రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. తొమ్మిది రోజులు రైళ్లు రద్దు..
posted on Sep 21, 2016 @ 4:02PM
ఒకపక్క వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలు రద్దు అయి ఇప్పటికే ప్రయాణికులు అవస్థలు పడుతుంటే ఇప్పుడు మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా తొమ్మిది రోజుల పాటు కొన్ని రైళ్లను రద్దు చేసింది విజయవాడ రైల్వే. అసలు సంగతేంటంటే.. ఈనెల 20 నుంచి 28వ తేదీ వరకు సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ పనులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 300 రైళ్లు రాకపోకలు సాగించే విజయవాడ రైల్వే స్టేషన్లో సుమారు 50 రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు. ఈ సందర్బంగా సీనియర్ డీసీఎం ఎం.యల్వేందర్‌యాదవ్ మాట్లాడుతూ.. రైల్వే సిగ్నలింగ్ ఆధునీకరణ పనుల నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశామని.. దీనిని గుర్తించి ప్రయాణికులు రెల్వే చేస్తున్న అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. అంతేకాదు విశాఖ నుంచి విజయవాడ మీదుగా వెళ్లే రైళ్లు...విజయవాడ మీదుగా విశాఖ రావాల్సిన ఏ ఒక్క రైళ్లు సిగ్నలింగ్ పనులు పూర్తయ్యేంత వరకు విజయవాడ స్టేషన్‌కు వెళ్లవని స్పష్టం చేశారు.