రాజకీయాలకు దగ్గుబాటి గుడ్ బై

      ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ రోజు తన అనుచరులతో సమావేశమైన దగ్గుబాటి భవిష్యత్తు కార్యాచరణపై చర్చి౦చినట్లు తెలుస్తోంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఆయన భార్య పురందేశ్వరి బిజెపి అగ్రనేతల సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. నిన్ననే దగ్గుబాటి దంపతులిరువురూ బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించి, మళ్ళీ ఇంతలోనే ఆయన మనసు మార్చుకొని ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకొంటున్నట్లు ప్రకటించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పరుచూరు శాసనసభ నియోజక వర్గం నుండి మళ్ళీ పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ ఇచ్చేందుకు కూడా అంగీకరించినట్లు సమాచారం. అదేవిధంగా గతంలో ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చేసినందున, త్వరలో బీజీపీ సీమాంధ్ర శాఖను ఏర్పాటు చేసినట్లయితే ఆయనకు పార్టీ బాధ్యతలు కట్టబెట్టే అవకాశం కూడా ఉంది. ఇటువంటి మంచి తరుణంలో ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవాలనుకోవాలని భావించడం వెనుక బలమయిన కారణాలే ఉండి ఉండవచ్చును.  

నెల్లూరు టీడీపీలో ఆదాల x మాగుంట

  నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి పేరు ఖాయమైందన్న తరుణంలో తాజాగా మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మాగుంట శ్రీనివాసులురెడ్డి త్వరలోనే టీడీపీలో చేరనున్నారని, ఈ మేరకు బాబుతో చర్చలు ముగిశాయని సమాచారం. మాగుంటకు ఆంతరంగికులైన గోపాల్‌రెడ్డి, మస్తాన్‌రెడ్డి గత ఆదివారం టీడీపీ అధినేతను కలిసి శ్రీనివాసులురెడ్డి పార్టీలో చేరే విషయమై చర్చించారు. అంతకు ముందు రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి కూడా చెన్నైలో మాగుంటతో మంతనాలు సాగించారు. చంద్రబాబుతో మాగుంట శ్రీనివాసులురెడ్డికి బలమైన వ్యక్తిగత సంబంధాలున్నాయి. మాగుంట బలంగా పట్టుబడితే ఆయనకు టికెట్ దక్కడం పెద్ద కష్టమేమీ కాదు. ఇదే జరిగితే ఆదాల పరిస్థితి ఏంటో అనేది చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ముఖ్యనేత కంభంపాటి రామమోహన్‌రావు అండదండలు ఆదాలకు బలంగా ఉన్నాయి. తాను ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నట్లు ఇప్పటికే ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు ఎంపీ స్థానం ఆదాలకా? మాగుంటకా ? అని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఈ గందరగోళ పరిస్థితుల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిత్వం టీడీపీ నుంచి ఎవరికి లభిస్తోందో చూడాల్సిందే. ఇక నెల్లూరు రూరల్ నియోజక వర్గానికి కొత్తతరం నాయకుడిగా ఆనం వివేకానందరెడ్డి కుమారుడు ఆనం చెంచు సుబ్బారెడ్డిని రంగంలో దించుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఇందులో ట్విస్టు ఏమిటంటే, ఆయన టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని అంటున్నారు.

దేశం బాటలో సీమ నేతలు

  ఎన్నికల వేడి మొదలైంది. కొత్త పార్టీలు వస్తున్నాయి, సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూలు కూడా వచ్చేసింది. నాయకులు నెమ్మదిగా ఎవరికి వాళ్లు జంపింగులు మొదలుపెట్టారు. రాయలసీమ ప్రాంతంలోని కొంతమంది కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి, ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో తగిన గుర్తింపు లేకుండా పడి ఉన్న మంత్రులు, మాజీ మంత్రులు ఈ దిశగా పయనిస్తున్నట్లు సమాచారం. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో మాజీ మంత్రులు జేసీ దివాకర్ రెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు వీళ్ల మంతనాలు సాగాయి. జేసీ దివాకర్ రెడ్డి ఇప్పటికే దేశంలో చేరికపై ఓ నిర్ణయం తీసేసుకున్నారు. ఆయన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులతో భుజాలు కలుపుకుని తిరుగుతున్నట్లు సమాచారం. ఇక మరో మాజీ మంత్రి డీఎల్ కూడా చంద్రబాబు వద్దకు వెళ్లడం, ఇంతకుముందే ఆయన ఓ విలేకరుల సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోయడం చూస్తుంటే ఆయన కూడా నిర్ణయం తీసేసుకున్నట్లే కనిపిస్తోంది. ఇక ప్రకటించడమే తరువాయి.   చంద్రబాబు కూడా కాంగ్రెసోళ్లందరూ చెడ్డోళ్లు కారని, వాళ్లలో మంచివాళ్లను మాత్రమే తాము చేర్చుకుంటున్నామని చెప్పారు. ఇక తెలంగాణ జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ మరీ అనుకున్నంత ఏమీ బలహీనంగా లేదు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు. మెదక్ పురపాలక సంఘం మాజీ చైర్మన్ బట్టి జగపతి, గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి చెందిన వై.మురళీధర్‌రెడ్డి గురువారం టీడీపీలో చేరారు.

చిత్తూరులో పార్టీల ముమ్మర కసరత్తు

  చిత్తూరు జిల్లాలో మునిసిపల్ ఎన్నికల సందడి పూర్తిస్థాయిలో కనిపిస్తోంది. ఎన్నికలు అన్ని పార్టీల నేతలను పరుగులు పెట్టిస్తున్నాయి. ప్రధాన పార్టీలు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల చైర్మన్లు, చిత్తూరు కార్పొరేషన్‌కు మేయర్ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ముమ్మరం చేశాయి. నామినేషన్లు వేసేందుకు గడువు దగ్గర పడుతుండడంతో మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు వార్డుల వారీగా, రిజర్వేషన్ల వారీగా అభ్యర్థుల జాతకాలను పరిశీలిస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న ఒకే ఒక కార్పొరేషన్ చిత్తూరు కావడంతో అందరి దృష్టీ చిత్తూరు పైనే ఉంది. టీడీపీ రాష్ట్ర నాయకత్వం మేయర్ అభ్యర్థి ఎంపికతోపాటు డివిజన్లలో కార్పొరేటర్లుగా గెలుపు గుర్రాలను పట్టుకునేందుకు నానా తంటాలు పడుతోంది. అదే సమయంలో వైఎస్సాఆర్ సీపీ డివిజన్ల వారీగా గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేసింది. మాజీ ఎమ్మెల్యే సీకేబాబు తన భార్యను మేయర్ అభ్యర్థిగా దించుతారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో 50 డివిజన్లలో తమ ప్యానల్‌గా బరిలోకి దిగే దీటైన అభ్యర్థులు ఎవరనే కసరత్తును ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇలా ప్రధాన పార్టీలన్నీ ఎవరికి వారు మేయర్ అభ్యర్థితోపాటు, కార్పొరేటర్లుగా పోటీచేసే వారి జాబితాను రెండురోజుల్లో ఖరారు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

కిరణ్ పార్టీ వెనక టీడీపీ నేతలు

  మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడం ఖాయమైపోయింది. ఇంతకుముందే కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద ‘జై సమైక్యాంధ్ర‘ పేరుతో రిజిస్టర్ చేసిన పార్టీనే కొనసాగించాలని కిరణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్టీ గుర్తును ‘చెప్పు‘ అని చెబుతున్నారు. ఈ పార్టీ ఏర్పాటుకు చిరునామాను తూర్పుగోదావరి జిల్లా మాచవరంగా పేర్కొన్నారు. ఇంతకీ ఈ పార్టీ వెనక ఉన్నది ఎవరో తెలుసా.. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీలు. పార్టీని ముందుగా రిజిస్టర్ చేసింది మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి రావు. ఆయనతో పాటు మరో మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర కూడా పార్టీ కసరత్తులో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ తోడల్లుళ్లు. మరో విశేషం ఏమిటంటే, ఇటీవలి కాలంలో చంద్రబాబుతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న నందమూరి హరికృష్ణకు చుండ్రు శ్రీహరి వియ్యంకుడు. వీరిద్దరితో పాటు ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్ సూచనలతోనే తొలి సభను రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని కిరణ్ నిర్ణయించారు. ఇప్పటికే కొత్త పార్టీకి సంబంధించిన జెండాలు, ఇతర ప్రచార సామగ్రి తయారీ పూర్తయింది. ఈనెల 12న రాజమండ్రిలో జరిగే సభలో టీడీపీకి చెందిన ఈ మాజీ ఎంపీలతోపాటు మరి కొంతమంది నాయకులు పాల్గొంటారని తెలుస్తోంది. కిరణ్ కొత్తపార్టీ ప్రకటన సమయంలో ఆయన వెంట కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ రాయపాటి సాంబశివరావు లేరు. మీడియా సమావేశం తర్వాత కిరణ్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కిరణ్ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఇంతకుముందు కిరణ్ పార్టీ తరఫున తాను గుంటూరు ఎంపీ పదవికి పోటీ చేస్తానని కూడా ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.

పవన్ కళ్యాన్ రాజకీయ ప్రవేశంపై వేడివేడి తాజా వార్త!!!

  పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ఇప్పుడే ఒక వేడివేడి సమాచారం అందింది. ఆయన ఈ ఆదివారం ప్రెస్ మీట్ పెట్టడం లేదు. కానీ, ఆ దగ్గరలోనే ఓ మంచి రోజు చూసుకొని ( బహుశః బుదవారం, ఏకాదశి) కొత్త పార్టీ ప్రకటించడం ఖాయమని అభిజ్ఞవర్గాల తాజా సమాచారం. మాజీ సీయం.కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ రోజు పార్టీని స్థాపిస్తున్నట్లు లాంచనంగా ప్రకటించినప్పటికీ, ఆయన మార్చి 12న రాజమండ్రీలో బహిరంగ సభలో కొత్తపార్టీ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తానని చెప్పడం గమనిస్తే, ఆరోజు ఏకాదశి గనుక పవన్ కళ్యాణ్ కూడా అదే రోజు పార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటిస్తారేమో!   ఇంతవరకు చిరంజీవి మరియు మెగా కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ పై పార్టీ పెట్టవద్దని తీవ్ర ఒత్తిడి తేవడం వలన ఆయన రాజకీయాలలోకి రాకపోవచ్చని వార్త ప్రచారంలోకి వచ్చినా, ముందే చెప్పినట్లు పవన్ కళ్యాణ్ ఒకసారి కమిట్ అయితే ఇక కష్టమయినా, నష్టమయినా వెనక్కి తగ్గరని నిరూపిస్తూ కొత్తపార్టీ స్థాపనకే సిద్దం అవుతున్నట్లు తాజా సమాచారం. ఇక కొత్త పార్టీ పేరు రిజిస్టర్ చేయించడం, లోగో, జెండా, అజెండా, మ్యానిఫెస్టో, తదితర ఏర్పాట్లన్నీఇప్పటికే పూర్తయిపోయాయని ఈలోగా మిగిలిన పనులు కూడా చక్కబెట్టి పార్టీని ప్రకటించాలని పవన్ కళ్యాణ్ మరియు ఆయన సన్నిహితులు భావిస్తున్నట్లు సమాచారం.   ఇక అన్నిటికంటే మరొక ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే, ప్రజారాజ్యం ప్రయోగం విఫలమవడంతో చాలా బాధపడిన పవన్ కళ్యాణ్ మన రాజకీయ వ్యవస్థలో తను చూసిన లోపాలను, వాటికి తనదయిన శైలిలో పరిష్కారాలు, రాజకీయ వ్యవస్థలో రావలసిన మార్పులు గురించి తన మనసులో భావనలకు అక్షర రూపం ఇచ్చారు. తన పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఇప్పుడు ఆయన వ్రాసిన పుస్తకావిష్కరణ కూడా చేసేందుకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఏమయినప్పటికీ, పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశంతో మళ్ళీ రాష్ట్ర రాజకీయాలలో కలకలం మొదలవడం ఖాయం. ఒకేసారి కిరణ్, పవన్ పార్టీలు ఆవిర్భవిస్తే ఇక రాజకీయాలలో సందడే సందడి.

రాజమండ్రిలో 12న కిరణ్ కొత్త పార్టీ

      మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 12వ తేదీన బుధవారం నాలుగు గంటలకు రాజమండ్రిలో బహిరంగ సభ ద్వారా పార్టీ పేరును, విధివిధానాలను ప్రకటిస్తామని తెలిపారు. గాయపడిన తెలుగువాడి హృదయాలకు ఉపశమనం కలిగించేందుకు పార్టీని నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. తెలుగు జాతి ఆత్మగౌరవ పరిరక్షణే ప్రధానంగా కొత్త పార్టీ స్థాపించాలని నిర్ణయించామని చెప్పారు.   విభజనకు కారణమైన పార్టీలే నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాయన్నారు. వారికి అధికార దాహం తప్ప ప్రజల సంక్షేమం పట్టదన్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలది అధికార దాహమే అన్నారు. తమ పార్టీ లక్ష్యం మాత్రం తెలుగు వారి గుండె చప్పుడు వినిపించేందుకే అన్నారు. తెలుగు వారి ప్రతిస్పందనలే తమ పార్టీ ప్రణాళికలని చెప్పారు. తాను పదవులు వదులుకొని పార్టీ పెడుతున్నానని చెప్పారు. అలాంటప్పుడు పదవుల కోసమే పార్టీ అనడంలో అర్థం లేదన్నారు.

'ప్రశ్నించడం' కోసం వస్తున్న పవన్!

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతానని ప్రకటించిననాటి నుండి మీడియాలో చెలరేగిన ఊహాగానాలు, విశ్లేషణలకు ఈ నెల తొమ్మిదో తేదిన తెరపడనుంది. అదే రోజున పవన్ రాజకీయాలపై తనకున్న అవగాహనను, అనుభవాలను పుస్తకం రూపంలో ప్రజల ముందుకు తీసుకురానున్నారు. పదవి కోసం కాదు..ప్రశ్నించడం కోసమే అనే నినాదంతో రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ పార్టీ అభ్యర్ధులు రెండు రాష్ట్రాలలోను పోటీ చేయనున్నారు. 9 లోక్ సభ, 40 శాసన సభ స్థానాలలో ఇండి పెండెంట్లుగా అభ్యర్ధులు బరిలోకి దిగనున్నారు. పవన్ కళ్యాణ్ మల్కాజిగిరి లేదా ఏలూరు నుంచి పోటీ చేయవచ్చని సమాచారం.

విభజనకు వ్యతిరేకంగా 12 పిటీషన్లు

      రాష్ట్ర విభజనను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 12 పిటీషన్లు దాఖలైనట్లు సమాచారం. వీటిపై శుక్రవారం సుప్రీం విచారణ చేపట్టనుందని న్యాయవాది రమేష్ తెలిపారు. ఇంతకుముందే పలుమార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పిటీషన్లు వేశారు. అయితే అప్పటికి తెలంగాణ విభజన ప్రక్రియ పూర్తికాలేదు. ఈ దశలో కోర్టు జోక్యం చేసుకోలేదని వాటిని తోసిపుచ్చింది. పార్లమెంటు ఓ నిర్ణయం తీసుకునే సమయంలో కోర్టులు జోక్యం చేసుకోవని, నిర్ణయం తీసుకున్న తరవాత తాము వాటిని పరిశీలిస్తాం అని కోర్టు తెలిపింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అపాయింటెడ్ డే కూడా ప్రకటించారు. విభజన ప్రక్రియ ఇప్పుడు చట్టరూపం దాల్చిన నేపథ్యంలో సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

కాంగ్రెస్ కి మజ్లీస్ తలాక్...తలాక్...తలాక్

  కేవలం ఈ ఒక్క రోజులో రాష్ట్ర రాజకీయ సమీకరణాలలో చాలా మార్పులు చేర్పులు ఏర్పడుతున్నాయి. వాటిలో ప్రధానంగా దగ్గుబాటి దంపతులు బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించగా, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మరో ఆసక్తి కరమయిన అంశం ఏమిటంటే, విభజన తరువాత మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకొంటుందని భావించిన మజ్లీస్ పార్టీ, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోబోమని తేల్చిచెప్పేసింది. తెరాస హ్యాండివ్వడంతో షాకులో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది మరో పెద్ద షాకని చెప్పవచ్చును. ఎందుకంటే ఇంతకాలం మజ్లిస్ పేరు చెప్పుకొని ముస్లిం ఓట్లను దండుకొంటున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆ అవకాశం పోయింది. తమది లౌకికవాద పార్టీ అని కాంగ్రెస్ ఎంత గొంతు చించుకొన్నా పేద, మధ్య తరగతి ముస్లిం ప్రజలు మజ్లిస్ పార్టీ వైపు, లేదా ఆ పార్టీ పొత్తులు పెట్టుకొంటున్న పార్టీ వైపే మొగ్గు చూపుతారు తప్ప కాంగ్రెస్ చెపుతున్న కుహాన లౌకిక కదలని పట్టించుకోరు. అదేవిధంగా రాష్ట్ర విభజన చేసినందుకు గుర్రుగా ఉన్న సీమాంధ్రలో ముస్లింలపై కూడా ఈ ప్రభావం పడితే, ఇక కాంగ్రెస్ పార్టీకున్న మైనార్టీ ఓటు బ్యాంకు ఖాళీ అయిపోవడం ఖాయం.   మజ్లిస్ పార్టీ మంచి విజయోత్సాహంతో ఉన్నతెరాసతో ఎన్నికల పొత్తులు కుదుర్చుకొనే అవకాశం ఉంది. హైదరాబాద్ మేయర్ గా ఉన్నమజ్లిస్ పార్టీకి చెందిన మజీద్ హుస్సేన్ కొద్ది సేపటి క్రితం పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణను కలిసి తమ పార్టీ నిర్ణయాన్ని తెలిపిన తరువాత తన పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోనియా గాందీ తన ముద్దబ్బాయ్ రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చోబెట్టుకోవాలని ఆశపడుతున్న ఈ సమయంలోనే ఇటువంటి విపరీత పరిణామాలు జరుగుతుండటం పాపం నిజంగా దురదృష్టమే!

కిరణ్ కొత్త పార్టీకి హై కమండ్ గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందా?

  గత ఆరేడు నెలలుగా కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీ గురించి విస్తృతంగా ప్రచారం జరిగినప్పటికీ, ఆయన ఇంతకాలంగా మీన మేషాలు లెక్కిస్తూ కాలక్షేపం చేయడంతో, ఆయన పార్టీపై ప్రజలకే కాదు మీడియాకు కూడా నిరాసక్తత ఏర్పడింది. సీమాంధ్రలో విభజనను వ్యతిరేఖిస్తూ ఉవ్వెత్తున ఉద్యమాలు జరుగుతున్న తరుణంలో ఆయన పార్టీకి, పదవికి రాజీనామా చేసి, కొత్త పార్టీ పెట్టి ఉండి ఉంటే అప్పుడు వచ్చే ఆ ఆధారణే వేరు. కానీ, కాంగ్రెస్ హై కమండ్ నుండి అనుమతి లేనందునే తను పదవికి రాజీనామా చేయలేకపోయానని స్వయంగా చెప్పుకొని, రాష్ట్ర విభజన పూర్తిగా జరిగిపోయిన తరువాత మరి అనుమతి దొరికిందో ఏమో తాపీగా రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టేందుకు సిద్దపడ్డారు. కానీ, కనీసం ఆ విషయాన్ని కూడా ఆయన స్వయంగా, దైర్యంగా ప్రకటించకుండా శైలజానాథ్, సబ్బంహరి, రాయపాటి వంటి వారితో మీడియాకు న్యూస్ లీకులు ఇస్తూ పార్టీ పట్ల ప్రజలలో ఆసక్తి పెరిగేలా చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆవిధంగా చేయడం వలన ప్రజలలో ఆయన పట్ల, ఆయన పెట్టబోయే పార్టీపట్ల మరింత వ్యతిరేఖ భావన, అనాసక్తి ఏర్పడింది.   దానికితోడు మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టబోతున్నట్లు ప్రచారం అవడంతో, కిరణ్ కుమార్ రెడ్డి ఇక కొత్త పార్టీ ఆలోచన విరమించుకోక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, ఆయన అదృష్టమో లేక మెగాభిమానుల దురదృష్టమో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టె ఆలోచనను విరమించుకొంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి. పవన్ కళ్యాణ్ వంటి నిజాయితీ పరుడు, మానవతావాది రాజకీయాలలోకి ప్రవేశించాలని ఆశించిన వారందరూ ఆయన తాజా నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తప్పకుండా చాలా సంతోషించి ఉండాలి.   ఒకవేళ పవన్ కళ్యాణ్ రంగ ప్రవేశం చేసినట్లయితే, సీమాంధ్రలో ఇప్పటికే దాదాపు ఖాళీ అయిపోతున్న కాంగ్రెస్ పార్టీ, ఇక ఎన్నికలలో పోటీ చేయవలసిన అవసరం, శ్రమ కూడా ఉండదు. గనుక, కాంగ్రెస్ అధిష్టానం చిరంజీవి ద్వారా కుటుంబ సభ్యులపైన, వారిద్వారా పవన్ కళ్యాణ్ పైన పరోక్షంగా ఒత్తిడి చేసి ఆయనను విరమింపజేసిన తరువాత కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందో లేక ఇంకా మీన మేషాలు లెక్కిస్తూ కూర్చొంటే ఉన్నపరువు కూడా పోతుందని మరి భయపడ్డారో లేక ఎన్నికల భేరీ మ్రోగిందని తొందరపడుతున్నారో తెలియదు కానీ ఆయన ఈరోజే తన కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.   ఇక రాష్ట్రం రెండుగా విడిపోతున్న ఈ సమయంలో కూడా ఆయన ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ అనే పేరుతో రిజిస్టర్ చేయించిన పేరును తన పార్టీకి వాడుకోబోతున్నట్లు వస్తున్న వార్తలు నిజమయితే, కేసీఆర్ తెలంగాణాపేరు చెప్పుకొని బలపడినట్లుగా, సమైక్యాంధ్ర పేరు చెప్పుకొని కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికలలో ఓట్లు దండుకోవాలని ఆలోచిస్తున్నట్లు అర్ధమవుతుంది. ఏమయినప్పటికీ, ఆయన కొత్త పార్టీ పెట్టినట్లయితే, అది కాంగ్రెస్ మహావృక్షానికి మొలిచిన మరో కొమ్మే అవుతుంది తప్ప వేరే కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును.

బిజెపిలోకి దగ్గుబాటి దంపతులు

      కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తమ నియోజకవర్గ ప్రజలతో పురందేశ్వరి సమావేశమై వారితో చర్చించాకే పార్టీ వీడే నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన విషయంలో తీసుకున్న నిర్ణయాలు తనను బాధించాయని, తమను సంప్రదించకుండా, తమ అభిప్రాయాలను కూడా పరిగణంలోకి తీసుకోలేదని, అందుకే కాంగ్రెస్ పార్టీని వీడామని చెప్పారు. ఒక దశలో తాము రాజకీయాల నుంచి తప్పుకుందామని నిర్ణయం తీసుకున్నామని, కానీ కార్యకర్తలు, సన్నిహితుల వారించడంతో బిజెపిలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ నెల 13న అద్వానీ, రాజనాథ్ సమక్షంలో బిజెపిలో చేరనున్నారు. ఈ ఎన్నికల తరువాత బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేఅవకాశాలున్న౦దున బీజేపీలోకి వెళ్ళడం వలననే వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. కేంద్రమంత్రిగా చేసిన పురందేశ్వరికి, ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగలిగితే ఆమెకు మళ్ళీ అంతకంటే మంచి కీలకమయిన పదవే దక్కవచ్చును.   

నేడే కిరణ్ కొత్త పార్టీ ప్రకటన

      ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన కొత్త పార్టీని ప్రకటించబోతున్నారని మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకు మాదాపుర్ లో తన సన్నిహితులతో కిరణ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కొత్త పార్టీపై చర్చించి..ఆ తరువాత ఆరు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కిరణ్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే సీమాంధ్రలో ఎలాంటి స్పందన వస్తుందనే దానిపై సర్వేలు కూడా చేసినట్లు సమాచారం. బుధవారం ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తరువాత ఇప్పుడు కిరణ్ కొత్త పార్టీని ప్రకటించిన ప్రయోజనం వుండదని కొంతమంది నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు ఇంకా ఆరవై రోజులు సమయమే వున్నందున...కిరణ్ కొత్త పార్టీ పెట్టిన సీమాంధ్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపబోడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

జగన్ కు షాక్.. 863 కోట్లు జప్తు

      వైఎస్ జగన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరో షాక్ ఇచ్చింది. జగన్ మీడియా, ఇతర సంస్థలకు చెందిన రూ.538 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన సుమారు రూ.325 కోట్ల ఆస్తులను కూడా జప్తు చేసినట్లు ప్రకటించింది. వాన్‌పిక్ ప్రాజెక్టు పేరుతో జరిగిన పలు అక్రమాలకు సంబంధించిన జగన్, నిమ్మగడ్డలకు చెందిన రూ.863 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం లోని సెక్షన్ 9, 11, 12, 13 (3) రెడ్ విత్ 13(1) (సి), (డి), భారత శిక్షాస్మృతిలోని 120-బి రెడ్ విత్ 420, 409, 419, 468, 471, 477-ఏ సెక్షన్ల కింద ఈ ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ బుధవారం ప్రకటన విడుదల చేసింది.

రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై మరొక సర్వే నివేదిక సిద్దం

  రాష్ట్రం రెండుగా విడిపోతున్న ఈ తరుణంలో వస్తున్నమున్సిపల్, సార్వత్రిక ఎన్నికలు రాజకీయ పార్టీలకి పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణ సంకటం అన్నట్లుగా తయారయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాల గురించి రాజకీయ పార్టీలకే కాకుండా ప్రజలలో కూడా తీవ్ర ఉత్కంట నెలకొంది. ఇది గమనించిన మీడియా-సర్వేసంస్థలు నిత్యం ఒక కొత్త నివేదిక ప్రజల ముందు ఉంచుతున్నాయి.   అయితే ఇటీవల ఇండియా టుడే కోసం సి-ఓటర్ అనే సర్వేసంస్థ నిర్వహించిన సర్వే నివేదికలో ఎంత నిబద్దత ఉందో తెలుసుకొనేందుకు ఒక ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ చానల్ సదరు సి-ఓటర్ సంస్థకు చెందిన 11ఏజన్సీలకు డబ్బులు ఎరగా చూపితే తాము ప్రజల నుండి సేకరించిన సమాచారంలో మార్పులు చేసి నివేదిక ఫలితాలను మార్చేందుకు కూడా వారు వెనుకాడలేదని బయటపెట్టడంతో ఇండియా టుడే పత్రిక యాజమాన్యం ఆ సర్వే నివేదికను వెంటనే రద్దు చేయడమే గాకుండా, తమ ప్రతిష్టకు భంగం కలిగిన్చినందున సి-ఓటర్ సంస్థపై కోర్టులో కేసు వేయబోతున్నట్లు ప్రకటించింది. అందువలన ఇప్పుడు సర్వే నివేదికలను సైతం నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది సర్వేలను మాత్రం ఆపలేకపోయింది, వాటి ప్రమాణాలను, నిబద్దతని ద్రువీకరించే ఎటువంటి ప్రత్యేక అధికారిక సంస్థలు లేనందున సదరు మీడియా లేదా సర్వే సంస్థకున్న పేరుని బట్టి ప్రజలు వాటి నివేదికలను విశ్వసించవలసి వస్తోంది.   తాజాగా, ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ చానల్స్-సి.యన్.యన్.; ఐ.బీ.యన్. మరియు లోక్ నీతి మరియు సీ.యస్.డీ.యస్. అనే నాలుగు సంస్థలు ఆంధ్ర, తెలంగాణాలలో సంయుక్తంగా ఒక సర్వే నిర్వహించి నివేదికలు ప్రకటించాయి. ఆ సర్వే ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైకాపాకు 11-17 లోక్ సభ సీట్లు, తేదేపాకు 10-16 రావచ్చని సమాచారం. ఇక తెలంగాణాలో కాంగ్రెస్-తెరాసలు సరిసమానంగా 6 నుండి 12 లోక్ సభ స్థానాలు కైవసం చేసుకోవచ్చని ప్రకటించింది. కానీ తెరాస అత్యధిక శాసనసభ స్థానాలు కైవసం చేసుకొంటుందని ప్రకటించింది.   ఈ ప్రకారం చూసినట్లయితే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనతో సాధించాలనుకొన్న ప్రయోజనం నెరవేరినట్లే భావించవచ్చును. ఎందుకంటే ఆ పార్టీకి తెలంగాణాలో ఉన్న 15 లోక్ సభ స్థానాలలో తెరాసతో కలిపి కనీసం 12 స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదేవిధంగా ఆ పార్టీకి మద్దతు ఇస్తాడన్ని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రలో కనీసం 11-17 లోక్ సభ స్థానాలు గెలుచుకొనే అవకాశం ఉంది. గనుక రెండు రాష్ట్రాలలో కలిపి కాంగ్రెస్ ఖాతాలో ఎంతలేదనుకొన్నా కనీసం 25-30 సీట్లు పడతాయి.   కానీ ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్నరాజకీయ పరిణామాలను బట్టి ఈ అంచనాలు, సర్వే నివేదికలు, రాజకీయ పార్టీల భవిష్యత్తు అన్నీ కూడా మారుతుంటాయి గనుక మున్ముందు మరింత ఆసక్తికరంగా ఉంటాయని చెప్పవచ్చును.

పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం మెగా సస్పెన్స్

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతానని ప్రకటించిననాటి నుండి మీడియాలో చెలరేగిన ఊహాగానాలు, విశ్లేషణల గురించి అందరికీ తెలుసు. కానీ, ఇప్పుడు తాజాగా రెండు పూర్తి విభిన్నమయిన సమాచారాలు అందడంతో, ఆయన రాజకీయ ప్రవేశం గురించి మరింత గందరగోళం ఏర్పడింది.   పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితులయిన ఇద్దరు వ్యక్తులు ఈరోజు తెదేపా అధిష్టానాన్ని కలిసిఆయన తరపున ఒక ప్రతిపాదన పెట్టినట్లు తాజా సమాచారం. దాని ప్రకారం, తనకు పదిహేను శాసనసభ టికెట్స్, తను కోరిన వ్యక్తులకి, వారు కోరుకొనే నియోజక వర్గాలలోనే కేటాయించేమాటయితే, ఆయన తెదేపాలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని, లేకుంటే ముందుగా ప్రకటించినట్లే ఈనెల 12 లేదా 13 తేదీలలో పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ ప్రకటిస్తారని చెప్పినట్లు సమాచారం.   అయితే ఏకంగా పదిహేను టికెట్స్ కేటాయించడం ఏ పార్టీ కయినా కష్టమే. గనుక తెదేపా అందుకు అంగీకరించకపోవచ్చును. అందువల్ల పవన్ కళ్యాణ్ ఒకవేళ కొత్త పార్టీ పెట్టలేకపోయినా, కనీసం తనకు పూర్తిగా పట్టున్న ప్రాంతాలలో స్వతంత్ర అభ్యర్ధులను నిలబెట్టి వారికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.   అయితే దీనికి పూర్తి విరుద్దమయిన మరో తాజా సమాచారం ఏమిటంటే, ఆయన కార్యాలయం నుండి ‘ముందు ప్రకటించినట్లుగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టడం లేదు. రద్దయింది’ అనే మెసేజ్ మీడియాకు చేరినట్లు తెలుస్తోంది. అన్న (చిరంజీవి) కాంగ్రెస్ పార్టీలో ఉండగా, తమ్ముడు తెదేపాలోనో లేక వేరే ప్రతిపక్ష పార్టీగానో ఎన్నికలలో నిలబడితే ఇప్పటికే దెబ్బ తిన్న బందుత్వాలు మరింత దెబ్బ తింటాయని మెగా కుటుంబ సభ్యులు అందరూ పవన్ కళ్యాణ్ పై తీవ్రమయిన ఒత్తిడి తెచ్చి ఆయన ప్రెస్ మీట్ ను రద్దు చేయించినట్లు, తద్వారా ఆయన రాజకీయ రంగ ప్రవేశం కూడా రద్దయినట్లేనని చూచాయగా తెలుస్తోంది.   ఒకవేళ పవన్ కళ్యాణ్ రంగ ప్రవేశం చేసినట్లయితే, సీమాంధ్రలో ఇప్పటికే దాదాపు ఖాళీ అయిపోతున్న కాంగ్రెస్ పార్టీ, ఇక ఎన్నికలలో పోటీ చేయవలసిన అవసరం, శ్రమ కూడా ఉండదు. గనుక, కాంగ్రెస్ అధిష్టానం చిరంజీవి ద్వారా కుటుంబ సభ్యులపైన, వారిద్వారా పవన్ కళ్యాణ్ పైన పరోక్షంగా ఒత్తిడి చేసి ఉన్నా ఆశ్చర్యం లేదు.   అయితే పవన్ కళ్యాణ్ పట్టుదల, దృడ సంకల్పం గురించి బాగా తెలిసిన కొందరు మాత్రం పవన్ కళ్యాణ్ ఒకసారి ఏదయినా నిర్ణయం తీసుకొంటే ఇక కష్టమయినా నష్టమయినా వెనుకడుగు వేయడని, ఆయన తప్పకుండా రాజకీయ రంగ ప్రవేశం చేయడమో లేదా తన తరపున కొందరు స్వతంత్ర అభ్యర్ధులను నిలబెట్టడమో ఖచ్చితంగా చేస్తాడని బల్ల గుద్ది మరీ చెపుతున్నారు.   ఏమయినప్పటికీ, ఇక ఈ సస్పెన్స్ మరింత కాలం కొనసాగితే అది పవన్ కళ్యాణ్ పేరు ప్రతిష్టలకి నష్టం కలిగిస్తుంది. గనుక ఆయన వెంటనే మీడియా ముందుకు వచ్చి ఏదో ఒక విస్పష్టమయిన ప్రకటన చేసి ఈ సస్పెన్స్ కు వెంటనే తెర దించడం అత్యవసరం.

పవన్ రాజకీయం సంగతేంటి?

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ పెడతారా? తానొక్కరే పోటీ చేస్తారా? అసలు రాజకీయాల్లోకి వస్తాడా రాడా.. ఇలాంటి ప్రశ్నలు గత కొంత కాలంగా విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. మార్చి రెండో వారంలో తాను చాలా విషయాలు చెబుతానంటూ పవన్ అన్నట్లు కూడా వినిపించింది. అయితే అప్పటిదాకా ఆగలేని ఔత్సాహికులు ఈలోపు తమకు కావల్సినట్లుగా చెప్పేసుకుంటున్నారు. పవన్ రాజకీయ భవితవ్యాన్ని తమకు తామే రాసేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మల్కాజిగిరి లేదా ఏలూరు నుంచి పోటీ చేయొచ్చని, అది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున లేదా ఇండిపెండెంటు గానే పోటీ చేస్తారంటూ బుధవారం మధ్యాహ్నం నుంచి మీడియా సంస్థల్లో ఫోన్లు బర బర మోగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు సాయంత్రానికి వాటికి ఒకమోస్తరుగా తెరపడింది. పవన్ కళ్యాణ్ సన్నిహితురాలు, పంజా సినిమా నిర్మాత తిరుమలశెట్టి నీలిమ ట్విట్టర్ ద్వారా వీటికి తెరదించారు. ‘‘అందరూ ఎందుకంత ఆందోళన చెందుతున్నారు, రకరకాలుగా అంచనాలు వేస్తున్నారు.. కాస్త ఓపిక పట్టండి. మీ అనుమానాలన్నింటినీ స్వయంగా పవన్ కళ్యాణే తీరుస్తారు’’ అని ఆమె ట్విట్టర్ లో తెలిపారు.

ఏ రోటి కాడ ఆ పాట పాడుతున్న జైరాం

  గ్రామాలలో మహిళలు వడ్లు దంచే రోటి దగ్గర ఒక రకం పాటలు పాడుతారు. మిరపకాయలు దంచేటపుడు మరొక రకం పాటలు పాడుతుంటారు. అందుకే ‘ఏ రోటి కాడ ఆ పాట’ అనే సామత పుట్టుకొచ్చింది. పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదం పొందగానే డిల్లీ నుండి రెక్కలు కట్టుకొని సీమాంధ్రపై వాలిపోయిన బీజేపీ నేత వెంకయ్య నాయుడిని చూసి కంగారుపడిన కాంగ్రెస్ అధిష్టానం, చూసి రమ్మంటే కాల్చి రాగల సమర్దుడయిన జైరాం రమేష్ ను రాష్ట్రం మొత్తం కవర్ చేసుకురమ్మని పురమాయించడంతో అయన మొదట తిరుపతి వెంకన్నకు మొక్కి అక్కడి నుండి నేరుగా హైదరాబాద్ లో వాలిపోయి, సోనియమ్మ అమ్మజెప్పిన ఘనకార్యం మొదలుపెట్టేసారు.   తెరాసని చెడామడా తిట్టేసి, ఆ పార్టీ ఇక ఎందుకు పనికిరాదని, అదొక శుద్ధ వేస్ట్ పార్టీ అని, తనకసలు రాష్ట్ర విభజనే ఇష్టం లేదని కానీ పార్టీ నిర్ణయాన్ని, తెలంగాణా ప్రజల ఆకాంక్షను మనసులో ఉంచుకొని విభజన ప్రక్రియలో పాలుపంచుకోవలసి వచ్చిందని సీమాంధ్ర ప్రజలకు వినబడేలా బిగ్గరగా అరిచి చెప్పారు. అప్పుడు తెరాస నేతలు కూడా ఆయనపై తీవ్రంగా విరుచుకు పడటంతో నిజంగానే ఆ రెండు పార్టీలు శత్రువులయిపోయాయేమో? అని అందరూ భ్రమ పడిపోయారు కూడా.   సీమాంధ్రలో వాతావరణం కొంచెం చల్లబడినట్లు వైజాగ్ కాంగ్రెస్ వాతావరణ శాఖ నుండి సిగ్నల్స్ రాగానే జైరాం రమేష్ మెటికలు విరుచుకొంటూ వైజాగ్ లో వాలిపోయి, కాంగ్రెస్ పార్టీ గత అరవై సం.లుగా దేశం మొత్తం మీద చేయలేని ఘన కార్యాలన్నిటినీ రానున్న పదేళ్లలో ఒక్క సీమాంధ్రకే చేసిపెట్టేందుకు కమిట్ అయిపోయిందని, కాంగ్రెస్ ఒకసారి కమిట్ అయితే తన మాట తనే వినదని, అందుకు తెలంగాణా ఏర్పాటే గొప్ప ఉదాహరణ అని, అందువల్ల ఇక సీమాంధ్ర ప్రజలందరూ కళ్ళు మూసుకొని (గుడ్డిగా) కాంగ్రెస్ పార్టీకి తమ ఓట్లు గుద్దేసి, తమ పిలకలు హస్తం చేతిలో నిరభ్యంతరంగా పెట్టేయోచ్చని నూరిపోసారు. ఇదంతా చూసి సీమాంధ్ర ప్రజలు ‘పాపం! జైరాంను, కాంగ్రెస్ పార్టీని అనవసరంగా అపార్ధం చేసుకోన్నామేమో? అని చాలా ఫీలయిపోయారు కూడా.   కానీ, ఆయన ఈరోజు వరంగల్ వెళ్ళగానే సరికొత్త ట్యూన్స్ తో సరికొత్త రోటిపాట అందుకొన్నారు. హైదరాబాద్ పూర్తిగా తెలంగాణా వాళ్ళకే చెందుతుందని, దానిలో వచ్చే ఆదాయంలో చిల్లి గవ్వ కూడా సీమాంధ్రకు విదిలించడం అనవసరమని తేల్చి చెప్పారు. అంతే కాక సీమాంధ్రవాళ్ళ మాట విని ఉంటే, చార్మినార్ లో రెండు మినార్లు కూడా తమ వాటాగా ఇవ్వమని డిమాండ్ చేస్తారని జోకేసారు. ఇక తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనం కాపోయినా తమ మధ్య ఎటువంటి అభిప్రాయభేదాలు లేవని, రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందనడం వాస్తవం కాదని, తెరాస తమతో ఎన్నికల పొత్తులు పెట్టుకొనేందుకు అంగీకరిస్తే స్వాగతిస్తామని చెప్పి, తెరాసని మళ్ళీ మెయిన్ లైన్లోకి తీసుకు వచ్చారు.   అదే సమయంలో డిల్లీ నుండి దిగ్విజయ్ సింగ్ కూడా ఆయనకు కోరస్ పాడటం విశేషం. అంటే ఈ సాంగ్స్ అన్నీ డిల్లీలోనే ముందే కంపోస్ అయినట్లు అర్ధమవుతోంది. త్వరలో ఇటువంటి వెరైటీ సాంగ్స్ మరికొన్ని వినిపించిన తరువాత, రాజమాతని, యువరాజా వారిని మొదట సీమాంధ్రకి ఆ తరువాత తెలంగాణాకి ఆహ్వానించి తెలుగు ప్రజలందరినీ అనుగ్రహింపజేస్తారేమో? బళా కాంగ్రెస్...ఈ తెలివితేటలకే ప్రజలు గత అరవై ఏళ్లుగా ఫ్లాటయిపోతున్నారు.