భార్య శవాన్ని భుజంపై మోస్తూ 10 కిలోమీటర్లు..
posted on Aug 25, 2016 @ 12:07PM
ఒడిషాలో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పేదరికం వల్ల తన భార్య శవాన్ని మోస్తూ 10 కిలోమీటర్లు నడుకుంటూ వెళ్లాడు ఓ వ్యక్తి. వివరాల ప్రకారం.. దానా మాజీ, అమంగ్ దేయి భార్య భర్తలు. అయితే అమంగ్ దేయి గత కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతుంది. అయితే ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లాడు దానా మాజీ. చికిత్స పొందుతూనే ఆస్పత్రిలో మరణించింది. ఇక శవాన్ని ఇంటికి చేర్చడానికి వాహనంలో తీసుకెళ్లే స్థోమత లేకపోవడంతో తన భుజంపైనే మోస్తూ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వగ్రామానికి బయలుదేరాడు. అలా 10 కిలోమీటర్లు నడిచాడు. ఇంతలో అది కాస్త మీడియా ప్రతినిధుల కంట పడడంతో ఆరా తీశారు. నేను చాలా పేదవ్యక్తినని.. వాహనాన్ని ఏర్పాటు చేసుకోలేను.. నా నిస్సాహాయతను ఆస్పత్రి అధికారులకు మోరపెట్టుకున్నాను.. దానికి వారు తాము ఎటువంటి సహాయం చేయలేమని తేల్చిచెప్పారు. దీంతో అనివార్యంగా భార్య మృతదేహాన్ని మోస్తూ ఇంటికి తీసుకువెళ్తున్నట్లు పేర్కొన్నాడు. దాంతో వారు జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పగా.. ఓ అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఘటన గురించి తెలుసుకున్న అధికార పార్టీ ఎంపీ కైలాష్ సింగ్.. జరిగిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక మంత్రిని కోరారు.