మారిన చైనా... ఎన్ఎస్జీ సభ్యత్వానికి సహకరిస్తాం..
posted on Oct 10, 2016 @ 10:41AM
చైనా, పాకిస్థాన్ లు ఎప్పుడూ భారత్ కు పక్కలో బల్లెంలా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఒకపక్క పాక్-భారత్ మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు చైనా ఓ ఆశ్చర్యకరమైన ప్రకటన ప్రకటించింది. ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం ఇండియా ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి అగ్రరాజ్యాలు సైతం ఓకే చెప్పినా చైనా మాత్రం అడ్డుకట్ట వేస్తూ వచ్చింది. అంతేకాదు ఇండియాకు సభ్యత్వం ఇచ్చినప్పుడు పాక్ కు కూడా ఇవ్వండి అంటూ మధ్యలో పుల్ల పెట్టింది. అయితే ఇప్పుడు ఏమైందో ఏమో కానీ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ)లో ఇండియా చేరేందుకు తాము సహకరిస్తామని చైనా మంత్రి ఒకరు వెల్లడించారు. ఎన్ఎస్జీలో పూర్తి స్థాయి సభ్యత్వాన్ని ఇండియా పొందేందుకు గల అన్ని అవకాశాలనూ చర్చించనున్నట్టు విదేశాంగ శాఖ సహాయమంత్రి లీ బావోడాంగ్ పేర్కొన్నారు. భారత్, చైనాల మధ్య మంచి సంబంధాలున్నాయని, ఇండియా అణుశక్తి సరఫరాదారుల గ్రూప్ లో చేరే విషయంలో తమ వంతు సహకారాన్ని అందిస్తామని ఆయన తెలిపారు.