రాజకీయాలకు దగ్గుబాటి గుడ్ బై
posted on Mar 7, 2014 @ 12:10PM
ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ రోజు తన అనుచరులతో సమావేశమైన దగ్గుబాటి భవిష్యత్తు కార్యాచరణపై చర్చి౦చినట్లు తెలుస్తోంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఆయన భార్య పురందేశ్వరి బిజెపి అగ్రనేతల సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. నిన్ననే దగ్గుబాటి దంపతులిరువురూ బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించి, మళ్ళీ ఇంతలోనే ఆయన మనసు మార్చుకొని ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకొంటున్నట్లు ప్రకటించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పరుచూరు శాసనసభ నియోజక వర్గం నుండి మళ్ళీ పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ ఇచ్చేందుకు కూడా అంగీకరించినట్లు సమాచారం. అదేవిధంగా గతంలో ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చేసినందున, త్వరలో బీజీపీ సీమాంధ్ర శాఖను ఏర్పాటు చేసినట్లయితే ఆయనకు పార్టీ బాధ్యతలు కట్టబెట్టే అవకాశం కూడా ఉంది. ఇటువంటి మంచి తరుణంలో ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవాలనుకోవాలని భావించడం వెనుక బలమయిన కారణాలే ఉండి ఉండవచ్చును.