వైసిపి నేత ఆత్మహత్యాయత్నం

  వైసిపిలో లుకలుకలు చివరకు నేతల ఆత్మహత్యాయత్నానికి కారణమవుతున్నాయి.తాజాగా ఆ పార్టీ నాయకులు తమకు పదవి ఇస్తానని మోసం చేయటంతొ ఓ మహిళ నాయకురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాను ఆశించిన పదవి దక్కలేదంటూ అనసూయ అనే నాయకురాలు మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పార్టీ కోసం తాను ఎంతో ఖర్చుచేశానని, అయినా పార్టీలో తనకు తగిన గుర్తింపఉ లభించటం లేదని గుంటూరు నల్లచెరువుకు చెందిన అనసూయ వైసీపీ మహిళా విభాగం నగర అధ్యక్ష పదవిని తనకు ఇస్తామని నాయకులు హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ పదవిని వేరే వారికి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నేటి నుంచే విభజన చర్చ

  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబందించిన బిల్లుపై చర్చకు ముహుర్తం కుదిరింది. శాసన సభతో పాటు శాసన మండలిలో కూడా ఈ రోజునుంచి కొత్త రాష్ట్ర ఏర్పాటుకు సంబందించిన బిల్లుపై నేతలు చర్చించనున్నారు. మంగళవారం జరిగిన బిఏసి సమావేశంలో అన్నిపార్టీల నేతలు ఈ మేరకు ఏకాభిప్రాయానికి వచ్చారు.సభలో చర్చకు సంబంధించిన షెడ్యూల్‌ను బుధవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటిస్తారు. రాష్ట్రపతి ఇచ్చిన గడువు జనవరి 23తో ముగుస్తుండటంతో ఈ లోపు మూడు విడతలుగా చర్చించటానికి నిర్ణయించుకున్న్టుగా సమాచారం. నేడు ప్రారంభించిన మూడురోజుల పాటు తొలివిడతగా చర్చించనున్నారు. ఆ తరువాత క్రిస్‌మస్‌తో పాటు కొత్త సంవత్సర సెలవు తరువాత జనవరి 3 నుంచి పదో తేది వరకు రెండో విడత సభలో చర్చిస్తారు. చివరిసారిగా జనవరి 16న ప్రారంభించి 23తో చర్చను ముగించి బిల్లును తిరిగి రాష్ట్రపతి కార్యాలయానికి పంపాలని ప్రాధమిక నిర్ణయించారు. మంగళ వారం స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ చాంబర్‌లో జరిగిన బిఏసి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మీటింగ్‌లో రాష్ట్రంలోని ప్రదాన పార్టీల ముఖ్యనేతలు పాల్గొన్నారు.

లోక్‌పాల్‌కు రాజ్యసభ ఆమోదం

  ఎట్టకేలకు అన్నా హజారే పోరాటం ఫలిచింది. అవినీతిని అరికట్టడానికి ప్రజా ఉద్యమాల ఫలితంగా రూపొందిన ఈ బిల్లుకు మంగళవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. చాలా రోజులుగా ఏవిషయంలోనూ కలిసి రాని చాలా పార్టీలు లోక్‌పాల్‌ విషయంలో మాత్రం ప్రభుత్వానికి సహకరించాయి. యుపిఏ మిత్ర పక్షం అయిన సమాజ్‌వాది పార్టీ మాత్రం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేఖించింది. 2011 డిసెంబర్‌లోనే ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టినప్పటికీ కొన్ని అంశాలపై రాజకీయ పార్టీల అభ్యంతరాల వల్ల ఆమోదం పొందలేకపోయింది. అయితే తరువాత మెజార్టీ పార్టీల అభిప్రాయ సేకరణ తరువాత కొద్ది పాటి మార్పులతో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. మంగళవారం సభలో న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్... లోక్‌పాల్ బిల్లుపై చర్చ ప్రారంభించారు. అదే సమయంలో ప్రతిపక్షనేత అరుణ్‌జైట్లీ కూడా బిల్లుకు మద్దతు తెలపటంతో బిల్లు ఆమోదం పొందింది. అయితే ప్రతిపక్షాలు లోక్‌పాల్‌ పరిదిపై మాత్రం పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరాయి.కార్పోరేట్ రంగాన్ని కూడా లోక్‌పాల్ పరిధిలోకి తేవాలని సీపీఎం నేత సీతారాం ఏచూరి కోరారు. సీపీఐ, బీఎస్పీ, జేడీయూ, అన్నాడీఎంకే, టీడీపీ తదితర పార్టీలు కూడా బిల్లుకు మద్దతు తెలిపాయి. మరోవైపు ఆది నుంచీ బిల్లును వ్యతిరేకిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్ చేసింది.

సమైక్యరాష్ట్రంలోనే ఎన్నికలు

  ఇంతవరకు కాంగ్రెస్ అధిష్టానం జనవరి 1వ తేదీనాటికి రెండు రాష్ట్రాలు ఏర్పాటవుతాయని చెపుతూ తెలంగాణా ప్రజలని మభ్యపెడుతోంది. కానీ, ప్రస్తుత పరిస్థితులను చూస్తే అసలు ఎన్నికలలోగా తెలంగాణా బిల్లు పార్లమెంటు ఆమోదం పొందుతుందా లేదా? అనే అనుమానం కూడా కలుగుతోంది.   మరో తాజా కబురు ఏమిటంటే ఒకవేళ రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినప్పటికీ, ఆ తరువాత జరుగవలసిన అధికారిక ప్రక్రియ అంతా పూర్తవడానికి కనీసం నెల రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు ఉభయసభలలో ఆమోదం పొందితే, దానిపై నోటిఫికేషన్ వెలువడడానికి కనీసం నెల రోజులు, ఆతరువాత దానిపై రాష్ట్రపతి అధికార ముద్ర వేసి రాష్ట్రావతరణను ప్రకటించడానికి మరొక నెలరోజులు పైగా పట్టవచ్చని హోంశాఖ వర్గాలు తెలియజేస్తున్నాయి. అందువలన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బిల్లుకి ఆమోదం తెలిపినప్పటికీ, ఈ ప్రక్రియ అంతా సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ (మార్చి రెండవ తేదీలోగా) వెలువడేలోగా పూర్తికావడం అసంభవం, గనుక 2014 ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరపవలసి ఉంటుందని హోంశాఖ వర్గాలు భావిస్తున్నాయి.

ఇసుక మాఫియా నేతలకు మావోయిస్టుల హెచ్చరిక

  మన ప్రజాప్రతినిధులు ప్రజాసేవతో బాటు రకరకాల వ్యాపారాలు చేసుకొనే వెసులుబాటు ఉంది. కేవలం ప్రజాసేవకోసమే కట్టుబడినవారిని వ్రేళ్ళ మీద లెక్కించవచ్చును. అటువంటి వారిని ప్రజలు దేవుళ్ళని భావిస్తే, అవకాశం ఉన్నపుడు కూడా రెండు చేతులా సంపాదించుకోవడం చేతకాని దద్దమ్మలని వారి సహచరులు దృడంగా నమ్ముతారు. ఈ రోజు మావోయిష్టుల కళ్ళు ఇసుక మాఫియాలో మునిగి తేలుతున్న మన ప్రజాప్రతినిధులపై పడింది. మావోయిస్టుల అధికార ప్రతినిధి జగన్ సంతకంతో ఉన్న ఒక లేఖ మీడియాకు చేరింది. అందులో ప్రజాప్రనిధులయిన అనేకమంది శాసనసభ్యులు, మంత్రులు, యంపీలు ఇసుక మాఫియాగా తయారయ్యారని వారు ఇప్పటికయినా తమ ఇసుక మాఫియా వ్యాపారాలను కట్టి బెట్టకపోయినట్లయితే ప్రజల చేతులో వారికి దండన తప్పదని హెచ్చరిక జారీ చేసారు. ఆ లేఖలో కాంగ్రెస్ యంపీ పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణ, మంత్రి శ్రీధర్ బాబు, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు వనమా వెనకటేశ్వర రావు, భద్రాచలం శాసనసభ్యురాలు కుంజ సత్యవతి, బాలసాని లక్ష్మి నారాయణ, కరీం నగర్ కు చెందిన కాంట్రాక్టర్ జగ్గారెడ్డిల పేరిట హెచ్చరిక జారీ అయింది.

స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ మూగనోము

  ఆఖరి బంతి వరకు పోరాడతాను.. రాష్ట్రం కన్నా పదవి పార్టీ ముఖ్యంగా కాదు.. నేను పదవిలో ఉండగా రాష్ట్రం విడిపోదు.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటానికి ఎవరినైనా ఎదిరిస్తాం.. ఈ మాటలు వింటుంటే బి గోపాల్‌ సినిమాకు పరుచూరి బ్రదర్స్‌ రాసిన డైలాగ్స్‌లా అనిపిస్తున్నాయి కదా.. ఇవన్ని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కిరణ్‌కుమార్‌ రెడ్డిగారు రాష్ట్ర విభజన విషయంలో చేసిన కామెంట్స్‌.. మరి ఇంతలా బీరాలు పలికిన ఈ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఇప్పుడు ఏం చేస్తున్నట్టు.. తాను పదవిలో ఉండగా రాష్ట్ర విభజన జరగదు అని తెగేసి చెప్పిన కిరణ్‌. ఇప్పుడు తాను ఉన్న సభలోనే తెలంగాణ ఏర్పాటుకు సంబందించిన బిల్లు చర్చ జరుగుతుంటే కిరణ్‌ మాత్రం మౌనం పాటిస్తున్నాడు. ఇన్నాళ్లు ఆఖరి బాల్‌ పడే వరకు పోరాడతానన్న కిరణ్‌ ఇఫ్పుడు మాత్రం అధిష్టానానికి జీహుజూర్‌ అంటున్నట్టుగా కనిపిస్తుంది. తెలంగాణ బిల్లు రాష్ట్రానికి వచ్చే వరకు తన వాదన బలంగా వినిపించిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి బిల్లు అసెంబ్లీకి చేరిన తరువాత మాత్రం ఒక్కసారిగా సైలెంట్‌ అయిపోయారు.. ఎవరు ఏమి అనుకోకుండా ఒకటి రెండు స్టేట్‌మెంట్లు ఇస్తున్నా గతంలో వినిపించినంత బలంగా వాయిస్‌ వినిపించటం లేదు. కిరణ్‌లో వచ్చిన ఈ మార్పులను రాజకీయ విశ్లేషకులు కూడా పలురకాలుగా విశ్లేషిస్తున్నారు. అయితే సమైక్య వాణి బలంగా వినిపించిన కిరణ్‌: సొంత పార్టీ పెట్టో ఆలోచనలో ఉన్నట్టు గతంలో బాగా టాక్‌ నడించింది. అదే సమయంలో సీమాంద్ర జిల్లాల్లో తనకున్న పట్టు ఎంతో తెలుసుకోవడానికి ఓ సర్వే కూడా చేయించుకున్నాడట.. కిరణ్‌ మౌనానికి ఈ సర్వే కూడా కారణం అంటున్నారు ఆయన సన్నిహితులు. సొంత పార్టీ పెట్టాలనుకున్న కిరణ్‌కు రాష్ట్రంలో కేవలం ఒక్క శాతం ప్రజల మద్దతు మాత్రమే ఉందని తెలిసి దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అయిందట. సర్వే ఫలితాలతో పాటు, బిల్లు కన్నా ముందే రాష్ట్రనికి వచ్చిన దిగ్విజయ్‌ సింగ్‌ మంత్రాంగం కూడా కిరణ్‌లోని మార్పుకు కారణం అన్న టాక్‌ బలంగా వినిపిస్తుంది. మరి స్టార్‌ బ్యాట్స్‌మెన్‌గా తనని తాను చెప్పుకున్న కిరణ్‌. ఇప్పుడు ఎలాంటి స్టెప్‌ తీసుకుంటాడో చూడాలి.

అవిశ్వాసంపై వెనక్కి తగ్గిన కాంగ్రెస్ ఎంపీలు..!

      తెలంగాణ ఎట్టి పరిస్థితులలో ఏర్పడదు. అసలు యూపీఏ ప్రభుత్వాన్నే ఉండనివ్వం. ప్రభుత్వాన్ని పడగొడుతున్నాం. మేము చేస్తున్న ప్రయత్నాలకు అనూహ్యమయిన మద్దతు లభిస్తుంది అని మీడియా ముందు గతంలో యుపిఎ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ లగడపాటి ఇప్పుడు కొత్త మాటలు చెబుతున్నారు.   తాజాగా ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చిన కేంద్రంలో కొనసాగుతున్నది మైనార్టీ ప్రభుత్వం అని, ఆ విషయాన్ని ప్రజలకు తెలియచేయాలనే తాము అవిశ్వాస తీర్మానం పెట్టామని స్పష్టం చేశారు. రాష్ట్ర సమైక్యత కోసం అనేక రకాలుగా వ్యూహాత్మకంగా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని, కేంద్రంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా బిల్లు అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నందునే తాము ఈ రోజు అవిశ్వాస తీర్మానంపై నోటీసు ఇవ్వలేదన్నారు. కేంద్రం విభజనపై ఎలా ముందుకు వెళ్తుందో చూస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యం కోసం పాటుపడుతున్నారన్నారు. జనవరి దాకా అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పైన చర్చ జరిగే అవకాశం లేదన్నారు.  

రేపటి నుండి తెలంగాణ బిల్లు పై చర్చ

      తెలంగాణ ముసాయిదా బిల్లుపై రేపటి నుంచి మూడు రోజుల పాటు వరకు చర్చ జరుగుతుందని బీఏసీ సమావేశంలో నిర్ణయించినట్లు శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. బిల్లులో ఏ క్లాజ్‌లు ఉన్నాయో దానిపై ప్రతి ప్రభ్యుడు చర్చించడానికి బీఏసీలో నిర్ణయం జరిగిందని ఆయన తెలిపారు. అయితే టీ. బిల్లు సరిగాలేదని, తిప్పి పంపాలని టీడీపీ సభ్యులు కోరారని, కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత దానిని రాష్ట్రపతి కూడా అంగీకరించి రాష్ట్రానికి పంపిన తెలంగాణ ముసాయిదా బిల్లును తిప్పి పంపడం సరికాదని, దీనిపై రేపట్నించే చర్చ జరుగుతుందని స్పీకర్ స్పష్టం చేశారు. సభ్యులందరూ తమ తమ అభిప్రాయాలు చెప్పాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని బీఏసీ సమావేశం ముగిసిన అనంతరం స్పీకర్ నాదెండ్ల అసెంబ్లీలో ప్రకటన చేశారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.

రాహుల్ నాన్సెన్స్ అంటే...

  రాహుల్ గాంధీ ‘నాన్సెన్స్’ అని ఒకమారు అంటే ప్రభుత్వామోదం పొందిన ఆర్డినెన్స్ కూడా చెత్త బుట్టలోకి వెళ్ళిపోతుంది. అదే ఆయన ‘ఓకే’ అంటే రెండేళ్ళ క్రితం అటక మీద పడేసిన లోక్ పాల్ బిల్లు కూడా దుమ్ము దులుపుకొని ఉభయసభలలో రేసుగుర్రంలా పరుగులు తీసి ఆమోదం పొందేస్తుంది. సమాజ్ వాదీ పార్టీ తప్ప పార్లమెంటులో అన్నిపార్టీలు లోక్ పాల్ బిల్లుని ఆమోదించడంతో బహుశః ఈరోజు రాజ్యసభ సమావేశాలు ముగిసేలోగానే లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందవచ్చును. అయితే, రాహుల్ గాంధీ ఎంతో ముచ్చట పడుతున్నమతనిరోధక బిల్లుకి మాత్రం బీజేపీ కాలు అడ్డం పెడుతోంది. అందువల్ల దానికోసం కాంగ్రెస్ పెద్దలు మరికొంత కసరత్తు చేయవలసి ఉంటుంది.   నాలుగు రాష్ట్రాలలో ఓడిపోయి నిరాశలో కూరుకుపోయిన మన రాహుల్ బాబు కనీసం లోక్ పాల్ బిల్లు దేశానికి మంజూరు చేసి కాస్త డప్పేసుకొందామని అనుకొంటే, ఎవరో అరవింద్ కేజ్రీవాల్ అనే ఆమాద్మీ అట, దానిని ఒక జోక్ పాల్ బిల్లు అని కుళ్ళు జోకులేస్తున్నాడు. పోనీ లోక్ పాల్ బిల్లు కోసం కడుపు మాడ్చుకొంటున్నఆ పెద్దాయన-అన్నా హజారే అయినా సంతృప్తిగా ఉన్నారంటే ఆయన కూడా ఎందుకో బరువుగా నిట్టూర్పులు విడుస్తున్నారు తప్ప ఈ బిల్లుని గురించి ఒక్క ముక్క మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు.   అయితే ఎవరికీ నచ్చినా నచ్చకపోయినా లోక్ పాల్ బిల్లు మన రాహుల్ బాబుకి బాగా నచ్చింది. గనుక ఇక పార్లమెంటు ఆమోదం పొందవలసిందే. రేపటి నుండి దాని గొప్పదనం గురించి, అటువంటి గొప్ప బిల్లును అటక మీద నుండి దింపించి, పార్లమెంటు చేత ఆమోదింపజేసిన ఘానాపాటి రాహుల్ గాంధీ గొప్పదనం, పట్టుదల, ప్రజల పట్ల నిబద్దత గురించి కాంగ్రెస్ భజన సంఘాలు హోరెత్తించేస్తుంటే జనాల చెవులు చిల్లులు పడిపోవలసిందే.

బిజినస్ అడ్వయిజరీ కమిటీ కుదరని ఏకాభిప్రాయం

  ఊహించినట్లుగానే కొద్ది సేపటి క్రితమే ముగిసిన శాసనమండలి-బిజినస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో తెలంగాణా బిల్లుపై సభలో ఎప్పటి నుండి చర్చ చెప్పట్టాలనే అన్శామపి సభ్యులమధ్య అంగీకారం కుదరలేదు. అందువల్ల శాసనసభలో బిల్లుపై ఏ సమయంలో చర్చ జరిగితే అదే సమయంలో శాసనమండలి కూడా చర్చించాలని నిర్ణయించడంతో సమావేశం ముగిసింది. ఈ సమావేశం ముగియగానే, శాసన సభ-బిజినస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం మొదలయింది. బహుశః ఇందులో కూడా ఇరు ప్రాంతాలకు చెందిన సభ్యుల సంఖ్యా సరి సమానంగా ఉంది గనుక సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం అసంభవమే. కనుక, ఈ సమావేశంలో కూడా ఎటువంటి నిర్ణయమూ తీసుకోకుండానే ముగిసే అవకాశం ఉంది. ఈ వారంతో ముగియనున్న శాసనసభ శీతాకాల సమావేశాల తరువాత మళ్ళీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బిల్లుపై చర్చ చెప్పట్టాలని కమిటీలలో సీమాంధ్ర సభ్యులు గట్టిగా వాదిస్తున్నట్లు సమాచారం. ఏమయినప్పటికీ, మరి కొద్దిసేపటిలో ఆ సంగతీ తేలిపోతుంది.

అసెంబ్లీ వాయిదా..బీఏసీ తరువాతే

      శాసన సభలో మంగళవారం సీమాంధ్ర, తెలంగాణ శాసనసభ్యులు స్పీకర్ పొడియంను చుట్టుముట్టి పోటాపోటీగా సమైక్య, తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ఎమ్మెల్యేల చేతిలో ఉన్న ఫ్లకార్డులను తెలంగాణ నేతలు బలవంతంగా తీసుకోవడంతో సభలో మరింత గందరగోళం నెలకొంది. సభాపతి ఎంత సర్ది చెప్పినప్పటికీ సభ్యులు వినలేదు.   సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడడంతో స్పీకర్ సభను అరగంటపాటు వాయిదా వేస్తూ బీఏసీ సమావేశం అనంతరం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని సభాపతి ప్రకటించారు. కాగా సభలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఎవరిసీట్లలో వారు ముభావంగా కూర్చున్నారు.

'తెలంగాణ బిల్లు' పై చర్చ ప్రారంభమైందా, లేదా..!!

      రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై సభలో చర్చ మొదలైందా? లేదా? అనే అంశంపై రచ్చ జరుగుతోంది. దీనిపై ఎవరేమన్నారంటే...   "ఈ నెల 11న జరిగిన బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు శాసనసభలో ముసాయిదా బిల్లు ప్రతులు ప్రవేశ పెట్టినందున చర్చ జరపాలా వద్దా అనే అంశంపై రాజకీయపక్షాల అభిప్రాయాల సేకరణకు సిద్ధమయ్యాను. ఇందులో భాగంగా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చర్చను ప్రారంభిస్తున్నట్ల్లుగా చెప్పారు. దానిపై ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాను. ఆయన స్పందించకపోవడంతో... ముసాయిదా బిల్లు చర్చకు వచ్చినట్లుగా భావించాల్సిందే! - ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క   చర్చను ప్రారంభించాలని మాత్రమే శ్రీధర్‌బాబు కోరారు. అందుకు పార్టీల అభిప్రాయం తెలుసుకునేందుకు స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క ప్రయత్నించారు. అంతే తప్ప చర్చ ప్రారంభం కాలేదు. చర్చ జరగాలంటే తప్పని సరిగా బీఏసీలో నిర్ణయం తీసుకోవాలి. - మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి "మల్లు భట్టి విక్రమార్క చర్చను ప్రారంభించడంపై రాజకీయ పక్షాల అభిప్రాయాలు కోరినప్పుడు నేను చర్చను ప్రారంభిస్తున్నట్లుగా చెప్పాను. ప్రధాన ప్రతిపక్ష నేత అభిప్రాయాన్ని తీసుకునేందుకు ఉపసభాపతి ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. బిల్లుపై చర్చ ప్రారంభమైనట్లేనని. దీనిపై పార్టీల వారీగా ఎవరెన్ని గంటలు మాట్లాడాలో తేలాల్సి ఉంది. - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మరోవైపు శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.    

దిగ్విజయ్ కొడుకు సెంటిమెంటుతో జగన్ బేజారు

  “కాంగ్రెస్ పార్టీకి మాకు ఎటువంటి సంబంధము లేదని” ప్రజలకు నచ్చజెప్పుకొనేందుకు పాపం నానా తిప్పలు పడుతున్నజగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ తనపై ఒలకబోస్తున్నఅవ్యాజమయిన ప్రేమతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఆయన ఘాటు ప్రేమను ఇక భరించలేక ‘అలా అన్నవాడిని చాచిపెట్టి చంపదెబ్బ కొట్టాలి’ అని కూడా అనవలసివచ్చింది.   కానీ, దిగ్విజయ్ సింగ్ మాత్రం అందుకు ఎంతమాత్రం నొచ్చుకోకుండా, గాంధీగారి సిద్దాంతాలు ఫాలో అయ్యే మనిషి గనుక ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపిస్తూ, “జగన్ తనను ఎన్నిమాటలన్నపటికీ అతని పట్ల తనకున్నపుత్రవాత్సల్యం చెరిగిపోదని, ఇప్పటికీ, ఎప్పటికీ కూడా అతను నా కొడుకు వంటి వాడేనని, తమ డీ.యన్.యే.లలో కూడా ఎటువంటి మార్పు చెందబోవని” నిన్ననే ఆయన తాజాగా మరోమారు డిల్లీలో కన్ఫర్మ్ చేసారు. వద్దంటే ఇంతటి ప్రేమ కురిపించే దిగ్విజయ్ వంటి పెంపుడు తండ్రి దొరికినందుకు జగన్ బాధపడుతుంటే, అటువంటి తండ్రి ప్రేమకు నోచుకోనందుకు లగడపాటి వంటి చాలామంది కాంగ్రెస్ నేతలు బాధపడుతున్నారు. పోనీ దిగ్విజయ్ తన తండ్రి ప్రేమను అవసరమయిన వారందరికీ పంచిపెడితే కనీసం వారయినా శుభ్రంగా వాడుకొనేవారు కదా!

నేడే ముఖ్యమంత్రి రంగప్రవేశం

  గత నాలుగయిదు నెలలుగా అధిష్టానాన్ని ధిక్కరిస్తూ గట్టిగా సమైక్యవాదం వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్నశాసనసభలో తెలంగాణా బిల్లు ప్రవేశపెడుతున్నసమయంలో అనారోగ్యకారణంతో సభకు డుమ్మాకొట్టడంతో ఆయన తీవ్ర విమర్షలకు గురయ్యారు. అయితే ఆయన నిన్నసాయంత్రం సమైక్యవాదం చేస్తున్న కొందరు సీమాంధ్ర శాసనసభ్యులు, మంత్రులతో సమావేశమయ్యారు. అయన తన వద్ద ఉన్న బిల్లుకాపీని వారికి చదివి వినిపించి, దానిని ఈ రోజు స్వయంగా సభలో ప్రవేశపెడతానని, అందులో ప్రతీ ఆర్టికల్ పై వోటింగ్ కోరుతానని తెలిపారు. ఆర్టికల్ 371(డీ) సవరించనిదే విభజన అసాధ్యమనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేసారు. బిల్లుపై సభ ఎప్పుడు, ఎన్ని రోజుల పాటు చర్చించాలో బిజినస్ అడ్వయిజరీ కమిటీయే నిర్ణయం తీసుకొంటుందని ఆయన తన అనుచరులకు చెప్పినట్లు సమాచారం.   ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తంగా సాగుతున్న సభాసమావేశాలు ముఖ్యమంత్రి రాకతో మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. నిన్న శాసనమండలి ప్రాంగణంలో మీడియా పాయింటు వద్ద తెదేపా, తెరాస యం.యల్.సీ.లు కొట్టుకొనేంత వరకు వెళ్ళారు. ఉభయ సభలు నినాదాలతో దద్దరిల్లిపోయాయి. ముఖ్యమంత్రిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నటీ-కాంగ్రెస్, తెరాస నేతలు ఈరోజు ఆయనపై మూకుమ్మడిగా విమర్శలకు దిగే అవకాశం ఉంది. అప్పుడు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ ఆయనకు బాసటగా నిలిచి ఎదురుదాడికి దిగితే సభలో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో చెప్పనవసరం లేదు.

మోడీ కోసం దేశం పరుగు

  ఒకప్పుడు బస్టాండులో టీ అమ్ముకొన్న నరేంద్ర మోడీ తన తెలివి తేటలతో గుజరాత్ ముఖ్యమంత్రి కాగలిగాడు. అదే వ్యక్తి ఇప్పుడు బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా ఎదిగాడు. ఒకనాడు ఆయన అభ్యర్ధిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేఖించిన అద్వానీ వంటి వారు కూడా నేడు ఆయనను పొగుడుతున్నారు. ఎక్కడో గుజరాత్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండే ఆయన, బీజేపీ ఎన్నికల సారధ్య బాధ్యతలు చేప్పట్టి గట్టిగా మూడు నాలుగు నెలలు కూడా కాలేదు. అయినప్పటికీ, ఇటీవల మూడు రాష్ట్రాలలో బీజేపీ సాధించిన ఘన విజయం, డిల్లీలో కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టగలిగారు. ఇది నిజంగా ఆయన ఘనతేనని అంగీకరించక తప్పదు.   సరిగ్గా రాహుల్ గాంధీ కి పట్టాభిషేకం చేయాలని కాంగ్రెస్ భావిస్తున్న తరుణంలో ఆయన అకస్మాత్తుగా బీజేపీ ప్రధానిగా ఊడిపడటంతో ఉలిక్కి పడిన కాంగ్రెస్ పార్టీ ఆయనను బూచిగా చూపించి రాహుల్ గాంధీకి అడ్డులేకుండా చూసుకోవాలని ప్రయత్నం చేసేది. కానీ  ఉగ్రవాదుల దాడులను, చైనా చొరబాట్లను, అధిక ధరలను, అరికట్టలేని కాంగ్రెస్ అసమర్దతను ఎండగడుతూ, అవినీతి వ్రేళ్ళూనుకుపోయిన కాంగ్రెస్ పార్టీనే ఆయన బూచిగా చూపెట్టి ఎన్నికలలో ఘన విజయం సాధించగలిగారు.   కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుండి డిల్లీ వరకు అందరి బేషరతు మద్దతు గల రాహుల్ గాంధీ ఈ ఎన్నికల ప్రచారంలో చతికిలపడిపోగా, మోడీ స్వయంగా దేశంలో మెజార్టీ ప్రజల వ్యతిరేఖతను ఎదుర్కొంటూ, మతతత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీని గెలిపించుకోవడం ఆయన సమర్ధతకు, రాజకీయ నైపుణ్యానికి అద్దంపడుతోంది.   పనిలోపనిగా ఆయన ప్రజలలో తనపట్ల ఉన్న వ్యతిరేఖతను కూడా క్రమంగా తగ్గించుకొనే ప్రయత్నాలు చాలా గట్టిగానే చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ‘యూనిటీ రన్’ పేరుతో ప్రజలకు తనకూ మధ్య దూరం తగ్గించుకొనే ప్రయత్నం చేసారు. దేశ ఐఖ్యత కోసం అనగానే సహజంగానే ప్రజలు అటువంటి కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతారు. పార్టీలకు, జెండాలకి అతీతంగా ప్రజలందరూ పాల్గొనేలా చేయడమే కాకుండా, దీనిపై కాంగ్రెస్ పార్టీ నోరెత్తలేని పరిస్థితి విధంగా చక్కటి వ్యూహం అమలు పరిచారు.   నిజానికి ఇది ఆయన తనను తాను ప్రజలలో ప్రమోట్ చేసుకోవడానికే ఉద్దేశ్యించబడిన కార్యక్రమమని అందరికీ తెలుసు. కానీ, ఆయన దేశ ఐఖ్యత కోసం పరుగు అంటూ దానికి మహనీయుడు సర్దార్ వల్లభభాయి పటేల్ పేరుని కూడా జోడించడంతో దానికి ఊహించినట్లే దేశవ్యాప్తంగా ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. ఆయన దీనిని ఒక బీజేపీ కార్యక్రమంగా రూపొందించి ఉంటే, ఇంత స్పందన ఉండేది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును. కానీ, ఆయన ఎక్కడా తన పేరు, పార్టీ ప్రసక్తి తేకుండా ‘దేశంకోసం’ అంటూ అందరినీ తన మాట మీద పరుగులెత్తించగలిగారు. అంతే గాకుండా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తనని, తన పార్టీని స్మరించుకోనేలా చేసారు. ఆయనలో గల ఈ నేర్పే రేపు డిల్లీకి బాటలు పరుస్తుందేమో కూడా!

వ్యూహాత్మకంగానే బిల్లు పై చర్చ

      మధ్యాహ్నం 3 గంటలకు శాసనసభ మళ్లీ మొదలయింది. తీవ్ర గందరగోళం మధ్యనే శ్రీధర్ బాబు ముసాయిదా బిల్లు పైన చర్చను ప్రారంభించాలని డిప్యూటీ స్పీకర్‌ను కోరారు. దీంతో డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క చర్చను ప్రారంభించాలని చంద్రబాబును కోరారు. చంద్రబాబు అందుకు నిరాకరించినట్లుగా తెరాస ఎమ్మెల్యేలు చెప్పారు. అయితే, చంద్రబాబు మాట్లాడేందుకు సిద్ధమవగా అసెంబ్లీ వాయిదా పడిందని టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. చంద్రబాబు సభలో ఉన్నప్పటికీ లేరని అవాస్తవ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.   చర్చకు స్పీకర్ ఆమోదం తెలపడంతో సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు ముసాయిదా బిల్లు ప్రతులను చించి స్పీకర్ పోడియం వైపుకు విసిరేశారు. చించివేసిన విసిరేసిన ప్రతులు సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్కపై కూడా పడ్డాయి. సీమాంధ్ర శాసనసభ్యులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. ప్రతులు చించి వేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్ స్థానంలో ఉన్న భట్టి సభను మంగళవారానికి వాయిదా వేశారు.

మన సోనియమ్మకే పాపం ఎందుకు ఇన్ని కష్టాలు?

    గల్లీ నుండి డిల్లీ వరకు కాంగ్రెస్ నేతలందరూ (సీమాంధ్రలో కొందరు తప్ప) సోనియమ్మకు గుళ్ళు గోపురాలు కట్టించి, దేవతలాగా పూజించుకొంటున్నారనే ఇంగితం కూడా లేని ప్రతిపక్షాలు ఆమెపై నీలాపనిందలు వేస్తున్నాయి. అంతటితో ఆగకుండా ఏవో కుంటి సాకులు వెతికి పట్టుకొని ఆమె దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారు. ఆమె ఎంతగా నచ్చజెప్పుతున్నపటికీ ప్రజలు కూడా ప్రతిపక్షాల చెప్పుడు మాటలకు చెవోగ్గి ఒక్కో రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చేస్తున్నారు. ఇక పోనీ కదా అని పిలిచి యంపీ టికెట్స్ ఇస్తే కనీసం ఆ కృతజ్ఞతన్నది కూడా లేకుండా కొందరు కాంగ్రెస్ యంపీలు అవిశ్వాసం అంటూ డిల్లీలో చిందులేస్తున్నారు.   ఇక నిన్నగాక మొన్న పుట్టిన అమాద్మీ అయితే ఏకంగా తన చీపురు కట్టతో డిల్లీ నుండి కాంగ్రెస్ పార్టీని ఊడ్చిపారేసింది. అయినప్పటికీ పాపం ఆ తల్లి కొడుకులు పెద్దమనసుతో ఆ పార్టీకే మద్దతు ఇచ్చేందుకు సిద్దపడ్డారు. కానీ, వారి మంచి మనసులను, తేనె మనసులను ఏ మాత్రం అర్ధం చేసుకోలేని ఆమాద్మీ, “అయితే మేము కుర్చీలో కూర్చోన్నాక మీరు కప్పెట్టిన కుంభకోణాలను అన్నిటినీ త్రవ్వి తీస్తాము. మీకు ఓకేనా?” అంటూ తలతిక్క ప్రశ్న వేయడంతో వారి మనసులు ఎంత నొచ్చుకొన్నాయో ఎవరికి తెలుసు?   ఇక, ఈ నరేంద్ర మోడీ హటాత్తుగా ఎక్కడి నుండి ఊడిపడ్డాడో ఏమో గానీ, కాంగ్రెస్ పార్టీని దేశం నుండి తరిమి కొడతామని, అరేబియా సముద్రంలో విసిరేస్తామని అవాకులు చవాకులు మాట్లాడుతూ పాపం! ఏ పాపం ఎరుగని ఆ తల్లి కొడుకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. గుజరాత్ పక్కనే అరేబియా సముద్రం ఉంది గనుక తనకు సులువుగా ఉంటుందని ఆయన కాంగ్రెస్ పార్టీని అందులోకి విసిరేస్తానని శపథం చేస్తుంటే, ఇక్కడ నుండి అంత దూరం వెళ్ళడం కష్టం గనుక మా పక్కనే ఉన్నబంగాళాఖాతంలోనే నిమజ్జనం చేసేస్తామని చంద్రబాబు, జగన్ బెదిరిస్తున్నారు.   అయిపటికీ సోనియమ్మ మాత్రం ఎలాగయినా వచ్చే ఎన్నికలలో గెలిచి తన రాహుల్ బాబును ప్రధానిగా చేసి ఈ దేశాన్నిఎలాగయినా కాపాడేయాలనే సత్సంకల్పంతో ఈ అజ్ఞాన జనాలనందరినీ పెద్ద మనసుతో క్షమించుకొంటూ ముందుకు సాగిపోతోంది ఆ మహా ఇల్లాలు. అయితే ప్రతిపక్షాలు చేస్తున్నఈ ధ్వని కాలుష్యంతో ప్రజలు బెదిరిపోకూడదనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ఎంత బిగ్గరగా భజన చేస్తున్నపటికీ, వారి భజన కంటే ప్రతిపక్షాల సౌండే ఎక్కువ క్లారిటీగా వినిపిస్తోంది జనాలకి. ఇప్పుడు ఈ సౌండ్ అమెరికాలో కూడా ప్రతిధ్వనించడం మొదలయింది.   ఇండియాలో అనేక కుంభకోణాలను అవలీలగా కప్పిపెట్టిన ఘనత గల కాంగ్రెస్ పార్టీకి, మూడు దశాబ్దాల క్రితం ఇందిరమ్మ హత్య జరిగినప్పుడు డిల్లీలో సిక్కులను ఊచకోత కోసిన సంఘటనను మాత్రం ఇంకా పూర్తిగా కప్పిపెట్టలేకపోవడంతో అది బోఫోర్స్ భూతంలాగే నేటికీ కాంగ్రెస్ పార్టీని ఇంకా భయపెడుతూనే ఉంది. అయితే సోనియమ్మ సింహాసనం అధిరోహించక ముందు ఎప్పుడో జరిగిన సంఘటనలకు కూడా ఆమెనే తప్పు పట్టడం చాలా అన్యాయమని ఒప్పుకోకతప్పదు.   మన కోర్టులు, జనాలకయితే పోనీ ఎలాగోలా సర్ది చెప్పుకోవచ్చు. కానీ అమెరికా కోర్టులకి కూడా చెప్పుకోవడం అంత వీజీ కాదు. ఏ పాపం ఎరుగని సోనియమ్మే సంజాయిషీలు చెప్పకోవలసి రావడం, ఆమెకే కాదు ఆమె భక్తులకి కూడా చాలా నామోషీగా ఉంటుంది. అమెరికాలోని ‘సిక్స్ ఫర్ జస్టిస్’ అనే పేరు పెట్టుకొన్నకొందరు దుర్మార్గులు పాపం! ఏ పాపం తెలియని దేవత వంటి మన సోనియమ్మపై అక్కడి యూ.యస్. ఫెడరల్ కోర్టులో కేసువేసి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు.   ఆనాడు అంటే ఇందిరమ్మ హత్య తరువాత డిల్లీలో వేలాది మంది అమాయకులయిన సిక్కులను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోసిన కాంగ్రెస్ నేతలకు, అందుకు సహకరించిన పోలీసు అధికారులకు కాంగ్రెస్ పార్టీ నేటికీ పార్టీలో, ప్రభుత్వంలో పదవులు, పార్టీ టికెట్స్ ఉదారంగా పంచిపెడుతూ చట్టం తన పని తాను చేసుకు పోతుందని చిలక పలుకులు వల్లె వేయడం చాలా అన్యాయమని, రాహుల్ బాబు బాషలో చెప్పాలంటే ‘నాన్సెన్స్’ అంటూ ఏవేవో పిటిషనులో బరబరా గీకేసి ఆమెపై కేసు వేసి కక్ష సాధించాలని చూస్తున్నారు.   అమెరికా కోర్టులకి మనలాగా అసలు సెంటిమెంటులు ఉండవో ఏమో తెలియదు కానీ, ఆ మధ్య పాపం ఆమె క్యాన్సర్ వ్యాధికి ఆపరేషన్ చేయించుకోవడానికి అమెరికా వచ్చిందనే ఇంగితం కూడా లేకుండా, జనవరి రెండు లోగా సంజాయిషీ ఇచ్చుకోవలసిందే అంటూ ఆమె చేతిలో కోర్టు నోటీసులు పెట్టేసారు.   ఆమె మన దేశంలో ప్రధాని కుర్చీలో కూర్చోకపోయినా అటువంటిదే మరో కుర్చీ తన ఇంట్లో వేయించుకొని, ప్రధాన మంత్రిలాగ దేశాన్నిఎక్కడికో తీసుకుపోతున్నందుకు దేశంలో ప్రతిపక్ష పార్టీలకి అసూయపడుతున్నయంటే అర్ధం ఉంది. కానీ, ఎవరివో చెప్పుడు మాటలు విని అమెరికా కోర్టులు కూడా మన దేశానికి ప్రధానివంటి ఆ మహా ఇల్లాలుకి నోటీసులు జారీ చేయడం చాలా అన్యాయం. ఇక్కడ ఇల్లు కాలి ఆమె బాధపడుతుంటే, ఆమెపైకి ఈవిధంగా అమెరికా కోర్టులు కూడా నోటీసులు విసరడం ఏమయినా న్యాయంగా ఉందా? అదే మనం ఇరాక్ మీద బాంబుల వర్షం కురిపించిన జార్జ్ బుష్షు దొరమీదకో, నేటికీ పాకిస్తాన్ మీదకి ద్రోణులతో బాంబుల వర్షం కురిపిస్తున్న ఒబామాకో మనం నోటీసులు జారీ చేయగలమా? సంజాయిషీలు అడిగే సాహసం చేయగలమా? అటువంటప్పుడు పాపం! దేవత వంటి మన సోనియమ్మకే ఎందుకు ఇన్ని కష్టాలు? ఇన్ని నీలాపనిందలు? ప్చ్!

తెలంగాణ బిల్.. 65 పేజీలు, 13 షెడ్యూళ్ళు

      65 ఏజీలు, 13 షెడ్యూళ్లతో కూడిన ప్రత్యేక తెలంగాణ ముసాయిదా బిల్లును స్పీకర్ నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు సభ ఈ ఉదయం ప్రారంభం కాగనే విపక్ష సభ్యుల నిరసనతో రెండు సార్లు వాయిదా పడింది. షెడ్యూల్ వివరాలు... 1.మొదటి షెడ్యూల్‌లో రాజ్యసభ సభ్యుల వివరాలు 2. రెండో షెడ్యూల్‌లో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్‌విభజన వివరాలు 3. మూడో షెడ్యూల్‌లో శాసనమండలి స్థానాల వివరాలు 4. నాల్గో షెడ్యూల్‌లో మండలి సభ్యుల విభజన వివరాలు 5. ఐదో షెడ్యూల్‌లో తెలంగాణలోని దళిత వర్గాల వివరాలు 6. ఆరో షెడ్యూల్‌లో తెలంగాణలోని గిరిజన వర్గాల వివరాలు 7. ఏడో షెడ్యూల్‌లో నిధులు, 8వ షెడ్యూల్‌లో పింఛన్ల వివరాలు 9వ షెడ్యూల్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల వివరాలు 10వ షెడ్యూల్‌లో రాష్ట్రస్థాయి సంస్థలకు సంబంధించిన వివరాలు 11వ షెడ్యూల్‌లో నదీ జలాల నిర్వహణ బోర్డుల విధివిధానాలు 12వ షెడ్యూల్‌లో బొగ్గు, విద్యుత్‌ విధివిధానాలు 13వ షెడ్యూల్‌లో విద్య, మౌలిక సదుపాయాల వివరాలు