బాలారిష్టాలు ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నాం-కేసీఆర్
posted on Aug 15, 2016 @ 12:24PM
70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగిన వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోవడం ఇది మూడోసారని..బాలారిష్టాలు ఒక్కొక్కటిగా అధిగమిస్తూ...స్థిర పాలన అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర సాధనలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం లుంబినీ పార్కులో అమరవీరుల స్థూపాన్నీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దేశాన్ని ఆకర్షించాయని..రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని మోడీ ప్రశంసించడం మనలో స్పూర్తి నింపిందన్నారు. సమాఖ్య స్పూర్తితో కేంద్రంతో సంబంధాలు కొనసాగిస్తున్నామని, ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలతో సత్ఫలితాలు పొందుతున్నామన్నారు. దసరా కానుకగా కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతోందని, ఆ రోజు నుంచే కొత్త జిల్లాలు పని చేస్తాయని ముఖ్యమంత్రి ప్రకటించారు.