రాళ్ల మధ్యలో డ్రగ్ స్మగ్లింగ్..
posted on Jun 18, 2016 @ 3:51PM
డ్రగ్స్ ను తరలించడానికి మాఫియా వాళ్లు పన్నే పథకాలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలు చేసుకుంటూ పోలీసుల కళ్లు కప్పి డ్రగ్స్ ను తరలిస్తూనే ఉంటారు. ఇప్పుడు అలా అక్రమంగా తరలిస్తున్న డ్రగ్ ను అమెరికా అధికారులు పట్టుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 726 కిలోల మారిజువానా అనే డ్రగ్ ను లాండ్ స్కేపింగ్ రాళ్ల మధ్య తరలిస్తూ పోలీసులకు చిక్కారు. వివరాల ప్రకారం. మెక్సికో సరిహద్దులలోని ఒటే మెసా కార్గో ద్వారా లాండ్ స్కేపింగ్ కోసం ఉపయోగించే పెద్ద సైజు రాళ్లను తరలిస్తుండగా.. అనుమానం వచ్చిన కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు వాటిని పరిశీలించారు. ఆ రాళ్లను డ్రిల్ చేసి చూడగా అసలు బండారం బయటపడింది. ఆ రాళ్ల మధ్యలో డ్రగ్ పెట్టి తరలిస్తున్నారు. మొత్తం 577 ప్యాకెట్లలో మారిజువానా బయటపడింది. ఈ డ్రగ్స్ విలువ దాదాపు రూ. 5.5 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.