దేశం బాటలో సీమ నేతలు
posted on Mar 7, 2014 7:59AM
ఎన్నికల వేడి మొదలైంది. కొత్త పార్టీలు వస్తున్నాయి, సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూలు కూడా వచ్చేసింది. నాయకులు నెమ్మదిగా ఎవరికి వాళ్లు జంపింగులు మొదలుపెట్టారు. రాయలసీమ ప్రాంతంలోని కొంతమంది కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి, ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో తగిన గుర్తింపు లేకుండా పడి ఉన్న మంత్రులు, మాజీ మంత్రులు ఈ దిశగా పయనిస్తున్నట్లు సమాచారం. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో మాజీ మంత్రులు జేసీ దివాకర్ రెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు వీళ్ల మంతనాలు సాగాయి. జేసీ దివాకర్ రెడ్డి ఇప్పటికే దేశంలో చేరికపై ఓ నిర్ణయం తీసేసుకున్నారు. ఆయన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులతో భుజాలు కలుపుకుని తిరుగుతున్నట్లు సమాచారం. ఇక మరో మాజీ మంత్రి డీఎల్ కూడా చంద్రబాబు వద్దకు వెళ్లడం, ఇంతకుముందే ఆయన ఓ విలేకరుల సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోయడం చూస్తుంటే ఆయన కూడా నిర్ణయం తీసేసుకున్నట్లే కనిపిస్తోంది. ఇక ప్రకటించడమే తరువాయి.
చంద్రబాబు కూడా కాంగ్రెసోళ్లందరూ చెడ్డోళ్లు కారని, వాళ్లలో మంచివాళ్లను మాత్రమే తాము చేర్చుకుంటున్నామని చెప్పారు. ఇక తెలంగాణ జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ మరీ అనుకున్నంత ఏమీ బలహీనంగా లేదు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు. మెదక్ పురపాలక సంఘం మాజీ చైర్మన్ బట్టి జగపతి, గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి చెందిన వై.మురళీధర్‌రెడ్డి గురువారం టీడీపీలో చేరారు.