నిమిషానికో ట్విస్ట్.. సమాజ్ వాద్ పార్టీ దారెటు..
posted on Sep 16, 2016 @ 4:17PM
సమాజ్ వాదీ పార్టీలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు నెలకొంటున్నాయి. గత రెండురోజుల క్రితం నుండి ములాయం కుటుంబంలో రాజకీయ విబేధాలు బయటపడుతున్న నేపథ్యంలో వేడి వాతావరణం నెలకొంది. ములాయం తమ్ముడు శివపాల్ యాదవ్ ను సంతృప్తి చేసేందుకు గాను కొడుకు అని కూడా చూడకుండా అఖిలేశ్ ను అధ్యక్ష పదవి నుండి తొలగించారు. ఆ పదవిని కాస్త శివపాల్ యాదవ్ కు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆయనకు ఏమైందో ఏమో కాని.. అధ్యక్ష పదవికి.. మంత్రి పదవికి కూడా రాజీనామా చేసేశారు. ఆయన ఒక్కడే కాదు ఆయన భార్య, కుమారుడు అందరూ రాజీనామాలు చేశారు. అయితే అఖిలేశ్ మాత్రం తన బాబాయి రాజీనామాను తిరస్కరించినట్టు తెలుస్తోంది. తన తండ్రి ములాయం సింగ్ తో చర్చలు జరిపిన తరువాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు తన కుటుంబంలో నెలకొన్న రాజకీయ విబేధాల నేపథ్యంలో ములాయం మాట్లాడుతూ.. సమాజ్‌వాదీ పార్టీ మొత్తం ఒక కుటుంబం లాంటిదని, తమ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన తెలిపారు. అయితే ఆయన అలా చెప్పిన కొద్దిసేపటికే శివపాల్ యాదవ్ తన రాజీనామాను ఆమోదించాల్సిందే అని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. మరి పైకి అంతా సమసిపోయినట్లే కనిపిస్తున్నా.. ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదని స్పష్టంగా అర్ధమవుతోంది. మరి నిమిషానికో రకంగా మారుతున్న ఈ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి.