చంద్రబాబుతో మాట్లాడా.. హామీలన్నీ నెరవేరుస్తాం.. జైట్లీ
posted on Aug 2, 2016 @ 3:49PM
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ అటు పార్లమెంట్ ఉభయసభల్లోనూ.. ఇటు ఏపీ రాష్టమంతటా నిరసలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ఎంపీలంతా ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకొని ఆందోళనలు చేపట్టారు. ఇక ఏపీలో వైసీపీ రాష్ట్రం మొత్తం బంద్ ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉండగా లోక్ సభలో ఎంపీలంతా ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ నినాదాలు చేపట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభకు వచ్చి.. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సమస్యలు తమకు తెలుసని.. ఏపీ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో తాను మాట్లాడానని అన్నారు. ఆయనతో అన్ని విషయాలు చర్చించానని ఆయన తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే అందుకు కొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు.