దేవుడా.. అభిషేకానికి 5వేలు
posted on Sep 21, 2016 @ 4:57PM
ఆఖరికి దేవుని పేరుతో కూడా వ్యాపారం చేసే రోజులు వచ్చాయి. ఏదో భక్తితో దేవునిని దర్శించుకుందామా అని వచ్చే భక్తులకు.. దేవాలయాల్లోని టికెట్లు ధరలు చూస్తుంటే పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నంత పని అవుతుంది. ఇందులో శ్రీశైలంలోని మల్లన్న ఆలయం ముందు ప్లేస్ లో ఉంది. గత కొంత కాలంగా శ్రీశైలం మల్లన్న అధికారులు ఆలయాన్ని ఆలయ కేంద్రంగా మార్చేశారు అన్న విమర్శలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా టికెట్ ధరలు అమాంతం పెంచేసి అది నిజమే అని తేల్చేశారు. కొత్తగా పెంచిన ధరలు చూసి భక్తులు షాకవ్వడం ఒకటే తరువాయి.. ఆలయ అధికారులు పెంచిన ధరులపై ఓ లుక్కేస్తే..
* గర్భాలయ అభిషేకం సేవను 5 వేలకు నిర్ణయించారు.
*సామూహిక అభిషేకం టికెట్ ధర రూ. 1000 నుండి 1500 కు పెంచారు. అయితే ఇంతకు ముందు సామూహిక అభిషేకం ధర మామూలుగా రూ.
1000 ముందుగా బుక్ చేసుకుంటే 1500 ఉండేది. ఇప్పుడు రెండింటికి ఒకటే రేటు 1500 ఫిక్స్ చేసేశారు.
* ఇంకా కుంకుమార్చన టికెట్ రూ 350 నుండి ఏకంగా రూ. 1000 రూపాయలు పెంచారు.
* రుద్రహోమం.. చండీహోమం టికెట్లు ధరలు రూ. 1200 నుండి రూ.1500 పెంచారు.
* ఇక సామాన్య భక్తులకు అందుబాటులో ఉండే శీఘ్ర దర్శనం టికెట్ ను రూ.50 నుండి రూ. 100కి పెంచారు.
ఇంకా గుడ్డి కంటే మెల్ల నయం అన్న చందాన కొన్ని టికెట్ల ధరలు తగ్గించి భక్తులకు కాస్త ఊరట కలిగించారు. అందులో కళ్యాణోత్సవం టికెట్ రూ. 1000 నుండి రూ.500కి.. సుప్రభాతం సేవ టికెట్ ను రూ. 1000 నుండి రూ.500కి తగ్గించారు.
మొత్తానికి ఇలానే ధరలు పెంచుకుంటూ పోతే సామాన్య ప్రజలకి అయితే ఆఖరికి దేవుని దగ్గరకి వెళ్లాలన్న ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.