జియో కు షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్న బీఎస్ఎన్ఎల్..

ఉచిత కాల్స్, ఉచిత డేటా సర్వీసులు ఆఫర్ చేస్తూ ఇతర నెట్ వర్కులకు షాకిస్తున్న రిలయన్స్ జియోకు.. ఇతర నెట్ వర్కులు కూడా షాకిచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే.. బీఎస్ఎన్ఎల్ ఓ ఆఫర్ తో ముందుకొస్తుంది. నెలకు ఉచిత వాయిస్ కాల్స్ , ఇతర  ఫ్రీ ఆఫర్లతో కొత్త  మంత్లీ ప్లాన్ ను పరిచయం  చేయబోతోంది. ఈఆఫర్ ను జనవరి 1 నుంచి వినియోగదారులకు అందించనుంది.  నెలకు రూ.149  రీచార్జ్ తో  ఏ నెట్ వర్క్ కైనా అన్ లిమిటెడ్  లోకల్ అండ్  నేషనల్ వాయిస్ కాల్స్ తోపాటు 300 ఎంబీ డాటా  సదుపాయంతో ఈ ప్లాన్ ను  లాంచ్ చేయనుంది. ఈ సందర్బంగా బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. నెల రూ 149 వద్ద భారతదేశం అంతటా ఏ నెట్వర్క్ వద్ద మొబైల్ చందాదారులకు అపరిమిత వాయిస్ కాల్స్ ప్రారంభించేందుకు  కృషి చేస్తున్నామని తెలిపారు.

ఉపముఖ్యమంత్రిపై చెప్పులు విసిరిన మహిళలు..

  తెలంగాణ మాజీ ఉపముఖ్యమంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన జనగామ జిల్లా జాఫర్ ఘడ్ లో చోటుచేసుకుంది. ఈరోజు అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన ఆయనపై మహిళలు చెప్పులు విసిరారు. స్టేషన్ ఘన్ పూర్, జాఫర్ గఢ్, చిల్పూర్ మండలాలను జనగామ జిల్లాలో కలపొద్దంటూ తాము ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా... జనగామ జిల్లాలో కలిపేందుకు అనుకూలంగా లేఖ ఇచ్చారంటూ రాజయ్యపై ఈ ప్రాంతవాసులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో, అక్కడకు వచ్చిన రాజయ్య వాహనంపైకి మహిళలు చెప్పులు విసిరి తమ కోపాన్ని తీర్చుకున్నారు.

జయ మృతికి ప్రముఖుల నివాళులు.. ఎవరెవరు ఎమన్నారంటే...

  చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత నిన్న రాత్రి తన తుదిశ్వాస విడిచారు. దీంతో జయలలితకు పలువురు నివాళులు అర్పించారు. జయలలిత మృతిపై ఎవరెవరు ఎలా స్పందించారో చూద్దాం..   రాష్ట్రపతి.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. జయలలిత మృతికి తీవ్ర సంతాపం తెలియజేశారు. జయలలిత ప్రజాకర్షణ కలిగిన గొప్ప నేత పరిపాలన దక్షత కలిగిన నాయకురాలని.. కోట్లాది మంది ప్రజలు ఆరాధించిన, ప్రేమించిన గొప్ప వ్యక్తిని దేశం కోల్పోయిందని అన్నారు.   ప్రధాని మోడీ..   జయలలిత మృతిపట్ల మోడీ తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. ఆమె మృతిపై స్పందించిన ఆయన భారత రాజకీయాల్లో ఆమె మరణం తీరని నోటు.. అనేకసార్లు జయలలితతో సంభాషించిన సందర్బాల్ని నేను మరచిపోలేనని.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని ఆమెకు సంతాపం తెలిపారు.   సోనియా గాంధీ..   కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జయలలిత మృతిపై స్పందించి.. తీవ్ర కలతచెందానని.. దేశంలోనే కాక రాజకీయంగాను ఆమె గొప్ప నేత అని అన్నారు. దేశరాజకీయాల్లో జయలలిత లేని లోటు తీర్చలేనిదని ఆమెకు సంతాపం వ్యక్తం చేశారు.   రాహుల్ గాంధీ..   కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జయలలితకు నివాళులు అర్పించారు. గొప్ప నేతను కోల్పోయాం.. మహిళలు, రైతులు మత్స్యకారులు జయలలిత కళ్లతో కలలు కనేవారు అని అన్నారు.   ఎం.కె స్టాలిన్   తమిళనాడు ప్రత్యర్థ పార్టీ అయిన డీఎంకే పార్టీ నేత కుమారుడు స్టాలిన్ కూడా జయలలిత మృతికి సంతాపం తెలియజేశారు. ముఖ్యమంత్రి మరణంతో తీవ్రంగా కలతచెందా.. పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులకు ఈ విషాద సమయంలో ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని అన్నారు.   సీఎం కేజ్రీవాల్..   జయలలిత మృతికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాళులు అర్పించారు. అమ్మ మృతి వార్త విని చాలా బాధపడ్డా.. చాలా చాలా గొప్పనేత.. సామాన్యుల నాయకురాలు..ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలియజేశారు.   సీఎం మెహబూబా ముఫ్తీ..   తమిళ ప్రజలకు జయలలిత దేవత అని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. జయలలిత ప్రజల ముఖ్యమంత్రి అని, ఆమె మృతి తీరని లోటు అని అన్నారు. ఈ సందర్భంగా జయ మృతి పట్ల ఆమె సంతాపం ప్రకటించారు.   సీఎం మమతా బెనర్జీ   జయలలిత మరణం దేశ రాజకీయాలకు తీరని నష్టమని.. గొప్ప, బలమైన, ధైర్యవంతమైన, ప్రజాదారణ కలిగిన ఆరాధ్యనేతను కోల్పోయాం. నిరంతరం ఆమె అభిమానుల హృదయాల్లో ఉంటారు అని ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరారు.     సీఎం చంద్రబాబు..   త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మృతి పట్ల ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడితో స‌హా అంద‌రు రాష్ట్ర‌ మంత్రులూ ఈ రోజు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంత‌రం చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ.. ఆమె మృతి ప‌ట్ల‌ ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు తెలిపారు. ఆమె మృతి దేశంలో ప్ర‌తి ఒక్కరికి షాక్ లాంటిదని..అన్ని పోరాటాల్లోనూ ఆమె విజ‌యాన్ని సాధించారని తెలిపారు.   సీఎం కేసీఆర్..   తమిళనాడు సీఎం జయలలిత మృతి తమిళ సమాజానికి తీరనిలోటని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. జయలలిత ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. జయ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జయలలిత మరణం తమిళ సమాజానికి తీరని లోటని.. జయలలిత రాజకీయ ప్రస్థానం సాహసోపేతమైనదని పేర్కొన్నారు. ఆమె అంచెలంచెలుగా ఎదిగిన విషయాన్ని గుర్తు చేశారు. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని కొనసాగించడం తమిళ రాజకీయాల్లో గొప్ప విషయమన్నారు. ఆమె తమిళనాట అత్యంత ప్రజాదరణ పొందిన నేత అని కొనియాడారు. సీఎం నితీశ్ కుమార్...   జయలలిత మరణం తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యానని.. దేవుడు ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని.. బీహార్ లో ఒకరోజు సంతాపదినం ప్రకటిస్తున్నాం అని నివాళులర్పించారు.   వైఎస్ జగన్..   తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం పట్ల జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తమిళనాడు రాజకీయాల్లో ఒక శక్తివంతమైన మహిళా శకం ముగిసిందని..తమిళనాట ఎన్నో సంక్షేమ పథకాలను ఓ ఉద్యమంలా ప్రారంభించి, కొనసాగించిన ఆమె ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారని అన్నారు.   ర‌జ‌నీకాంత్   త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఆ రాష్ట్ర సీఎం జ‌య‌ల‌లిత మృతి ప‌ట్ల సంతాపం ప్ర‌క‌టించారు. దేశం ఓ ధైర్య‌వంతురాలైన కూతుర్ని కోల్పోయింద‌ని ర‌జ‌నీకాంత్ త‌న ట్వీట్‌లో జ‌యను కీర్తించారు. కేవ‌లం త‌మిళ‌నాడు మాత్ర‌మే కాద‌ని, యావ‌త్ దేశం ధైర్య‌వంతురాల్ని కోల్పోయిన‌ట్లు, ఆమె ఆత్మ‌కు శాంతి చేకూర్చాల‌ని దేవున్ని ప్రార్థిస్తున్న‌ట్లు ర‌జ‌నీ ఆమెకు నివాళులర్పించారు.   అమితాబ్ బ‌చ్చ‌న్   బాలీవుడ్ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా సీఎం జ‌య మృతి ప‌ట్ల సంతాపం తెలిపారు. జ‌య మృతి విషాద‌క‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు. త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన పార్తిబ‌న్‌, జీయ‌మ్ ర‌వి, త్రిష, శృతి హాస‌న్‌, డైర‌క్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ జ‌య మృతి ప‌ట్ల సంతాపం తెలిపారు.

జయలలితకు మోడీ నివాళులు..

  ప్రధాని నరేంద్ర మోడీ చెన్నై చేరుకున్నారు. జయలలిత పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఆమె మృతదేహం ఉంచిన  రాజాజీ హాల్‌కు వచ్చిన మోడీ జయలలిత పార్థివదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం.. జయలలిత స్నేహితురాలు శశికళను మోదీ పరామర్శించారు. శశికళ, తమిళనాడు ముఖ‍్యమంత్రి పన్నీరు సెల్వం కన్నీటి పర్యంతమయ్యారు. మోదీ.. వీరిద్దరినీ ఓదార్చారు. పన్నీరు సెల్వం భుజం తట్టి క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాల్సిందిగా చెప్పారు. అక్కడే ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడితో మోదీ కాసేపు మాట్లాడారు. కాగా ఈ రోజు సాయంత్రం మెరీనా బీచ్‌లో గురువు ఎంజీఆర్ సమాధి పక్కన జయ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

అమ్మకు పవన్ కళ్యాణ్ సంతాపం..

  తమిళనాడు మృతిపట్ల పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ సంతాపాన్ని తెలియజేశారు. రాజకీయ, సీని రంగానికి చెందిన పలువురు ఇప్పటికే జయ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కొందరు సోషల్ మీడియాలో జయకు సంతాపం ప్రకటించారు. దీనిలో భాగంగానే  సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా అమ్మకు సంతాపం తెలిపాడు. జయలలిత మరణం తనని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, భారతీయ రాజకీయాలపై ఆమె చెరగని ముద్ర వేసారని పవన్ అన్నాడు. జయలలిత బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ఆశగా,శ్వాసగా జీవించారని.. అమ్మ మరణం తమిళ నాడుకే కాక యావత్ దేశానికి తీవ్ర లోటు అని ఆమెకు మనః పూర్వక అంజలి ఘటిస్తూ తన తరపున, జనసేన పార్టీ శ్రేణుల తరపున సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపాడు.

తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పు... కేవలం 20 ఎమ్మెల్యేలు అంతే..

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఒకపక్క రాష్ట్రం రోదనలో పడగా.. మరోపక్క మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించవచ్చని అప్పుడే రాజకీయ నిపుణులు అంచనాలు మొదలుపెట్టారు. తమిళనాడులో  ‘పురచ్చి తలైవీ’గా కోట్లాది మంది గుండెల్లో కొలువైన జయలలిత మృతి చెందడంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎందుకంటే జయలలిత తరువాత డీఎంకే పార్టీకి పోటీగా పార్టీని నడిపే సత్తా ఇంకెవరికీ లేదు అన్నది అందరికి తెలిసిందే. జయ తరువాత అంతటి స్థానంలో పేరు పొందిన నేత ఒక్కరు కూడా ఆ పార్టీలో లేరు. ఇక ఆమె ప్రధాన అనుచరుడు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టినా... జయకు ఉన్న ప్రజాకర్షణలో పన్నీర్ సెల్వం ఒక వంతు కూడా సాటిరారు. ఆమె సన్నిహితురాలైన శశికళ కూడా ఇంతవరకూ జయలలితకు నిచ్చెలిగానే ఉన్నారు కానీ.. పార్టీలోకి మాత్రం ప్రవేశించలేదు.   ఈ నేపథ్యంలోనే జయ లేకపోవడం డీఎంకే పార్టీకి ప్లస్ పాయింట్ అయినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశాలను కొట్టిపారేయలేమంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే తమిళనాడు అసెంబ్లీలో శాసనసభ్యలుల సంఖ్య 234. ఇందులో అధికార అన్నాడీఎంకే బలం 134 కాగా... విపక్ష డీఎంకే, కాంగ్రెస్ కూటమి బలం 98. అధికారంలోకి రావాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. అంటే, డీఎంకే కూటమి మరో 20 మంది ఎమ్మెల్యేలను లాగేస్తే చాలు.... మ్యాజిక్ ఫిగర్ సాధించినట్టే. ఇప్పుడు దీనిపైనే అందరి దృష్టి పడింది. ఇంతకాలం జయలలిత కనుసైగలకు అనుగునంగా భయపడో, భక్తితోనే ఉన్న పలువురు అన్నాడీఎంకే నేతలకు... ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ వచ్చినట్టైంది. దీంతో డీఎంకే పార్టీ నేతలు అన్నాడీఎంకే పార్టీ నేతలతో పావులు కదపొచ్చు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏదో ఒక విధంగా వారిని తమ పార్టీవైపుకు లాక్కునే ప్రయత్నాలు చేయవచ్చు అని అంటున్నారు నిపుణులు. మరోవైపు, పన్నీర్ సెల్వం, జయ స్నేహితురాలు శశికళల మధ్య చిన్న విభేదం తలెత్తినా... డీఎంకే పని మరింత సులువవుతుందని అంటున్నారు. మరి జయ లాంటి పవర్ పార్టీలో లేకపోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొత్తానికి ఏం జరుగుతుందో తెలియాలంటే కొంత సమయం వెయిట్ చేయాల్సిందే.

అమ్మకు ప్రముఖులు సంతాపం..

  జయలలిత మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. నిన్నరాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయలలిత తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళనాడు మొత్తం కన్నీటిపర్యంతమైంది. ఇక జయలలిత మృతి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి, ప్రధాని నరేంద్ర మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సంక్షేమ కార్యక్రమాలతో జయలలిత పేదలకు దగ్గరయ్యారని మోడీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు  రాహుల్‌గాంధీ జయలలిత మృతిపట్ల నివాళులర్పించారు. దేశరాజకీయాల్లో జయలలిత లేని లోటు తీర్చలేనిదని సోనియాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జయలలితకు నివాళులర్పించారు.

జయలలిత సినీ, రాజకీయ ప్రస్థానం..

  జయలలిత ఫిబ్రవరి 24, 1948న అప్పటి మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించింది. జయలలిత తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందినది కాగా బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు రెండు పేర్లు పెట్టారు. అందులో అసలు పేరు కోమలవల్లి. అది జయలలిత అవ్వగారి పేరు. ఇక జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు. ఆ తరువాత తన 15 వ ఏటనే సినిమారంగ ప్రవేశం చేసి తిరుగులేని పేరు సంపాదించుకుంది. కథానాయకుని కథ(1965) మనుషులు మమతలు(1965) ఆమె ఎవరు? (1966) ఆస్తిపరులు (1966) కన్నెపిల్ల (1966) గూఢచారి 116(1966) నవరాత్రి (1966) గోపాలుడు భూపాలుడు (1967) చిక్కడు దొరకడు(1967) ధనమే ప్రపంచలీల(1967) నువ్వే (1967) బ్రహ్మచారి (1967) సుఖదుఃఖాలు(1967) అదృష్టవంతులు(1968) కోయంబత్తూరు ఖైదీ(1968) తిక్క శంకరయ్య(1968) దోపిడీ దొంగలు(1968) నిలువు దోపిడి(1968) పూలపిల్ల (1968) పెళ్ళంటే భయం(1968) పోస్టుమన్ రాజు(1968) బాగ్దాద్ గజదొంగ(1968) శ్రీరామకథ (1968) ఆదర్శ కుటుంబం(1969) కథానాయకుడు(1969) కదలడు వదలడు(1969) కొండవీటి సింహం(1969) పంచ కళ్యాణి దొంగల రాణి (1969) ఆలీబాబా 40 దొంగలు (1970) కోటీశ్వరుడు (1970) గండికోట రహస్యం(1970) మేమే మొనగాళ్లం(1971) శ్రీకృష్ణ విజయం(1971) శ్రీకృష్ణసత్య (1971) భార్యాబిడ్డలు(1972) డాక్టర్ బాబు (1973) దేవుడమ్మ (1973) దేవుడు చేసిన మనుషులు (1973) లోకం చుట్టిన వీరుడు(1973) ప్రేమలు - పెళ్ళిళ్ళు(1974)  జయలలిత తొలి సినిమా " చిన్నడ గొంబె కన్నడ " చిత్రము పెద్ద హిట్టయ్యింది.  ఈమె తొలి తెలుగు సినిమా " మనుషులు మమతలు " ఈమెను పెద్దతార స్థాయికి తీసుకెళ్లింది.   ఆ తరువాత 1981లో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశం చేసింది. ఆమె నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. ఎం.జీ.ఆర్ రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చి ఎంజీఆర్ కు వారసురాలిగా పేరు తెచ్చుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఎంజీఆర్ తో విభేదాలు రాగా ఆయన ఆగ్రహానికి గురై పార్టీలోని పలు పదవులకు దూరమైంది. ఎంజీఆర్ మరణానంతరం జయలలితకు పార్టీనుండి మంచి సపోర్ట్ లభించింది. ఎంజీఆర్ మరణించిన తరువాత పార్టీ రెండుగా చీలింది. ఒక వర్గం ఎంజీఆర్ భార్య జానకి రాంచంద్రన్ కు మద్దతు పలికితే ఇంకో వర్గం జయలలితకు అండగా నిలబడ్డారు. జానకీ రాంచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. కాని, 21రోజుల్లోనే రాష్ట్రం రాష్ట్రపతి పాలనలోకి వెళ్లిపోయింది. దాంతో జానకీ రామచంద్రన్ ఏఐఏడీఎంకే పార్టీ నుంచి తప్పుకున్నారు. జయలలిత పార్టీలో తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు. అప్పుడు 1989 అసెంబ్లీ ఎన్నికలలో జయలలిత విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానంసంపాదించారు. దాని తరవాత 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించింది. ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా అవతరించింది. ఇక ఆ తరువాత డీఎంకే పార్టీని అధిగమించగల పార్టీగా అవతరించి.. పార్టీకి ఎప్పటికప్పుడు గట్టి పోటీనిస్తూనే ఉంది. *   1972లో తమిళనాడు ప్రభుత్వము జయలలితను కళైమామణి పురస్కారముతోసత్కరించింది. *   1988 లో రాజ్యసభకు నామినేట్ చేయబడి గెలిచింది. *   1989 డీఎంకే పార్టీ తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఆమె ప్రతిపక్ష నేతగా ఉండాల్సి వచ్చింది. *   ఏఐఏడీఎంకే, కాంగ్రెస్ కూటమి డీఎంకేను మట్టి కరిపించింది. జయలలిత తొలిసారి సీఎం అయ్యారు... * 1996 లో జయలలితపై వచ్చిన కొన్ని అభియోగాలు కారణంగా ఓటమిపాలైంది. *   2001 ఎన్నికల్లో గెలిచి రెండోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఎన్నికయ్యారు. *  2006 ఎన్నికల్లో మళ్లీ ఓడిపోయారు. *   2011 లో తిరుగులేని ఎన్నిక. * సెప్టెంబరు 27, 2014 న జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయింది. దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవి రద్దైనది. * మే 11, 2015న కర్ణాటక ఉన్నత న్యాయస్థానము ఆమెను నిర్దోషిగా విడిచిపెట్టింది. దాంతో ఆమె మే 23న తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది * ఇక అప్పటి వరకూ చేతులు మారుతూ వచ్చిన ఆధికారం వల్ల.. జయపై వచ్చిన ఆరోపణల వల్ల 2016.. ఈఏడాది జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అని అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూశారు. అయితే అందరి అంచనాలను తిరగరాస్తూ.. వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయిన రికార్డ్ ను సృష్టించి జయలలిత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.

ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం...

  ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత కన్నుమూయడంతో ఆమెకు ముఖ్య అనుచరుడైన పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. నిన్న అర్థరాత్రి 1:30 గంటలకే రాజ్‌భవన్‌లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 15 మంది మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ విద్యాసాగర్‌రావు వారిచే ప్రమాణస్వీకారం చేయించారు. జయలలిత మృతి పట్ల ప్రమాణ స్వీకారానికి ముందు శాసనసభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. తమిళనాడులో సీఎం మృతితో ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలకు, కార్యాలయాలకు మూడు రోజులు సెలవు ప్రకటించారు. ప్రమాణ స్వీకారం అనంతరం పన్నీరు సెల్వం కన్నీటి పర్యంతమయ్యారు.

జయలలిత జీవితంలో తెలియని ఎన్నో నిజాలు..

  తమిళనాడు ముఖ్యమంత్రి (పురచ్చి తలైవి) మరణించడంతో తమిళనాడు ఒక్కసారిగా స్థంభించిపోయింది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ముఖ్యమంత్రి జయలలిత ఇక లేరు అన్న వార్త వినగానే అభిమానులకు ప్రాణం పోయినంత పని అయింది. ఎన్నో ఒడిదుడుకులు అడ్డుకొని ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆమె జీవితంలో మనకు తెలియని ఎన్నో నిజాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. *  కర్నాటకలో పాత మైసూరు సంస్థానంలోని మాండ్యాలో పుట్టిన ఆమె అసలు పేరు కోమల పల్లి.  * నాయకురాలిగా, నటిగా ఆమె జీవితమంతా తమిళనాడులోనే సాగింది *  ఆమె విశ్రాంతి అంతా హైదరాబాదులోనే కొంపెల్లి ప్రాంతంలో ఉండే ఫామ్ హౌజులోనే ఉండేది *  ఆమె అయిదో ఏట నుంచే భరతనాట్యం నేర్చుకోగా.. తల్లి బలవంతం మీద 15 వ ఏటనే సినిమాల్లోకి అడుగుపెట్టింది…. *  ఆమె మొదటి సినిమాలో యంగ్ విడో పాత్ర… మెట్రిక్ స్టేట్ ర్యాంకర్ ఓ యంగ్ విడో పాత్ర పోషించడం ఐరనీ… * ఆ తొలి సినిమాకు సెన్సార్ ఇచ్చిన రేటింగ్ ‘పెద్దలకు మాత్రమే’… *  తనకు అప్పటికి 15 ఏళ్ల వయసే కాబట్టి తన తొలి సినిమాను తనే థియేటర్ లో చూడలేకపోయిందట…. *  స్లీవ్ లెస్ బ్లౌజు వేసుకుని, జలపాతం కింద తడుస్తూ పాటలో నటించిన తొలి తమిళ నటి కూడా జయలలితనే… * ఆమె సినిమా కెరీర్ మొదట్లోనే శోభన్ బాబును ప్రేమించింది.. ఆ ప్రేమ అలాగే కొనసాగింది. అందుకే ఆమె వివాహం చేసుకోలేదు. * అయితే శోభన్ బాబుతో ఆమెకు శోభన (ప్రియ మహాలక్ష్మి) అనే కూతురు పుట్టిందనీ మాత్రం ప్రచారం ఉంది కానీ ఆమె గురించి ఇప్పటి వరకూ ఎవరికి తెలియదు * తమిళంలో ఆమె సిల్వర్ జుబ్లీ సినిమాలే అధికం.. 85 సినిమాల్లో 80 హిట్టే…ఇజ్జత్ అనే హిందీ సినిమాలోనూ నటించింది అదీ హిట్టే. ఇక తెలుగులో ఆమె నటించినవి 28 సినిమాలు. * ఆమెకు ఒక సోదరుడు కూడా ఉన్నాడు పేరు జయకుమార్. అతను 1995లో చనిపోయాడు. * అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా ఎన్నికైన వారిలో జయలలిత ఒకరు. ఆమెకు ఇంగ్లిషు పుస్తకాలు చదవడమంటే మహా ఇష్టం… ఎప్పటికీ ఆమెతో ఆ పుస్తకాలు ఉంటాయి… ఆమె మంచి రచయిత్రి కూడా… ఎస్టరియర్ తమిళ వీక్లీలో థాయ్ పేరుతో రాస్తూ ఉండేది. * క్రికెట్ మ్యాచులంటే కూడా ఆమెకు ఇష్టమే. కేవలంపటౌడీని చూడటం కోసమే ఆమె క్రికెట్ మ్యాచులకు వెళ్లేదట. * దత్తపుత్రుడి పెళ్లి జరిపినప్పుడు లక్షన్నర మందికి ఆతిథ్యం ఇచ్చింది… ఇది గిన్నీస్ రికార్డు…తన దత్తపుత్రుడి పెళ్లి ఖర్చు అప్పట్లోనే 100 కోట్లు అని విమర్శ కాగా, 10 కోట్లేనని ఐటీ శాఖ అంచనా వేసింది… * తన ప్రియసఖి శశికళతో ఆమె బంధం గురించి రకరకాల దుష్ప్రచారాలున్నాయి… శశికళను కాస్త దూరం ఉంచడం మొదలెట్టగానే ఇదే శశికళ జయలలితకు స్లోపాయిజన్ కుట్ర చేసిందని తెహెల్కా కథనం…అప్పటి నుంచే జయ ఆరోగ్యం క్షీణించి, చివరకు రోజల తరబడీ చికిత్స చేసినా చక్కబడలేదనేది విమర్శ… * 1992లో కుంభకోణంలో మహామకం ఉత్సవాల్లో ఆమె సంప్రదాయ స్నానమాచరించడానికి వెళ్లగా అక్కడ జరిగిన జనం తొక్కిసలాటలో 50 మంది మృతిచెందారు. 18)1992 లోనే అప్పటి గవర్నర్ చెన్నారెడ్డి తన పట్ల అమర్యాదగా వ్యవహరించాడని ఆమె ఆరోపించింది. * సుబ్రహ్మణ్యస్వామి 1996లో జయలలితపై కేసు పెట్టినప్పుడు బయటపడ్డ ఆస్తులు మొత్తం 66 కోట్లు. అయిదే అందులో అందరినీ ఆకర్షించినవి 12,000 చీరెలు, 30 కిలోల బంగారం, 2,000 ఎకరాల భూమి, 750 జతల చెప్పులు, 8 క్వింటాళ్ల వెండి… * 1997లో ఆస్తుల జప్తు జరిగినప్పుడు, ఇక ఆభరణాలు ధరించనని ఒట్టు పెట్టుకుని, తిరిగి అధికారంలోకి వచ్చాకే 2011లో ధరించింది. * పాలనలో ఆమె నియంతలాగే వ్యవహరిస్తుందని ఎవరైనా విమర్శలు చేసినా, వార్తలు రాసినా ఎడాపెడా పరువునష్టం కేసులు పెట్టించేది. కానీ విధేయత విషయంలో మాత్రం పాతకాలం చక్రవర్తులు కూడా పనికిరారు అని అనేవారు. * ఇక పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల పాదాభివందనాలు చాలా కామన్. ఆమె కళ్లల్లోకి నేరుగా చూడొద్దనీ, బొకే ఇచ్చేసి, వెనక్కి తిరిగి వీపు చూపకుండా, వెనక్కి వెనక్కి నడిచిరావాలని గన్ మెన్ చెప్పేవారట. * స్కూళ్లో ఓ క్లాస్ మేట్ లవ్ కు పోస్ట్ మ్యాన్ గా వ్యవహరించింద. ఆమె తల్లికి తెలియగానే తనపై నిందలు వేసి తప్పుకుందట. * మొదట్లో ఎంజీఆర్ ఆమెను సందేహించేవాడట… ఆమె ప్రతి కదలికపై నిఘా వేసి ఉంచేవాడట…వీడియో పార్లర్ నడుపుకునే శశికళను కూడా గూఢచర్యం కోసమే ఎంజీఆర్ జయలలిత వద్ద ఉంచాడట. * 1981లో రాజకీయాల్లోకి రాగానే, 1983లో రాజ్యసభ సభ్యురాలైంది. అయితే 1984లో ఎంజీఆర్ కు స్ట్రోక్ వచ్చి, అనారోగ్య సమస్యల్లో ఉంటే, ఈమె రాజీవ్ ను, గవర్నర్ ఖురాను కలిసి సీఎంను చేయమని అడిగిందట. దాంతో ఆమె ఎంజీఆర్ కోపానికీ గురైంది. * 1986లో ఎంజీఆర్ తో పడకపోవడంతో ఆయనకు పోటీగా జయలలిత పెరవై అనే సమాంతర ఆర్గనైజేషన్ ను కూడా స్టార్ట్ చేసిందట…

కిక్కిరిసిన రాజాజీ హాల్‌... అమ్మ ముఖమే కనిపించడం లేదు..

  గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిన్న రాత్రి తన తుదిశ్వాసను విడిచారు. దీంతో రాష్ట్రం మొత్తం కన్నీరు మున్నీరవుతోంది. పార్టీ నేతల, కార్యకర్తలు, అభిమానులు జయ మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. మొదట ఆమె పార్థివదేహాన్ని..ఆమె అధికార నివాసమైన పోయెస్ గార్డెన్‌కు తరలించారు. కొద్దిసేపు అక్కడ ఉంచిన అనంతరం ప్రజల సందర్శనార్థం ప్రఖ్యాత రాజాజీ హాల్‌కు తరలించారు. ప్రజల సందర్శనార్థం ఈ రోజు మొత్తం అక్కడే ఉంచుతారు. ‘అమ్మ’ను కడసారి చూసేందుకు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున రాజాజీ హాల్‌కు చేరుకుంటున్నారు. రాజాజీ హాల్ వరండాలో దాదాపు 25 మెట్లకు పైన ఐస్ బాక్స్ పై జయలలిత మృతదేహాన్ని ఉంచగా, ప్రజలు సందర్శించేందుకు మూడు వరుసల క్యూలైన్ ను మెట్లకు దిగువన దాదాపు 25 మీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. దీంతో అప్పుడే ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. అయితే తమకు అమ్మ ముఖమే కనిపించడం లేదని ప్రజలు, అభిమానులు ఆరోపిస్తున్నారు. రేపు సాయంత్రం 4:30 గంటలకు జయ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మృత్యు ఒడిలోకి చేరిన జయలలిత...

తమిళనాడు ఒక్కసారిగా స్ఠంభించిపోయింది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ముఖ్యమంత్రి జయలలిత ఇక లేరు అన్న వార్త వినగానే అభిమానులకు ప్రాణం పోయినంత పని అయింది. మొన్న రాత్రి గుండె పోటుకు గురైన అమ్మకు అపోలో వైద్య సిబ్బంది చికిత్స అందించారు. అయితే సాధారణ చికిత్సకు ఆమె స్పందించక పోవడంతో ఎక్మో పద్దతి ద్వారా చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమంగానే ఉందని.. ఆమెను బ్రతికించేందుకు ప్రయత్నిస్తున్నామని.. అభిమానుల ప్రార్థనలే ఆమెను కాపాడాలని వైద్యులు చెప్పినా జరగాల్సింది జరిగిపోయింది. నిన్న రాత్రి ఆమె తన తుదిశ్వాసను విడిచారు.   మరోవైపు జయలలిత మరణించడంతో దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు ఆమెకు సంతాపం తెలిపారు. ప్రధాని మోడీ జయలలిత మృతి పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ అమ్మ మృతికి సంతాపం తెలిపారు.

జయకు చికిత్స కొనసాగుతోంది.. పుకార్లు నమ్మొద్దు...

  జయలలితకు ఇంకా చికిత్స కొనసాగుతుందని.. ఆమె ఇక లేరు అని తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఇక లేరు అని చెన్నైకు చెందిన పలు ఛానెళ్లలో ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై స్పందించిన అపోలో జయ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని... ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ఇక మరోవైపు ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కనీసం పార్టీకు సంబంధించిన కార్యకర్తలకు కూడా ఎలాంటి సమాచారం తెలియక పోవడంతో వస్తున్న వార్తలతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టారు. అమ్మను చూపించాలని డిమాండ్ చేస్తూ గొడవకు దిగారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చెన్నై అపోలో వద్ద ఉద్రిక్తత.. పేషెంట్లను వేరే ఆస్పత్రికి తరలింపు

చెన్నై అపోలో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరికొద్ది సేపట్లో అమ్మ ఆరోగ్యం గురించి కీలక ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అభిమానులు సంగతైతే చెప్పనక్కర్లేదు. పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు తరలివస్తున్నారు. అమ్మ ఆరోగ్యం విషమంగా ఉంది అని చెప్పడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఇక ముందే పరిస్థితిని గమనించిన ప్రభుత్వం ముందుగానే పెద్ద ఎత్తున పోలీసులను మోహరించింది. అపోలో ఆస్పత్రి వద్ద పెద్ద ఎత్తున భద్రత కట్టుదిట్టం చేసింది. అంతేకాదు దాదాపు తమిళనాడుకు 500 కిలో మీటర్ల దూరం నుండే అభిమానులు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇక అమ్మ ఆరోగ్యం నేపథ్యంలో ఐటీ కంపెనీలకు మధ్యహ్నం నుండే సెలవులు ప్రకటించేశారు. ఇక దుకాణాలు.. పాఠశాలలు.. ప్రయాణాలు, బస్సు సర్వీసులు ఈరోజు ఉదయం నుండే రద్దయ్యాయి. చెన్నై మొత్తాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.   పేషెంట్లను వేరే ఆస్పత్రికి తరలింపు..   మరోవైపు అపోలో ఆస్పత్రిలో ఉన్న ఇతర పేషెంట్లను వేరే ఆస్పత్రులకు తరలిస్తున్నారు. దాదాపు నలభై అంబులెన్స్ లలో పేషెంట్లను ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

జయ ఆరోగ్యంపై స్వామి ట్వీట్... అభిమానుల్లో టెన్షన్...

  ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన ట్వీట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. అదేంటంటే... తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం గురించి. గుండెపోటుకు గురై చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను పరామర్శించేందుకు గాను స్వామి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన ట్విట్టర్ ఖాతాలో అమ్మ ఆరోగ్యంపై ట్వీట్ చేశారు. 'సాయంత్రం 6. గంటలకు జయలలిత గురించి ఓ కీలక ప్రకటన వింటారు' అని స్వామి ట్వీట్ చేశారు. మరి స్వామి ట్వీట్ లోని ఆంతర్యం ఏమై ఉంటుందని ఆందరూ ఆలోచిస్తున్నారు. మరోవైపు అమ్మ అభిమానులు మాత్రం స్వామి ట్వీట్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.