రాంభూపాల్ కన్నీటి పర్యంతం

  కర్నూలు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తానని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన మాట తప్పి మోసం చేశాడని మాజీ మంత్రి, కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రాంభూపాల్ చౌదరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీజీ వెంకటేష్‌ను పార్టీలో చేర్చుకుని కర్నూలు శాసనసభ అభ్యర్థిగా ప్రకటించడంపై ఆయన తన అనుచరులతో చర్చించారు. నాలుగున్నర సంవత్సరాలపాటు వయస్సును కూడా లెక్క చేయకుండా ఇంటింటికి తెలుగుదేశం పేరుతో నగరమంతా పర్యటించి పార్టీకి పునాదులు ఏర్పాటు చేశానన్నారు. అలాంటి తనను కనీసం సంప్రదించకుండా టీజీని పార్టీలో చేర్చుకున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

కాంగ్రెస్ నేతలకు రెడ్ కార్పెట్ పరుస్తున్న చంద్రబాబు

  ఈరోజు మాజీ కాంగ్రెస్ మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప రెడ్డి మరియు శిల్పా మోహన్ రెడ్డిలు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. అదేవిధంగా మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి మరియు ఆమె కుమారుడు గల్లా జయదేవ్ ఇద్దరూ కూడా నిన్ననే పార్టీలో చేరారు. ఇక నిన్న మొన్నటి వరకు కిరణ్ కుమార్ రెడ్డితో రాసుకు పూసుకు తిరిగిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు ఇప్పుడు చంద్రబాబు పంచన చేరారు. బహుశః రానున్న మరికొద్ది రోజులలో ఇంకా చాలా మంది కాంగ్రెస్ నేతలు వారి అనుచరులు తెదేపాలోకి బారులు తీరి తరలి రావచ్చును.   ఇప్పుడు వారందరూ చంద్రబాబుని పొగడ్తలతో ముంచెత్తేస్తూ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నేతలు కండువాలు మార్చుకొంటున్నపుడు ఇటువంటివి సహజమే. కాంగ్రెస్ అధిష్టానం వారిని మోసగిస్తే, వారు కాంగ్రెస్ పార్టీకి హ్యాండిస్తున్నారు. ప్రభుత్వం రద్దయ్యే చివరి నిమిషం వరకు పదవులను పట్టుకొని వ్రేలాడిన ఈ నేతలందరూ, తమ రాజకీయ భవిష్యత్తుని కాపాడుకొనేందుకు, యం.యల్యే. టికెట్స్ కోసమే తెదేపాలోకి దూకారని అందరికీ తెలుసు. ఇంత కాలంగా సోనియా, రాహుల్ గాంధీలకు భజనలో తరించిన వారందరూ ఇప్పుడు పచ్చకండువా కప్పుకోగానే చంద్రబాబు భజన మొదలుపెట్టేసారు. ఆయన నిజాయితీ, కార్యదీక్ష, పట్టుదల, సమర్దతల గురించి నోరారా వర్ణించుతూ ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అని పొగడ్తలతో ముంచెత్తేసారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన వారందరూ ఇక ముందు తెదేపాను బలోపేతం చేస్తామని హామీ ఇస్తున్నారు.   ఇటువంటి వారిని చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించి, వారు అవకాశవాద కాంగ్రెస్ నేతలు కారని ప్రజలకు ఏవిధంగా నచ్చచెప్పగలరు? వారు పార్టీ కండువాలు మార్చినంత తేలికగా ప్రజలకు వారిపట్ల ఉన్న అభిప్రాయలు మారవని విశేష రాజకీయ అనుభవం గల ఆయనకీ తెలియక పోదు. అటువంటప్పుడు వారు తెదేపా తరపున పోటీ చేసి ఓడిపోతే, నష్టం పార్టీకే కాని వారికి కాదనే సంగతి కూడా ఆయనకీ తెలియక పోదు. కానీ, ఎన్నికల ముందు అటువంటి బలమయిన నేతల రాకతో పార్టీ మరింత బలపడుతుందని చంద్రబాబు భావిస్తున్నందునే వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లున్నారు.   అయితే వారందరూ కూడా తమకు పార్టీలో టికెట్ ఖరారు చేసుకొన్న తరువాతనే పార్టీలో చేరారు తప్ప తెదేపాకు సేవచేయడానికో లేకపోతే చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడానికో కాదు. మరి అటువంటి వారు ఇప్పుడు తెదేపాను బలోపేతం చేసేందుకు కృషిచేస్తామని ఇస్తున్న హామీలను ఎంతవరకు నమ్మవచ్చో చంద్రబాబే ఆలోచించుకోవలసి ఉంది. పదవులు, పార్టీ టికెట్స్ కోసం ఇంత తేలికగా కాంగ్రెస్ పార్టీతో బందాలు తెంపుకొని గుంపులు గుంపులుగా తరలివస్తున్న ఇటువంటి నేతలు, ఒకవేళ ఎన్నికల తరువాత తెదేపా మెజార్టీ సాధించలేకపోతే, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే ఆ పార్టీలోకి తరలివెళ్లిపోవడం ఖాయం.   అందువలన చంద్రబాబు కాంగ్రెస్ నుండి తరలి వస్తున్నఇటువంటి నేతలకు కాక చిరకాలంగా నమ్మకంగా పార్టీనే అంటిపెట్టుకొని సేవలు చేస్తున్న వారికే తొలి ప్రాధాన్యం ఈయడం వలన పార్టీపై నేతలకు శ్రేణులకు నమ్మకం పెరుగుతుంది. తద్వారా పార్టీ మరింత పటిష్టంగా తయారవుతుంది కూడా. ఇంతకాలం సోనియా, రాహుల్ గాంధీలకు వీరభజన చేసిన ఈ నేతలందరూ, కాంగ్రెస్ అధిష్టానం వ్యూహంలో భాగంగానే ఇప్పుడు గుంపులు గుంపులుగా తెదేపాలోకి ప్రవేశించి, ఎన్నికలవగానే మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయే ఆలోచనతోనే వచ్చి చేరుతున్నారేమో? అప్పుడు తెదేపా కూడా ఇప్పడు కాంగ్రెస్ ఖాళీ అయినట్లే అయిపోయినా ఆశ్చర్యం లేదు. అందువల్ల చంద్రబాబు మరింత అప్రమత్తతో మెలగడం చాలా అవసరం.

జైరాం వ్యాఖ్యలను తప్పుపట్టిన పురంధేశ్వరి

      కాంగ్రెస్ పార్టీ వీడి బిజెపిలో చేరడంపై మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి వివరణ ఇచ్చారు. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాల కోసమే ఆమె బిజెపిలో చేరినట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తనను గౌరవించిందనడంలో సందేహం లేదన్నారు. తాను కూడా ఎప్పుడు పార్టీ ప్రతిష్టను దిగజార్జలేదని అన్నారు. కృతజ్ఞత లేదంటూ తన పట్ల జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. రామాయపట్నం దగ్గర తనకు వెయ్యి ఎకరాలు ఉన్న మాట అవాస్తవమని పురందేశ్వరి తెలిపారు. తమకు ఎక్కడ ఏ భూములు ఉన్నాయో సర్వే నంబర్లతో జైరాం రమేష్ వెల్లడించాలని పురందేశ్యరి డిమాండ్ చేశారు. లోకసభలో బిల్లు పాస్ కాగానే తాను రాజీనామా చేశానని పురంధేశ్వరి గుర్తు చేశారు. కాంగ్రెసు పార్టీలో ఉంటే సీమాంధ్రకు న్యాయం జరగదన్నారు.విభజన తీరే కాదని, కాంగ్రెసు పార్టీలో తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు.

టిడిపి తరపున మహేష్ బాబు ప్రచారం

      టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేస్తారనే విషయంపై రాజకీయాలలో వర్గాలలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ రోజు చంద్రబాబు సమక్షంలో గల్లా అరుణ కుమారి, ఆమె కుమారుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త గల్లా జయదేవ్ టిడిపి లో చేరారు. గల్లా జయదేవ్ ఎవరో కాదు..మన మహేష్ అక్క భర్త. అంటే ఇద్దరూ బావ బామ్మర్దులన్నమాట. మహేష్ గతంలో రాజకీయాలకు దూరంగా వుంటానని ప్రకటించినప్పటికి, బావ కోసం ఆయన పోటీ చేయబోయే గుంటూరు నియోజకవర్గంలో ప్రచారం చేస్తాడని సమాచారం. ఇదే విషయాన్ని మహేష్ బావ జయదేవ్ కూడా ఈరోజు స్వయంగా ప్రకటించారు. మహేష్ బాబు ఏ పార్టీకి చెందకపోయినా తనకు ప్రచారం చేస్తారని చెప్పారు.

కాంగ్రెస్-తెరాస పొత్తులెందుకొద్దు అంటే

  టీ-కాంగ్రెస్ నేతలు తెరాసతో పొత్తులు వద్దనుకోవడానికి కారణం ముఖ్యమంత్రి, ఇతర కీలక పదవుల కోసం ఆరాటం వల్లనే తప్ప వేరేఏమీ కాదు. ఒకవేళ కాంగ్రెస్-తెరాసలు పొత్తులు పెట్టుకొంటే, టికెట్స్ మరియు మంత్రి పదవులలో సింహభాగం తెరాసకే వెళ్ళిపోవడం ఖాయమని వారికీ తెలుసు. ఎన్నోఏళ్లుగా ముఖ్యమంత్రి పదవి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న జానారెడ్డి, గీతారెడ్డి, దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, జైపాల్ రెడ్డి వంటి ఓ డజనుమంది టీ-కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ఆ అవకాశం వస్తుంటే, దానిని చేజేతులా కేసీఆర్ కి ఆయన కుటుంబ సభ్యులకి అప్పగిస్తారని భావించలేము. అందుకే వారు విలీనమే కాదు తెరాసతో పొత్తులు కూడా వద్దని కోరుకొంటున్నారు. అయితే ఒకవేళ కేసీఆర్ బీజేపీతో పొత్తులు పెట్టుకొంటే వారి పరిస్థితి ఏమిటో వారే ఊహించుకోవచ్చును. కానీ, తెరాస బీజేపీతో పొత్తులు పెట్టుకోకపోయినా కేసీఆర్ మరియు తెరాస ధాటికి టీ-కాంగ్రెస్ నేతలు నిలవలేరని వారికీ తెలుసు. అయితే పొత్తులు పెట్టుకొని పదవులు వదులుకోవడం కంటే, పోరాడిపోగొట్టుకొన్నా అంత బాధ అనిపించదు కనుకనే టీ-కాంగ్రెస్ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ తెరాసతో పొత్తులు వద్దని చెపుతున్నారు.   తెరాస కూడా ఇంచుమించు వారిలాగే ఆలోచిస్తోంది గనుకనే ఆ పార్టీతో విలీనం,పొత్తులు వద్దని కోరుకొంటోంది. గత పదేళ్ళుగా ఎండనక వాననక రోడ్లమీద పడి ఉద్యమాలు చేసి తెలంగాణా సాధించుకొన్నాక తీరాచేసి ఇప్పుడు అధికారం చేతికి అందే సమయంలో దానిలో కాంగ్రెస్ పార్టీకి వాటా పంచి ఇవ్వడం బాధగానే ఉంటుంది. గనుక టీ-కాంగ్రెస్ నేతల ప్రకటనను తెరాస కూడా స్వాగతించవచ్చును.   అయితే జానారెడ్డి చెప్పినట్లు ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ తిరిగి కేంద్రంలో అధికారం చెప్పట్టాలంటే యంపీ సీట్లు అవసరం గనుక, కాంగ్రెస్-తెరాసలు మెజార్టీ యంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి, మెజార్టీ యంయల్యే సీట్లు తెరాసకి దక్కేలా ఒప్పందం చేసుకొని ఎన్నికల పొత్తులకి సిద్దపడవచ్చును.ఆవిధంగా ఒప్పందం చేసుకోవడం వలన తెరాసకు కూడా లాభమే. ఎందుకంటే దానికి యంపీ సీట్లకి పోటీ చేసే సామర్ధ్యం, పెట్టుబడి పెట్టగల సరయిన నేతలు లేరు. పైగా దాని దృష్టి రాష్ట్రంలో అధికారంపైనీ కానీ, కేంద్రంపై లేదు.   అయితే, ఈ ఒప్పందం వలన మళ్ళీ జానారెడ్డి వంటి వారి ఆశలు ఆవిరి కాకమానవు. పోనీ ఎన్నికల తరువాత కేంద్రంలో మళ్ళీ తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏ కేంద్రమంత్రి పదవో పుచ్చుకొందామన్నా, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుస్తుందనే నమ్మకమే లేదు. అందువల్ల టీ-కాంగ్రెస్ నేతలందరూ తెరాసతో పొత్తు వద్దని తమ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడిచేయవచ్చును. తెరాస కోరుకొంటున్నదీ అదే. కాగల కార్యం గందర్వులే చేస్తారు అంటే ఇదేనేమో!

టిడిపిలో చేరిన గల్లా అరుణ, జయదేవ్

      కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, ఆమె కుమారుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త గల్లా జయదేవ్ ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో వీరిరువురు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా గల్లా అరుణ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న తమను, ఆపార్టీ నట్టేట ముంచిందని అన్నారు.సీమాంధ్రుల మనోభావాలను కాంగ్రెస్ పట్టించుకోలేదని గల్లా అరుణ మండిపడ్డారు. సీమాంధ్ర ప్రాంత అభివృద్ధి చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమన్నారు. అందుకే తాము టిడిపిలో చేరుతున్నామన్నారు. చంద్రబాబుకు పూర్తిస్థాయిలో సహకరించేందుకే పార్టీలో చేరుతున్నానని చెప్పారు. జయదేవ్ మాట్లాడుతూ.. తనకు నటుడు మహేష్ బాబు, ఆయన తండ్రి కృష్ణల మద్దతు ఉందని చెప్పారు. మహేష్ బాబు ఏ పార్టీకి చెందని వాడయినప్పటికీ తనకు మద్దతిస్తారని చెప్పారు.

పురందేశ్వరిపై జైరాం సంచలన వ్యాఖ్యలు

      బీజేపీ తీర్థం పుచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరిపై కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రి జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆమె వెన్నుపోటు పొడిచారని అన్నారు. పురందేశ్వరి ప్రకాశం జిల్లా రామాయపట్నం వద్ద పురంధేశ్వరి వేల ఎకరాల భూములు కొన్నారని, అక్కడే పోర్టు నిర్మాణం చేయాలని ఆమె కోరారని జై రామ్ రమేష్ ఆరోపించారు. అయితే తాము దుగరాజపట్నం వద్దే పోర్టు నిర్మించేందుకు నిర్ణయించామని జైరాం రమేష్ తెలిపారు. అందుకే పార్టీని వీడారని అన్నారు. 'ఆమె పచ్చి స్వార్థపరురాలిగా, కృతఘ్నురాలిగా వ్యవహరించారు. ఆమె నిజస్వరూపం బయటపడింది' అని జైరాం వ్యాఖ్యానించారు. సీమాంధ్రకు కేంద్రం తగిన న్యాయం చేయలేదన్న పురందేశ్వరి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆమె ఆరోపణలు నిరాధారమని, హుందాతనంగా లేవని జైరాం అన్నారు.

చంద్రబాబు బీసీ మంత్రం

  చంద్రబాబు నాయుడు మరోసారి బీసీ మంత్రం జపించేందుకు సిద్ధమయ్యారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యను రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. అప్పుడే చంద్రబాబు తన మదిలోని మాటను చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీతో కలిసి పనిచేసే విషయమై తమ సంఘం రాష్ట్ర కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆర్. కృష్ణయ్య చెప్పారు. బీసీలను సీఎం చేస్తామని ప్రకటించిన టీడీపీపై ఎవ్వరూ విమర్శలు చేసినా సహించేది లేదన్నారు.

పంచాయతీలకు రేపే నోటిఫికేషన్.. 6న పోరు

  సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏప్రిల్ 6వ తేదీన పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 9వ తేదీ ఆదివారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు, జెడ్పీ చైర్‌పర్సన్, ఎంపీపీ చైర్‌పర్సన్ల ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్/నోటిఫికేషన్ విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, పంచాయతీరాజ్ కమిషనర్ వరప్రసాద్ తదితర అధికారులతో సమావేశమయ్యారు. రిజర్వేషన్లను ఎప్పటిలోగా అందిస్తారో తెలపాలని కోరారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడంతో పాటు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారని, ఏడెనిమిది జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ గెజిట్ నోటిఫికేషన్‌లు అందగానే జెడ్పీ, మండల రిజర్వేషన్లు ఖరారు చేసి శనివారం రిజర్వేషన్ల జాబితా అందిస్తామని వారు హామీ ఇచ్చారు. రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో ఉంటాయని కూడా చెప్పారు. పంచాయతీరాజ్ అధికారులు ఇచ్చే రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

తమ్మినేనికి తెలంగాణా సీపీఎం సారథ్యం?

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ తొలి కార్యదర్శి పదవి తమ్మినేని వీరభద్రానికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అయిన తమ్మినేనినే ఈ పదవిలో నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్టీలో ఉన్న అనుభవంతో పాటు తెలంగాణాలోనే పార్టీకి మంచి పట్టున్న జిల్లా నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండడంతో వీరభద్రం పేరు చాలా కాలంగా కార్యదర్శి పదవి కోసం వినిపిస్తోంది. ఈనెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర కమిటీ సమావేశంలో పరిశీలించిన అనంతరం, కేంద్ర కమిటీ ఆమోదం తీసుకొని తెలంగాణ పార్టీ కార్యదర్శి పేరును ప్రకటిస్తారని హైదరాబాద్‌లోని ఎంబీ భవన్ వర్గాలు తెలిపాయి. తమ్మినేని పేరు కు గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఆయన ఈసారి ఎన్నికల బరినుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ పదవి కోసం పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు ఎస్.వీరయ్య పేరు కూడా వినిపిస్తోంది. ఈయన కూడా కేంద్ర కమిటీ సభ్యుడి హోదాలో పనిచేస్తున్నారు. గత రాష్ట్ర మహాసభల్లోనే ఈయనను పార్టీ రాష్ట్ర కార్యదర్శిని చేయవచ్చనే ప్రచారం జరిగింది. వీరిద్దరిలో ఒకరిని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా త్వరలోనే ప్రకటించనున్నారు.

మా కొత్త పార్టీలోకి రావచ్చుగా...ప్లీజ్..

‘   నేను సీఎంగా ఉన్నప్పుడు మీరు అడిగిన పనులు చేశానుగా. ఈ సారి ఎన్నికల్లో మా పార్టీ తరపున పోటీ చేయొచ్చుగా. ఒక సారి వచ్చి కలిస్తే అన్నీ మాట్లాడుకుందాం’ పలు జిల్లాల్లోని ముఖ్యమైన నాయకులకు కిరణ్ కుమార్ రెడ్డి నుంచి వస్తున్న ఫోన్ల సారాంశమిది. ‘అన్న మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఒక సారి హైదరాబాద్‌కు వచ్చి కలవచ్చుగా’ అని కిరణ్ సోదరులు సంతోష్, కిషోర్ కూడా మరికొందరికి ఫోన్లు చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల విషయంలో నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డితో కిరణ్‌కు చెడింది. అప్పటి వరకు వేచి చూసే ధోరణిలో ఉన్న ఆదాల సైకిలెక్కేందుకు వేగంగా నిర్ణయం తీసుకున్నారు. కిరణ్ పార్టీ పెడతారో లేదోనన్న అనుమానాలు రావడంతో ఆయన వైపు నిలిచిన ఒకరిద్దరు నేతలు కూడా మెల్లగా జారుకున్నారు. దాదాపు ఇదే పరిస్థతి అన్ని జిల్లాల్లోనూ కనపడుతోంది. మరోవైపు ముహూర్తం (12వ తేదీ) ముంచుకురావడంతో ఆ రోజుకు స్టేజీ నిండేంత మంది నేతలను పోగేయడానికి రంగం సిద్ధమవుతోంది.

రండి బాబు రండి..టికెట్లిస్తాం బాబూ.. రండి బాబు రండి....

  తూర్పుగోదావరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. కానీ అభ్యర్థులు దొరక్క పార్టీలు తల పట్టుకుంటున్నాయి. కోనసీమలోని ఏకైక మున్సిపాలిటీ అమలాపురంలో తెలుగుదేశం అభ్యర్థి ఎంపికలో మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావుకు తలబొప్పి కడుతోంది. తన అనుచరులే ఇద్దరు పోటీపడుతుండటంతో ఎవరికి బొట్టు పెట్టాలో తెలియని అయోమయంలో ఆయన ఉన్నారు. కాంగ్రెస్‌లో అయితే పార్టీ తరఫున పోటీ చేయమని బతిమలాడుతున్నారు. అవసరమైతే ఇండిపెండెంట్ అభ్యర్థులుగానైనా బరిలోకి దిగుతాము తప్పితే కాంగ్రెస్ నుంచి పోటీచేసేది లేదని చాలామంది తెగేసి చెబుతున్నారు.   తుని, పెద్దాపురంలలో టీడీపీ, తునిలో చైర్మన్ అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించాయి. పెద్దాపురం నియోజకవర్గంలోని పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. తన రాజకీయ భవితవ్యంపై ఎటూ తేల్చుకోలేకపోతున్న తరుణంలో పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ మున్సిపల్ ఎన్నికల ఊసే ఎత్తడం లేదు. మండపేట మున్సిపాలిటీలో 29 వార్డులుండగా ఇంతవరకూ ఏ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయింది. పార్టీ నాయకులతో వార్డు స్థాయిలో రోజుకు నాలుగైదు ప్రాంతాల్లో భేటీలు జరుగుతున్నాయి. ఈ రకంగా దాదాపు అన్ని మున్సిపాలిటీలలోను అభ్యర్థుల ఎంపిక కోసం నేతలు తలలు పట్టుకుంటున్నారు.

ప్రకాశం కాంగ్రెస్ ఖాళీ?

  ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ ఖాళీ అవుతోంది. డీసీసీ అధ్యక్షుడు ఆమంచి కృష్ణమోహన్ ఇప్టికే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, వివిధ పదవుల్లో కొనసాగుతున్న నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా క్రమంగా కాంగ్రెస్ కు దూరం అవుతున్నారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి కూడా అదే దారిలో ఉన్నట్లు సమాచారం. వీళ్లతో పాటు మాజీ మునిసిపల్ చైర్మన్ నుంచి సర్పంచ్‌ల వరకు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు కూడా ఏదో ఒక దారి చూసుకుంటున్నారు. ఈ జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రభావంతో ఎక్కువ మంది జగన్ పార్టీ వైపు మొగ్గు చూపుతుంటే మరికొందరు మాత్రం సైకిల్ ఎక్కే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ మరిన్ని చిత్రాలు వెలుగుచూసేలా ఉన్నాయి.

మెగా సమస్యకు పరిష్కారం ఉందా?

  పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంతో మెగా కుటుంబంలో, మెగాభిమానులలో చీలికలు రానున్నాయి. ఇటువంటి పరిస్థితులని నివారించడానికి నేటికీ రెండు మార్గాలున్నాయి. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రవేశం ఆలోచన విరమించుకోవాలి లేదా చిరంజీవి తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తమ్ముడుకి అండగా నిలబడాలి. ఈ రెంటిలో రెండవ ఆలోచనే ఇద్దరికీ శ్రేయస్కరం. వారిరువురూ చేతులు కలిపితే రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా అవతరించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ వంటి నిజాయితీపరుడు, రాజకీయాలలోకి రావాలనుకొన్నపుడు, చిరంజీవి కుటుంబ సభ్యులు అతనిని వారించే ప్రయత్నాలు చేసే బదులు, అతనికి అండగా నిలబడితే ప్రజలందరూ హర్షిస్తారు.   చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్రమంత్రి అయి ఉండవచ్చు గాక, కానీ ఆయన నాలుగు దశాబ్దాలుగా రేయింబవళ్ళు కష్టపడి సంపాదించుకొన్న పరువు ప్రతిష్టలు, సమాజంలో గౌరవం అన్నీకూడా కేవలం రెండేళ్ళలోనే పూర్తిగా మసకబారిపోయాయి. అవినీతిమయమయిన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఒక తప్పయితే, రాహుల్ గాంధీ కోసం రాష్ట్రాన్ని విడదీస్తున్నపటికీ, తమ అభిప్రాయాలకు పూచికపులెత్తు విలువీయకపోయినప్పటికీ, తన స్వంత పార్టీ నేతల రాజకీయ జీవితాలని, భవిష్యత్తుని సర్వనాశనం చేసినప్పటికీ, ముఖ్యమంత్రి పదవి కోసం ఆత్మాభిమానం, ఆత్మగౌరవం చంపుకొని కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం మరో పెద్ద తప్పు. కాంగ్రెస్ పార్టీలో తెలుగు వాళ్ళకు ఎంత గౌరవ మర్యాదలున్నాయో ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకొన్న తరువాత కూడా ఇంకా ఆ పార్టీ అధిష్టానానికి సలాములు చేస్తూ గులాములా ఎందుకు కొనసాగాలి? అని ప్రశ్నించుకోవాలి.   ఒక పరాయి (దేశ) వ్యక్తి అయిన సోనియాగాంధీ ముందు తలవంచగా లేనిదీ రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు కోసం తన అహం, బేషజం పక్కనబెట్టడం పెద్ద కష్టమయిన పనేమీ కాదు. పైగా దానివలన ప్రజల దృష్టిలో అయన గౌరవం పెరుగుతుందే తప్ప తరగదు. అందువల్ల ఇప్పటికయినా చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి అండగా నిలబడితే ప్రజలు, అభిమానులు కూడా హర్షిస్తారు. తమ్ముడు రూపంలో వచ్చిన ఈ అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే బదులు అతనికి అడ్డంకులు సృష్టిస్తే, దానివలన ఆయనే ప్రజల దృష్టిలో మరింత పలుచన అవుతారు. ఇటువంటి పరిస్థితిని నివారించడం ఇప్పుడు ఆయన చేతిలోనే ఉంది.   ఆయనకంటే కాంగ్రెస్ అధిష్టానానికి వీరవిధేయులు, తలపండిన నేతలే పార్టీ తమకు ద్రోహం చేసిందని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అటువంటప్పుడు నిన్నగాక మొన్న పార్టీలో చేరిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి, దాని అధిష్టానానికి ఆత్మాభిమానం వదులుకొని ఊడిగం చేయనవసరం లేదు. నిజం చెప్పాలంటే ఆయన ఎంత ఊడిగం చేసినా ఆయన ఎన్నడూ ముఖ్యమంత్రి కాలేరు. ఆవిషయం మొన్ననే ఆయనకి అనుభవం అయింది కూడా. ఇక అటువంటప్పుడు మునిగిపోయే టైటానిక్ షిప్ వంటి కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎందుకు కొనసాగాలో ఆయనే ఆలోచించుకోవాలి.   ఆయన కాంగ్రెస్ లో ఉన్నంత మాత్రాన్నఆ టైటానిక్ షిప్ మల్లెపూల నావలా ఎన్నికలలో తేలుతూ సాగిపోదు. అలాగని వదిలిపెట్టినా అది మునిగిపోకా మానదు. ఆ టైటానిక్ షిప్పుని పట్టుకొని వ్రేలాడితే దానితో బాటు ఆయన కూడా మునగడం ఖాయం. దేశముదురు కాంగ్రెస్ నేతలందరికీ తమ షిప్ మునిగితే ఈదుకొని క్షేమంగా ఏవిధంగా ఒడ్డున పడాలో బాగా తెలుసు. కానీ, అది తెలీని చిరంజీవి వంటి వారే ఆ టైటానిక్ క్రింద మునిగిపోయే ప్రమాదం ఉంది. గనుక అది ఇంకా మునగక ముందే మళ్ళీ లైఫ్ (బోట్) ఇస్తున్న పవన్ చెంతకి చేరి క్షేమంగా బయటపడటం మేలేమో ఆయనే ఆలోచించుకోవాలి.

పవన్ పార్టీకి మద్దతివ్వను: చరణ్

      పవన్ కళ్యాణ్ కొత్త పార్టీపెడతారన్న ప్రచారం నేపధ్యంలో రామ్ చరణ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. పవన్ బాబాయి కొత్త పార్టీ పెట్టినా తన మద్దతు నాన్న చిరంజీవికేనని ఆయన స్పష్టం చేశారు. "బాబాయ్ దారి బాబాయ్‌దేనని... నా దారి నాదే''నని అన్నారు. తన మద్దతు నాన్నకే ఉంటుందని స్పష్టం చేశారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, రాజకీయాలపై తనకు అవగాహన లేదని రామ్ చరణ్ తేజ అన్నారు. ఎవరి దారులు వారికి ఉంటాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీలో ముసలం సాగుతోందని మీడియాలో వార్తలు వినిపిస్తున్నా....మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్, నాగ బాబు అలాంటివేమీ లేవు అన్నట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు.

పవన్ పొలిటికల్ ఎంట్రీ 14న..!!

      ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ నాయకుల చూపులన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ మీదనే ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన రాజకీయ అరంగేట్ర విషయాన్ని వాయిదా వేసుకుంటూ పోతున్నారు. మొన్న 9వ తేది మీడియా ముందుకు వస్తానన్న పవన్..ఇప్పుడు దానిని 14వ తేదికి మార్చినట్లు సమాచారం. దీనికి సంబందించి మాదాపూర్ హైటెక్స్ లో అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లును పివిపి సంస్థ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. అదే రోజున రాజకీయాలపై తాను రాసిన పుస్తకాన్ని రిలీజ్ చేయనున్నారు. ఆ రోజు సాయంత్రం 6.30 గంటల నుండి 7.15 వరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి..ఆ వేదికపై పవన్ ఒక్కడే తన అభిప్రాయాల్ని తెలియజేయనున్నారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆహ్వానాలు అందాయి. అయితే ఆయన ఏ బుల్లెట్ పేల్చబోతున్నారనే దానిపై అభిమానులు, ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

టీటీడీపై మండిపడ్డ జయసుధ

      తిరుమలలో టీటీడీ సిబ్బంది తీరుపై సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జయసుధ మండిపడ్డారు. తిరుమలలో డిక్లరేషన్ తీసుకోవాలని టీటీడీ సిబ్బంది తనపైన ఒత్తిడి తెచ్చారని, అందుకే డిక్లరేషన్ పైన సంతకం చేశానని అన్నారు. అయితే డిక్లరేషన్ తీసుకోవాలని జయసుధపై ఎలాంటి ఒత్తిడి తెలేదన్న టీటీడీ ఈవో గోపాల్ వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. అసలు తిరుమలలో టీటీడీ ఆఫీసు ఎక్కడ వుందో తనకు తెలియదని, అలాంటిది తాను అక్కడికి వెళ్ళి డిక్లరేషన్ పై సంతకం ఎందుకు చేస్తానని ప్రశ్నించారు. నేను తప్ప, మా కుటుంబ సభ్యులంతా హిందువులేనని అన్నారు. అనుమానం రావడానికి తానేమైనా ఉగ్రవాదినా అని జయసుధ మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డికి ఒక రూలు..తమకో రులా అని ఆమె ప్రశ్నించారు. జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకుంటామన్న టీటీడీ, ఎందుకు తీసుకోలేదని అడిగారు. దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తానని అన్నారు.

కాంగ్రెస్ వెర్సెస్ కాంగ్రెస్

  కాంగ్రెస్ నేతలు చాలా మంది తమ పార్టీని దేశంలో ఏ ఇతర పార్టీ ఓడించలేదని, కేవలం తమని తాము ఓడించుకొన్నపుడే ఇతరులు విజయం సాధిస్తుంటారని చాలా గర్వంగా చెప్పుకొంటుంటారు. వారి మాట అక్షరాల నిజమని అనేక సార్లు నిరూపించబడింది. మళ్ళీ రేపు ఎన్నికలలో మరోమారు నిరూపింప బడబోతోంది. అయితే, ఈసారి కాంగ్రెస్ పార్టీ తనని తాను ఓడించుకోవడానికి గతంలో లాగ గ్రూపులుగా విడిపోయి కొట్టుకోకుండా, ఈసారి మరి కొంచెం ఆధునిక పద్దతిలో పార్టీలుగా విడిపోయి కొట్టుకోబోతోంది. అయితే ఈసారి ఓడిపోయేందుకు గాక గెలిచేందుకే అలా విడిపోయి తనలో తాను పోరాడుకొంటున్నట్లు నటిస్తోంది. కానీ కాంగ్రెస్ నేతల మాట ఎన్నడూ వమ్ము కాలేదు. కనుక ఈసారి కూడా కాంగ్రెస్ తనని తాను ఓడించుకొని రాష్ట్రంలో, దేశంలో ప్రతిపక్షాలను గెలిపించబోతోంది.   రాష్ట్ర విభజన చేసినందుకు ఆగ్రహంతో ఉన్న సీమాంధ్ర ప్రజలు, ఇంకా పార్టీని  పట్టుకొని వ్రేలాడుతున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, రాష్ట్ర విభజనను సమర్ధిస్తూ, ప్యాకేజీల గురించి మాట్లాడటం చూసి కాంగ్రెస్ పార్టీపై మరింత రగిలిపోతున్నారు. బహుశః ఈ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ వ్యతిరేఖతను మరింత పెంచి పోషించి, కొత్తగా పార్టీ పెడుతున్న కిరణ్ కుమార్ రెడ్డికి, కాంగ్రెస్ తో రహస్య ఒప్పందం కుదుర్చుకొన్న జగన్మోహన్ రెడ్డి కి కాంగ్రెస్ వ్యతిరేఖ ఓట్లు దండిగా పడాలని ఉద్దేశ్యపూర్వకంగానే వారు ఆవిధంగా మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దానివలన వారాశించిన ఫలితం రాకపోగా, పూర్తి వ్యతిరేఖ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.   ఎందువలన అంటే, లగడపాటి, పురందేశ్వరి, హర్ష కుమార్, ఉండవల్లి, కిరణ్ కుమార్ రెడ్డి వంటి కరడు గట్టిన కాంగ్రెస్ వాదులే తమ పార్టీ జగన్మోహన్ రెడ్డితో రహస్య ఒప్పందం కుదుర్చుకొందని చెపుతున్నారు. మళ్ళీ వారిపై ఇప్పుడు కాంగ్రెస్ లో మిగిలిన బొత్స, డొక్కా,కొండ్రు, రఘువీరా వంటి నేతలు కిరణ్, జగన్ ఇద్దరూ అవకాశ వాదులని, వారిరువురూ ప్రజలను వంచిస్తున్నారని పదేపదే గట్టిగా వాదిస్తున్నారు.   ఈవిధంగా కాంగ్రెస్ నేతలు పార్టీలుగా విడిపోయినప్పటికీ, అలా ఎందుకు విడిపోయారో మరచి పోయి, ఒకరి చరిత్రలు మరొకరు బయటపెట్టుకొని, ప్రజలకి వారి నాటకం కళ్ళకు గట్టేవిధంగా వారే ప్రదర్శించుకొని వారిని వారే ఓడించుకొబోతున్నారు. కొందరు మనుషులు జీవితంలో త్వరగా పైకి ఎదగడానికి అడ్డు దారులు త్రొక్కి అదః పాతాళానికి పడిపోతుంటారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ అధికారంలోకి రావడానికి ఒక వినాశాకరమయిన ప్రయోగం చేస్తోందిపుడు. దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పటికే స్పష్టంగా కనబడుతున్నాయి. తమని తామే ఓడించుకొంటామనే కాంగ్రెస్ నేతల మాట ఎన్నడూ వమ్ము కాదని ఎన్నికల తరువాత వారే నిరూపిస్తారు.

కొత్త ప్లేయర్స్ ఎవరు ఎవరితో ఆడుకొంటారు?

  తెలుగు ప్రజల సేవ చేసుకొని తరించాలని తపించిపోతున్నమరో అరడజను కొత్త పార్టీలు తరలి వస్తున్నాయి గనుక వాటిలో ఇప్పుడు ఏ పార్టీ చేత సేవచేయించుకోవాలో ఎంచుకొనే చాయిస్ ప్రజలకి దొరుకుతోంది. అయితే ప్రజాసేవ చేసేందుకు తెగ ఆరాటపడిపోతున్నఈ పార్టీలు తమతో పోటీలో ఉన్న ఇతర పార్టీలకు మాత్రం ఎసరు పెట్టేయడం ఖాయం.   ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టబోయే పార్టీని తీసుకొంటే, గత ఎన్నికలలో మెగా బ్రదర్ చిరంజీవి తేదేపాకు గండి కొట్టినట్లే, ఈసారి కూడా తేదేపాకు పవన్ బాబుతో మెగా ప్రాబ్లెం రావచ్చును. అందువల్ల తెదేపా మళ్ళీ తన టైగర్లని, సింహాలని ముందుకు తీసుకు వచ్చి తన స్టార్ పవర్ అంతా ధారపోసి పోరాడవలసి ఉంటుంది.   ఇక మొన్నటి దాక గాలిలో బ్యాటు తిప్పుతూ అదిగో లాస్ట్ బాల్..ఇదిగో లాస్ట్ బాల్ అంటూ కనబడని ఆ బాల్స్ అన్నిటినీ ఫోర్లు,సిక్సర్లు బాదిపడేసిన కెప్టెన్ కిరణ్, విడిపోతున్న రాష్ట్రంలో సమైక్యగానం ఆలపిస్తూ గాయపడిన ప్రజల హృదయాలకు ఏదో మందు పూసేందుకు వస్తున్నట్లు ప్రకటించేరు. ఆయన టీం వేరే కలర్ టోపీలు, డ్రెస్సులు, వేసుకొస్తున్నపటికీ అది (హోం టీమ్) టీమ్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొనే గ్రౌండ్లోకి దిగుతోందని అందరికీ తెలుసు. అయినప్పటికీ ఆ టీమ్ ముందు ‘హోం టీమ్’ తోనే ఆడుకొని వైడ్ బాల్స్ నో బాల్స్ తో రన్స్ సంపాదించుకొనే ప్రయత్నం చేస్తుంది. పనిలో పనిగా తనలాగే హోం టీమ్ తో మ్యాచు ఫిక్సింగ్ చేసుకొని అదే గ్రౌండ్లో తెలుగు తమ్ముళ్ళతో గేమ్ ఆడుకొంటున్న వైకాపా టీమ్ పై కూడా గుగ్లీలు విసురుతూ అవుట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అవుట్ చేయబోదు.   ఇక డ్రీం బాయ్ బొత్స నేతృత్వంలో హస్తం పట్టుకొని గ్రౌండులోకి వస్తున్న హోమ్ టీమ్ కాంగ్రెస్ లో మిగిలిన వారు అందరూ ఫుట్ బాల్ తో క్రికెట్, క్రికెట్ బాల్ తో బాస్కెట్ బాల్ అఆడగల సమర్దులు గనుక, గ్యాలరీ ఉన్న ప్రేక్షకులకి ఏవో ప్యాకేజీలు ఇచ్చి టోపీలు పెట్టి మ్యాచ్ గెలిచేందుకు గట్టిగా కృషి చేస్తారు. ఈ మూడు (కాంగ్రెస్) టీమ్స్ కి కూడా పవన్- ఎఫ్ఫెక్ట్ తప్పదు.   అయితే కిరణ్, జగన్, బొత్స ప్రజాసేవ చేసేందుకు తమలో తాము పోరాడుకొంటుంటే, మధ్యలో తెలుగు తమ్ముళ్ళుకొంత మేర లాభపడే అవకాశం ఉంది. ఎందుకంటే వారందరూ విడివిడిగా ఆడుతున్నపటికీ అందరూ కూడా ఒకే కాంగ్రెస్ టీమ్ తరపునే ఈ మ్యాచ్ ఆడుతున్నారని గ్యాలరీలో కూర్చొని చప్పట్లు కొడుతున్న ప్రేక్షకులకి అందరికీ తెలిసు.   ఇక గ్రౌండ్ క్లీన్ చేసేందుకు చీపురు పట్టుకొని వస్తున్న ఆమాద్మీ టీం, అందరూ ఫౌల్ గేమ్ ఆడుతున్నారని విజిల్ వేసే లోక్ సత్తా, నల్ల జెండాలు పట్టుకొనొస్తున్న మందకృష్ణ మాదిగ, సీమ సింహం బైరెడ్డి అందరూ తలా పిడికెడు ఓట్లు పట్టుకుపోవడం ఖాయం గనుక, తెదేపా, వైకాపాలకు మెజార్టీ ఓట్లు, సీట్లు సంపాదించుకోవడం కష్టమే అవుతుంది.