని, అందువల్ల ఇక బడ్జెట్ సమావేశాల వరకు టీ-బిల్లు పార్లమెంటుకు వచ్చే అవకాశం లేదని, ఒకవేళ వచ్చినా దానిని తాము ఇదేవిధంగా అడ్డుకొంటామని, ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజన జరగనీయకుండా అడ్డుకొనేందుకు శతవిధాల ప్రయత్నిస్తామని ఆయన అన్నారు.

బుధవారం బుద్దొచ్చింది ...

      ఎట్టకేలకు సీమాంధ్ర ఎమ్మెల్యేలకు జ్ఞానోదయం అయినట్టే ఉంది. ఇప్పటిదాకా సమైక్య పార్టీ అనే క్రెడిట్ కొట్టేయడానికి తమలో తాము కొట్టుకుంటూ కూర్చున్న పార్టీల ప్రతినిథులంతా బుధవారం బుద్ది తెచ్చుకున్నారు. విభజించు పాలించు సూత్రాన్ని అనుసరిస్తూన్న కేంద్రం తమలో తమకు చిచ్చుపెట్టి విభజన కార్యక్రమాన్ని సజావుగా పూర్తి చేసేందుకు వ్యూహం రచించినట్టు కనిపిస్తుండటంతో ... ఇక అంతా కలిసి కేంద్రంపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో చకచకా చోటుచేసుకున్న పరిణామాల్లో ఇదే కీలక అంశం. కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీలకు చెందినా శాసనసభ్యులు కలిసికట్టుగా చేసే ... సమైక్యపోరాటంలో భాగంగా కేంద్రప్రభుత్వానికి, రాష్ట్రపతికి అఫిడవిట్లు సమర్పించనున్నామని తెలిపారు.

దేవయానితో అనుచితంగా వ్యవహరించలేదు: అమెరికా

  భారత దౌత్యాదికారిణి దేవయాని కోబ్రగాడే పట్ల న్యూయార్క్ పోలీసులు అనుచితంగా ప్రవర్తించడమే గాక నేటికీ ఆమెను ఇతర నేరస్తులతో కలిపి జైలులో బందించి ఉంచారు. అందుకు భారత్ తీవ్ర నిరసన, ఆగ్రహం వ్యక్తం చేసి, ఆమెను తక్షణమే విడుదల చేసి భారత్ కు త్రిప్పిపంపాలని, జరిగినదానికి అమెరికా ప్రభుత్వం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరింది. భారత్ తన నిరసన తెలియజేసేందుకు అనేక చర్యలు చెప్పటింది.   అయితే న్యూయార్క్ రాష్ట్ర అధికార ప్రతినిధి మేరీ హర్ఫ్ మీడియాతో మాట్లాడుతూ జరిగినదానిపై ఎటువంటి పశ్చాత్తాపము కనబరచకపోగా, తమ దేశ చట్టాలకి లోబడే దేవయానిపై చర్యలు తీసుకొన్నామని, తమ పోలీసు అధికారులు కూడా నిబంధనల ప్రకారమే ఖైదీలందరినీ ఏవిధంగా విచారిస్తారో అదేవిధంగా ఆమెను కూడా విచారించారని తెలిపారు. అందువల్ల ఇటువంటి అంశం భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతంగా కలిగే విధంగా వ్యవహరించకూడదని ఆమె భారత్ కు సుద్దులు చెప్పడం విశేషం. ఏమయినప్పటికీ, దేవయాని పట్ల తమ పోలీసు అధికారులు అనుచితంగా వ్యవహరించారో లేదో తెలుసుకొంటామని, అలాగే తమ చట్టపరిధిలో ఆమె విడుదలకు గల అవకాశాలను తప్పక పరిశీలిస్తామని హామీ కూడా ఇచ్చారు.   ఒక మహిళా అధికారి అయిన మేరీ హర్ఫ్ సాటి మహిళ పట్ల జరిగిన అనుచిత వ్యవహారాన్ని ఖండించకపోగా ఈవిధంగా మాట్లాడటం సిగ్గు చేటు.

తెలుగు ప్రజలతో ఆడుకొంటున్నస్టార్ బ్యాట్స్ మ్యాన్

  రాష్ట్ర విభజన ప్రక్రియ సజావుగా ముందుకు సాగడానికి తెలంగాణావాదులు ఒట్టి హడావుడి తప్పచేసిందేమీ లేదు. కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొదటి నుండి రాష్ట్ర విభజన తీవ్రంగా వ్యతిరేఖిస్తూ, తన అధిష్టానాన్ని సైతం ధిక్కరిస్తూనే, తెలంగాణా బిల్లు శాసనసభకు వచ్చేక అడ్డుకొందామని చెపుతూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరినీ నిలువరించి, రాష్ట్ర విభజన ప్రక్రియకు ఎటువంటి ఆటంకాలు ఎదురవకుండా ఇంతవరకు తీసుకు రాగలిగారు. ఈ స్టార్ బ్యాట్స్ మ్యాన్ సీమాంధ్ర తరపున ఆడుతూనే తెలంగాణా టీముని గెలిపించేందుకు శాయాశాక్తులా కృషిచేసారు. అందుకు తెలంగాణావాదులందరూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవలసిందే.   తెలంగాణా బిల్లుపై చర్చను ఎప్పుడు, ఎన్ని రోజులు చెప్పట్టాలనే విషయం తేల్చేందుకు నిన్నశాసనసభ బిజినస్ అడ్వయిజరీ కమిటీ సమావేశమయినప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి అదే ధోరణి ప్రదర్శిస్తూ సమావేశంలో మధ్యలోంచి లేచి వెళ్ళిపోయారు. ఓటింగే ఉండని బిల్లుని తాము ఓటింగులో ఓడించేస్తామని ఇంతవరకు సీమాంధ్ర ప్రజలను మభ్యపెడుతూ వచ్చిన ఆయన, ఆయన అనుచరులు ఇప్పుడు బిల్లుకి వ్యతిరేఖంగా అఫిడవిట్లు ప్రవేశపెడతామంటూ మరో కొత్త నాటకం మొదలుపెట్టారు.   ముఖ్యమంత్రి రాష్ట్ర విభజనను అడ్డుకోలేకపోయినా సీమాంధ్ర ప్రజలు ఏమనుకొనేవారు కాదు. కానీ తమ తరపున పోరాడుతున్నట్లు నటిస్తూ నేటికీ ఈవిధంగా తమను మభ్యపెట్టాలని ప్రయత్నించడమే జీర్ణించుకోలేకపోతున్నారు. విభజనను అడ్డుకొంటానని అటు తెలంగాణా ప్రజలకు, అడ్డుకొంటునట్లు మభ్యపెట్టినందుకు సీమాంధ్ర ప్రజలకు ఆయన తీవ్ర ఆగ్రహం కలిగించారు. అందువల్ల ఆయన పరిస్థితి రెంటికీ చెడిన రేవడిగా మారడం ఖాయం. తను ఏ సమైక్యవాదంతో ప్రజల దృష్టిలో ఛాంపియన్ గా ఎదిగారో, ఇప్పుడు దానికారణంగానే పరువుపోగోట్టుకోవడం ఖాయం. మరి ఆయనకు వంతపాడుతూ నేటికీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న సీమాంధ్ర శాసనసభ్యులు, మంత్రులకు అదే దుస్థితి ఎదురవడం తధ్యం.   ప్రజలు బుద్ధి హీనులని భావించి, వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డిల్లీలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని చీపురు కట్టతో ఊడ్చిపెట్టేసారు. అది చూసిన తరువాతయినా ఈ కాంగ్రెస్ నేతలకి జ్ఞానోదయం కలుగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కనుక, రాష్ట్ర విభజన బిల్లు శాసనసభ గడప దాటే వరకు కూడా రోజుకొక కొత్త డ్రామా ఆడుతూ ఇరు ప్రాంతాల ప్రజలను మోసం చేయడం కంటే, కనీసం ఇప్పటి నుండయినా బిల్లుపై సభలో చర్చించి దానిలో లోటుపాట్లు కనుగొని వాటికి తగిన సూచనలు చేసి త్రిప్పి పంపిస్తే తెలుగు ప్రజలందరికీ మహోపకారం చేసిన వారవుతారు. లేకుంటే వారిని ఆ దేవుడు కూడా ఈసారి ప్రజల నుండి కాపాడలేడు. .