కూలిన భవనం.. శిథిలాల వెలికితీత

హైదరబాద్ నగరంలోని నానక్ రాంగూడలోని నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. నిన్నరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ భవంతి నిర్మాణం కోసం వచ్చిన నాలుగు కుటుంబాలు అక్కడే ఉంటుండగా భవనం కుప్పకూలిపోవడంతో వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారు. దాదాపు 13 మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ యంత్రాగం హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. మంత్రులు మహమూద్‌ అలీ, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి, పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తదితరులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి సహాయచర్యలు పర్యవేక్షించారు.మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ఉండగా జరిగిన ఘటన గురించి ఆరా తీస్తున్నారు. బాధితులకు తగిన చర్యలు అందించాలని మంత్రులను, అధికారులను కేసీఆర్ ఆదేశించారు.  

నోట్ల రద్దు చేసి నెల రోజులు పూర్తి..

  పెద్ద నోట్ల రద్దును ప్రకటించి నేటికి నెల రోజులు పూర్తయిందని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. నగదు లావాదేవీలు ఖర్చుతో కూడుకున్నవి.. నగదు లావాదేవీల నిర్వహణ కూడా చాలా కష్టం..నగదు లావాదేవీలు తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.. అందుకే నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. గత నెల రోజుల్లో డిజిటల్ లావాదేవీలు 20 శాతం నుంచి 40 శాతానికి పెరిగాయని..  క్యాష్ లెస్ లావాదేవీల నిర్వహణ వేగవంతం చేస్తామని.. డబ్బు స్థానంలో డిజిటల్ విధానాన్ని ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఇంకా డెబిట్, క్రెడిట్ కార్డులపై పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై 0.7 శాతం డిస్కౌంట్ లభిస్తోందని.. రైల్వే రిజర్వేషన్ చేయించుకుంటే పది లక్షల రూపాయల విలువైన జీవిత భీమా ఉచితమని.. డిజిటల్ పద్దతిలో తీసుకునే రైల్వే పాసుల ధరలు తగ్గించామని.. టోల్ గేట్ల దగ్గర కూడా డిజిటల్ సేవలు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు.

చెన్నై తెలుగు వ్యాపారవేత్తల ఇళ్లలో దాడులు.. దిమ్మతిరిగే డబ్బు...

  పాత నోట్ల రద్దుతో ఒక్కసారిగా నల్ల కుబేరుల గుండెల్లో పెద్ద బండలు పడినంత పనైంది. ఇప్పటికే ప్రభుత్వం షరతులు పెట్టడంతో డబ్బు మార్పిడికి నానా తంటాలు పడుతున్నారు. కొందరు మాత్రం ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డారు. దీంతో పెద్ద వ్యాపారుల ఇళ్లలో డబ్బు మూలుగుతుంది. ఈనేపథ్యంలో ఐటీ దాడులు జరపగా పెద్ద మొత్తంలో డబ్బు దొరుకుతుంది. దీనిలో భాగంగానే చెన్నైలో ఐటీ దాడులు జరపగా దిమ్మతిరిగేంత డబ్బు బయటపడింది. చెన్నైలోని తెలుగు బడా వ్యాపారవేత్తల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. శేఖర్‌ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ప్రేమ్‌ రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అన్నానగర్‌, టి. నగర్‌ సహా 8 చోట్ల సోదాలు జరిపారు. ఈ దాడుల్లో 400 కోట్ల రూపాయల విలువైన దస్తావేజులతో పాటు రూ. 90 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 70 కోట్ల నోట్లు, 20 కోట్లు పాత నోట్లు ఉన్నట్టు సమాచారం. వీటితో పాటు 100 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. కొత్త నోట్లు దొరక్క సామాన్యులు అష్టకష్టాలు పడుతుంటే వీరికి 70 కోట్ల విలువ చేసే కొత్త నోట్లు ఎలా వచ్చాయనే గురించి అధికారులు విచారిస్తున్నారు.

ఇంగ్లండ్ తొలిరోజు స్కోర్.. 288/5

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లడ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ మొదటి రోజు భాగానే స్కోర్ చేసింది. తొలి రోజు ఆటముగిసే సరికి తొలి ఇన్నింగ్స్‌లో 288/5 స్కోరుతో నిలిచింది. ముందు బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ కుక్, జెన్నింగ్స్ అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. అయితే జడేజా సంధించిన అద్భుతమైన బంతికి కుక్ పెవిలియన్ చేరాడు.  ఆ తరువాత  రూట్ కూడా అశ్విన్ కు వికెట్ సమర్పించుకున్నాడు. ఇక ఆ తరువాత జెన్నింగ్స్, బెయిర్ స్టో, మొయిన్ అలీ కూడా వికెట్లు కోల్పోయారు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 94 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు తీసుకోగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు.

రాష్ట్రపతికి కోపం తెప్పించారు...

  పార్లమెంట్లో తమ వైఖరితో ఆఖరికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కూడా కోపం తెప్పించారు మన ఎంపీలు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలైనప్పటినుండి ఇప్పటి వరకూ ఏరోజు ఉభయసభలు సజావుగా సాగిన దాఖలాలు లేవు. పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు సభల్లో ఆందోళనలు చేపడుతూనే ఉన్నారు. ప్రధాని మోడీ సభకు రావాలని.. నోట్ల రద్దుపై మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు పార్లమెంట్లో ఎంపీల వైఖరిపై స్పందించిన ప్రణబ్ ముఖర్జీ ఎంపీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమయాన్ని వృధా చేయడం ఇరుపక్షాల సభ్యులకు ఏమాత్రం భావ్యంకాదని, ఇది అంగీకరించకూడని విషయం అని అన్నారు. ‘ ఎంపీలు.. మీ పని మీరు చేయండి. పార్లమెంటు నడిచేందుకే మీరు అక్కడ ఉన్నారు. పార్లమెంటును కార్యకలాపాలను భంగపరచడం అంగీకరించకూడని విషయం’ అని ఆయన అన్నారు.   కాగా నవంబర్‌ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, దానిపై చర్చ జరగాలని, ఓటింగ్‌ నిర్వహించాలని ప్రతిపక్షాలు పట్టుపడుతుండగా, అందుకు ససేమిరా అంటూ, తాము తీసుకుంది సరైన నిర్ణయమే అంటూ అధికార పక్షం చెబుతోంది. దీంతో రోజూ పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళనలు తప్ప చర్చలు మాత్రం జరగడంలేదు.

భారత్-ఇంగ్లడ్ టెస్ట్ మ్యాచ్.. అంపైర్ తలకు గాయం

  ఇంగ్లండ్‌, ఇండియా మధ్య ముంబైలో నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో అంపైర్ పాల్ రీఫిల్ త‌ల‌కు గాయ‌మైంది. స్క్వేర్‌లెగ్‌లో రీఫిల్ నిలుచున్న స‌మ‌యంలో బౌండ‌ర్ ద‌గ్గ‌రి నుంచి ఫీల్డ‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ విసిరిన త్రో.. నేరుగా రీఫిల్ త‌ల వెనుక త‌గిలింది. దీంతో అత‌ను అక్క‌డే కూల‌బ‌డిపోయాడు. వెంట‌నే ఇంగ్లండ్ టీమ్ ఫిజియో, డాక్ట‌ర్ మైదానంలోకి ప‌రుగెత్తారు. దీంతో మ్యాచ్ చాలాసేపు ఆగిపోయింది. ఇక అత‌ను అంపైరింగ్ చేసే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో మైదానం నుంచి వెళ్లిపోయాడు. అత‌ని స్థానంలో థ‌ర్డ్ అంపైర్ మరాయస్ ఎరాస్మ‌స్ ఫీల్డ్‌లోకి వ‌చ్చాడు.

కాంగ్రెస్ కు అరుణ్ జైట్లీ సవాల్...

నల్లకుబేరులకు చెమటలు పట్టించడానికి ప్రధాని నరేంద్ర మోడీ పెద్ నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నసంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల వాళ్ల సంగతేమో కానీ.. సామాన్య ప్రజలు మాత్రం సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే దీనిపై స్పందించిన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఓ సవాల్ విసిరారు. లోక్ సభలో నోట్ల రద్దుపై మాట్లాడిన ఆయన నోట్ల కష్టాలు డిసెంబర్‌ 30 వరకు కొనసాగుతాయని... పెద్ద నోట్లను రద్దు చేస్తూ సాహోసోపేతమైన నిర్ణయం తీసుకోవడంతో తాత్కాలికంగా నోట్ల కష్టాలు తప్పవని ప్రధాని నరేంద్ర మోదీ ముందే చెప్పారని గుర్తు చేశారు. అంతేకాదు ఇక ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పై కూడా మండిపడ్డారు. అధికారంలో ఉండగా నల్లధనం నియంత్రణకు  కాంగ్రెస్‌ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని 2004-14 మధ్య కాలంలో పదేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ... నల్లధనాన్ని అరికట్టేందుకు ఒక్క చర్య తీసుకున్నా వెల్లడించాలని జైట్లీ సవాల్‌ విసిరారు.

మోడీపై దీదీ నిప్పులు... మోడీ నియంత

  పెద్ద నోట్ల రద్దు పై ప్రధాని మోడీని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదటి నుండి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి దీదీ మోడీపై నిప్పులు చెరిగారు. నోట్ల కష్టాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, దీనికి కారణం ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితికి ప్రధాని మోదీ కారణమయ్యారని మండిపడ్డారు. అంతేకాదు ‘ప్రధాని మోదీ తనకు తాను పులి అనుకుంటున్నారు.. ఓ నియంత కారణంగా దేశంలో నోట్ల కష్టాలు వచ్చాయి. ఇది చీకటి యుగం. దీని నుంచి ప్రజలను బయట పడేసేందుకు మేము ప్రయత్నిస్తున్నాం.. నోట్ల రద్దుతో ప్రధాని, ఆయన మద్దతుదారులకే లబ్ది చేకూరింది.. మోదీ వన్‌ మేన్‌ షో కారణంగానే నోట్ల కష్టాలు వచ్చిపడ్డాయి. దేశాన్ని చాలా మంద్రి ప్రధాన మంత్రులు పాలించారు కానీ మోదీలా ఎవరూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయలేదు. ప్రజల డబ్బును మోదీ తన సొంత సొమ్ములా భావిస్తున్నారు. నల్లధనం ఎక్కడుంది? మీరు తీసుకున్నదంతా ప్రజా ధనమే. అదంతా పన్నుల కడుతున్న వారి డబ్బు. ఎవరినీ సంప్రదించకుండానే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు అని మండిపడ్డారు.

నోటి మీద వేలు వేయలేదని..మాస్టర్ ఏం చేశాడో తెలుసా..?

  తల్లిదండ్రుల తర్వాత పిల్లలను క్రమశిక్షణలో పెట్టవలసిన బాధ్యత ఖచ్చితంగా గురువులదే..అయితే మాటలతో విననప్పుడు..విద్యార్థిని తన దారికి తెచ్చుకోవడానికి గురువుకు దండించే అధికారం కట్టబెట్టింది మన సంస్కృతి. అయితే కొందరు గురువులు మానవత్వం మరిచి చిన్నారులపై క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా నోటి మీద వేలు వేసుకోమంటే..వేయలేదని ఓ చిన్నారి కాలు విరగ్గొట్టాడు ఒక మాస్టర్. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామానికి చెందదిన యోగేశ్ అనే చిన్నారి స్థానికంగా ఉండే ఒక ప్రైవేట్ స్కూలులో నర్సరీ చదువుతున్నాడు. విద్యార్థులంతా అల్లరి చేస్తుండటంతో తరగతి గదిని కంట్రోల్ చేయడం కోసం పిల్లలందరిని నోటి మీద వేలు వేసుకోమన్నాడు అనంతగిరి అనే మాస్టర్. అయితే యోగేశ్ నోటిపై వేలు వేసుకోకపోవడంతో అనంతగిరి పైకి ఎత్తి పడేయటంతో ఆ చిన్నారి కుడికాలు విరిగింది. అయితే సంఘటన జరిగిన 2 గంటల వరకు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించలేదు..దీంతో చిన్నారి నొప్పితో విలవిలలాడిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు యోగేశ్‌ని ఆస్పత్రికి తరలించారు.

రాహుల్ గాంధీ నవ్వులు తెచ్చిన తిప్పలు...

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. ఆయనకు తెలిసి చేస్తారో లేక తెలియక చేస్తారో తెలియదు కానీ.. అవి మాత్రం పెద్ద ఇష్యూనే అవుతాయి. ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ అమ్మకు నివాళులు అర్పించడానికి చెన్నై వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన ఆయన చిరునవ్వులు చిందిస్తూ వచ్చారు. అంతేనా నివాళి అర్పించిన అనంతరం కూడా అక్కడున్న జనాలకు నవ్వుతూ అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన నవ్వడమే వచ్చింది అసలు సమస్య. దీనిపై సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఒకపక్క అమ్మ మరణంతో తమిళనాడు అంతా ఆవేదనలో మునిగిపోతే... అక్కడకు ఎందుకు వచ్చామో అనే సంగతిని కూడా మరిచిపోయి, నవ్వుకోవడం సిగ్గుచేటని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి దీనిపై రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారో చూద్దాం..

ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్దమే.. హైకోర్టు సంచలన వ్యాఖ్య

  ట్రిపుల్ తలాక్ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ట్రిపుల్ తలాక్ పై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్దమే అని తేల్చి చెప్పింది. ట్రిపుల్ తలాక్ అనేది ముస్లిం మహిళల హక్కులను హరించడమే అని..  రాజ్యాంగపరంగా ట్రిపుల్ తలాక్ ఆమోదయోగ్యం కాదని, దీన్ని ఎవరూ ఆచరించాల్సిన అవసరం లేదని తెలిపింది. రాజ్యాంగంలో ఉన్న హక్కులను హరించేలా పర్సనల్ లాబోర్డు ఏదీ ఉండకూడదని..  రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కారని, అందువల్ల దీన్ని పాటించాల్సిన అవసరం లేదని తెలిపింది. దీంతో కోర్టు తీసుకున్న నిర్ణయంపై అనేక ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

రాజ్యసభలో రచ్చ.. మేం సిద్దంగా ఉన్నాం..

పార్లమెంటు ఉభయసభలు గురువారం ప్రారంభమయ్యాయి. పెద్దనోట్ల రద్దుపై ఈరోజు కూడా విపక్షాలు లోక్‌సభలో ఆందోళన చేపడుతున్నాయి. రాజ్యసభలో దీనిపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ సభాపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ మాట్లాడుతూ.. పెద్దనోట్ల రద్దు తర్వాత సుమారు 100 మందికి పైగా మరణించారని.. వారికి సభలో నివాళులర్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని విమర్శించారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ శాంతించాలని విజ్ఞప్తి చేసినా వారు వినకుండా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం నెలకొనడంతో సభను వాయిదా వేశారు. ఇదిలా ఉండగా అటు లోక్ సభలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

అమ్మ బుగ్గపై రంధ్రాల మిస్టరీ...!

  దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు దాదాపు రెండు నెలల పైననే ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడారు. ఎంతో అత్యాధునిక చికిత్స అందించినా కూడా ఆమె ఆరోగ్యం మాత్రం నయం కాలేకపోయింది. దీంతో ఆమె సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆతరువాత మెరీనా బీచ్ లో ఎంజీఆర్ ఘాట్ పక్కనే ఆమె పార్థీవ దేహాన్ని ఖననం చేశారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఓ వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అదేంటంటే... జయలలిత బుగ్గపై రంధ్రాలు ఉండటం.. ఇప్పుడు దానికి సంబంధించిన ఓ ఫొటో చక్కర్లు కొడుతుంది. ఆమె ఎడమ బుగ్గపై నాలుగు రంధ్రాలు ఉండటంతో.. చెంపపైన ఆ రంధ్రాలు ఏంటీ అనే చర్చ ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఆమె మృతదేహాం కొన్ని రోజులు పాడవకుండా శరీరంలోకి రసాయనాలు ఎక్కించి ఉంటారా... అందులో భాగంగానే ఈ రంధ్రాలు ఏర్పడ్డాయా అని అనుకుంటున్నారు. సాధారణంగా ఈ పద్దతిని ‘ఎమాల్మింగ్‌’ అంటారు.   ‘ఎమాల్మింగ్‌’ అంటే ఏమిటి..?   ‘ఎమాల్మింగ్‌’ అంటే దేహాన్ని కొన్ని రకాల రసాయనాలు, మందులతో శుద్ధి చేయడంతో పాటు, బాడీలోకి దేహం కుళ్లిపోకుండా సూది కూడా వేస్తుంటారు. మృతదేహంలోని రక్తాన్ని బయటకు తీసేసి ఈ రసాయన మందును లోనికి పంపడమే ‘ఎమాల్మింగ్‌’. అయితే సహజంగా ఈ సూదిని మెడ వెనుక లేదా.. గజ్జల్లో వేస్తుంటారు. జయలలిత పార్థీవదేహానికి కూడా ఈ తరహా ప్రక్రియ వైద్యులు నిర్వహించి ఉండే అవకాశాలు ఉన్నాయి.   అయితే జయలలితకు ఆఖరి అస్త్రంగా ఎక్మో ద్వారా చికిత్స చేశారు కాబట్టి ఆ ప్రక్రియలోనే ఎమాల్మింగ్‌ కూడా నిర్వహించవచ్చు. ప్రత్యేకంగా సూదులు వేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు అని కూడా అనుకుంటున్నారు కొంతమంది. ఈ నేపథ్యంలో అమ్మ బుగ్గపై రంధ్రాలు ఉండటంతో ఇది కాస్త హాట్ టాపిక్ అయ్యింది. మరి ఇంతకీ ఆ రంధ్రాలు ఎందుకు పెట్టారో వైద్యులకే తెలియాలి

సెలవు దొరకలేదు.. వెబ్ క్యామ్ ద్వారా పెళ్లి...

  మనిషి జీవితంలో సోషల్ మీడియా అనేది సగభాగం అయిపోయింది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చేతిలో ఫోన్, డేటా ఉండాలే కానీ ఆల్ లైన్ ద్వారానే అన్నీ చేసేస్తున్నారు. అంతలా మనిషి జీవితంతో పెనవేసుకుపోయింది. ఇలాంటి సందర్భాల్లోనే జోకులు వేసుకోవడానికో.. కామెంట్స్ చేసుకోవడానికో అప్పుడప్పుడు అంటుంటారు కదా.. రానురాను ఆన్ లైన్ లోనే పెళ్లిళ్లు జరుగుతుంటాయి అని. అది ఇప్పుడు నిజం చేశాడు కేరళకు చెందిన ఓ వ్యక్తి. వివరాల ప్రకారం..కేరళలోని కొల్లం ప్రాంతానికి చెందిన హారీస్ సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఈనెల6వ తేదీన అతని పెళ్లి ఉండగా సెలవు కోసం అప్లై చేశాడు. కానీ సెలవు దొరకలేదు. ఇక చేసేది లేక హారీస్ సౌదీలోనే ఉండి వెబ్ క్యామ్ ద్వారా తన పెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇక కేరళలో పెళ్లి కూతురు ఉండగా.. పెళ్లి కొడుకు పాత్రను హారీస్ చెల్లెలు పోషించింది. దీంతో మొత్తానికి వెబ్ క్యామ్ ద్వారా పెళ్లి ముగిసింది. ఈ పెళ్లి కార్యక్రమంలో అతని బంధువులు, స్నేహితులు అందరూ పాల్గొన్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఈ పెళ్లిపై కొన్ని ముస్లిం వర్గాలు మాత్రం చర్చించుకుంటున్నాయి. ఇలా జరిగిన ఈ పెళ్లి ధృవీకృతమవుతుందా అని అంటున్నారు. అసలే ముస్లింలకు పట్టింపులు ఎక్కువ.. మరి చూద్దాం ఏం జరుగుతుందో.

భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్ మ్యాచ్... ఇంగ్లండ్ బ్యాటింగ్

  భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ముంబైలోని  వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా కుక్ మాట్లాడుతూ, ముంబైలో ఆడుతుండటం ఆనందంగా ఉందని... ఇక్కడ తమకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపాడు. ఇండియన్ కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ, టాస్ ఓడిపోవడం పెద్ద సమస్య కాదని.. గత మ్యాచ్ లలో ఆడిన విధంగానే ఈ మ్యాచ్ లో కూడా ఆడి, గెలుస్తామని చెప్పాడు.   ఇంగ్లండ్ జట్టు: ఏ.కూక్, జే.జెన్నింగ్స్, జే.రూట్స్, ఎం.అలీ, జే.బెయిర్‌స్టో, బి.స్టోక్స్, జే.బట్లర్, సి.ఓక్స్, ఏ.రషీద్, జే. బాల్, జే.అండర్‌సన్   భారత జట్టు: మురళి విజయ్, కేఎల్.రాహుల్, ఛతేశ్వర పూజారా, విరాట్ కోహ్లీ, కరణ్ నాయర్, పార్థీవ్ పటేల్, అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్

ఢిల్లీని కప్పేసిన పొగమంచు...

  దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు దుప్పటిలా కప్పేసింది. మొన్నటి వరకూ వాయు కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఢిల్లీ వాసులకు ఇప్పుడు పొగమంచు.. 'పగమంచు'లా పట్టుకుంది. దీంతో ఢిల్లీలో రవాణా, రోడ్డు వ్యవస్థ ఒక్కసారిగా స్థంభించిపోయింది. ఈ పొగమంచు కారణంగా దాదాపు 100కు పైగా రైళ్లు ఆలస్యంగా వస్తున్నాయి..మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. ఇక విమానాశ్రయం వద్ద అయితే పొగమంచు కారణంగా రన్ వే కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది.  6 అంతర్జాతీయ విమానాలు, 7 దేశీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో రెండు దేశీయ విమానాలు రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది.