చిత్తూరులో పార్టీల ముమ్మర కసరత్తు
posted on Mar 7, 2014 7:52AM
చిత్తూరు జిల్లాలో మునిసిపల్ ఎన్నికల సందడి పూర్తిస్థాయిలో కనిపిస్తోంది. ఎన్నికలు అన్ని పార్టీల నేతలను పరుగులు పెట్టిస్తున్నాయి. ప్రధాన పార్టీలు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల చైర్మన్లు, చిత్తూరు కార్పొరేషన్‌కు మేయర్ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ముమ్మరం చేశాయి. నామినేషన్లు వేసేందుకు గడువు దగ్గర పడుతుండడంతో మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు వార్డుల వారీగా, రిజర్వేషన్ల వారీగా అభ్యర్థుల జాతకాలను పరిశీలిస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న ఒకే ఒక కార్పొరేషన్ చిత్తూరు కావడంతో అందరి దృష్టీ చిత్తూరు పైనే ఉంది. టీడీపీ రాష్ట్ర నాయకత్వం మేయర్ అభ్యర్థి ఎంపికతోపాటు డివిజన్లలో కార్పొరేటర్లుగా గెలుపు గుర్రాలను పట్టుకునేందుకు నానా తంటాలు పడుతోంది. అదే సమయంలో వైఎస్సాఆర్ సీపీ డివిజన్ల వారీగా గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేసింది. మాజీ ఎమ్మెల్యే సీకేబాబు తన భార్యను మేయర్ అభ్యర్థిగా దించుతారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో 50 డివిజన్లలో తమ ప్యానల్‌గా బరిలోకి దిగే దీటైన అభ్యర్థులు ఎవరనే కసరత్తును ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇలా ప్రధాన పార్టీలన్నీ ఎవరికి వారు మేయర్ అభ్యర్థితోపాటు, కార్పొరేటర్లుగా పోటీచేసే వారి జాబితాను రెండురోజుల్లో ఖరారు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.