ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఎటు..!
posted on Aug 2, 2016 @ 5:32PM
గతంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం కావాలని డిమాండ్ చేస్తూ ఆంధ్ర రాష్ట్రం అంతటా నిరసనలు, ధర్నాలు చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ అప్పుడు ఫలితం శూన్యం. ఇప్పుడు మరోసారి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాష్టం మొత్తం నిరసనలు నిర్వహించారు. మరోవైపు ఏపీ ఎంపీలు కూడా ఈసారి పార్లమెంట్లో గట్టిగానే ఆందోళనలు చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని.. ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వాదనలు వినిపించారు. దీంతో పార్లమెంట్ ఉభయసభల్లోనూ గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పుడు బీజేపీకి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని బీజేపీ అధిష్టానం ఎప్పుడో చెప్పకనే చెప్పింది. రాష్ట్ర విభజన ఏర్పడిన తరువాత ఏదో పైపైకి నాన్చుతూ.. హోదా ఇచ్చే అంశంపై ఆలోచిస్తున్నామని మాటలు చెప్పి.. ఆఖరికి రెండు సంవత్సరాల తరువాత అసలు ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదని.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని తేల్చిచెప్పింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ రెండు రోజులు నిరసనలు, ధర్నాలు చేశారు. ఆ తరువాత మళ్లీ కామన్.. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆలోచిస్తున్నామని బీజేపీ పెద్దలు చెప్పడం.. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వ నేతలు ఇవ్వాలని అని డిమాండ్ చేయడం సరిపోయింది. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రారావు ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు ప్రేవశపెట్టారు. ఇక ఈ బిల్లు కూడా చర్చకురానివ్వకుండా బీజేపీ నేతలు బాగానే ప్రయత్నించారు. ప్రయత్నించడం కాదు.. అసలు బిల్లును చర్చకు రానివ్వమని బహిరంగంగానే చెప్పారు. కానీ అన్ని పార్టీలు ఒకతాటిపైకి వచ్చే సరికి చర్చించక తప్పలేదు. కానీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అప్పుడు కూడా ఏపీకి ప్రత్యేక హోదా రాదని చెప్పకనే చెప్పారు. దీంతో మళ్లీ నిరసనలు స్టార్ట్.
అయితే ఈసారి మాత్రం పరిస్థితి కాస్త బీజేపీని చిక్కుల్లో పడేసే విధంగానే కనిపస్త్తోంది. కేవలం రాజకీయ లబ్దికోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీల్చింది. అందులో భాగంగానే ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చింది. దీనికి స్పందించిన బీజేపీ పెద్దలు ఐదేళ్లు కాదు తాము కనుక అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రగల్భాలు పలికింది. అనుకున్నట్టే అధికారంలోకి వచ్చింది బీజేపీ. అయితే ఇప్పుడు మాత్రం అది అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ అని.. అది విభజన చట్టంలో లేదని సన్నాయి నొక్కులు నొక్కుతుంది. ఇక రాష్ట్ర విభజన చేసిన పాపానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ దాని ఫలితం అనుభవిస్తుంది. ఏదో ఇప్పుడు కనీసం తమ ద్వారా ప్రత్యేక హోదా అన్న వస్తే కొంతలో కొంత పాపాన్న కడుగున్నట్టు అవుతుందని భావిస్తున్నారు. ఈక్రమంలోనే బీజేపీ కూడా ప్రత్యేక హోదాపై ఇలానే నాన్చితే కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక వైసీపీ పార్టీ నేతలు కూడా తమ వ్యూహాల్లో తాము ఉన్నారు.
ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అయోమయంలో ఉంది. ఒకపక్క మిత్రపక్షమైన బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. ప్రత్యేక హోదాపై ఖచ్చితంగా కావాలని డిమాండ్ చేయలేకపోతున్నారు. మరి ప్రజలు దీన్ని చూస్తూ ఊరుకునే పరిస్థితుల్లో లేరు. అలా ఖచ్చితంగా బీజేపీ తో ఢీకొట్టాలంటే అది కాని పని. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తే అటు ఏపీ అభివృద్ధికి కాని.. ఏపీకి నిధులు రావాలన్నా కానీ కాస్త ఇబ్బందే. అలా కాకుండా ఉండాలంటే తాను రాజీనామా చేసి వేరేగా వెళ్లడం ఒక్కటే మార్గం. అలాకాకుండా బీజేపీతోనే ఉంటూ.. వారిపై ఒత్తిడి తెస్తూ.. వారిని బతిమాలో.. ఏదో విధంగా ప్రత్యేక హోదా సాధిస్తేనే మంచిదని అంటున్నారు. అంతేకాదు ఏపీ ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుకు సోషల్ మీడియా ప్రచారం కూడా మైనస్ అయిందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఏపీకి ప్రత్యేక హోదా రావలంటూ రాష్ట్రమంతటా.. అటు ఢిల్లీలో కూడా ఆందోళనలు జరుగుతుంటే.. నేషనల్ ఛానల్స్ ఒక్కటంటే ఒక్కసారి కూడా దీనిపై వార్తలు రాలేదు. ఇలాంటి కొన్ని కొన్ని విషయాల్లో కూడా చంద్రబాబు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. మరి చూద్దాం చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో.. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీతో ఎలా ముందుకు వెళతారో.. ఎలా వారిని ఢీకొంటారో.