మోడీకి వెంకయ్య ఫోన్... ఇది మంచిది కాదు..
posted on Aug 1, 2016 @ 4:56PM
ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటి వరకూ మిత్ర పక్షాలుగా ఉన్న టీడీపీ, బీజేపీ మధ్య దూరం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని బీజేపీ చెబుతుంటే టీడీపీ మాత్రం ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని బీజేపీ నేతలు గతంలో చెప్పకనే చెప్పారు. ఇప్పుడు మళ్లీ అదే పాట పాడారు. రాజ్యసభలో కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రారావు ప్రత్యేక హోదాపై ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం విషయాన్ని నాన్చి, నాన్చి.. ఆఖరికి ఇచ్చేది లేదని పరోక్షంగా చెప్పింది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. అంతేకాదు బీజేపీ పొత్తుతో టీడీపీ చాలానే నష్టపోయిందని కూడా అన్నారు. ఈ నేపథ్యంలో అసలే బీజేపీ, టీడీపీ మిత్రపక్షమైనప్పటికీ కాస్త దూరంగానే ఉంటున్నాయి.. ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా కారణంతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది.
ఇప్పుడు ఈ విషయంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ప్రధాని నరేంద్రమోడీకి స్వయంగా ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీ పార్టీల మధ్య దూరం పెరుగుతుందని.. ఇది ఎంతమాత్రం మంచిది కాదని అన్నారు. ఎన్నికలకు ముందు బీజేపీ స్వయంగా ప్రత్యేక హోదా హామీ ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన, అవకాశం ఉన్నంత మేరకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని తద్వారా సమస్యలను పరిష్కరించ వచ్చని వెంకయ్య సూచించినట్టు తెలుస్తోంది. మరి మోడీ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.