ఉరీ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం..
posted on Sep 24, 2016 @ 10:43AM
పాకిస్థాన్ ఉరీ పై చేసిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ బాగానే ప్రతీకారం తీర్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఉరీ దాడి తరువాత భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి వెళ్లిమరీ ఉగ్రవాదులను మట్టుబెడుతోంది. ఇప్పటి వరకూ పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో అడుగుపెట్టిన బలగాలు కనీసం 20 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సైనికులతో కూడిన పారాచూట్ రెజిమెంట్ బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొని.. మూడు ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం చేసిన దాడిలో 20 మంది ముష్కురులు ప్రాణాలు కోల్పోగా 180 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే కచ్చితంగా ఎంతమంది ఉగ్రవాదులు మృతి చెందారన్నది మాత్రం తెలియరాలేదు.
ఇదిలా ఉండగా మరోవైపు భారత్ కు పాక్ హెచ్చరికలు జారీ చేస్తుంది. భారత్‌లో లక్ష్యాలను ఎంచుకున్నామని, అటు నుంచి ఏ చిన్న దాడి జరిగినా బలంగా తిప్పికొడతామని పాకిస్థాన్ హెచ్చరించింది. ఇప్పటికే బలగాలను మోహరించామని, సమీప భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురైనా పాకిస్థాన్ సైన్యం మాత్రం ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుందని రక్షణశాఖ వర్గాలు స్పష్టంచేశాయి. తమ సత్తా ఏంటో భారత్‌కు తెలుసని కూడా పాక్ హెచ్చరించింది. మరి ఈ నేపథ్యంలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.