సామాన్యుడి జీవితంలో మార్పు తీసుకురావాలి-మోడీ
posted on Aug 15, 2016 @ 11:40AM
70వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 125 కోట్ల భారతీయులకు నా శుభాకాంక్షలు అని తెలిపారు. మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం వెనుక లక్షలాది మహానుభావుల త్యాగఫలం ఉందని గుర్తు చేశారు.
కృష్ణుడి నుంచి గాంధీ వరకు, భీముడి నుంచి అంబేద్కర్ వరకు భారతదేశానికి సనాతన చరిత్ర ఉందని ప్రధాని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేళ దేశాన్ని కొత్త శిఖరాలకు చేర్చేందుకు మనమంతా సంకల్పించుకోవాలన్నారు. స్వరాజ్యం ఏర్పడాలంటే త్యాగాలు తప్పనిసరని..అది మన నిరంతర సంకల్పం కావాలని ప్రధాని స్పష్టం చేశారు. సామాన్యుడి జీవితంలో మార్పు తీసుకురావడమే సురాజ్యమని పేర్కొన్నారు. ఆ దిశగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆరోగ్య, పౌర సేవల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత జోడించాలని మోడీ పిలుపునిచ్చారు.