తూచ్! ముఖ్యమంత్రి ఎవరయినా కావచ్చు: జైరాం

    స్థలం: కరీంనగర్, సమయం: ఉదయం 10గంటలు సందర్భం: కేంద్రమంత్రి జైరామ్ రమేష్ మీడియా సమావేశం.   “అవును! తెలంగాణా రాష్ట్రానికి మొట్ట మొదటి ముఖ్యమంత్రి దళితుడనే చేస్తాము. నూటికి నూరు శాతం కాదు 200% ఖచ్చితంగా దళితుడనే ముఖ్యమంత్రిని చేస్తాము. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, దళితుడిని తెలంగాణాకు మొట్ట మొదటి ముఖ్యమంత్రిని చేయడం తధ్యం. ఇది నా మాటే కాదు...రాహుల్ గాంధీ మాట కూడా. మా మాటకు తిరుగు లేదు.”   స్థలం: నిజామాబాద్, సమయం: మద్యాహ్నం రెండు గంటలు. సందర్భం: కేంద్రమంత్రి జైరామ్ రమేష్ మీడియా సమావేశం.   “మా పార్టీ ఎప్పుడో 50 సం.ల క్రితమే దళితుడయిన దామోదరం సంజీవయ్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది. మా పార్టీ సమాజంలో అన్ని వర్గాలవారికి సమానావకాశాలు కల్పించాలనే దృడ సంకల్పంతో పంచ సూత్ర పాలసీని చాలా కాలంగా అమాలు చేస్తోంది. దాని ప్రకారం సమాజంలో అన్ని వర్గాలకు అంటే యస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మరియు మైనార్టీ వర్గాలకు చెందిన వారికి అధికారం చెప్పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా మా పార్టీ తెలంగాణా విషయంలో అదే పాలసీని అవలంభిస్తుంది. ఈ వర్గాలకు చెందిన ఏ నేతనయినా తెలంగాణకు మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా నియమిస్తాము.”   డామిట్ కధేటి ఇలా అడ్డం తిరిగింది... తెలంగాణా ఇస్తే మా పార్టీలో తెరాసను విలీనం చేస్తానని మా హ్యాండ్ పార్టీకే హ్యాండిచ్చిన కేసీఆర్, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఇంత కాలం చెపుతూ వచ్చి ఇప్పుడు తానే ముఖ్యమంత్రి సీట్లో సెటిల్ అయిపోదామని చూస్తున్నాడు కదాని.. అతనికి దెబ్బేసేదామని చూస్తే.. డామిట్ కధేటి ఇలా అడ్డం తిరిగింది...అయినా మావాళ్ళు ఓ డజను మంది ముఖ్యమంత్రి కుర్చీలో కర్చీఫ్ వేసుకొని తిరుగుతుంటే, అది పట్టించుకోకుండా వాగినందుకు నాకే వాళ్ళే గడ్డేట్టేసారు మరి...షిట్...షిట్...

సైకిలెక్కుతున్న కుతూహలమ్మ?

  చిత్తూరు జిల్లా రాజకీయాలు చిత్రంగా ఉన్నాయి. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉంటున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ టీడీపీలో చేరడం ఖాయమైంది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు అయోమయంలో పడ్డాయి. ఇన్నాళ్లుగా రెండు పార్టీల నాయకులు ఒకళ్లపై ఒకళ్లు తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోసుకున్నారు. 1980 ప్రాంతాల్లో వైద్యురాలిగా పనిచేస్తున్న కుతూహలమ్మను చంద్రబాబే రాజకీయూల్లోకి తీసుకొచ్చి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చేశారు. ఇది అప్పట్లో జిల్లాలో సంచలనం. కానీ తర్వాత టీడీపీలో ఎదిగిన చంద్రబాబును అప్పట్లో వ్యతిరేకించిన ప్రధాన నేతల్లో కుతూహలమ్మ ఒకరు. 30 ఏళ్లుగా కుతూహలమ్మ కాంగ్రెస్‌లో కొనసాగుతూ అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు మళ్లీ రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత, తన రాజకీయ గురువు చంద్రబాబును కలిశారు. తన కుమారుడు ఎ.హరికృష్ణకు గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరారు. అయితే చంద్రబాబు ఆమెనే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం.

సిక్కోలులో చాప చుట్టేస్తున్న కాంగ్రెస్

  శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చాపచుట్టే పరిస్థితికి వచ్చింది. ఇది కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి మింగుడు పడటంలేదు. పార్టీలో ఉన్న కొద్ది మంది నాయకులు ఎక్కువ మంది టీడీపీలోకి, ఒకరిద్దరు జగన్ పార్టీలోకి వెళ్లిపోతున్నారు. పార్టీని నిలబెట్టేందుకు కిల్లి కృపారాణి చేసిన మంతనాలు పారడంలేదు. నిన్నమొన్నటి వరకు ఆమెకు దాదాపు కుడిభుజంగా వ్యవహరించిన 16వ వార్డు మాజీ కౌన్సిలరు గోళ్ల చంద్రరావు సోమవారం తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. మున్సిపల్ మాజీ చైరపర్సన్ లక్ష్మి భర్త దుర్గాప్రసాద్ కూడా పార్టీ మారే ఉద్దేశంలోనే ఉన్నారు. కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిపోవడం కంటే స్వతంత్రులుగా పోటీచేసి, గెలిచిన తరువాత అధికారంలోకి వచ్చే పార్టీలో చేరితే బాగుంటుందనే ఆలోచనలో కొందరు బలమైన అభ్యర్థులు ఉన్నట్టు సమాచారం. ఇటీవల వరుసగా 5 సార్లు పలాస పట్టణానికి కృపారాణి వచ్చి పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లతో సమావేశాలు జరిపారు. మున్సిపాలిటీలో చుట్టరికాలు చేస్తూ ప్రముఖుల ఇళ్లకు వెళ్లి పార్టీకి అండగా నిలవమని ప్రాధేయపడినా ఫలితం మాత్రం ఉండట్లేదు.

అనంత కాంగ్రెస్ లో మిగిలింది ముగ్గురే!

  అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోతోంది. సీనియర్ నాయకులు అందరూ ఒక్కొక్కరూ జారుకుంటున్నారు. దాంతో ఇక జూనియర్లకు పండగే పండగ. ఈసారి అడిగినవాళ్లకు లేదనకుండా టికెట్లు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, మడకశిర ఎమ్మెల్యే సుధాకర్, మాజీ ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు శివరామిరెడ్డి మాత్రమే కొనసాగుతున్నారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జగన్ పార్టీలో చేరిపోయారు. తాడిపత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి టీడీపీలోకి దాదాపు వెళ్లిపోయినట్లే. గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదనగుప్తా కాంగ్రెస్‌ను వీడి ఏదో ఒక పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.   శింగనమల నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి శైలజానాథ్ మాత్రం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి పెట్టే పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతపురం ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి జగన్ పార్టీకి వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కూడా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్సీ పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా ఆయన ఈ సారి పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో టికెట్లు ఎలా కేటాయిస్తారో చూడాల్సిందే మరి!

పొన్నాలకు కోడలి గండం

  కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు ఇంటిపోరు మొదలైంది. జనగామ ఎమ్మెల్యే టికెట్ విషయంలో పొన్నాల లక్ష్మయ్యకు, ఆయన కోడలు వైశాలికి మధ్య విభేదాలు తలెత్తాయి. నిజానికి వైశాలి గతంలోనే పోటీ చేయాలని భావించినా, అప్పట్లో డీలిమిటేషన్ కారణంగా కుదరలేదు. దాంతో ఇప్పుడు తాను పోటీ చేసి తీరాల్సిందేనని ఆమె గట్టిగా పట్టుబడుతున్నారు. కానీ లక్ష్మయ్య ఆలోచన వేరేలా ఉంది. జనగామ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఇప్పుడు జనరల్ మహిళకు కేటాయించారు. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ పదవిని తీసుకుని... వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బాగుంటుందని లక్ష్మయ్య వర్గం నుంచి వైశాలికి ప్రతిపాదనలు వెళ్లాయి. దీనికి ఆమె ససేమిరా అంటున్నారు. మహిళా కాంగ్రెస్ పార్టీకి వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న ఆమె.. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అవసరమైతే లక్ష్మయ్య భువనగిరి లోక్‌సభకు పోటీ చేయాలని... తాను మాత్రం ఎమ్మెల్యేగా బరిలో ఉంటానని చెబుతున్నట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో తాను ముఖ్యమంత్రి పదవికి పోటీలో ఉంటానని.. సీనియర్ నేతగా అన్ని అర్హతలు ఉన్నాయని లక్ష్మయ్య భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంటి నుంచే పోరు మొదలవడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

కిరణ్ పార్టీ పేరు ఖరారు

  ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి తన కొత్త పార్టీ పేరు, కార్యవర్గం సభ్యుల వివరాలు వగైరా ప్రకటించారు. కొత్త పార్టీ పేరు ‘జై సమైక్యాంధ్ర' పార్టీ పేరుని ఎన్నికల కమీషన్ వద్ద రిజిస్టర్ చేయించుకొన్న చుండ్రు శ్రీహరిరావుని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉంటారని , తాను అధ్యక్షుడుగా ఉంటానని కిరణ్ ప్రకటించారు. కొత్త పార్టీకి "తెలుగువారి ఆత్మగౌరవం'' అనే ఓ ట్యాగ్ లైన్ కూడా చేర్చారు.   కాంగ్రెస్ బహిష్కృత యంపీలు-ఉండవల్లి అరుణ్‌కుమార్, సబ్బం హరి, హర్షకుమార్, సాయిప్రతాప్ మరియు మాజీ మంత్రులు శైలజానాథ్, పితాని సత్యనారాయణలు ఈ పార్టీకి ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఇక లగడపాటి రాజకీయ సన్యాసం స్వీకరించినప్పటికీ ఆయన ఈ కొత్త పార్టీకి సలహాదారుగా ఉంటారని కిరణ్ తెలిపారు. జి. గంగాధర్, తులసీరెడ్డి, రత్నబిందులను పార్టీ కార్యదర్శులుగా ఎంచుకొన్నారు. ఇక కొత్త పార్టీ విధివిధానాల గురించి, ఆశయాల గురించి ఈ నెల 12న రాజమండ్రిలో జరగనున్న బహిరంగ సభలో ప్రకటిస్తానని తెలిపారు.   రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్ పార్టీయే అయినప్పటికీ, కాంగ్రెస్ ను వదిలి పెట్టి చంద్రబాబు లేఖ ఇచ్చినందునే రాష్ట్ర విభజన జరిగిందని తన అధిష్టానాన్నివెనకేసుకు వచ్చారు. కానీ, కాంగ్రెస్ పార్టీని విమర్శించకుండా ముందుకు సాగడం కష్టం గనుక, సోనియమ్మకు కవచంలా జైరామ్ రమేష్, దిగ్విజయ్ సింగులను సున్నితంగా విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత కూడా తన పార్టీకి ‘జై సమైక్యాంధ్ర’ అని పెట్టుకోవడంపై వస్తున్న విమర్శలకు జవాబుగా గత ఆరేడు నెలలుగా కోట్లాది మంది ప్రజల నిత్యం జపించిన దానినే తన పార్టీ పేరుగా పెట్టుకొన్నానని సర్ది చెప్పుకొన్నారు.   సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వారందరూ తన పార్టీలో చేరాలని విజ్ఞప్తి చేసి, ఇది వాళ్ళ పార్టీయేననే భావన కలిగించే ప్రయత్నం చేసారు. డిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఆమాద్మీ పార్టీ పెట్టినప్పుడు కూడా సరిగ్గా ఇటువంటి విధానమే అనుసరించి ప్రజలను ఆకర్షించగలిగారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకే పార్టీ పెడుతున్నానని చెప్పుకొంటున్న కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర విభజన చేసిన తన అధిష్టానం పట్ల నేటికీ అదే విధేయత కనబరచడం విడ్డూరంగా ఉంది.

చిరంజీవికి పోటీ భయం

   అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి, పార్టీ పెట్టిన కొత్తల్లోనే సొంత ఊరికి దగ్గర్లో, అత్తవారి ఊళ్లోనే.. అదే పాలకొల్లులో ఓడిపోయిన చిరంజీవికి ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. అప్పట్లోనే, సొంత సామాజికవర్గం బలంగా ఉన్న చోట కూడా ఓ మహిళా అభ్యర్థి చేతిలో ఓడిపోయిన తాను ఇప్పుడు.. కాంగ్రెస్ పార్టీ మీద, అందులోనూ సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రుల మీద పీకల వరకు కోపం ఉన్న సీమాంధ్ర ప్రాంతంలో పోటీ చేసి నెగ్గగలనా అన్న అనుమానం కూడా గట్టిగానే ఉంది. దాంతో ప్రత్యామ్నాయం కోసం చూసుకుంటున్న చిరుకు.. కర్ణాటకలో తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే చిక్ బళ్లాపూర్ స్థానం కనిపించింది. బెంగళూరుకు సమీపంలోని చిక్ బళ్లాపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతారని అంటున్నారు. ఇక్కడ తెలుగు మాట్లాడే వారు ఎక్కువగా ఉండటంతో పాటు చిరంజీవికి చెప్పుకోదగ్గ సంఖ్యలో అభిమానులున్నారు. చిరంజీవికి కాస్తో కూస్తో విజయావకాశాలు ఉన్నాయంటే ఇక్కడే అంటున్నారు. ప్రస్తుతం ఈ స్థానానికి కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అళగిరి పని శంకరగిరి మాన్యాలే?

  తండ్రితో విభేదాలు.. సోదరుడిపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసిన కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరికి.. ఈసారి అసలు తమ సొంత పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కూడా దక్కేలా లేదు. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను డీఎంకే పార్టీ ఖరారు చేసింది. 35 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా విడుదల చేసింది. కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకె అళగిరికి ఇందులో చోటు దక్కలేదు. పార్టీ నియమాలకు వ్యతిరేకంగా వ్యవహరించారనే కారణంతో అళగిరిని జనవరిలో తాత్కాలికంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సోదరుడు స్టాలిన్ తో వారసత్వ పోరు సాగిస్తున్న అళగిరి ఇంతకుముందు తండ్రిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. 2జీ స్పెక్ట్రం కేసులో నిందితులు, టెలికం మాజీ మంత్రులు ఎ. రాజా, దయానిధి మారన్ లకు మాత్రం టికెట్లు దక్కాయి. నీలగిరి నుంచి రాజా, చెన్నై సెంట్రల్ నుంచి మారన్ పోటీ చేయనున్నారు.

రోడ్డున్న పడుతున్న నేతలు

      అనంతపురం జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ టికెట్లు ఆశించిన కొందరు నాయకులు 2014 ఎన్నికలే లక్ష్యంగా ఏడాదిగా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు. నియోజకవర్గాల్లో తరచూ పర్యటించి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఉన్న డబ్బుంతా వదిలించుకున్నారు. సేవలతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో విజయం సాధించినా.. టికెట్లు మాత్రం దక్కే సూచనలు కనిపించలేదు. దాంతో పోయిన డబ్బులు లెక్కలేసుకుంటూ.. కక్కలేక.. మింగలేక లోలోన మధనపడిపోతున్నారు.   రాయదుర్గం నియోజకవర్గంలో ఓ టీడీపీ నేత పార్టీ టికెట్ ఆశించి ఏడాది నుంచి విస్తృతంగా పర్యటించారు. పార్టీ కార్యక్రమాలు,  సేవా కార్యక్రమాలు అంటూ లెక్కకు మించి ఖర్చు చేసుకున్నారు. కానీ ఇప్పుడు టికెట్ దక్కే సూచనలు కనిపించట్లేదు. దాంతో సేవలకు రాం..రాం...చెప్పారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడు రియల్‌ఎస్టేట్ వ్యాపారంలో బాగా గడించారు. దీనికి తోడు కాంట్రాక్టు పనులు చేసి అనతికాలంలోనే కోట్లు సంపాదించారు. టికెట్ వస్తుందన్న ఆశతో, గుడులు..గోపురాలకు ఇతోదిక విరాళాలు అందజేశారు. యువతకు క్రికెట్ కిట్లు, పండుటాకులకు ఖర్చులకు డబ్బులు ఇస్తూ వచ్చారు. ఇదే క్రమంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా రావడంతో అయిన కాటికి ఖర్చు చేసి పార్టీ మద్దతుదారులను గెలిపించుకున్నారు. తీరా చూస్తే..ఈ నాయకునికి కాకుండా మరో నాయకునికి అధిష్టానం టికెట్టు ఖరారు చేయనున్నట్లు తెలుసుకుని కంగుతిన్నారు.

జూనియర్ యన్టీఆర్ బీజేపీలోకి జంప్?

  ఇటీవల తెదేపాలో చేరిన గల్లా జయదేవ్ తన బావమరిది మహేష్ బాబు తన కోసం (పార్టీ కోసం) ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ప్రకటించేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మహేష్ బాబుతో బాటు ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తదితరులు కూడా తెదేపా ప్రచారం కోసం తరలిరావడం ఖాయమనేసుకోవచ్చును.   అయితే ఇంతవరకు తేదేపాకు స్టార్ ఎట్రాక్షన్ గా నిలచిన జూ.యన్టీఆర్ పరిస్థితి ఏమిటనే ధర్మసందేహం అందరికీ కలగడం సహజం. జూ.యన్టీఆర్ మరియు అతని తండ్రి హరికృష్ణ చాలా కాలంగా తెదేపాకు దూరంగానే ఉన్నారనే సంగతి, అందుకు కారణాలు వగైరా అందరికీ తెలిసిన సంగతే. అదేవిధంగా చంద్రబాబు, బాలకృష్ణలు కూడా వారిరువురితో అంటీ ముట్టనట్లే ఉంటున్నారు. మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికలలో మళ్ళీ తనకు టికెట్ కావాలని హరికృష్ణ అడిగినప్పటికీ చంద్రబాబు ఆయన అభ్యర్ధనను పట్టించుకోకపోవడంతో ఆయన సమావేశం మధ్యలోనే అలిగి బయటకు వెళ్ళిపోయారు. ఈ నేపధ్యంలో గల్లా జయదేవ్ కోసం మహేష్ బాబు వంటి పెద్ద స్టార్ ప్రచారానికి వస్తున్నపుడు ఇక వారిని చంద్రబాబు పట్టించుకొంటారా? అనే అనుమానం కలుగక మానదు. ఇంతజరిగిన తరువాత ఒకవేళ ఆయన పిలిచినా వారిరువురూ వస్తారా లేదా? అనేది కూడా అనుమానమే.   ఒకవేళ వారి మధ్య ఈ దూరం ఇలాగే ఉండిపోతే, ప్రతిపక్ష పార్టీలు వారిరువురికీ ఆహ్వానాలు పంపితే వారు వెళ్ళకుండా ఉంటారా? ఇప్పుడు స్వయాన హరికృష్ణ సోదరి పురందేశ్వరి బీజేపీలో చేరారు గనుక, ఒకవేళ ఆమె ఆహ్వానిస్తే హరికృష్ణ, జూ.యన్టీఆర్ ఇరువురూ కూడా బీజేపీలోకి వెళ్ళినా వెళ్ళవచ్చును. కానీ, తెదేపా-బీజేపీలు గనుక ఎన్నికలు పొత్తులు పెట్టుకోన్నట్లయితే మళ్ళీ నందమూరి కుటుంబ సభ్యులు అందరూ పాత (యన్టీఆర్) సినిమాలలోగా గ్రూప్ ఫోటోకి కలుస్తారేమో!

జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్

      రాష్ట్రంలో ఎన్నికల జోరు మొదలైంది. అసెంబ్లీ, లోక సభ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా, మున్సిపాల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం మొదలైంది. తాజాగా రాష్ట్రంలో స్థానిక సంస్థల సమరానికి తెరలేచింది. జడ్పిటిసి, ఎంపీటీసి ఎన్నికలకు సంబందించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. స్థానిక సంస్థల బ్యాలెట్ పత్రాల ద్వారానే నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు.   1. మార్చి17 నుండి 20 వరకు నామినేషన్ల స్వీకరణ 2. మార్చి 21న నామినేషన్ల పరీశీలన 3. మార్చి 24న నామినేషన్ల ఉపసంహరణ 4. ఏప్రిల్ 6న పోలింగ్ 5. ఏప్రిల్ 7న అవసరమైన చోట రీపోలింగ్ 6. ఏప్రిల్ 8న ఓట్ల లెక్కింపు

రాజకీయాల్లోకి రాఖీ?

      ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడే అందాలను ఆరబోసే రాఖీ సావంత్ ఉన్నట్టుండి సమాజసేవికగా మారిపోయింది. శుభ్రత- పరిశుభ్రత అంటూ లెక్చర్లు ఇస్తోంది. అంతేకాదు, మురికివాడలకు కూడా వెళ్లిపోతోంది. మహిళా దినోత్సవం సందర్భంగా పదివేల చెత్తబుట్టలు, కొన్ని బహుమతులు, తినుబండారాలు కొనుక్కుని మురికివాడలకు వెళ్లారు రాఖీ. అక్కడున్నవారికి వాటిని పంచిపెట్టింది. డస్ట్‌బిన్స్ పంచుతున్నప్పుడు అందరూ అందులోనే చెత్త వేయాలని, తద్వారా పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటాయని, దానివల్ల రోగాల బారినపడే అవకాశం తక్కువగా ఉంటుందని ఓ లెక్చర్ కూడా ఇచ్చేసిందట. ఆమెకు రాజకీయాల్లో చేరాలని ఉందని, అందులో భాగంగానే ఇదంతా చేసిందని కూడా కొంతమంది చెవులు కొరుక్కుంటున్నారు.

జైరామ్ దెబ్బకి టీ-కాంగ్రెస్ కూడా మటాష్?

  పార్లమెంటులో విభజన బిల్లుకి ఆమోదముద్ర పడగానే కేంద్రమంత్రి జైరామ్ రమేష్ రెక్కలు కట్టుకొని ఎగిరి వచ్చి రాష్ట్రం మీద చక్కర్లు కొడుతూ ఆంధ్ర, తెలంగాణా ప్రజలను ప్రసన్నం చేసుకొనేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి దిగ్విజయ్ సింగ్ ఇన్-చార్జ్ అయినప్పటికీ ఇప్పుడు జైరామ్ రమేషే ఇన్-చార్జ్ అన్నట్లుగా వ్యవహరిస్తూ, ఆంధ్ర, తెలంగాణాలలో పార్టీని తీవ్ర ప్రభావితం చేసే విదంగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాకు దళితుడనే ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించారు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఇంత కీలకమయిన నిర్ణయాలను ఈవిధంగా ప్రకటించ(లే)దు. కానీ, జైరామ్ రమేష్ ప్రకటించారంటే బహుశః అందుకు అధిష్టాన దేవత అనుమతించి ఉండవచ్చును.   తెలంగాణా ఇస్తే తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ మాట తప్పడమే కాకుండా, కనీసం పొత్తులకయినా కాంగ్రెస్ ను కనికరించకుండా, తామే స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బల్లగుద్ది చెపుతూ కాంగ్రెస్ కంట్లో నలుసుగా తయారయ్యారు. అంతే గాక తెలంగాణా ఏర్పడితే మొదట దళితుడనే ముఖ్యమంత్రి ని చేస్తానని చెపుతూ వచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదు. పైగా తనపార్టీ నేతలచేత తనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టి తెలంగాణా పునర్నిర్మాణం చేయాలని గట్టిగా డిమాండ్ చేయిస్తున్నారు. అందువలన ఇప్పుడు కేసీఆర్ ని అతని పార్టీని తెలంగాణా ప్రజల దృష్టిలో పలుచన చేసేందుకే బహుశః జైరామ్ రమేష్, ఇప్పుడు ‘దళిత ముఖ్యమంత్రి’ అంశం తలకెత్తుకొన్నారు. అయితే తెలంగాణా ఏర్పాటు చేసి, తెరాసను విలీనం చేసుకొని, తెదేపా, బీజేపీలను దెబ్బతీసి రాజకీయ లబ్ది పొందాలని కలలుగన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు జైరామ్ రమేష్ తాజా ప్రకటనతో మరొకసారి తన కాళ్ళను తానే నరుకొన్నట్లుగా అయింది.   తెలంగాణా ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి అవ్వాలని కలలుగంటున్న డజనుకు పైగా ఉన్న టీ-కాంగ్రెస్ నేతల ఆశలపై జైరామ్ రమేష్ ప్రకటన నీళ్ళు చల్లినట్లయింది. వారందరూ ఇంతవరకు కేవలం ముఖ్యమంత్రి పదవికోసమే సోనియా భజన చేస్తున్నారని అందుకే తెరాసతో పొత్తులు వద్దంటున్నారని కూడా అందరికీ తెలుసు. కానీ కేసీఆర్ ని ఇరుకునపెట్టే ప్రయత్నంలో జైరామ్ రమేష్ మాట్లాడిన మాటలు వారికి తీవ్ర ఆగ్రహం కలిగించాయి. ఇంతవరకు ఆయనను అంటిబెట్టుకొని తిరిగిన టీ-కాంగ్రెస్ నేతలందరూ ఇప్పుడు ఆయనపై అధిష్టానానికి పిర్యాదు చేసేందుకు సిద్దం అవుతున్నారు.   అయితే శివుడి ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు. సోనియమ్మ ఆదేశం లేనిదే జైరామ్ రమేష్ అయినా ఆవిధంగా మాట్లాడరు అనే తత్వం వారు గ్రహించలేకపోవడం విచిత్రమే. అయినా రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడం కోసం తన సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీని, నేతల రాజకీయ భవిష్యత్తుని కూడా బలిపెట్టగలిగిన కాంగ్రెస్ అధిష్టానం, అవసరమనుకొంటే టీ-కాంగ్రెస్ నేతలను (కేసీఆర్ కి) బలి ఇచ్చేందుకు ఎందుకు వెనుకాడుతుంది? అనే ఆలోచన కూడా వారికి లేకపోవడం విచిత్రమే.  

దానం దాదాగిరీ

    ‘ఈ బస్తీలో మా అన్నతిరుగొద్దన్నడు..మీరు వెంటనే వెళ్లిపోండి.. లేకుంటే బాగుండదు..’ ఇవీ ఏ వీధి రౌడీయో అన్న మాటలు కావు, ఇతర పార్టీల నాయకులకు తాజా మాజీమంత్రి దానం నాగేందర్ అనుచరుల హెచ్చరికలు. పాదయాత్ర చేస్తుంటే అడ్డుకోడానికి మీరెవరు.. అని ప్రశ్నించిన వేరే పార్టీల కార్యకర్తలపై పిడిగుద్దులు కురిపించారు. దాదాపు మూడు గంటల పాటు ఈ దౌర్జన్యకాండ నిరాఘాటంగా పోలీసులు పక్కనుంచి చూస్తుండగానే జరిగింది. బంజారాహిల్స్ డివిజన్ నందినగర్ పక్కనే ఉన్న వెంకటేశ్వర నగర్ లో ఈ సంఘటన జరిగింది. కార్పొరేటర్ కొడుకు, అతడి అనుచరులు ఈ దౌర్జన్యాలకు పాల్పడ్డారు. కార్యకర్తలు, నేతలపై దాడులకు పాల్పడిన బంజారాహిల్స్ కార్పొరేటర్ భారతి కొడుకు భానుప్రకాష్, తమ్ముడు రామ్జీ, అనుచరులు సంజీవ్‌నాయక్, రాజేందర్‌లపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 341 (దౌర్జన్యం), సెక్షన్ 509 (మహిళలపై అసభ్యప్రవర్తన, అసభ్య పదజాలంతో దూషించడం), 506 (చంపుతానని బెదిరించడం) తదితర నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

వైకాపాలో చేరిన అనంత వెంకట్రామి రెడ్డి

      సీమాంధ్రలో కాంగ్రెస్ బలమైన నాయకులంతా ఒకరి వెనుక ఒకరు పార్టీని వీడి వేరే పార్టీలోకి వలసలు వెళ్ళడంతో ఆ పార్టీ అధిష్టానం దిక్కుతొచని స్థితిలో పడిపోయింది. తాజాగా అన౦తపురం జిల్లా కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామి రెడ్డి ఆదివారం వైకాపాలో చేరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన తన అనుచరులతో కలిసి పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయన చేరికతో అనంతపురం జిల్లాతో పాటు పార్టీలో కార్యకర్తల్లో హర్షం వ్యక్తమైంది. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజలను మోసం చేసిందని, అందుకే తాను పార్టీని వీడానని తెలిపారు. జిల్లాలో పార్టీ గెలుపుకు శాయశక్తులా కృషిచేస్తానని అన్నారు. ఇప్పటికే మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి తెలుగుదేశం తరపున లోక్ సభ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపధ్యంలో అక్కడ రసవత్తర పోటీ జరిగే అవకాశం ఉంది. ఇరు పక్షాలకు ఇది ప్రతిష్టాత్మక నియోజకవర్గం అవుతుంది.

తిరుపతిలో కుల రాజకీయాలు షురూ

  తిరుపతిలో కుల రాజకీయాలు మొదలైపోయాయి. ముందునుంచే చిత్తూరు ప్రాంతంలో కులాల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. వివిధ సామాజిక వర్గాలకు చెందినవాళ్లు తమ ఆధిపత్యం చూపించుకోడానికి ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఓ పార్టీలో ఉన్న ఓ కులం వాళ్లంతా కలిసి సమావేశం పెట్టుకున్నారు. దానికి ఇతర పార్టీలలో ఉన్న సాటి కులస్థులను కూడా పిలిచారు. పిలవడం అయితే పిలిచారు గానీ, వాళ్లను వేదికమీదకు కూడా పిలవకుండా, పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా తమ పార్టీ వాళ్లనే అందలం ఎక్కించారు. దాంతో మమ్మల్ని పిలవడం ఎందుకు, ఇలా అవమానించడం ఎందుకంటూ మిగతా పార్టీల వాళ్లు మండిపడుతున్నారు. మరోవైపు బీసీ సంఘాలు కూడా ఈ కులసమావేశం విషయం తెలిసి అగ్గి మీద గుగ్గిలం అయ్యాయి. తిరుపతిలోని బీసీలలో యాదవ సామాజికవర్గం బలంగా ఉంటుంది. కుల సమావేశాలు ఏర్పాటుచేసి, తమవాళ్లనే గెలిపించుకోవాలని చెప్పడం ఏంటని వీళ్లు కూడా ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. బీసీలను కాదని వాళ్లెలా గెలుస్తారో చూస్తామని కత్తులు నూరుతున్నారు.

పవన్ పార్టీ పెడితే.. ఆలోచిస్తా: అలీ

  సినీ హీరో పవన్‌కళ్యాణ్ పార్టీపెడితే రాజకీయ ప్రవేశం, పోటీ చేసే అంశాల గురించి ఆలోచిస్తానని సినీ నటుడు అలీ చెప్పారు. గుంటూరులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పవన్ పార్టీ పెట్టకుండా రాజకీయాల గురించి మాట్లాడనన్నారు. రాజమండ్రి నుంచి పవన్ పార్టీ తరపున పోటీచేయనున్నారని ప్రచారం జరుగుతున్నట్లు విలేకరులు అడగ్గా అలాంటిదేమీ లేదన్నారు. టీడీపీ తరఫున రాజమండ్రి నుంచి గానీ, గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి గానీ అలీ పోటీ చేస్తారని ఇటీవల ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అది ఉండవల్లి వ్రాసిచ్చిన స్క్రిప్టేనా

   తెలంగాణా బిల్లు వివిధ దశలలో ఉన్నప్పుడు మాట మాట్లాడకుండా కూర్చుని, లాస్ట్ బాల్ ఇంకా ఉందంటూ కామెంట్లు చేసిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మాత్రం తెలుగు మంత్రం జపిస్తున్నారు. తెలుగువాళ్ల ఐక్యత కోసమే తాను రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. 12వ తేదీన రాజమండ్రిలో బహిరంగ సభ ఏర్పాటుచేసి, అక్కడ పార్టీ ప్రకటిస్తానని చెప్పిన ఆయన.. ఈలోపు తాను సమైక్య రాష్ట్రం కోసం ఎంతగా ‘పోరాడానో’ చెబుతున్నారు. మిగిలిన పార్టీల మీద పనిలోపనిగా దుమ్మెత్తి పోస్తున్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, పరువు ప్రతిష్టలను ఇనుమడింపజేయడానికి, తెలుగువారి సర్వతోముఖాభివృద్ధికి తన జీవితాన్ని అంకితమిస్తున్నట్లు కిరణ్ తాజాగా చెప్పారు. తెలుగుజాతిని విభజించి, అవమానించినందువల్లే పదవిని వదులుకోవడంతోపాటు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చానని వివరించారు. తన పాలనలో సామాన్యుడి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పథకాలు అమలవుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కుట్రపన్ని విభజన చిచ్చుతో నాశనం చేశాయని ఆరోపించారు. దటీజ్ కిరణ్. ఇంతకీ ఈ స్క్ర్రిప్టు అంతా ఇచ్చింది మాత్రం ఉండవల్లేనని పరిశీలకులు భావిస్తున్నారు.