మార్కెట్లోకి పతంజలి జీన్స్..

ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి దేశీయ ఆహార రంగంలో అగ్రశ్రేణి సంస్థలకు పోటీనిస్తూ దూసుకుపోతోంది. తాజాగా వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. యువతలో అధిక డిమాండ్ ఉన్న కారణంగా స్వదేశీ జీన్స్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని సంస్ధ యజమాని బాబా రాందేవ్ స్వయంగా ప్రకటించారు. ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాది ఆరంభంలో మార్కెట్లోకి స్వదేశీ జీన్స్‌ను ప్రవేశపెడతామని ఆయన అన్నారు. ఇప్పటికే ఎఫ్ఎంసీజీ రంగంలో ప్రముఖ సంస్థలకు ముచ్చెమటలు పట్టించిన పతంజలి వస్త్ర రంగంలో ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో వేచి చూడాలి.

సీఎస్‌పై కూతురు లైంగిక దాడి కేసు..

రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాశ్ మీనాపై లైంగిక ఆరోపణలు నమోదయ్యాయి..ఆ ఆరోపణలు చేసింది ఎవరో కాదు స్వయంగా ఆయన కూతురు. ప్రస్తుతం లండన్‌లో చదువుకుంటోన్న ఆయన కూతురు తన తండ్రి ఎలా ప్రవర్తించాడో కోర్టుకు మెయిల్ ద్వారా వెల్లడించింది. మానాన్న నన్ను భారంగా భావించేవాడు..నన్ను అభ్యంతరకరంగా తాకేవాడు. 13 ఏళ్ల వయసులో ఉన్నపుడు నా గదిలోకి వచ్చేవాడు..చెప్పరాని చోటు చేతులు వేసి తాకేవాడు. ఇలా రెండేళ్లపాటు ప్రతి రోజు నరకం అనుభవించాను. చివరకు ఈ విషయాన్ని అమ్మతో చెప్పాను. దాంతో పోలీసులకు చెప్తానని కూడా అమ్మ బెదిరించింది. మగ సంతానం కావాలని అమ్మను విడాకులు అడిగారు. రెండో పెళ్లి చేసుకునేందుకు అడ్డుగా ఉందని మొత్తం కుటుంబసభ్యులు వేధించేవారు. నేను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు రాజీ కుదిర్చి ఆయనకు అనుకూలంగా ఉండేలా చేశారే తప్ప న్యాయం చేయలేదని ఆమె ఈ మెయిల్‌లో పేర్కొన్నారు. అయితే దీనిపై ఓం ప్రకాశ్‌ను ప్రశ్నించగా వారు చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలు అని చెప్పారు. నా భార్య, కూతురు తనపై చాలా కేసులు పెట్టారని, రెండు కేసుల్లో ఓడిపోయారని అన్నారు. ఐదేళ్లుగా వారు తనకు దూరంగా ఉంటున్నారని అన్నారు.

మేం పొట్టలో పొడవలేదు..పొట్ట నింపుతున్నాం

కాకినాడ సభలో భారతీయ జనతా పార్టీపై జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇవాళ ఉదయం నుంచి పవన్‌ను టార్గెట్ చేశారు కమలనాథులు. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు పవన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఏపీ ప్రజల పొట్టలో పొడిచిందంటూ పవన్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. బీజేపీ ఏపీ ప్రజల పొట్టలో పొడవలేదని..పొట్ట నింపుతోందని అన్నారు. రాష్ట్రంలో ఇండస్ట్రీయల్ కారిడార్‌తో యువత కడుపు నింపుతామని చెప్పారు. ప్రత్యేక ఆంధ్రా ఉద్యమానికి ఆనాడు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. 

హైదరాబాద్‌లో భారీ వర్షం

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ భారీ వర్షాలతో తడిసి ముద్దవుతోంది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. తాజాగా కొద్దిసేపటి క్రితం నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్, తార్నాక, నాచారం, మల్లాపూర్, హబ్సీగూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపరితల ఆవర్తనం మరో 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశముందని..దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

కాపుల కోసం..మరోసారి ముద్రగడ దీక్ష

కాపులను బీసీల్లో చేర్చాలంటూ గత కొన్న రోజులుగా ఆందోళన చేస్తోన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి దీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు. కాపు ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసే దిశగా ఇవాళ రాజమండ్రిలో కాపు ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా నగరానికి చేరుకున్న ముద్రగడ మీడియాతో మాట్లాడారు. ఉద్యమ కార్యచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. తనపై ప్రభుత్వం నిఘా పెట్టాలని ఆరోపించారు. తన ఫోన్‌ కాల్స్ ట్రాప్ చేస్తున్నారని, అందుకు తనకు ఎలాంటి అభ్యంతరాలూ లేవని తెలిపిన ఆయన, ముఖ్యమంత్రి బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారన్నారు.  కాపులకు న్యాయం చేస్తానన్న చంద్రబాబు, తన హామీని వెంటనే నెరవేర్చకుంటే మరోసారి దీక్ష తప్పదని హెచ్చరించారు.

మార్కేట్లోకి ఐఫోన్ 7, 7 ప్లస్.. ఫీచ‌ర్లివే

  టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా ఐఫోన్ 7, 7 ప్లస్ మొబైళ్లను విడుదల చేసింది. అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కో లోని బిల్ గ్రాహం సివిక్ ఆడిటోరియంలో  ఐఫోన్ 7, 7 ప్లస్ మోడళ్లను విడుదల చేశారు. వీటితో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 2ను కూడా విడుదల చేశారు.  32 జీబీ ఐఫోన్ 7 ధ‌ర రూ.43వేలు ఉండ‌గా, అదే ఐఫోన్ 7 ప్ల‌స్ రూ.51వేల‌కు ల‌భ్యం కానుంది. కాగా భారత్‌లో ఐఫోన్ 7, 7 ప్లస్ మొబైళ్లను అక్టోబర్ 7న విడుదల చేయనున్నారు. ఐఫోన్ 7, 7 ప్ల‌స్ ఇత‌ర‌ ఫీచ‌ర్లివే... ఐఫోన్ 7, 7 ప్ల‌స్ రెండింటి ఫీచ‌ర్లు ఒకే విధంగా ఉన్నాయి. కాక‌పోతే డిస్‌ప్లే, కెమెరాలు మాత్ర‌మే వేరుగా ఉన్నాయి. ఐఫోన్ 7లో 4.7 ఇంచ్ డిస్‌ప్లే ఉంటే ఐఫోన్ 7 ప్ల‌స్‌లో 5.5 ఇంచ్ డిస్‌ప్లే ఉంది. ఐఫోన్ 7లో 12 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా ఒక‌టి ఉంటే, ఐఫోన్ 7 ప్ల‌స్‌లో అవి రెండు ఉన్నాయి. ఇక మిగ‌తా అన్నీ ఫీచ‌ర్లు స‌మాన‌మే. * ఓలియోఫోబిక్ కోటింగ్ డిస్‌ప్లే * 4జీ ఎల్‌టీఈ, నానో సిమ్ * ఐపీ 67 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్ * యాపిల్ పే, ఐఓఎస్ 10 * యాపిల్ ఎ10 ఫ్యూష‌న్ ప్రాసెస‌ర్ * 2 జీబీ ర్యామ్, 32/128/256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌ * వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2 ఎల్ఈ

శాసనమండలిలో చంద్రబాబు.. సమావేశాలు ఇవే చివరివి

  ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేతుల ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనమండలిలో ఏపీ ప్రత్యేక హోదా ప్రకటించారు. ఏపీ శాసన మండలి సమావేశాలకు హాజరైన ముఖ్యమంత్రి కాస్త భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. 1980లో తొలిసారి మండలి సమావేశాలకు హాజరైనట్టు తెలిపారు. అంతేకాదు ఏపీ అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్లో ఇవే చివరివై ఉండవచ్చని పేర్కొన్నారు. ఇంకా హోదా గురించి మాట్లాడుతూ.. ఏపీ ప్రత్యేకహోదాపై కేంద్రం నుండి ప్రకటన రావడంతో బీజేపీ బీజేపీ, తెలుగుదేశం నేతల తీరుపై పలువురు చేసిన విమర్శల చేస్తున్నారని.. మంచి పనులు చేస్తున్న తమపై ఎన్నో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌ని, తనను చెప్పుతో కొడతానని కొందరు అన్నారని.. ఈ వ్యాఖ్య‌కు తాను ఎంతగానో బాధపడిన‌ట్లు ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏ రాష్ట్రానికీ హోదా ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని కేంద్రం చెబుతోందని.. కేంద్రం పెద్ద‌లు ప్ర‌త్యేక హోదా వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌న్నీ ఇస్తామంటున్నారని అన్నారు.

11 ఏళ్ల తరువాత.. జైలు నుండి ఎంపీ

  రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ నేత‌, మాజీ ఎంపీ మొహ‌మ్మ‌ద్ షాహ‌బుద్దిన్ దాదాపు 11 ఏళ్ల తరువాత జైలు నుండి విడుదలయ్యాడు. బగల్ పూర్ జైలులో శిక్ష అనుభవించిన ఆయన ఈరోజు జైలు నుండి విడుదలయ్యాడు. ఈయన విడుదల నేపథ్యంలో ఆయ‌న అభిమానులు జైలు వ‌ద్ద‌కు భారీగా చేరుకున్నారు. దాదాపు 600 వాహ‌నాల‌తో భారీ ర్యాలీ తీశారు. నాలుగు సార్లు ఎంపీగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన షాహ‌బుద్దిన్ ను ఓ మర్డర్ కేసులో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. అయితే ఇన్ని సంవతస్సరాల తరువాత పాట్నా హైకోర్టు షాహబుద్దిన్ కు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుండి బయటకు వచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... నాపై తప్పుడు కేసు పెట్టారని... ఈ కేసులో నన్ను ఇరికించారని ఆరోపించారు. అంతేకాదు ఎప్పటికీ తన నేత లాలూ ప్రసాదే అని అన్నాడు.

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ విజయం..

  దిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన విద్యార్థి సంఘం ఏబీవీపీ  విజయం సాధించింది. దిల్లీ యూనివర్సిటీ పరిధిలోని 44 కళాశాలల్లో కూడా స్టూడెంట్‌ కౌన్సిల్‌ ఎన్నికలు జరిగాయి. అయిదుగురు సభ్యుల ప్యానెల్‌ను ఎన్నుకునేందుకు జరిగిన ఈ ఎన్నికల్లో.. 11 కళాశాలల్లో ఏబీవీపీ విజయం సాధించింది. ఎన్నికల్లో టాప్‌ నాలుగు స్థానాల్లో మూడు ఏబీవీపీ సొంతం చేసుకోగా, ఒక స్థానం కాంగ్రెస్‌కు చెందిన ఎన్‌ఎస్‌యూఐ దక్కించుకుంది. దిల్లీ వర్సిటీ ప్రెసిడెంట్‌గా అమిత్‌ తన్వార్‌ గెలుపొందగా, ప్రియాంక చబ్రి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సెక్రటరీగా అంకిత్‌ సంగ్‌వాన్‌ ఎన్నికయ్యారు. వీరంతా ఏబీవీపీకి చెందిన వారు. ఎన్‌ఎస్‌యూఐకి చెందిన మోహిత్‌ సంగ్‌వాన్‌కు జాయింట్‌ సెక్రటరీ స్థానం దక్కింది.

పవన్ వ్యాఖ్యలపై వెంకయ్య.. ఆ అవసరం లేదు..

కాకినాడ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై పోరాట సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే సభలో పాల్గొన్న పవన్ బీజేపీ, వెంకయ్యనాయుడే టార్గెట్ గా ప్రసంగించిన సంగతి కూడా విదితమే. ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ప్రతిఒక్కరికీ ఉంది..నాపై వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు.. ప్రజలకే సమాధానం చెప్తా అని అన్నారు. ఆనాడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడింది నేనే.. ఇప్పుడు మాట్లాడుతున్నవారు అప్పుడు ఏమయ్యారు అని ప్రశ్నించారు. అంతేకాదు ఏపీకి హోదాకు మించిన సాయం చేస్తున్నామని అన్నారు.

టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణ.. 9 మందికి తీవ్ర గాయాలు

  ఇప్పటికే ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరు పార్టీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. ఇప్పుడు ఏకంగా ఇరు పార్టీ కార్యకర్తలు సైతం ఘర్షణకు దిగే పరిస్థితి నెలకొంది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా పరిగి మండలం.. పైడేటి గ్రామంలో వినాయచవితి ఉత్సవాల సందర్భంగా ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది దీంతో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని అస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు.

ఇదే రిపీట్ అవుతుంది.. అమెరికాకు ఆల్‌ఖాయిదా హెచ్చరిక...

  9/11 ఈ డేట్ పేరు చెప్పగానే మనకు అమెరికాలోని ట్విన్ టవర్స్ పై ఉగ్రవాదులు జరిపిన సంఘటన గుర్తుకొస్తుంది. ఈ ఘటన జరిగి దాదాపు 15 ఏళ్లు గడుస్తున్న ఇప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే ఇప్పుడు అలాంటి దాడులే మళ్లీ జరుగుతాయని అగ్రరాజ్యమైన అమెరికాను హెచ్చిరించారు ఉగ్రవాదులు. నిన్నటితో ఈఘటన జరిగి 15 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఆల్‌ఖాయిదా ఓ వీడియోను విడుదల చేసింది. అందులో ఆల్‌ఖాయిదా చీఫ్ అయిమన్ అల్-జవహరీ మాట్లాడుతూ.. ‘‘మాపై మీ నేరాలకు ప్రతీకారంగానే 9/11’’ దాడి అని..ఇది ఇలాగే కొనసాగితే 9/11 లాంటి ఘటనలు వేలసార్లు చూడాల్సి వస్తుందని హెచ్చరించాడు. అరబ్, ముస్లిం దేశాలల్లో భూములను ఆక్రమించుకుంటూ నేరపూరిత, లంచగొండి ప్రభుత్వాలకు అమెరికా మద్దతు ఇస్తోందని ఆరోపించాడు. ఉగ్రవాదులందరూ ఏకం కావాలని కోరిన ఆల్‌ఖాయిదా చీఫ్ ఆఫ్రికన్ అమెరికన్లను ఇస్లాంలోకి మారాల్సిందిగా సూచించాడు. కాగా 2001లో ట్విన్ టవర్స్‌పై జరిగిన దాడిలో 2,753 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే.

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్... అరెస్టుల పర్వం..

  కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఈరోజు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్రమంతా బంద్ చేపట్టారు. తెల్లవారుజామున 4గంటల నుంచే వామపక్ష పార్టీలన్నీ బంద్ ను ప్రారంభించారు. మరోవైపు పోలీసులు కూడా బంద్ చేపట్టిన నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లకు తరలిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వైకాపా, వామపక్ష పార్టీలకు చెందిన 54 మందిని అదుపులోకి తీసుకున్నారు.   ఇంకా తిరుపతిలో వైకాపా నేత భూమన కరుణాకర్‌రెడ్డిని అరెస్టు చేసి తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టుకు నిరసనగా తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట వైకాపా కార్యకర్తలు ధర్నా చేపట్టారు.   కడప జిల్లాలో 8 డిపోల పరిధిలో 930 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారుజామునే బస్టాండ్‌ల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగిన వైకాపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక సీపీఎం నాయకులు శాంతియుతంగా మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. విద్యా, వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా సినిమాహాళ్లు, పెట్రోల్‌ బంక్‌లు మూసివేశారు.  

ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఉద్రిక్తత

అసెంబ్లీ లోపలే కొట్టుకునే అధికార, ప్రతిపక్ష సభ్యులు చివరికి సభ బయట కూడా అలాంటి వాతావరణాన్నే సృష్టిస్తున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీ మూడో రోజు సమావేశాల్లో భాగంగా ప్రత్యేకహోదాపై చర్చించాలంటూ ప్రతిపక్ష వైసీపీ సభ్యులు పట్టుబట్టడంతో స్పీకర్ కోడెల సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.  దీంతో శాసనసభ్యులు మీడియా పాయింట్ వద్దకు చేరుకున్నారు. అయితే ముందుగా వైసీపీ చేరుకోగా..ఆ తర్వాత టీడీపీ సభ్యులు అక్కడికి వచ్చారు. అయితే ముందు మేం మాట్లాడాలంటే..మేం మాట్లాడాలంటూ ఇరు వర్గాలు బాహాబాహీకి దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.