సెలవు దొరకలేదు.. వెబ్ క్యామ్ ద్వారా పెళ్లి...
posted on Dec 8, 2016 @ 10:08AM
మనిషి జీవితంలో సోషల్ మీడియా అనేది సగభాగం అయిపోయింది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చేతిలో ఫోన్, డేటా ఉండాలే కానీ ఆల్ లైన్ ద్వారానే అన్నీ చేసేస్తున్నారు. అంతలా మనిషి జీవితంతో పెనవేసుకుపోయింది. ఇలాంటి సందర్భాల్లోనే జోకులు వేసుకోవడానికో.. కామెంట్స్ చేసుకోవడానికో అప్పుడప్పుడు అంటుంటారు కదా.. రానురాను ఆన్ లైన్ లోనే పెళ్లిళ్లు జరుగుతుంటాయి అని. అది ఇప్పుడు నిజం చేశాడు కేరళకు చెందిన ఓ వ్యక్తి. వివరాల ప్రకారం..కేరళలోని కొల్లం ప్రాంతానికి చెందిన హారీస్ సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఈనెల6వ తేదీన అతని పెళ్లి ఉండగా సెలవు కోసం అప్లై చేశాడు. కానీ సెలవు దొరకలేదు. ఇక చేసేది లేక హారీస్ సౌదీలోనే ఉండి వెబ్ క్యామ్ ద్వారా తన పెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇక కేరళలో పెళ్లి కూతురు ఉండగా.. పెళ్లి కొడుకు పాత్రను హారీస్ చెల్లెలు పోషించింది. దీంతో మొత్తానికి వెబ్ క్యామ్ ద్వారా పెళ్లి ముగిసింది. ఈ పెళ్లి కార్యక్రమంలో అతని బంధువులు, స్నేహితులు అందరూ పాల్గొన్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఈ పెళ్లిపై కొన్ని ముస్లిం వర్గాలు మాత్రం చర్చించుకుంటున్నాయి. ఇలా జరిగిన ఈ పెళ్లి ధృవీకృతమవుతుందా అని అంటున్నారు. అసలే ముస్లింలకు పట్టింపులు ఎక్కువ.. మరి చూద్దాం ఏం జరుగుతుందో.